వాహ్‌ హైదరాబాద్‌... ఇదేనా విశ్వనగరం?

26 Nov, 2020 01:25 IST|Sakshi

సందర్భం

మాటలు కోటలు దాటుతున్నయ్‌; చేతలు మాత్రం గడప దాటని చరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిది. హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామంటూ గత ఆరేళ్లుగా ఇచ్చిన హామీలెన్ని? వాటిలో అమలైనవెన్ని? నగరంలో రూ.67,000 కోట్ల వ్యయంతో మౌలిక సదుపాయా లను ఘనంగా పెంపొందించినట్లు కేటీఆర్‌ స్వయంగా రాష్ట్ర శాసనసభలో చెప్పారు. అంతగా అభివృద్ధి చేస్తే నగరంలో రోడ్లపైకి వర్షపు నీరు ఎందుకొచ్చింది? కాలనీలకు కాలనీలు ఎందుకు ముంపునకు గురయ్యాయి? గత జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా సంవ త్సర కాలంలో లక్ష మంది పేదలకు రెండు పడకల ఇళ్ళు నిర్మించి ఇస్తామని కేసీఆర్‌ భరోసా ఇచ్చారు. ఎన్నికలు వస్తున్నాయని హడావుడిగా దసరా రోజున 11,000 ఇళ్లలో గృహప్రవేశం జరిపిం చారు. లక్ష ఇళ్ళెక్కడ? 11,000 ఎక్కడ? 

హైదరాబాద్‌ నగరాన్ని డల్లాస్‌ నగరంగా, పాతబస్తీని ఇస్తాంబుల్‌ నగరంగా అభివృద్ధి చేస్తామని కేసీఆర్‌ 2015లో చెప్పిన మాటలు సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. స్కై స్క్రాపర్లు, నగరం చుట్టూ గ్రీన్‌ కారిడార్, వేగంగా దూసుకు పోయే స్కైవేలు, నగరం శివారులో శాటిలైట్‌ టౌన్‌షిప్‌లతో అంతర్జాతీయ ప్రమాణాలతో నగరాన్ని అభివృద్ధి చేస్తామన్నారు. ఇప్పుడేమైంది? గత జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో గెలిస్తే 100 రోజుల ప్రణాళికలతో నగరం రూపురేఖలనే మార్చివేస్తామని మునిసిపల్‌ మంత్రిగా కేటీఆర్‌ హడావుడి చేశారు. కనీసం రోడ్లలో గుంతలనైనా పూడ్చారా? సిటీలో ఎక్కడ గుంత చూపించినా వెయ్యి ఇస్తానని సవాల్‌ చేసిండు. కానీ నగరంలో ఎక్కడ చూసినా గుంతలే కన్పిస్తున్నాయి. 

మూసీనది అభివృద్ధి కోసం అంటూ ఓ కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి కనీసం కేంద్రం మంజూరు చేసిన నిధులను కూడా ఖర్చు పెట్టలేదే? రూ. 1,400 కోట్లు ఖర్చు పెడతామన్న కేసీఆర్‌ ప్రభుత్వం ఎంత ఖర్చు పెట్టిందో చెప్పగలరా? నగరంలో ట్రాఫిక్‌ రద్దీ తగ్గించడం కోసం రూ 20,000 కోట్లతో స్ట్రాటెజిక్‌ రోడ్‌ డెవలప్‌మెంట్‌ ప్లాన్‌ అమలుపరుస్తున్నట్లు ప్రకటించారు. 20 ఫ్లైఓవర్లు, 5 స్కైవేలు, 11 మేజర్‌ కారిడార్లు, 5 గ్రేడ్‌ సెపరేట్లతో మొత్తం 2,000 కిలోమీటర్ల కొత్త రహదారులు వేస్తున్నట్లు చెప్పుకున్నారు. కానీ అందులో నాలుగోవంతు కూడా వేయలేదు. ట్రాఫిక్‌ రద్దీ కోసం మూసీనదిపై 42 కిలోమీటర్ల ఆరు లైన్ల రోడ్లు వేస్తామని చెప్పి ఇప్పటివరకు ప్రణాళిక కూడా చేయలేదు. మురికి నీటితో ఉన్న హుస్సేన్‌సాగర్‌ను మంచినీటితో నింపుతాననీ, సాగర్‌ నీటిని కొబ్బరి నీటివలె చేస్తాననీ చెప్పిన కేసీఆర్‌ ఇప్పుడా విషయమే మరచిపోయారు. ఉమ్మడి రాష్ట్రంలో పునాది పడిన మెట్రో రైలు తమ ఘనతగా చెప్పుకొంటున్న కేసీఆర్‌ పాతబస్తీ వరకు ఆ రైల్‌ ఎందుకు వెళ్లడం లేదో చెప్పగలరా? శంషాబాద్‌ విమానాశ్రయం వరకు పొడిగిస్తామని చెప్పిన ఆయన ఎందుకు ఆ ఊసెత్తడం లేదు?

