కొన్ని సలహాలూ, సంఘటనలూ!

14 Nov, 2022 00:23 IST|Sakshi

కామెంట్‌

చాలామంది రాయరు గానీ, అత్యున్నత పదవుల్లో ఉన్నవారు తమ అనుభవాలను పుస్తకాలుగా తెస్తే, అవి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడిస్తాయి. అవి విలువైన పాఠాలు కూడా అవుతాయి. తాజాగా తన పదవీకాలపు జ్ఞాపకాలను పుస్తకంగా తెచ్చిన జాబితాలోకి భారత రిజర్వ్‌ బ్యాంకు గవర్నర్‌గా, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా పనిచేసిన సి.రంగరాజన్‌ కూడా చేరారు. 1990లో దేశం ఎదుర్కొన్న అత్యంత క్లిష్టమైన ఆర్థిక సంక్షోభం గురించీ, చివరకు బంగారాన్ని తాకట్టుపెట్టి దానిలోంచి బయటపడిన ఘటన గురించీ ఆయన రాశారు. అప్పటి రాజకీయ వైఫల్యాన్ని కూడా బయటపెట్టారు. రూపాయి విలువను తగ్గించాల్సి వచ్చిన సందర్భాన్ని కూడా వివరించారు. గవర్నర్‌గా పనిచేసినప్పుడు రాజకీయ నాయకుల ముహూర్తాల సెంటిమెంట్లను ఆయన గమనించారు. వీటన్నింటికంటే ముఖ్యంగా, గవర్నర్లకు తమ అధికారాలు, పరిమితుల మీద ఉండవలసిన గ్రహింపు గురించి కూడా ఆయన విడమరిచారు. గవర్నర్లు తరచూ వార్తల్లోకి వస్తున్న నేపథ్యంలో ఇది గమనార్హమైనది.

అత్యున్నత పదవుల్లో ఉన్నవారు తమ బాధ్యతలను ఎలా నిర్వర్తించారో  ప్రకటించుకునే తరహా సంప్రదాయం మన దగ్గర పెద్దగా లేదు. మాంటెక్‌సింగ్‌ అహ్లూ్లవాలియా దీనికి ఒక మినహా యింపు. ప్రణాళికా సంఘం డిప్యూటీ చైర్మన్‌గా తన దశాబ్ద కాలపు అనుభవాలను గురించి ఆయన రాశారు. భారత ఉపరాష్ట్రపతిగా తన పదేళ్ల కాలం గురించి హమీద్‌ అన్సారీ సమగ్రమైన ఇంట ర్వ్యూను ఇవ్వడాన్ని ఎంచుకున్నారు. ఇప్పుడు సి. రంగరాజన్‌... రిజర్వ్‌ బ్యాంక్‌ గవర్నర్‌గా, ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా, ఒరిస్సా, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో స్వల్పకాలం పాటు గవర్నర్‌ బాధ్య తలు నిర్వహించిన తన పదవీ కాలాల గురించిన రచనను(ఫోర్క్స్‌ ఇన్‌ ద రోడ్‌: మై డేస్‌ ఎట్‌ ఆర్బీఐ అండ్‌ బియాండ్‌) ప్రచురించారు. అది ఎన్నో చక్కటి వివరాలతో, సంతోషకరమైన ఉపాఖ్యానాలతో కూడి ఉంది.

భారత రిజర్వ్‌ బ్యాంక్‌(ఆర్బీఐ) గవర్నర్‌గా ఉన్నప్పుడు, 1990 నాటి ఆర్థిక సంక్షోభం గురించి ఆయన ఎంతో వివరంగా రాశారు. ఆ సంవత్సరం ఆగస్టు నెలలో నేషనల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వానికి ఆర్బీఐ లేఖ రాస్తూ, ‘‘ఈ సంక్షోభాన్ని అధిగమించడానికి అంతర్జాతీయ ద్రవ్య సంస్థలను సంప్రదించక తప్పని పరిస్థితి గురించి’’ పేర్కొంది. కానీ ‘‘ప్రభుత్వం తక్షణ చర్య ఏదీ తీసుకోలేదు.’’ ఇది ‘‘రాజకీయ నాయకత్వ వైఫల్యమే’’ అని రంగరాజన్‌ అభిప్రాయపడ్డారు. ఆనాటి ‘‘పరిస్థితిలోని తీవ్రతను నాటి ప్రభుత్వం గుర్తించకపోవడం, లేదా ఐఎంఎఫ్‌ (అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ) వద్దకు వెళ్లడానికి సైద్ధాం తికంగా విముఖత ప్రదర్శించడం’’ వల్ల చర్య తీసుకోవడానికి ప్రభుత్వం తిరస్కరించిందని రంగరాజన్‌ రాశారు.

