ఈ శాంతి ఒప్పందం ఓ ఆశాకిరణం

23 Sep, 2020 02:34 IST|Sakshi

సందర్భం 

ఇజ్రాయెల్, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ మధ్య ఆగస్టు 13న కుదిరిన శాంతి ఒప్పందం మూడు కారణాల వల్ల అత్యంత ప్రాధాన్యత సంతరిం చుకుంది. 1. యూదు ఇజ్రాయెల్, అరబ్‌ ముస్లింల మధ్య ఉన్న తీవ్రమైన వైషమ్యాలకు ముగింపు పలుకుతూ ఇజ్రాయెల్, అరబ్‌ లీగ్‌ మధ్య దౌత్య సంబంధాలు నెలకొనడానికి ఇది ఒక దారి చూపగలదు. 2, ఈ శాంతి ఒప్పందం ముస్లిం ప్రపంచాన్ని విభజిస్తుంది. 3, పాలస్తీనియన్ల స్థానభ్రంశం, దాని కొనసాగింపుగా జరిగే ప్రమాదం ఉన్న రక్తపాతాన్ని నివారించగలుగుతుంది. ఈ ఒప్పందం ప్రకారం పాలస్తీనా, ఇజ్రాయెల్‌ మధ్య ఘర్షణకు కేంద్రబిందువైన వెస్ట్‌ బ్యాంకులోని చాలా భాగాలను తనలో కలుపుకునే ప్రయత్నాలను ఇజ్రాయెల్‌ ఆపేస్తుంది. అలాగే ఇజ్రాయెల్, యూఏఈ వాణిజ్యం, శాస్త్ర సాంకేతిక వైద్య పరిశోధనా రంగాల్లో సహకరించుకుంటాయి. జోర్డాన్, ఈజిప్టు తర్వాత ఇజ్రాయెల్‌తో దౌత్య సంబంధాలు నెలకొల్పుకున్న మూడో అరబ్‌ దేశం యూఏఈ.

పాలస్తీనాగా పిలుస్తున్న ప్రాంతం మధ్యధరా సముద్రం, జోర్డాన్‌ నది మధ్య నెలకొని 1922 వరకు అట్టోమాన్‌ సామ్రాజ్య పరిధిలో ఉండింది. అయితే మొదటి ప్రపంచ యుద్ధ అనంతర కాలంలో నానాజాతి సమితి ఇచ్చిన ఉత్తర్వుల ప్రకారం దాని కార్యనిర్వహణ బ్రిటన్‌ పరమైంది. పాలస్తీనాలోని ప్రాంతాలు ధార్మికంగా యూదులకు, క్రైస్తవులకు, అరబ్బులకు కూడా ప్రాధాన్యత కలిగినవి. రెండో ప్రపంచ యుద్ధ అనంతరం నాజీ జర్మనీలో హోలోకాస్ట్‌ అనుభవించిన యూదులకు భూమిని కేటాయిస్తూ ఐక్యరాజ్య సమితి సాధారణ సభ ఒక తీర్మానాన్ని ఆమోదించింది. దాని ప్రకారం పాలస్తీనా రెండుగా విభజించబడింది. ఈ విభజనకు ఇజ్రాయెల్‌ ఆమోదించినా, సమీప దేశాలు తిరస్కరిం చాయి. అనంతర రాజకీయ పరిణామాలు 1948లో ఘోర యుద్ధానికి దారితీశాయి. ఇజ్రాయెల్‌ ఒకవైపు; ఐదు అరబ్‌ దేశాలు జోర్డాన్, ఇరాక్, సిరియా, ఈజిప్ట్, లెబనాన్‌ మరోవైపు నిలిచి పోరాడాయి. ఇజ్రాయెల్, అరబ్‌ ప్రపంచం మధ్య దశాబ్దాల ఘర్షణకు తెరలేచింది. 1949లో యుద్ధాన్ని నిలుపుచేస్తూ కుదిరిన ఒప్పందాలు ఆయా ప్రాంతాల మీద ఆధిపత్యాన్ని ఏర్పరచాయి.

