క్వాడ్‌తో మనకు ఒరిగేదేమిటి?

4 Jun, 2022 02:00 IST|Sakshi

సందర్భం

క్వాడ్‌ సభ్యదేశాలకు చెందిన ప్రత్యేక ఆర్థిక జోన్లలో ఫ్రీడమ్‌ ఆఫ్‌ నావిగేషన్‌ పేరిట అమెరికా వంటి ప్రాంతీయేతర శక్తులు విహరించడాన్ని అడ్డుకునేందుకు ఎలాంటి వ్యూహాన్నీ భారత్‌ రూపొందించలేదు. భారత్‌కు హిందూ మహాసముద్ర రీజియన్‌ చాలా ముఖ్యమైనది. 90 శాతం చమురు దిగుమతులు, 95 శాతం వాణిజ్య కార్యకలాపాలు ఇక్కడినుంచే జరుగుతున్నాయి. విదేశీ ఆధిపత్య శక్తుల ద్వారా హిందూ మహా సముద్ర ప్రాంతంలో సైనికీకరణ, పోటీ నెలకొంటే అది భారత్‌ భద్రతకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. ఒక ప్రాంతీయ శక్తిగా తన సొంత ప్రయోజనాలను కాపాడుకోవడమే కాకుండా, హిందూ మహా సముద్ర ప్రాంత సమీప దేశాల ప్రయోజనాలను కాపాడటంలోనూ భారత్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంది.

రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో, ఇటీ వలే జపాన్‌లో ఆస్ట్రేలియా, ఇండియా, జపాన్, అమెరికా మధ్య ముగిసిన నాలుగుదేశాల సంభాషణ లేదా క్వాడ్‌ సదస్సు పలువురు అంతర్జాతీయ సంబంధాల విశ్లేషకులను విశేషంగా ఆకర్షించింది. తైవాన్‌పై చైనా దాడిచేస్తే సైనికపరంగా స్పందిస్తామని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ చేసిన వ్యాఖ్య ప్రాధాన్యతను సంతరించుకుంది. సదస్సు తర్వాత విడుదల చేసిన సంయుక్త ప్రకటన... 2021 మార్చ్‌ 12న జరిగిన తొలి సదస్సులో చేసిన ప్రకటనలోని క్వాడ్‌ స్ఫూర్తిని నొక్కి చెప్పింది. 

అమెరికా ఇంతవరకూ 1982 నాటి సముద్ర చట్టాలపై ఐక్యరాజ్య సమితి కన్వెన్షన్‌ను ఆమోదించలేదు కానీ 1958 నాటి నడి సము ద్రంపై కన్వెన్షన్‌ (సీహెచ్‌ఎస్‌)లో మాత్రం భాగం పుచ్చుకుంది. అయితే నడిసముద్రంపై కన్వన్షన్‌ని తదుపరి వచ్చిన సముద్ర చట్టాలపై ఐరాస కన్వెన్షన్‌ తోసిపుచ్చిందనుకోండి! అమెరికా దీన్నే లాంఛనప్రాయమైన అంతర్జాతీయ చట్టంగా గుర్తించినప్పటికీ, 1982 నాటి తాజా కన్వెన్షన్‌ని అమెరికా ఇంకా ఆమోదించకపోవడం వల్ల యూఎన్‌సీఎల్‌ఓఎస్‌ ప్రతిపాదించిన ప్రత్యేక ఆర్థిక మండళ్ల (ఈఈజెడ్‌) భావనకు గణనీయంగా సవాలు ఎదురవుతోంది. తీరం నుంచి 200 నాటికల్‌ మైళ్ల దూరం వరకు సముద్ర అన్వేషణలపై, సముద్ర వనరుల ఉపయోగంపై, నీటినుంచి, గాలి నుంచి విద్యుత్‌ ఉత్పత్తిపై ఆయా దేశాలకు ఉండే ప్రత్యేక హక్కులను ఈ ప్రత్యేక ఆర్థిక మండళ్ల భావన గుర్తిస్తోంది.

గత సంవత్సరం క్వాడ్‌ దేశాల మధ్య తొలి సదస్సు జరిగిన నెల రోజుల్లోపే అంటే 2021 ఏప్రిల్‌ 7న అమెరికా భారత్‌కు నిజంగానే షాక్‌ కలిగించింది. అంతర్జాతీయ చట్టానికి అనుగుణంగా ఉండే లక్షద్వీప్‌ దీవుల సమీపంలోని భారత ప్రత్యేక ఆర్థిక మండలి జలాల లోపలికి ఫ్రీడమ్‌ ఆఫ్‌ నావిగేషన్‌ (ఎఫ్‌ఓఎన్‌ఓఎఫ్‌) పేరిట తన భారీ నౌకను పంపించినట్లు అమెరికా తెలిపింది. అయితే తీరప్రాంత దేశం సమ్మతి లేకుండా అలాంటి విన్యాసం నిర్వహించడం చట్టవిరుద్ధమని భారత్‌ తీవ్రంగానే స్పందించింది. సముద్ర మండళ్ల చట్టం 1976 ప్రకారం తన ప్రాదేశిక జలాల్లోకి, ప్రత్యేక ఎకనమిక్‌ జోన్‌లోకి విదేశీ నౌకలు ప్రత్యేకించి సైనిక నౌకలు ప్రవేశించాలంటే ముందస్తు సమా చారం, అనుమతి తీసుకోవాలని భారత్‌ చెబుతోంది. దీని ప్రకారం చూస్తే అమెరికా చేపట్టిన నౌకా విన్యాసం సముద్ర చట్టాలపై ఐక్య రాజ్య సమితి కన్వెన్షన్‌ని మాత్రమే కాదు, భారత జాతీయ చట్టాలను కూడా ఉల్లంఘించినట్లే అవుతుంది. 

