స్వీయరక్షణ కోసమే... క్షమాభిక్షలు!

29 Nov, 2020 01:20 IST|Sakshi

ఈ వారం అమెరికా చరిత్రలో కీలకమైనది. ఫలితాలు వెలువడిన ప్పటి నుంచీ పేచీ మొద లుపెట్టిన ప్రస్తుత అధ్య క్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ ఇక తన నిష్క్రమణ ఖాయ మని నిర్ధారణ కొచ్చారు. అధికారం మెట్లు దిగ బోయే అధ్యక్షుణ్ణి అమెరి కాలో పెద్దగా ఎవరూ పట్టించుకోరు. ఆయన పాలనాపరమైన ఆదే శాలు ఇవ్వలేరు. ఎవరికీ హెచ్చరికలు జారీ చేయ లేరు. వైట్‌హౌస్‌లో ఆయన ఇప్పుడు నిరర్థక అధ్యక్షుడు. అధ్యక్షుడిగా వున్న నాలుగేళ్లు, అంత క్రితం రెండేళ్లు ఆయన మీడియాలో మార్మోగారు. మొత్తం ఆరేళ్లుగా ఆయన ఆడిందే ఆటయింది. మాట మాట్లాడితే... ఎవరిమీదనో విరుచుకుపడితే చప్పట్లు మోగాయి. తనను నిలదీస్తున్న మహిళా జర్నలిస్టుపైనో, మరొకరిపైనో చవక బారు వ్యాఖ్యలు చేసి నొప్పిస్తే ఆయన మద్దతుదార్లు సామాజిక మాధ్య మాల్లోనూ, బయటా ట్రంప్‌ను కీర్తించే వారు. 

ఇప్పుడు ఆ ప్రాభవం అడుగం టింది. ఆయన స్థానాన్ని  కాబోయే అధ్యక్షుడు జో బైడెన్‌ కొంచెం కొంచెంగా ఆక్రమిస్తున్నారు. ట్రంప్‌ ఇంకెంతమాత్రం పతాకశీర్షిక కాదు. అయితే దిగిపోయే అధ్యక్షుడి అహాన్ని సంతృప్తిపరిచేందుకు ఆయనకు కొన్ని అధికారాలిస్తారు. అందులో ప్రధానమైనది క్షమాభిక్ష అధికారం. ట్రంప్‌ దాన్ని ఉపయోగించుకుని ఎవరెవరిని క్షమిస్తారన్నదానిపై చాలా ఊహాగానాలొచ్చాయి. దాదాపు అవన్నీ నిజమయ్యాయి. ఆయన ముందుగా క్షమించింది తనకు గతంలో జాతీయ భద్రతా సలహాదారుగా వ్యవహరించిన మైకేల్‌ ఫ్లిన్‌ను. ఆయన తన అనుచరు డని, తననే నమ్ముకున్నాడని, తనకు మంచి అభిమాని అని కాదు... ఆయన్ను క్షమించడంద్వారా ట్రంప్‌ తనను తాను క్షమించుకున్నారు. ఎందుకంటే ఫ్లిన్‌పై విచారణ ముందుకెళ్లేకొద్దీ  దోషిగా తేలేది ట్రంపే. 

ఇదీ వివాదం... 
గత అధ్యక్ష ఎన్నికల్లో రష్యా ఇంటెలిజెన్స్‌ సంస్థలు జోక్యం చేసుకున్నాయని, ట్రంప్‌కు అనుకూలంగా, హిల్లరీ క్లింటన్‌కు వ్యతిరేకంగా తప్పుడు ప్రచారానికి దిగి కనీసం మూడు రాష్ట్రాల్లో 80,000 ఓట్లు ఆయనకు పడేలా చేశాయన్నది ప్రధాన అభియోగం. అధ్యక్ష ఎన్నికలో కీలకపాత్ర పోషించిన ఆ మూడు రాష్ట్రాల్లో ఏం జరిగిందన్నది ఇంకా మిస్టరీగానే వుంది. విచారణ అనంతంగా సాగుతూనే వుంది. అసలు రష్యా ఎందుకు జోక్యం చేసుకోవాలనుకుందో ఇంకా అంతు బట్టడం లేదు. ఎందుకంటే రష్యాతో మంతనాలు సాగించి, దాని సీక్రెట్‌ ఏజెం ట్లకు అండగా నిలిచినవారిలో అనేకులు రకరకాల సాకులు చెప్పారు. కొందరు అడ్డగోలుగా అబద్ధాలాడారు. మరికొందరు సాక్ష్యాలను ధ్వంసం చేశారు.

ఇంకొం దరు తమకు జ్ఞాపకశక్తి తగ్గిపోయిందన్నారు. దానికితోడు ట్రంప్‌ ప్రభుత్వం తెలివిగా ఈ ఎపిసోడ్‌పై దర్యాప్తు మొదలెట్టిన ప్రత్యేక కమిటీకి సారథ్యం వహించిన రాబర్ట్‌ మ్యూలర్‌ అధికారాలకు చాలా పరిమితులు విధించింది. జ్ఞాపకశక్తి పోయిందన్నవారిలో మైకేల్‌ ఫ్లిన్‌ కూడా వున్నారు. అప్పటి అధ్యక్షుడు ఒబామా రష్యా ప్రమేయంపై విచారణకు మొదట్లో అంగీకరించలేదు. అయితే 2016 డిసెంబర్‌ 29న రష్యాపై కొన్ని ఆంక్షలు విధించారు. దాంతో అప్పటికింకా అధ్యక్ష పదవి స్వీకరించని ట్రంప్‌కూ, రష్యా ప్రభుత్వానికీ మధ్య రహస్య లడాయి నడిచింది. ‘మీరడిగారని సాయం చేశాం. చివరకు మమ్మల్ని ఇలా బజారున పడే స్తారా?’ అని రష్యా ప్రభుత్వం శివాలెత్తింది.