హైదరాబాద్‌ను విశ్వనగరంగా మారుస్తామని చెప్పుకొం టున్న నేతలు 450 ఏళ్ళ నగర చరిత్రకు సాక్షిగా ఉన్న పలు వారసత్వ భవనాలను కూల్చివేస్తున్నారు. సచివాలయంలోని హెరిటేజ్‌ భవనంతో పాటు అమ్మవారి గుడి, మసీద్‌లను కూల్చివేసి, వాటి శిథిలాలపై కొత్త సచివాలయ నిర్మాణం చేప ట్టారు. చరిత్రాత్మక కట్టడాలైన అసెంబ్లీ భవనం, ఉస్మానియా ఆసుపత్రి, ఎర్రమంజిల్‌ ప్యాలెస్‌లను కూల్చేందుకు సిద్ధపడుతు న్నారు. నగర ప్రజల దాహార్తిని తీర్చే విధంగా కృష్ణా, గోదావరి జలాలను నిల్వచేసుకొనేందుకు రాచకొండ, శామీర్‌పేటల వద్ద రెండు రిజర్వాయర్లను నిర్మిస్తామని చెప్పి, డీపీఆర్‌లు కూడా సిద్ధమైనా ఒక తట్ట మట్టిని కూడా ఎత్తలేదు. 

గత ఎన్నికల ముందు 18,000 కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్ధీకరిస్తున్నట్లు చెప్పిన ప్రభుత్వం తిరిగి ఆ మాట ఎత్తడం లేదు. తెలంగాణ అకాడమీ అఫ్‌ స్కిల్‌ అండ్‌ నాలెడ్జ్‌ (టాస్క్‌) ద్వారా నాలుగేళ్లలో లక్ష మంది యువతకు నైపుణ్య శిక్షణ కల్పించి, ఉద్యోగాలు కల్పిస్తామన్న ప్రభుత్వం ఒక్కరికైనా ఇచ్చిందా? నగర పరిధిలో మొదటి దశలో రూ.130 కోట్లతో 40 మోడల్‌ మార్కెట్లు, 200 ఆదర్శ మార్కెట్లు అభివృద్ధి చేస్తామని చెప్పారు. కేవలం నాలుగు మార్కెట్లు మాత్రమే నిర్మించినా వాటిని కూడా అందుబాటులోకి తేలేదు. స్వచ్ఛ హైదరాబాద్‌లో భాగంగా 200 నుండి 300 ఎకరాలలో 15 కొత్త డంప్‌యార్డ్‌లు అభివృద్ధి చేస్తామని చెప్పి ఒక్కటి కూడా చేయలేదు. 

నగర ప్రజలను వరదల నుండి విముక్తి కలిగించడం కోసం సీవరేజీ డెవలప్‌ మెంట్‌ ప్లాన్‌ అమలుకు రూ 10,000 కోట్లు కూడా ప్రభుత్వం ఇవ్వలేక పోవడంతో నగర ప్రజలకు ముంపు బాధలు తప్పడం లేదు. టీఆర్‌ఎస్‌ ఆరేళ్ల పాలనలో గప్పాలు కొట్టడం తప్ప హైద రాబాద్‌కు ఒరిగిందేమీ లేదు. ఇటీవల కురిసిన వర్షాలు, వరద లతో కార్లు, వాహనాలు మునిగిపోయి ఎటు చూసినా బురద, వాసనతో ఉన్న నగరాన్ని చూసి ఇదేనా విశ్వనగరమంటే, ‘వాహ్‌... హైదరాబాద్‌?’ అని జనం నవ్వుకుంటున్నారు.
వ్యాసకర్త: ఎన్‌. రామచంద్రరావు, తెలంగాణ బీజేపీ నేత, శాసనమండలి సభ్యుడు

మరిన్ని వార్తలు