ఇంధనం ఆదా చేద్దాం–కాలుష్యం తగ్గిద్దాం

8 Jan, 2021 00:32 IST|Sakshi

సందర్భం

సహజ వనరులు ప్రకృతి వర ప్రసాదాలు. సకల జీవుల మనుగడకు సహజ వనరులే పట్టుగొమ్మలు. ప్రకృతి ప్రసా దించే నీరు, గాలి, నేల, చమురు, శిలాజ ఇంధనాలు, వృక్ష సంపద, జీవ వైవిధ్యం లాంటివి ప్రపంచ మానవాళికి మౌలిక ప్రాణాధారాలుగా నిలు స్తున్నాయి. భూగర్భంలోంచి తోడుకునే చమురు, సహజ వాయువులు ముఖ్యమైన ఇంధనాలుగా ప్రపంచ వ్యాప్తంగా ఉపయోగపడుతున్నాయి. ఈ ఇంధనా లను తోడుకొని, విచక్షణారహితంగా వాడుకోవడం వల్ల అవి దినదినం తరిగిపోతున్నాయి. రాబోయే రోజుల్లో వాటికి తీవ్ర కొరత ఏర్పడే అవకాశం ఉందని గమనించాల్సిన సమయం ఆసన్నమైంది. ఇలాంటి సంప్రదాయ, తరిగే శిలాజ ఇంధనాలను పరిరక్షించు కోవాలనే సదుద్దేశంతో ప్రతియేటా జనవరి 4 నుంచి 10వ తేదీ వరకు ‘చమురు –సహజ వాయు పరిరక్షణ వారోత్సవాలు’ జరుపుకో వడం ఆనవాయితీగా వస్తున్నది.

పెట్రోలియం ఉత్పత్తులకు ఆధారమైన చమురు నుండి బ్యూటేన్, డీజిల్, గ్యాసోలీన్, కిరోసిన్, ఎల్పీజీ, ద్రవ సహజ ఇంధనాలు, ప్రోపేన్, పెట్రోల్‌ లాంటి అనేక ఇంధనాలు వస్తాయి. సహజ వాయువులో మీథేన్‌ 95 శాతం, ఈథేన్‌ 4 శాతం, ప్రోపేన్‌ 0.2 శాతం, ఐసోబ్యూటేన్‌ 0.02 శాతం ఉంటాయి. ఇలాంటి సహజ వాయువును సులభ, సురక్షిత, పర్యావరణహిత ఇంధనంగా వినియోగిస్తారు. పెట్రో లియం అండ్‌ నేచురల్‌ గ్యాస్‌ మినిస్ట్రీ నాయకత్వంలో చమురు సంస్థలు, పెట్రోలియం పరిరక్షణ పరిశోధనా సంఘం వారు 1991 నుంచి శిలాజ ఇంధన పరిరక్షణ వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. సహజ ఇంధనాల గిరాకీ క్రమేణా పెరుగుతున్న నేపథ్యంలో వాటిని ఆదా చేస్తే, ఉత్పత్తి చేసినట్లుగానే భావించాలని సామాన్య జనాలకు అవగాహన కల్పించడం జరుగుతున్నది.

శిలాజ ఇంధనాలను విచ్చలవిడిగా వాడే పవర్‌ ప్లాంట్లు, బాయిలర్లు, ఫర్నేసులు, ఎరువుల కార్మాగా రాలు, గృహాలు, పరిశ్రమలు, రవాణా వాహనాలతో తీవ్రమైన గాలి కాలుష్యం (హైడ్రోకార్బన్, కార్బన్‌ మోనాక్సయిడ్, సీసం, సల్ఫర్‌ లాంటివి) ఏర్పడుతు న్నది. ఈ వారోత్సవాల్లో భాగంగా సామాన్య ప్రజ లకు, విద్యార్థినీవిద్యార్థులకు చమురు, సహజ వాయు వుల పరిరక్షణ అవసరం మీద అవగాహన కల్పించడం, నిపుణులతో ఉపన్యాసాలు, సమావేశాలు ఏర్పాటు చేయడం, కార్మికులకు శిక్షణ ఇవ్వడం, ఆడియో, వీడియో ప్రచారాలు చేయడం, కరపత్ర వితర ణలు, ఇంధన ఆదాపై పోటీలు లాంటి అనేక కార్య క్రమాలు నిర్వహించడం జరుగుతోంది. 

శిలాజ ఇంధనాలు దేశ ప్రగతికి వినియోగపడు తున్నప్పటికీ దినదినం వాటి డిమాండ్, సరఫరా మధ్య అంతరం పెరుగుతూ, ధరల నియంత్రణ కొరవడి విలువైన విదేశీ మారకద్రవ్యం ఎక్కువగా వినియో గించాల్సి వస్తున్నది. రవాణా వాహనాల కార్యదక్షత పెంచడం, ప్రజారవాణా వ్యవస్థను పటిష్టపరచడం, ఘన ద్రవ ఇంధనాలను బదులుగా వాయు ఇంధనా లను వినియోగించడం లాంటి చర్యలు చేపట్టాలి. ప్రస్తుతం మహానగరాల్లో ఆటోలు, ట్యాక్సీలు, బస్సులు లాంటి రవాణా వాహనాల్లో సీఎన్‌జీ (కంప్రెస్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) వాడటం పెరగడం ముదా వహం. శిలాజ ఇంధనాల విచ్చలవిడి వాడకంతో తాజ్‌మహల్‌ లాంటి ప్రపంచ వారసత్వ స్మారక, చారిత్రక, పర్యాటక కట్టడాలు కళావిహీనమవటం జరుగుతున్నది.

కిరోసిన్‌ వాడకాన్ని తగ్గించడం, సీసం లేని ఇంధనాలను విని యోగించడం, పెట్రోలియం వాహనాలను సీఎన్‌జీ వాహనాలుగా మార్చడం లాంటి చర్యలు తీసుకోవడం మరింత వేగంగా, ప్రాధాన్యతా క్రమంలో జరగాలి. పెట్రోలు, డీజిల్‌ ధరలు నూరు రూపాయలవుతున్న సంధికాలంలో ప్రజలు పెట్రో లియం ఉత్పత్తులను ఆదా చేయకపోతే, సమీప భవిష్యత్తులో మన ఆదాయంలో సగం ఇంధనాలకే వెచ్చించాల్సి వస్తుందని గమనించాలి. దీపం ఉండ గానే ఇల్లు చక్కదిద్దుకుందాం. ఇంధనాలు ఆదా చేసి ఖర్చు, కాలుష్యాలను తగ్గించుకుందాం.

-డాక్టర్‌ బుర్ర మధుసూదన్‌రెడ్డి
(జనవరి 4–10 వరకు చమురు–సహజ వనరుల పరిరక్షణ వారోత్సవాల సందర్భంగా)
వ్యాసకర్త విశ్రాంత ప్రధానాచార్యులు, కరీంనగర్‌ ‘ మొబైల్‌: 99497 00037

మరిన్ని వార్తలు