Francis Bacon: మానవ గమనంలో ఒక మజిలీ

22 Jan, 2022 12:55 IST|Sakshi

తుపాకి గుండు చేసిన కన్నాల ఆధారంగా నేరం ఎలా జరిగిందో ఊహించి, అన్వేషించి నిర్ధారణ చేయడం వంటిది – సైంటిఫిక్‌ మెథడ్‌! తొలిసారి సైన్స్‌ మెథడ్‌ను ప్రతిపాదించింది ఫ్రాన్సిస్‌ బేకన్‌! 

వైజ్ఞానిక పరిశోధనకు, అప రాధ పరిశోధనకూ సామ్యముంది. శాస్త్రవేత్త ఇన్‌వెస్టిగేటివ్‌ ఇన్‌స్పెక్టర్‌ లాంటి వాడే కానీ, అపరాధ పరిశోధక కథారచయిత వంటివాడు కాదు. కథా రచయిత ముందుగానే తన కథా పరిణామాన్ని మనస్సులో ఉంచుకుని, తదనుకూలంగా ఆధారాలనూ, సన్నివేశాలనూ సృష్టించుకుంటాడు. విజ్ఞాన శాస్త్ర ప్రపంచంలో ‘ఫ్రాన్సిస్‌ బేకన్‌’ పూర్వపు విజ్ఞానవేత్తలందరూ ఈ తరగతికి చెందినవారు. ఒక భావాన్ని ముందుగానే సిద్ధాంతీకరించుకుని తన దృక్పథంలోకి వచ్చిన అంశాలను తదనుగుణంగా సమర్థించుకోవడం వారి పద్ధతి. ఆ విధంగా పొందు కుదరనివి అసహజమనీ, అసంబద్ధాలనీ తోసిపుచ్చడం వారి ఆచారం– ఇదీ 1955లో  ‘సైన్స్‌ ఇన్‌ అవర్‌ లైవ్స్‌’ అనే పుస్తకంలో సైన్స్‌ రచయిత రిచ్చీ కాల్డర్‌ అభిప్రాయం! 

కనుకనే మానవ గమనంలోనే ఫ్రాన్సిస్‌ సైన్స్‌ పద్ధతి ఒక మజిలీగా మలుపు తిప్పింది. ప్రకృతిని, ప్రపంచాన్ని పరిశీలించే దృష్టి మారిపోయింది ఆయన కారణంగానే. ఆధునిక విజ్ఞాన పద్ధతికి ఆద్యుడుగా ఫ్రాన్సిస్‌ను పరిగణి స్తారు. బేకన్‌ బహుముఖ ప్రజ్ఞాశాలి. లాయర్‌ చదువు తర్వాత రాజకీయాలలో రాటుదేలి జీవిత చరమాంకంలో ‘నేచురల్‌ ఫిలాసఫీ’ మీద దృష్టి పెట్టి చిరస్మరణీయమైన కృషి చేశారు. (చదవండి: అణచివేతను ధిక్కరించిన అరుణపతాక)

1561 జనవరి 22న లండన్‌లో జన్మించిన ఫ్రాన్సిస్‌ బేకన్‌ మతం, న్యాయం, రాజకీయాలలోనే కాకుండా సైన్స్‌ విషయాలలో కూడా నిష్ణాతులు. తండ్రి పొందిన ఛాన్స్‌లర్‌ పదవి సాధించినవాడు ఫ్రాన్సిస్‌. ఆయన తల్లి గ్రీకు, లాటిన్, ఇటలీ, ఫ్రెంచి భాషలలో నిష్ణాతులు. 1581లో హౌస్‌ ఆఫ్‌ కామన్స్‌ సభ్యుడై, తర్వాత హౌస్‌ ఆఫ్‌ లార్డ్స్‌లో కూడా సభ్యుడై మొత్తంమీద 37 ఏళ్లు పార్లమెంటు మెంబ ర్‌గా కొనసాగారు. రాజకీయంగా ఎత్తు పల్లాలు బాగా ఎరి గిన ఫ్రాన్సిస్‌ బేకన్‌ ఆర్థికంగా కూడా సమస్యలు ఎదు ర్కొన్నారు. అటార్నీ జనరల్‌ (1613–17)గా, లార్డ్‌ ఛాన్సలర్‌ (1617–21)గానూ ఆయన వ్యవహరించారు. ఆలోచనా ధోరణిలో, పరిశీలనా పద్ధతిలో అంతకు ముందున్న ప్లేటో, అరిస్టాటిల్‌ వంటి వారిని బేకన్‌ విభేదించి తన మార్గంలో ముందుకు పోయారు. 

చాలా రకాలుగా కృషి చేసిన ఫ్రాన్సిస్‌ బేకన్‌ ప్రతిపాదించిన ‘కో ఆపరేటివ్‌ రీసెర్చ్‌ ఇన్‌ స్టిట్యూషన్‌’ భావన తర్వాత కాలంలో రాయల్‌ సంస్థ ఏర్పడటానికి దోహదపడింది. చివరి దశలో ప్రయోగాలు చేస్తూ న్యూమోనియా సోకి 1626 ఏప్రిల్‌ 9న కన్ను మూశాడు. వారు ప్రతిపాదించిన సైన్స్‌ పద్ధతి తర్వాతి కాలంలో పెద్ద ఎత్తున ప్రచారంలోకి వచ్చింది. (చదవండి: సైన్సును మతం నుంచి వేరుచేసిన శాస్త్రవేత్త)

- డాక్టర్‌ నాగసూరి వేణుగోపాల్‌ 
ఆకాశవాణి పూర్వ సంచాలకులు

మరిన్ని వార్తలు