ఫ్రీడమ్‌ ఆఫ్‌ నేవిగేషన్‌ అన్ని దేశాలకూ వర్తిస్తుందనీ, క్వాడ్‌ డిక్లరేషన్‌ ఏ ప్రత్యేక దేశాన్నీ లక్ష్యంగా చేసుకోదని చెబుతూనే, చైనాకు బలమైన సందేశాన్ని పంపడంలో భాగంగా అమెరికా అలాంటి చర్యకు పాల్పడిందని కొంతమంది పరిశీలకులు సమర్థిస్తుండవచ్చు.  అమెరికా పాదముద్రల్లో నడిచి, చైనాతో సహా ఇతర విదేశీ శక్తులు కూడా ఇదే వాదన వినిపించి భారత ప్రత్యేక ఆర్థిక జోన్‌లోకి స్వేచ్ఛగా తమ నౌకలను పంపిస్తే, భారత్‌కు ఇది తక్షణ ఆందోళన కలిగించక మానదు.

ఈ అర్థంలో క్వాడ్‌ ప్రకటన స్థూలంగానే భారత భద్రతా పరమైన ఆందోళనలను విస్మరించిందనే చెప్పాలి. అంతేకాకుండా యూరేషి యన్‌ భౌగోళిక వ్యూహాన్ని దక్షిణాసియా, హిందూ మహాసముద్ర తీర ప్రాంతంతో సహా ఓ ఒక్క శక్తీ లేదా సంకీర్ణ శక్తులు కూడా డామినేట్‌ చేయడాన్ని అనుమతించకూడదనే అమెరికన్‌ వ్యూహాన్ని మాత్రమే క్వాడ్‌ ప్రకటన సంతృప్తి పర్చనుంది. ‘చైనా–ఇండియా గ్రేట్‌ పవర్‌ కాంపిటీషన్‌ ఇన్‌ ది ఇండియన్‌ ఓషన్‌ రీజియన్‌ ఇష్యూస్‌ ఫర్‌ కాంగ్రెస్‌’ శీర్షికతో అమెరికా కాంగ్రెస్‌ రీసెర్చ్‌ పేపర్‌ని 2018లో ట్రంప్‌ పాలనా కాలంలో ప్రచురించారు. భారత్, చైనా మధ్య పోటీ, శత్రుత్వం పెరుగుతున్న నేపథ్యంలో హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలో ఒక సమతుల్య శక్తిగా అమెరికా వ్యవహరించాలని ఈ పత్రం స్పష్టం చేసింది.

తమ హిందూ మహాసముద్ర తీర ప్రాంత వ్యూహంలో భారత్‌ అతిముఖ్యమైన వ్యూహాత్మక భాగస్వాములలో ఒకటని ట్రంప్, బైడెన్‌ పాలనా యంత్రాంగాలు రెండూ ప్రకటించాయి గానీ, భారత ప్రత్యేక ఆర్థిక జోన్‌లో అమెరికా యుద్ధ నౌకా విహారం దాని విశ్వసనీయతకు తూట్లు పొడిచింది. అలాగే ఒక ప్రాంతీయ శక్తిగా ఈ మొత్తం రీజియన్‌ ప్రయోజనాలను పరిరక్షించే మాట దేవుడెరుగు, భారత్‌ తన సొంత ప్రయోజనాలనైనా కాపాడుకునే సామర్థ్యం కలిగివుందా అనే సందేహాలను ఇతర తీరప్రాంత దేశాల్లో పెంచి పోషించింది.