తనకు కేటాయించిన భూభాగంతో పాటు పాలస్తీనాకు కేటాయించిన భాగానికి కొద్ది కిలోమీటర్ల దూరంలో ఉన్న ప్రాంతాల మీద కూడా ఇజ్రాయెల్‌ తన సార్వభౌమత్వాన్ని ప్రకటించుకుంది. వెస్ట్‌ బ్యాంక్, తూర్పు జెరూసలేం జోర్డాన్‌ నియంత్రణలోకి వస్తే, గాజా స్ట్రిప్‌ ఈజిప్ట్‌ నియంత్రణలోకి వచ్చింది. 1967 నాటి ఆరు రోజుల యుద్ధంలో గాజా స్ట్రిప్, సినాయ్‌ ద్వీపకల్పంను ఈజిప్ట్‌ నుంచి; వెస్ట్‌ బ్యాంక్, తూర్పు జెరూసలేంను జోర్డాన్‌ నుంచి; గోలన్‌ హైట్స్‌ను సిరియా నుంచి ఇజ్రాయెల్‌ వశం చేసుకుంది. 1948లో తన స్వాతంత్య్రం ఇజ్రాయెల్‌ ప్రకటించుకున్న నాటి నుంచి హింసాత్మక ఘర్షణల కారణంగా లక్షలాది మంది పాలస్తీనియన్లు తమ ప్రాంతాల నుంచి తరలిపోవాల్సి వచ్చింది.
యూదులు పవిత్రంగా తలచే ఎన్నో స్థలాలకు వెస్ట్‌ బ్యాంక్‌ కేంద్రం. అక్కడ ఐదు లక్షల మంది యూదులు స్థిరపడ్డారు. ఇందులో అత్యధికులు ఇజ్రాయెల్‌ సరిహద్దులో నివసిస్తున్నారు. వీటినే ఇజ్రాయెల్‌ కలుపుకోవాలని అనుకుంది. వెస్ట్‌ బ్యాంకు 30 లక్షల మంది పాలస్తీనియన్లకు నివాస స్థలం కూడా. నిజానికి దీనిమీద తన ఆధిపత్యాన్ని పూర్తిగా ఇజ్రాయెల్‌ నిలుపుకున్నప్పటికీ దాన్ని తన ప్రాంతంగా ప్రకటించుకోలేదు. అలా చేస్తే లక్షలాది పాలస్తీనియన్లు స్థానభ్రం శానికి గురికావాల్సి రావడమేగాక, ఐసిస్, ఇస్లామిక్‌ తీవ్రవాదం కారణంగా తీవ్ర రాజకీయ ఆర్థికపరమైన ఆంక్షలు ఎదుర్కొంటున్న సరిహద్దు దేశాలు మహా విపత్తు బారిన పడతాయి. శాంతి ఒప్పందం ఈ ప్రమాదాన్ని తప్పించింది.

అయితే ఈ ఒప్పందం మధ్యప్రాచ్యంలో కొత్త పరిణామాలకు దారితీయగలదు. ముస్లిం ప్రపంచం స్పష్టంగా చీలి పోతుంది. షియాల ప్రాబల్యం ఉన్న ఇరాన్, సున్నీల ప్రాబల్యం గల సౌదీ అరేబియా సారథ్యంలోని అరబ్‌ దేశాలు ఇప్పటికే సిరియా, యెమెన్, ఇరాక్, లెబనాన్‌లో తీవ్రమైన ముఖాముఖి పోరులో ఉన్నాయి. యెమెన్‌లో హైతీ, లెబనాన్‌లో హెజ్‌బుల్లా, గాజాలో హమాస్‌ లాంటి తిరుగుబాటుదారులు, ఇతర పాలస్తీనా గ్రూపులు అయిన ఇస్లామిక్‌ జిహాద్‌ లాంటి వాటికి ఇరాన్‌ సహకరిస్తోందని ఆరోపణలు ఎదుర్కొంటోంది. అందుకే ఇరాన్‌ మీద విధిం చిన ఆయుధాల కొనుగోలుకు సంబంధించిన నిషేధ పొడిగింపునకు మద్దతునిస్తూ, బెహ్రాయిన్, కువైట్, ఒమన్, ఖతార్, సౌదీ అరేబియా, యూఏఈ సభ్యులుగా గల గల్ఫ్‌ కోఆపరేషన్‌ కౌన్సిల్‌ ఆగస్టు 10న సంయుక్త వినతిపత్రాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలికి సమర్పించింది.