సరిగ్గా ఆ సమయానికి డొమినికన్‌ రిపబ్లిక్‌లో సెలవుల కోసం వెళ్లి సేద తీరుతున్న ట్రంప్‌ అనుచరుడు ఫ్లిన్‌ అమెరికాలో రష్యా రాయబారి సెర్జీ కిస్లయెక్‌ను సంప్రదించారు. ఆ వెంటనే కిస్లయెక్‌ విమానంలో డొమినికన్‌ రిపబ్లిక్‌కు వచ్చారు. ఇద్దరి భేటీ తర్వాత రష్యా చల్లబడింది. ‘ఒబామా విధించిన ఆంక్షల్ని మేం వచ్చాక తొలగిస్తాం. కనుక మీరు ప్రతీకారానికి దిగకండి’ అని ఫ్లిన్‌ నచ్చజెప్పారు. అప్పట్లో ఒబామా ఆంక్షలు ప్రకటించగానే రష్యా సైతం అదే పని చేస్తుందని అందరూ అనుకున్నారు. కానీ చిత్రంగా రష్యా అధ్యక్షుడు పుతిన్‌ వాటిని పట్టించుకోలేదు. ట్రంప్‌ అధ్యక్షుడు కావడానికి అయిదురోజుల ముందు ఫ్లిన్‌–కిస్లయెక్‌ సంభాషణలపై కథనాలు వచ్చినప్పుడు వారు కేవలం క్రిస్మస్‌ శుభాకాంక్షలు తెలుపుకున్నారని, అప్పుడు రష్యా విమానం కూలిపోయినందుకు ఫ్లిన్‌ సంతాపం తెలిపారని ప్రస్తుతం ఉపాధ్యక్షుడిగా వున్న మైక్‌ పెన్స్‌ చెప్పారు. ఆ తర్వాత కొన్నిరోజులకే ఫ్లిన్‌–కిస్లయెక్‌ సంభాషణల్ని ఇంటెలిజెన్స్‌ సంస్థలు రహస్యంగా రికార్డు చేశాయని తేలిపోయింది. అది 

తెలిశాక ఇక లాభంలేదని
ఫ్లిన్‌ నిజం చెప్పారు. కిస్లయెక్‌తో ఏం మాట్లాడానో గుర్తు లేదుగానీ... అలా చేయ కుండా వుండాల్సిందని సంజాయిషీ ఇచ్చారు. అయితే ‘ట్రంప్‌ అధికారంలో కొచ్చాక ఆంక్షలు తొలగిస్తాం’ అన్న మాటే ఆయన్ను వెంటాడుతోంది. ఇప్పుడు ఫ్లిన్‌కు క్షమాభిక్ష దొరికింది గనుక దానిపై ఇక విచారణ వుండదు. ఫ్లిన్‌ మాత్రమే కాదు... ఇంకా మరికొందరు కూడా ఈ స్కాంలో చిక్కుకున్నారు. వారందరినీ ట్రంప్‌ క్షమించారు. వారిలో పాల్‌ మనాఫోర్ట్, జో అర్పయో, రోజర్‌ స్టోన్‌ తదితరులున్నారు. వీరందరికీ క్షమాభిక్ష పెట్టారు సరే... ట్రంప్‌ స్వీయ క్షమా భిక్షకు కూడా సిద్ధపడతారా? ఇప్పుడు అందరిలోనూ వున్న సంశయం ఇదే. 

ఎవరే మనుకుంటే మనకేం అనుకునే ట్రంప్‌ అలా చేసినా చేయొచ్చు. నిబంధనల ప్రకారం దానిపై తుది నిర్ణయం మాత్రం అమెరికా సుప్రీంకోర్టే చేయాలి. ట్రంప్‌ మద్దతుదార్లకు ఇప్పుడు సుప్రీంకోర్టు అలా చేస్తుందా లేదా అన్న చింత లేదు. ఎందుకంటే తనను ఇరికించగలవారందరినీ ఇప్పటికే డొనాల్డ్‌ ట్రంప్‌ క్షమించారు. కనుక స్వీయ క్షమాభిక్ష అవసరం పడకపోవచ్చు. మొత్తానికి కుట్ర ఆరోపణల మధ్య అధికారంలోకొచ్చిన ట్రంప్‌ సర్కారు... దాని తాలూకు నిజం ఎప్పటికీ బయట పడకుండా అడ్డంకులు సృష్టించడంతో అధికారంనుంచి తప్పుకుం టోంది. ఏతావాతా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రవేశం, నిష్క్రమణా రెండింటిలోనూ వివా దాలే రగిలాయి.
-జార్జి మాథ్యూ, సీనియర్‌ జర్నలిస్టు

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా