దండియాత్ర నుంచి ఆత్మనిర్భర్‌ వరకు

2 Oct, 2020 00:47 IST|Sakshi

సందర్భం

సముద్రం నుంచి కొన్ని ఉప్పురాళ్లను ఏరుతూ మహాత్ముడు సాగించిన దండియాత్రకు పేద ప్రజల నుంచి అనూహ్య స్పందన వచ్చింది. ఉప్పు చట్టాన్ని ప్రశ్నిస్తూ... పూర్ణ స్వరాజ్యం, సంపూర్ణ స్వాతంత్య్రం అనే పదాలు అర్థమయ్యేలా వీధివీధినా ఉన్న సామాన్యులను సైతం గాంధీజీ చైతన్యపరిచారు. ప్రకృతిలో లభించే ఉప్పు వంటి సహజ సంపదపై బ్రిటిష్‌ పాలకులు సుంకాలు విధించడం, గుత్తాధిపత్యం ప్రదర్శించడంతో ఈ కదలిక భారతదేశమంతటా ప్రతిధ్వనించింది. ఈరోజు ప్రధాని నరేంద్రమోదీ ఒక సామాన్య ఛాయ్‌ వాలాగా తన సొంత జీవిత అనుభవాలను గాంధీజీ బోధనలతో కలపగలిగారు. పేదల్లో సాధికారత, ఆత్మగౌరవ భావాల్ని కలిగించే ఒక శక్తిమంతమైన మేనిఫెస్టోని ఆత్మనిర్భర్‌ రూపంలో మోదీ రూపొందించగలిగారు. 

అది 1856 నాటి సంగతి... అప్పట్లో బ్రిటిష్‌ ఈస్ట్‌ ఇండియా కంపెనీ వారికి మన దేశం నుంచి వచ్చే ఆదాయం మూడు కోట్ల బ్రిటీష్‌ పౌండ్ల కంటే తక్కువగా ఉండేది. ఇందులో పది శాతం వరకు ఉప్పుపై విధించిన పన్నులు, సుంకాల నుంచే వచ్చేవి. ఇప్పటి విలువతో చూస్తే అది దాదాపు 3,000 కోట్ల రూపాయలతో సమానం. అయితే సగటు భారతీయుడు సంవత్సర ఉప్పు వినియోగానికి డబ్బులు చెల్లించాలంటే.. కనీసం రెండు నెలలు కష్టపడాల్సిన పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేది. అప్పటికే ఉప్పు వాడకాన్ని పూర్తిగా వదులుకున్న మహాత్మాగాంధీ... 1930 ఏప్రిల్‌లో ఉప్పు చట్టానికి వ్యతిరేకంగా దండికి దండయాత్ర చేశారు. సముద్రం నుంచి కొన్ని ఉప్పు రాళ్లను ఏరుతూ మహాత్ముడు సాగించిన యాత్రకు  అనూహ్య స్పందన వచ్చింది. లక్షలాది మంది ప్రజలు మహాత్ముడి వెంట నడిచారు. 

ఉప్పు చట్టాన్ని ప్రశ్నిస్తూ... పూర్ణ స్వరాజ్యం, సంపూర్ణ స్వాతంత్య్రం అనే పదాలు అర్థమయ్యేలా వీధివీధినా ఉన్న సామాన్యులను సైతం గాంధీజీ చైతన్యపరిచారు. రాజకీయ స్వేచ్ఛ అనే ఆలోచనని ఆర్థిక స్వేచ్ఛతో అనుసంధానించడం కంటే అత్యుత్తమ మార్గం మరొకటి లేదని ఆయన వివరిం చారు. ప్రకృతిలో లభించే ఉప్పు వంటి సహజ సంపదపై బ్రిటిష్‌ పాలకులు సుంకాలు విధించడం, గుత్తాధిపత్యం ప్రదర్శించడంతో ఈ కదలిక భారతదేశమంతటా ప్రతిధ్వనించింది. ఆర్థిక స్వేచ్ఛ, స్వావలంబన కోసం 1915లో సబర్మతి ఆశ్రమంలో ఖాదీ వినియోగంతోనే గాంధీజీ పోరాటం ప్రారంభమైంది. గ్రామ స్వరాజ్యం, స్వయం సమృద్ధి, ఆర్థిక స్వేచ్ఛ అనే ఆలోచనలు, ఖాదీ వినియోగం, ఉప్పు పన్ను చట్టాల ఉల్లంఘన వంటివే స్వాతంత్య్ర ఉద్యమానికి  ప్రేరణనిచ్చాయి.

ఈ రోజు ప్రధాని నరేంద్రమోదీ ఒక సామాన్య ఛాయ్‌ వాలాగా తన సొంత జీవిత అనుభవాలను గాంధీజీ బోధనలతో కలపగలిగారు. ఈ ప్రక్రియలో ప్రధాని, పేదల్లో సాధికారత, ఆత్మగౌరవ భావాల్ని కలిగించే ఒక శక్తిమంతమైన మేనిఫెస్టోని రూపొందించగలిగారు. మహాత్మా గాంధీ జీవితం, ఆయన బోధనల నుండి ప్రేరణ పొందిన నరేంద్రమోదీ, ప్రధానిగా తన తొలి విడతలో ప్రారంభిం చిన స్వచ్ఛ్‌ భారత్‌ పథకం, పరిశుభ్రతకు, పారిశుద్ధ్యానికి ప్రతీకగా నిలిచింది. దీనిని ప్రజల ఉద్యమంగా మార్చినందున యుద్ధ ప్రాతిపదికన అనేక లక్ష్యాలను చేరుకోగలిగింది. నేటి భారతంలో రాజ కీయ స్వేచ్ఛ అందరికీ ఉన్నా, ఆర్థిక స్వేచ్ఛ అనేది ఇంకా కొంతమంది పేదలకు, అణగారిన వారికి ఒక కలగానే మిగిలిపోయింది. స్వావలంబన, ఆర్థిక స్వేచ్ఛ అనే స్తంభాలపైన మాత్రమే పేదలను మనం ఉద్ధరించగలం అన్న నిజాన్ని గ్రహించిన ప్రధాని...ఆత్మ నిర్భర భారత్‌కి రూపకల్పన చేశారు.

1970లో వచ్చిన ‘గరీబీ హటావో’ దేశంలో పేదరికాన్ని శాశ్వతం చేసిన నినాదం అయితే, దానికి పూర్తి విరుద్ధంగా పేదరికాన్ని తరిమి కొడుతూ, పేదల్లో సాధికారత పెంపొందిస్తూ, తమ విధిని వారే రాసుకునే వీలు కల్పించింది ఇప్పటి ఆత్మ నిర్భరత, స్వావలంబన అనే ఈ కార్యక్రమం. దీనితోపాటుగా ఇటీవల ప్రవేశపెట్టిన రైతుల సంక్షేమ చట్టం,  కార్మిక హక్కుల సవరణ చట్టం, నిత్యావసర వస్తువుల సవరణ చట్టాలు, రైతులకు ఆర్థిక స్వేచ్ఛని, ఉత్పత్తుల్ని అమ్ముకొనే అవకాశాలని కల్పించే చర్యలు. సూక్ష్మ వాగ్దానాలతో, నోటి మాటలతో రైతులని బలహీనపరిచే బదులు, ప్రధాని మన వ్యవసాయ రంగాన్ని పట్టి పీడుస్తున్న చట్టాల బంధాల నుండి విముక్తి చేసి, రైతులు తమ విధిని తామే సృష్టించుకునే స్వతంత్రతను, ప్రేరణని ఇచ్చారు. అదే సమయంలో ఇప్పటికే అమలులో ఉన్న ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ యోజన, కనీస మద్దతు ధర వంటి పథకాలు, రైతులు తమకు కావాల్సిన విత్తనాలు, ఎరువులు అన్ని ప్రాంతాలలో అందుబాటులో వుంచి, పంటను, ఉత్పత్తులను కనీస ధరకు అమ్ముకునేందుకు కావాల్సిన సౌకర్యాలను మెరుగుపరిచే అనేక చర్యలు తీసుకుంటున్నారు.

 రైతు ఉత్పత్తులను లాభదాయక మార్గంలో విక్రయించే అవకాశం ఉన్న వ్యవస్థను సృష్టించడం కొత్తగా ప్రవేశపెట్టిన రైతు ఉత్పత్తుల వాణిజ్య– వర్తక (ప్రోత్సాహం–సౌలభ్యం) చట్టం–2020 ప్రధాన లక్ష్యం. దీనివల్ల రైతులు తమ ఉత్పత్తులను ప్రభుత్వ మార్కెట్‌ యార్డులలో మాత్రమే విక్రయించాల్సిన అవసరం ఉండదు. అంతర్‌–రాష్ట్ర లేదా తమ సొంత రాష్ట్రంలో జరిగే ఎటువంటి వాణిజ్య, వ్యాపారంలోనైనా వారు పాల్గొనవచ్చు. ప్రభుత్వాలు గుర్తించిన మార్కెట్‌ యార్డ్‌ లోపల లేదా బయట అమ్ముకోవడానికి సంసిద్ధుడైన ఏ రైతుపైనా లేదా సంబంధిత వ్యాపారిపైన ప్రభుత్వం మార్కెట్‌ రుసుము లేదా సెస్‌ విధించరాదని ఈ చట్టం చెబుతోంది. పంట ఎంపిక ఒక ముఖ్యమైన అంశం కాగా, ధరలను ముందుగానే ఊహిం చగలగడం, పంట వేసే సమయంలోనే రైతు ఉత్పత్తుల కొనుగోలును నిర్ధారించి ఆందోళనను తొలగించడం వంటి చర్యల ద్వారా మనం రైతుల భవి ష్యత్తును కాపాడవచ్చు.