కాబట్టి ఈ శాంతి ఒప్పందానికి ఇరాన్‌ తీవ్రంగా స్పందించడంతో పాటు, ఆయా తిరుగుబాటుదారు వర్గాలకు మరింత మద్దతు ఇచ్చే వీలుంది. దీనివల్ల సున్నీ ముస్లిం దేశాలు ఏకతాటిపైకి రావడం, ఫలితంగా తీవ్రమైన ఆయుధ పోటీ నెలకొనడం జరగవచ్చు. అమెరికా, ఇరాన్‌ ఘర్షణల్లో మధ్యప్రాచ్య దేశాలు అమెరికా వైపు నిలబడి ఇరాన్‌ను ఒంట రిని చేస్తాయి. అట్లా అమెరికా, ఇజ్రాయెల్, అరబ్‌ దేశాల కొత్త ఐక్యత సాధ్యం అయ్యే వీలుంది. సహజంగానే దీనివల్ల అమెరికా, దాని మిత్ర దేశాలు భాగస్వాములు కాని దేశాల వైపు ఇరాన్‌ స్నేహహస్తాన్ని సాచే వీలుంది. అలా మధ్య ప్రాచ్యంలోకి చైనా ప్రవేశించడానికి వీలు ఏర్పడుతుంది. ఇప్పటికే చైనా, పాకిస్తాన్‌ ఎకనమిక్‌ కారిడార్‌ వలన అరేబియా సముద్రంలో చైనాకు ప్రవేశం దొరికింది. ఇది మరింతగా విస్తృతమై భిన్న ధ్రువ ప్రపంచంలో సరికొత్త కూటమికి దారితీస్తుంది.

ఈ ఘర్షణలో భాగస్వాములైన ఇజ్రాయెల్, పాలస్తీ నాతో సహా, అన్ని అరబ్‌ దేశాలతోనూ భారత్‌ విజయవంతంగా స్నేహ సంబంధాలను కొనసాగించగలిగింది. అయితే  మౌలిక సదుపాయాల కల్పనలో ఇరాన్, చైనా భాగస్వామ్యం ఇండియాలో కొంత ఆందోళనకు కారణమైంది. చైనా సహకారం ఉన్న పాకిస్తాన్, ఆర్గనైజేషన్‌ ఆఫ్‌ ఇస్లామిక్‌ కంట్రీస్‌ను విచ్ఛిన్నం చేయడానికి చేసిన ప్రయత్నం ఇప్పటికే అరబ్‌ ప్రపంచంలో అనుమానాలు రేకెత్తించింది. అందుకే కశ్మీర్‌ విషయంలో పాకిస్తాన్‌కు వ్యతిరేకంగా సౌదీ అరేబియా గట్టి వైఖరి తీసుకుంది. పాలస్తీనా, ఇజ్రాయెల్‌ రెండు దేశాల విధానానికి కట్టుబడి ఈ శాంతి ఒప్పందాన్ని భారత్‌ స్వాగతించింది. అయితే రానున్న రోజుల్లో మారిపోయే రాజకీయ పరిణామాలు, ముఖ్యంగా పాలస్తీనా, ఇజ్రాయెల్, ఇరాన్‌ విషయంలో చూపాల్సిన సంయమనం పరంగా భారత విదేశాంగ విధానానికి కొత్త సవాళ్లు ఎదురవుతాయి.
వ్యాసకర్త:డా. గద్దె ఓం ప్రకాష్‌ , అసిస్టెంట్‌ ప్రొఫెసర్, డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పొలిటికల్‌ సైన్స్, సెంట్రల్‌ యూనివర్సిటీ ఆఫ్‌ సిక్కిం, గ్యాంగ్‌టక్‌ ‘
 మొబైల్‌: 94749 79304

మరిన్ని వార్తలు