తన ప్రత్యేక ఆర్థిక మండలిలోకి ఇతరులు ప్రవేశించడానికి భారత్‌ తీసుకున్న వైఖరి లాగానే, ఇతర దేశాలు కూడా తన ప్రత్యేక ఆర్థిక మండలిలోకి ప్రవేశించడానికి ముందుగా అనుమతి తీసుకోవలసి ఉందని చైనా పేర్కొంటోంది. అయితే ఈ ప్రత్యేక ఆర్థిక మండలి తనదే అని చైనా చెబుతుండటం వల్ల జపాన్, దక్షిణ కొరియా, పిలిఫ్పైన్స్, వియత్నాంతో దానికి వివాదాలు ఎదురవుతున్నాయి. అమెరికాకు ఈ దేశాలతో భద్రతాపరమైన బాధ్యతలు ఉంటున్నాయి. ప్రస్తుతానికి అయితే తూర్పు, దక్షిణ తీర ప్రాంతంలో భారత్‌ తన ఉనికిని ప్రదర్శించుకోవడానికి చాలా తక్కువ అవకాశాలు మాత్రమే ఉన్నాయి. కాబట్టి చైనా తీరప్రాంతంపై క్వాడ్‌ చేసిన ప్రకటన భారత్‌కు ఉపకరించదు. అదే సమయంలో అమెరికాకు, ఆగ్నేయాసియా, తూర్పు ఆసియాలోని తన పొత్తుదారుల ప్రయోజనాలను మాత్రమే ఈ ప్రకటన నెరవేరుస్తుందని గ్రహించాలి.

హిందూ మహాసముద్ర తీర ప్రాంతంలోని లేదా ఇండో పసిఫిక్‌ రీజియన్‌లోని భౌగోళిక ప్రాంతాన్ని క్వాడ్‌ గుర్తించడం లేదు. 2017 నాటి జాతీయ భద్రతా వ్యూహం ప్రకారం, భారత పశ్చిమ తీర ప్రాంతం నుంచి అమెరికా పశ్చిమ తీరప్రాంతం వరకు వ్యాపించిన ప్రాంతాన్ని ఇండో–పసిఫిక్‌ ప్రాంతమని అమెరికా నిర్వచించింది. కాగా, ఆఫ్రికా కొమ్ము అని చెబుతున్న ప్రాంతం నుంచి పసిఫిక్‌ రీజియన్‌ తీరం వరకు ఉన్నదే ఇండో–పసిఫిక్‌ ప్రాంతమని భారత్‌ భావిస్తోంది. ఈ ప్రాంతంలో భారత ప్రయోజనాలు చాలావరకు ఆగ్నేయాసియా దేశాలతోనే ముడిపడి ఉన్నాయి. ఈ ప్రాంతంలో ‘స్ట్రింగ్‌ ఆఫ్‌ పెరల్స్‌’ పేరిట పెరుగుతున్న చైనా మదుపు ప్రాజెక్టులు, మిలిటరీ వ్యవస్థల నిర్మాణం భారత్‌ ఆర్థిక, భద్రతా ప్రయోజనాలకు ప్రత్యక్ష ప్రమాదంగా మారుతున్నాయి.

భారతీయ హిందూ మహాసముద్ర వ్యూహంలో రెండు కీలక అంశాలున్నాయి. ఒకటి, భారత ప్రాంతీయ నౌకల ఉనికిని బలోపేతం చేయడం. దీనివల్ల విదేశీ శక్తుల ఆధిపత్యానికి చెక్‌ పెట్టవచ్చు. రెండు, ఆర్థిక, సాంకేతిక సహకార చర్యలను ప్రోత్సహించడం. సభ్యదేశాలకు చెందిన ప్రత్యక ఆర్థిక జోన్లలో ఫ్రీడమ్‌ ఆఫ్‌ నావిగేషన్‌ పేరిట ప్రాంతీ యేతర శక్తులు విహరించడాన్ని సామూహికంగా అడ్డుకునేందుకు ఇంతవరకు ఎలాంటి వ్యూహాన్నీ భారత్‌ రూపొందించలేదు. భారత్‌కు సంబంధించినంతవరకూ హిందూ మహాసముద్ర రీజియన్‌ చాలా ముఖ్యమైనది. 90 శాతం చమురు దిగుమతులు, 95 శాతం వాణిజ్య కార్యకలాపాలు ఈ ప్రాంతం ద్వారానే జరుగుతున్నాయి. విదేశీ శక్తుల ద్వారా హిందూ మహాసముద్ర రీజియన్‌లో సైనికీకరణ, పోటీ నెల కొంటే అది భారత్‌ భద్రతకు తీవ్ర ప్రమాదాన్ని కలిగిస్తుంది. 

ఒక ప్రాంతీయ శక్తిగా తన సొంత ప్రయోజనాలను కాపాడు కోవడం కోసమే కాకుండా, హిందూ మహా సముద్ర ప్రాంతం సమీప దేశాల ప్రయోజనాలను కూడా కాపాడటంలో భారత్‌ కీలక పాత్ర పోషించాల్సి ఉంది. దీనికోసం స్వతంత్ర  హిందూ మహాసముద్ర వ్యూహాలను భారత్‌ బలోపేతం చేసుకోవలసి ఉంది. అప్పుడే ఈ రీజి యన్‌లో నిజమైన నికర భద్రతా ప్రదాతగా భారత్‌ ఆవిర్భవిస్తుంది.


వ్యాసకర్త: డాక్టర్‌ గద్దె ఓంప్రసాద్‌,
అసిస్టెంట్‌ ప్రొఫెసర్, సిక్కిం సెంట్రల్‌ యూనివర్సిటీ మొబైల్‌: 79089 33741

మరిన్ని వార్తలు