స్వల్పకాలంలో అనితరసాధ్య ప్రగతి..!

30 May, 2022 00:00 IST|Sakshi

విశ్లేషణ

ప్రజాసేవలో కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుంది. ఈ కాలంలో ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటూనే అనేక రంగాల్లో ప్రగతిపథంలో దూసుకుపోతోంది. మహమ్మారి సమయంలో టీకాల సరఫరాలో చూపిన చొరవ, సుపరిపాలన కోసం చేపట్టిన అనేక సంస్కరణలు, పేదలకు అన్ని విధాలుగా అండగా ఉండటం ఈ ఎనిమిదేళ్లలో ప్రత్యేకంగా పేర్కొనదగ్గవి. అలాగే సహకార సమాఖ్య వ్యవస్థను పరిరక్షిస్తూ, రాష్ట్రాలకు అందవలసిన పన్నుల వాటాను కేంద్రం సక్రమంగా అందిస్తోంది. దేశవ్యాప్తంగా 45 కోట్ల బ్యాంక్‌ ఖాతాలను పేద ప్రజల కోసం తెరిచింది. సుమారుగా 3 కోట్ల ఇళ్లు లబ్ధిదారులకు అందాయి. 9 కోట్లకు పైగా గ్యాస్‌ కనెక్షన్లు, 18 కోట్లకు పైగా ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులు ఇవ్వడం జరిగింది.

కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం పెట్రోలియం ఉత్పత్తులు, డీజిల్, పెట్రోల్, గ్యాస్‌పై వేస్తున్న పన్నును తగ్గించుకొని ప్రజలకు ఉపశమనం కలిగిం చాలని నిర్ణయించింది. ఇందుకు అనుగుణంగా మే 21న పెట్రోల్, డీజిల్‌పై సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించింది. దీంతో పెట్రోల్‌పై లీటరుకు రూ. 9.5, డీజిల్‌పై లీటరుకు రూ. 7, వంటగ్యాస్‌పై రూ. 200 చొప్పున తగ్గింది. గత 2021 నవంబర్లో కూడా పెట్రోల్‌పై లీటర్‌కు రూ. 5, డీజిల్‌పై లీటర్‌కు రూ. 10 చొప్పున తగ్గించింది. గత ఆరు నెలల్లో రెండుసార్లు కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌ ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించి ప్రజలకు ఉపశమనాన్ని కలిగించింది. ఇలా రెండు సార్లు తగ్గించినందుకు కేంద్ర ప్రభుత్వం మీద రూ. 2.20 లక్షల కోట్ల రూపాయల భారం పడనుంది. 

కేంద్ర ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలకు ఇది ఒక ఉదాహరణ మాత్రమే. గత 8 సంవత్సరాలుగా నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారత ప్రభుత్వం దేశంలో మౌలిక వసతుల కల్పన, ప్రజల సంక్షేమం కోసం అనేక కార్యక్రమాలను చేపట్టింది. 2014–22 వరకు 8 సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం చేసిన మొత్తం అభివృద్ధి వ్యయం రూ. 90.9 లక్షల కోట్లుగా గణాంకాలు తెలుపుతున్నాయి.  ప్రభుత్వం 8 సంవత్సరాలలో ప్రధానంగా ఆహారం, ఇంధనం, ఎరువుల సబ్సిడీలపై ఇప్పటివరకూ ఖర్చు చేసిన మొత్తం రూ. 24.85 లక్షల కోట్లు. మూలధన సృష్టి కోసం రూ. 26.3 లక్షల కోట్లు ఖర్చు చేయడం జరిగింది. 

ప్రజాసేవలో మోదీ ప్రభుత్వం 8 ఏళ్లు పూర్తిచేసుకుంటున్న సందర్భంగా సేవ, సుపరిపాలన, గరీబ్‌ కల్యాణ్‌ అనే మూడు ప్రాథమిక సూత్రాలను పరిశీలించాల్సిన అవసరం ఉంది. సేవ విష యానికి వస్తే, మహమ్మారి సమయంలో ప్రధాని మోదీ టీకా పరిశో ధన నుండి దాని సరఫరా వరకు ముందుండి నడిపించిన విధానం గురించీ, ఆయన చూపిన చొరవ, అవిశ్రాంత కృషి గురించీ చెప్పు కోవాలి. రెండవది సుపరిపాలన కోసం ప్రభుత్వం చేపట్టిన అనేక సంస్కరణలు, కార్యక్రమాలు. మూడవదీ, అత్యంత ముఖ్యమైనదీ పేదలకు అండగా ఉండటమే.