ఈ నేపథ్యంలో ఆర్థిక పరిస్థితి ‘‘వేగంగా దిగజారిపోయింది’’ అంటే ఆశ్చర్యపడాల్సింది ఏమీలేదు. నాలుగు నెలల తర్వాత, ‘‘మన నిల్వలు... కేవలం మూడు వారాల దిగుమతులకు మాత్రమే సమా నంగా ఉన్నాయి,’’ అని చెబుతూ ఆయన ఇలా కొనసాగిస్తారు: ‘‘పరిస్థితి ఎంత తీవ్రంగా ఉండిందంటే, విదేశాల్లో ప్రభుత్వానికి ఉన్న ఆస్తులను అమ్మివేయాలని కూడా కొంత ఆలోచన సాగింది.’’ అలా అమ్మేయడానికి పరిగణించిన ఆస్తుల్లో జపాన్‌ రాజధాని టోక్యోలోని భారత రాయబార కార్యాలయం కూడా ఒకటి.
ఈ పరిస్థితుల నేపథ్యంలో రిజర్వు బ్యాంక్‌ ‘‘డిఫాల్టర్‌గా ఉండటానికి కూడా సిద్ధమైంది... దీన్ని తప్పించుకోవడానికి చివరికి అదీ, ఇదీ అనకుండా ప్రతి విషయం గురించి కూడా ఆలోచించాం’’ అని రంగరాజన్‌ నాతో చెప్పారు. ఆ సమయంలో వారు ఎంపిక చేసు కున్న నిర్ణయాల్లో ఒకటి: 405 మిలియన్‌ డాలర్ల రుణం పొందడానికి గానూ, భారతదేశ బంగారు నిల్వల్లో 15 శాతం (ఇది 46.91 టన్నులకు సమానం) తనఖా పెట్టాలనుకోవడం! ఈ రోజు చూస్తే అది పెద్ద మొత్తంగా అనిపించకపోవచ్చు. కానీ ఆ సమ యంలో ‘‘ఆ సొమ్ము చాలా కీలక మైంది... ఎగవేతను అడ్డుకోవ డానికి.’’

1991 జూలై నాటి మరొక అద్భుతమైన కథ ఈ పుస్తకంలో ఉంది. అది – పీవీ నరసింహారావు ప్రభుత్వం రూపాయి విలువను తగ్గించడం గురిం చినది. అప్పుడు డాక్టర్‌ మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక మంత్రిగా ఉన్నారు. అది రెండు దఫాలుగా జరిగింది. సి.రంగరాజన్‌ ఈ రెండో దఫా గురించి ఒక ఆసక్తికరమైన విషయం వెల్లడించారు.
ఇక్కడ ఒక చిన్న నేపథ్యం గురించి చెప్పాల్సిన అవసరం ఉంది. తొలి విడత రూపాయి విలువను తగ్గించిన తర్వాత, దానిపై వచ్చిన తీవ్రమైన రాజకీయ ప్రతిస్పందన చూసి ప్రధాని నరసింహారావు విశ్వాసం సన్నగిల్లింది. దీంతో రెండో దఫా రూపాయి విలువ తగ్గింపును వాయిదా వేయాలని మన్మోహన్‌ సింగ్‌ను కోరారు. ఆ సందర్భంలో రంగరాజన్‌ చెప్పిన విషయానికి చాలా ప్రాముఖ్యం ఉంది.

రూపాయి విలువను రెండో దఫా తగ్గించిన రోజున (1991 జూలై 3)  ఆర్థికమంత్రి మన్మోహన్‌ సింగ్‌ నుంచి ఉదయం 9.30 గంట లకు రంగరాజన్‌కు ఫోన్‌ కాల్‌ వచ్చింది. ‘‘పరిస్థితి ఎలా ఉంది?’’ అని మన్మోహన్‌ అడిగితే, ‘‘నేను జంప్‌ చేశాను’’అని రంగరాజన్‌ సింపుల్‌గా చెప్పేశారు. దాంతో మన్మోహన్‌ ‘‘అయితే సరే’’ అని చెప్పి సంభాషణను ముగించారు. 
ఆనాటి తన సమాధానం గురించి రంగరాజన్‌ నాకు చెబుతూ, రూపాయి విలువను తగ్గించడానికి ఆర్బీఐ కోడ్‌ భాష వాడిందని వివరించారు. ఆ కోడ్‌ ఏమిటంటే ‘హాప్, స్కిప్, అండ్‌ జంప్‌’. ‘నేను జంప్‌ చేశాను’ అనే సమాధానానికి ‘‘రెండో దశ రూపాయి విలువ తగ్గింపు ప్రక్రియ పూర్తయిందనీ, దాన్ని ఇక ఆపలేమనీ’’ అర్థం. 

రంగరాజన్‌ రాసిన పుస్తకం అయిదేళ్లు ఆయన గవర్నర్‌ పదవిలో ఉన్న రోజుల్లో చేసిన కొన్ని మంచి విషయాలను కూడా పొందుపర్చింది. ఈనాటి గవర్నర్లకు కొన్ని మంచి సలహాలను కూడా ఇది సూచించింది. ఒరిస్సాలో గవర్నర్‌గా ఉన్నప్పుడు భారత రాజకీయ నాయకులపై జ్యోతిష్యం ఎంత బలంగా ప్రభావం వేస్తోందో రంగరాజన్‌ కనుగొన్నారు. ఆనాడు ఒరిస్సా ముఖ్య మంత్రిగా ఉన్న గిరిధర్‌ గమాంగ్‌ కేవలం శుభ ముహూర్తాల్లో మాత్రమే గవర్నర్‌ని కలిసేవారట. ‘‘ఉదయం 11.13కు నేను మిమ్మల్ని కలుస్తాను’’ అని గమాంగ్‌ అనేవారని ఈ పుస్తకం చెబుతోంది.

ఇక నేటి గవర్నర్లకు ఈ పుస్తకం ఇస్తున్న సలహా నిజంగానే ఉపయోగకరంగా ఉంది. ముఖ్యమంత్రి చేస్తున్న పనులు గవర్నర్‌కి నచ్చకపోయిట్లయితే, ఆయన లేదా ఆమె ముఖ్య మంత్రితో నేరుగా చర్చించాలనీ, లేదా రాష్ట్రపతికి ఈ వ్యవహారంపై లేఖ రాయవచ్చనీ రంగరాజన్‌ తన పుస్తకంలో రాశారు. అంతకు మించి తన అసమ్మతిని, వ్యతిరేకతను గవర్నర్‌ బయటకు వెల్ల డించకూడదనీ, ప్రజా ప్రదర్శన చేయకూడదనీ సలహా ఇచ్చారు. ఈ మాటలు మమతా బెనర్జీ గానీ విన్నట్లయితే ఎంతో సంతోష పడతారు!
గతంలో ప్రముఖ రాజకీయ నేతలుగా ఉన్న వ్యక్తులను గవ ర్నర్లుగా నియమించినప్పుడు ‘‘కార్యాచరణలోకి దిగాలన్న దురద వారిలో కొన్నిసార్లు స్పష్టంగా కనిపిస్తుంది’’ అని రంగరాజన్‌ అంటారు. ఆయన సలహా ఒకటే! అది ఏమిటంటే – ‘‘వారు తమ అత్యుత్సాహాన్ని అదుపులో పెట్టుకోవడం తప్పక నేర్చుకోవలసి ఉంది... గవర్నర్లు తమకు గల అధికారాలను మాత్రమే కాకుండా తమ పరిమితులను కూడా అర్థం చేసుకోవలిసి ఉంటుంది.’’
కరణ్‌ థాపర్‌
వ్యాసకర్త సీనియర్‌ పాత్రికేయులు

మరిన్ని వార్తలు