రైతులను రక్షిస్తూ, వారికి అధికారాన్ని కల్పిస్తూ, న్యాయమైన, పారదర్శకమైన పద్ధతితో భవిష్యత్తులో వ్యవసాయ ఉత్పత్తుల అమ్మకం కోసం వ్యవసాయ–వ్యాపార సంస్థలు, ప్రక్రియదారులు, టోకు వ్యాపారులు, ఎగుమతిదారులు లేదా పెద్ద రిటైలర్లతో పరస్పరం అంగీకరించిన పారితోషిక ధరల చట్రంలో పాల్గొనడానికి రైతుల (సాధికారత, రక్షణ) ధరల భరోసా–వ్యవసాయ సేవల బిలు–2020 వీలు కల్పిస్తుంది. ఒప్పంద వ్యవసాయం అనే ఈ వినూత్న ఆలోచన ద్వారా రైతులు డిమాండ్‌కి అనుగుణంగా పంటలు పండించి, మంచి ధరకు అమ్ముకునే అవకాశం కలుగుతుంది. చివరగా, అత్యవసర వస్తువుల (సవరణ) బిల్లు–2020, ఈ చట్టం మూడు లక్ష్యాలను సాధిస్తుంది. మొదటిది– రైతులు తమ ఉత్పత్తులకు ఎక్కువ ధర పొందేలా చేస్తుంది. రెండవది– నిల్వలు, బ్లాక్‌–మార్కెటింగ్‌ సాకుతో రైతులను, వ్యాపారులను వేధిస్తూ రాష్ట్ర పరిపాలనను బలహీనపరుస్తున్న అధికారుల అజమాయిషీని తగ్గిస్తుంది. ఇక మూడవది– పెద్ద ఎత్తున పంట నష్టం లేదా ప్రకృతి వైపరీత్యాల సమయంలో మాత్రమే ఈ చట్టం వ్యవసాయ వస్తువుల రవాణాను, స్వేచ్చాయుతంగా అమ్మడాన్ని నియంత్రిస్తుంది.

స్వావలంబన ఆత్మనిర్భర భారత్‌ నిర్మాణం దిశగా ప్రధాన మంత్రి తన ఆలోచనని కార్యరూపంలోకి తీసుకొచ్చారు. మొదటగా స్వావలంబన, ఆత్మనిర్భరత అనే సూత్రాలను ప్రకటించి తర్వాత దాని అమలుకు కావలసిన నిధులు పెద్ద ఎత్తున కేటాయించారు. పార్లమెంట్‌ సమావేశాల్లో మన రైతుల అభివృద్ధి, సాధికారతకు చట్టాలను రూపొం దించారు. మోదీ ప్రభుత్వానికి ముందు చాలా ప్రభుత్వాలు గాంధీజీ నుండి ప్రేరణ పొందాయి కానీ మోదీలా ఆయన సందేశాన్ని స్వీకరించి నేటి కాలానుగుణంగా మాత్రం అమలు చేయలేకపోయాయి. వారు చేయలేకపోయిన దానిని చేసి చూపిస్తూ ప్రధాని మోదీ నిజమైన గాంధేయవాదిగా నిరూపించుకున్నారు. మహాత్మాగాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని సాకారం చేస్తూ, గ్రామీణాభివృద్ధి–నిజమైన దేశాభివృద్ది అనే స్ఫూర్తిని తీసుకుని సంపూర్ణ దేశాభివృద్ధిని సాధించటమే, మన మహాత్మునికి మనం ఇచ్చే నిజమైన నివాళి.

(నేడు గాంధీజీ 151వ జయంతి సందర్భంగా)

జి. కిషన్‌రెడ్డి
వ్యాసకర్త కేంద్ర హోంశాఖ సహాయమంత్రి

మరిన్ని వార్తలు