సహకార సమాఖ్య ద్వారా... మౌలిక వసతుల కల్పన, సేవా, సుపరిపాలన, పేదల సంక్షేమం కోసం చేపట్టిన అనేక రకాల పథకాలు... అన్ని రాష్ట్రాల్లో విజయవంతంగా అమలు జరగాలని ప్రధాని భావించారు. అందుకోసం వివిధ రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పని చేయాలని నిర్ధరించారు. అందరూ సమష్టిగా కలిసి పనిచేస్తేనే ఇది సాధ్యమని భావించారు. కో–ఆపరేటివ్‌ ఫెడరలిజం ఫ్రేమ్‌ వర్క్‌ను కొనసాగించడంలో భారత ప్రభుత్వం అన్ని అంశాలలో కృషి చేస్తుంది. ఇది స్థూల, సూక్ష్మ స్థాయులు రెండింటిలోనూ చూడవచ్చు. కేంద్ర పన్నుల వికేంద్రీకరణ రూపంలో గరిష్ఠ మొత్తంగా నిధులను నేరుగా రాష్ట్రాలకు బదిలీ చేసేలా నిరంతరంగా చర్యలు తీసు కుంటూనే ఉంది.

14వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు 42%, 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు 41% కేంద్రం పన్నులలో ఆయా రాష్ట్రాలకు బదిలీ చేస్తున్నది. అంటే కేంద్రం వసూలు చేసిన 40% కంటే ఎక్కువ పన్నులు ముందుగా రాష్ట్రాలకు నేరుగా తిరిగి వెళ్తాయి. గతంలో 13వ ఆర్థిక సంఘం చేసిన సిఫార్సు 32% వాటా ఉంటే, ప్రస్తుత 42% వాటా – అంటే 10% అదనంగా రాష్ట్రాలకు ప్రభుత్వం ఉదారంగా అందిస్తున్నది. నిధుల అధిక వికేంద్రీకరణ ఫలితంగా, భారత ప్రభుత్వం ఇప్పటివరకు సమర్పించిన 9 బడ్జెట్‌లలో భాగంగా రాష్ట్రాలకు సుమారు రూ. 57 లక్షల కోట్లు బదిలీ చేస్తోంది.

సేవా, మౌలిక సదుపాయల కల్పన కోసం ‘మిషన్‌ – మోడ్‌’ ఫోకస్‌ ద్వారా కేంద్రానికి పన్నుల రూపంలో వచ్చిన నిధులలో 42% నేరుగా రాష్ట్రాలకు బదిలీ అవుతాయి. ఇక కేంద్ర ప్రభుత్వం వద్ద మిగిలి ఉన్న 58% నిధులను ఎలా, ఏ విధంగా ఉపయోగిస్తుంది అనే ప్రశ్న చాలామంది పదే పదే లేవనెత్తుతున్నారు. మోదీ ప్రభుత్వం ఎల్లప్పుడూ ప్రాథమికంగా మౌలిక సదుపాయాలను అందించడంలో నిమగ్నమై ఉంది. ‘ప్రధానమంత్రి గతిశక్తి’లో భాగంగా రోడ్లు, రైల్వేలు, విమానాశ్రయాలు, ఓడరేవులు, ఉమ్మడి రవాణా, జల మార్గాలతో పాటు లాజిస్టిక్స్‌ ఇ¯Œ ఫ్రాస్ట్రక్చర్‌ వంటి ఏడు అభివృద్ధి రంగాల అభివృద్ధికి సమన్వయం కోసం పునాది వేసింది.     

కేవలం రోడ్లు, రైల్వేల అభివృద్ధి మాత్రమే కాకుండా వైద్య, విద్య, ఆరోగ్య, మౌలిక సదుపాయాలు, టెలికమ్యూనికేషన్‌ లాంటి అనేక రంగాలలో సదుపాయాల కల్పనలో దేశం ‘ఆత్మ నిర్భర్‌’ స్ఫూర్తితో ముందుకు వెళ్లడం జరుగుతోంది. పేద ప్రజల కనీస అవసరాలపై చేపట్టిన కార్యక్రమాలలో ప్రముఖంగా ‘గరీబ్‌ కల్యాణ్‌’ నిలుస్తుంది. దేశవ్యాప్తంగా 45 కోట్ల బ్యాంక్‌ ఖాతాలను పేద ప్రజల కోసం తెరిచారు. సుమారుగా 3 కోట్ల ఇళ్లు లబ్ధిదారులకు అందాయి. దేశ వ్యాప్తంగా 9 కోట్లకు పైగా గ్యాస్‌ కనెక్షన్లను అందించాం. 

