మహానేత వైఎస్సార్‌: నిరుపేదల గుండె దీపం

2 Sep, 2021 07:51 IST|Sakshi

‘వాని రెక్కల కష్టంబు లేనినాడు/ సస్యరమ పండి పులకింప సంశ యించు/ వాడు చెమ్మట లోడ్చి  ప్రపంచమునకు/ భోజనం బెట్టువానికి  భుక్తి లేదు’’. మహాకవి గుర్రం జాషువా రైతు కష్టాన్ని కవిత్వంగా చెప్పాడు. కష్టజీవుల దీనగాథను కళ్ళకు కట్టాడు. ఆ కవిత్వం, కావ్యం సాహిత్య ప్రపంచంలో నిత్యనూతనం. నేటికీ దేశంలో ఇదీ రైతు దుస్థితి.  ఆంధ్రప్రదేశ్‌ మట్టి మీద సజీవసాక్ష్యంగా మరుపురాని మహోన్నతగాథ మరొకటి వుంది. ఇది రైతు బతుకుతో పెనవేసుకు నడిచిన ఒక మహానాయకుని సత్యయాత్ర. అదే ప్రజల గుండెల్లో రాజన్నగా ముద్రపడిన డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖర రెడ్డి జీవితం.

ఇచ్చిన మాట మీద నిలబడి పాలన చేసిన రాజన్నకి నాడు ప్రజలు హృదయపూర్వకంగా రెండోసారీ ముఖ్యమంత్రిగా పట్టం గట్టారు. పదవంటే బాధ్యత, జాతి భవితవ్యమని ఎలుగెత్తి చాటిన పాలకుడు రాజన్న. ప్రజల ఆకాంక్షలకు అద్దం పట్టే పాలన. ఆయనది ప్రజాకర్షకమైన వ్యక్తిత్వమే కాదు రూపం కూడా. రచ్చబండలో పాల్గొననున్న ముఖ్యమంత్రిని మనసారా చూడాలన్న జనం ఆశలు అడియాసలై పోయాయి. కళ్ళన్నీ కన్నీరుమున్నీరైపోయాయి.

ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ చరిత్రలో రైతు కోసం, రైతు కూలీ కష్టం కోసం తన శక్తినంతా ధారబోసిన ముఖ్యమంత్రి డాక్టర్‌ వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఒక్కరే. ప్రతిపక్షనాయకునిగా పాదయాత్రతో ఆయన ప్రజల్ని పలకరించారు. నెర్రెలు తీసిన పంట పొలాల మాటున నెత్తురోడుతున్న బతుకుల్ని కళ్ళారా చూశారు. ఆర్థిక దుస్థితితో చదువులకు దూరమవుతున్న యువతతో మాట్లాడారు. చికిత్సకరువై చీకటిలో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ ఆసుపత్రుల్లో అడుగెట్టారు. రోగుల దుస్థితి చూసి తల్లడిల్లిపోయారు. తడబడుతున్న బతుకుమాటల్ని చెవులారా విన్నారు. అన్నార్తుల ఆవేదనను  ఆలకించారు. రాష్ట్ర ప్రజల కష్టాలకు ఆయనే ప్రత్యక్షసాక్షిగా నిలిచారు. అందుకే రాజన్న తనదైన అజెండా అమలు చేశారు. అన్నదాతకు అండగా నిలిచారు.

ముఖ్యమంత్రిగా తొలి సంతకమే విద్యుత్‌ బకాయిల మాఫీ కోసం చేశారు.  విద్యార్థులకు ఫీజు రీయంబర్స్‌మెంట్‌తో అండగా నిలిచి వారిలో ఆశావాదాన్ని నింపారు. ప్రజలందరికీ ప్రాణరక్షగా ‘ఆరోగ్యశ్రీ’ తెచ్చారు. మహిళల్ని అక్కచెల్లమ్మలుగా పిలిచి వారిపై అమితమైన ప్రేమ కురిపించారు. వారి సాధికారత కోసం శ్రమించారు. రాష్ట్రాన్ని సతత హరితవనంగా పరిరక్షించారు. అవసరమైన ప్రతి చోటా నీటి ప్రాజెక్టుల్ని నిర్మించారు. పంట చేలలో ప్రతి నీటిబొట్టూ రాజన్న బొమ్మను చెక్కుకుంటూ ప్రవహించిందనడంలో అతిశయోక్తి లేదు. ఆరిపోతున్న ఎన్నో గుండెదీపాలు వెలిగించిన వైద్యుడు రాజన్న. అందుకే రాజన్న పేరును ఎందరో తమ ఎదల మీద పచ్చబొట్టు పొడిపించుకున్నారు. ప్రజలకిచ్చిన మాట జవదాటలేదు. తన లక్షాన్ని నమ్మి వెంటనడిచిన స్నేహితుల్ని ప్రాణప్రదంగా ప్రేమించారు. రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లుతున్న వేళ ఆయన మాత్రం నింగికెగసి దేశం యావత్తును శోకసంద్రంలోకి నెట్టేశారు.

వైఎస్‌  తన అనుభవాల్నే కాదు, సంస్కర్తలనూ ఆదర్శంగా తీసుకొని పాలన చేశారు. డాక్టర్‌ అంబేడ్కర్‌ సాగించిన సామాజిక పోరాటాల్ని ఆయన గౌరవించారు. అణగారిన ప్రజల కోసం  మహాత్మా ఫూలే చేబట్టిన కార్యాచరణను ఆచరించారు. అందుకే నాడు ధనిక, పేద తేడా లేకుండా మనుషుల్ని ప్రేమించారు రాజన్న. పేదరికంతో ఏ ఒక్కరి ప్రాణమూ పోకూడదని, ఏ పేదవిద్యార్థి చదువూ ఆగకూడదని ఆయన నినదించారు. నీటినీ, నింగినీ ప్రేమించిన రాజన్న మీద నాడు ప్రజలు ఉంచిన నమ్మకాన్నే నేడు జనం జగనన్న మీద పెంచుకున్నారు.

తండ్రి బాటలో రెట్టింపు ఉత్సాహంతో  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలన చేస్తున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల అభివృద్ధి కోసం తన పాలనలో ఎన్నో మార్పులు తీసుకొచ్చారు. ప్రతిపౌరుని పరిరక్షణ బాధ్యతగా భావించి ప్రభుత్వం దూసుకుపోతోంది. రాజన్న పథకాలకు జగనన్న రక్షణకవచమై నిలిచారు. జగనన్న పల్లెపల్లెకు ఆరోగ్యశ్రీకారం చుట్టారు. వృద్ధుల చేతిలో ఫించన్‌ ఆసరాగా నిలిచారు. పేదల గుండెల్లో విద్యాదీపమై వెలుగులు విరజిమ్ముతున్నారు. రాజన్న పేదల పాలిట రాజైతే ఆ రాజ్యానికి సర్వసైన్యాధక్షుడై జగనన్న ధైర్యసాహసాలతో  పరిరక్షిస్తున్నారనేది సత్యం. ఈ నిజాన్ని ప్రజలు నిండు మనస్సుతో ఆశీర్వదిస్తున్నారు.

డాక్టర్‌ జి.కె.డి. ప్రసాద్‌
వ్యాసకర్త ఫ్యాకల్టీ, జర్నలిజం విభాగం
ఆంధ్ర విశ్వవిద్యాలయం, విశాఖ.  మొబైల్‌ : 9393 111740  

మరిన్ని వార్తలు