దేశవ్యాప్తంగా ప్రజల ఆరోగ్యం కోసం అర్హులందరికీ 18 కోట్లకు పైగా ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులను జారీ చేయడం జరిగింది. 3 వేలకు పైగా హాస్పిటల్స్‌ను ఈ పథకంలో చేర్చి ప్రజలకు వైద్యాన్ని  సులభతరం చేయడం జరిగింది. గత 8 సంవత్సరాలలో, ప్రభుత్వ రంగంలోని 132 వైద్య కళాశాలలు, అలాగే ప్రైవేట్‌ రంగంలో 77 వైద్య కళాశాలలు ఆమోదం పొందాయి.

మోదీ ప్రభుత్వం నిరుపేదల సాధికారత కోసం పనిచేస్తోంది. కోవిడ్‌ – 19, దాని తర్వాత వచ్చిన ఇబ్బందుల సమయాల్లో దేశంలో 80 కోట్ల మందికి రూ. 3 లక్షల 60 వేల కోట్ల విలువ చేసే బియ్యాన్ని ఉచితంగా అందచేయడం జరిగింది. అంతేకాకుండా రైతుల సంక్షేమం కోసం నరేంద్ర మోదీ అన్ని విధాల కృషి చేస్తున్నారు. ధాన్య సేకరణ సీజన్లలో 1 కోటి 31 లక్షల మంది రైతుల నుండి దాదాపు 900 లక్షల మెట్రిక్‌ టన్నుల వరినీ, 50 లక్షల మంది రైతుల నుండి 430 లక్షల మెట్రిక్‌ టన్నుల గోధుమలనూ కొనుగోలు చేయడం ద్వారా రైతుల సంక్షేమానికి మోదీ ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం స్పష్టమవుతోంది.

శాంతి, దీర్ఘకాలిక సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి, రాజ కీయ ప్రమేయం ప్రముఖంగా అవసరమయ్యే దీర్ఘకాలిక సమస్యలు ఇప్పుడు చాలావరకు పరిష్కారానికి నోచుకున్నాయి. జమ్మూ– కశ్మీర్‌లో ఆర్టికల్‌ 370 రద్దు ఫలితంగా ‘ఒకే దేశం, ఒక రాజ్యాంగం’  చిరకాల ప్రతిష్ఠాత్మక లక్ష్యం నెరవేరింది. ఈశాన్య ప్రాంతం శాంతి యుత వాతావరణం చూడగలుగుతోంది. ఈశాన్య ప్రాంతంలో మిలి టెంట్ల కారణంగా ఏర్పడే ఉద్రిక్త సంఘటనలు 74% తగ్గాయి, పౌరుల మరణాలు 84% తగ్గాయి. మనం శాంతిపై దృష్టి పెడుతూనే మన దేశ రక్షణకు సంబంధించిన శక్తి సామర్థ్యాలను పెంపొందించుకున్నాం. దానితో పాటు మన రక్షణ ఉత్పత్తి సామర్థ్యాలను కూడా పెంపొం దించుకున్నాం. ఉరీ, బాలాకోట్‌ వైమానిక దాడులకు ప్రతీకారంగా జరిగిన సర్జికల్‌ స్ట్రయిక్స్‌ ద్వారా భారతదేశం తన సార్వభౌమత్వాన్ని కాపాడుకోవడంలో రాజీ పడదని ప్రపంచానికి చాటి చెప్పాం. 

వలస పాలన నుండి స్వాతంత్య్రం పొందిన 75వ సంవత్సరాన్ని ‘ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌’ కింద భారతదేశం వివిధ కార్య క్రమాల ద్వారా స్మరించుకుంటోంది. రాబోయే 25 ఏళ్లలో మనం చూడాలనుకునే సుసంపన్నమైన, బలమైన భారతదేశం కోసం విధాన పరమైన నమూనాలను నిర్ణయించేందుకు ఇది అవకాశం ఇస్తుంది. గత 8 సంవత్సరాలలో గణనీయమైన విజయాలను మోదీ ప్రభుత్వం సాధించింది. పైనచెప్పినవి ఇందుకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. ‘మనం గమ్యస్థానానికి చేరేముందు ఎన్నో మైళ్ల దూరం ప్రయా ణించాల్సి ఉంటుంద’న్న ప్రధానమంత్రి మాటలు మన కర్తవ్యాన్ని గుర్తుచేస్తూనే ఉంటాయి. ఆ లక్ష్యం దిశగా అడుగులు వేద్దాం, రండి!


వ్యాసకర్త: 
కేంద్ర సాంస్కృతిక, పర్యాటక, ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి శాఖల మంత్రి
జి. కిషన్‌ రెడ్డి
 

మరిన్ని వార్తలు