గ్లైఫోసేట్‌పై దేశవ్యాప్త నిషేధం అత్యవసరం

26 May, 2021 12:19 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

గ్లైఫోసేట్‌.. ఇది కలుపును చంపే విష రసాయనం. దీన్ని చల్లితే కలుపుతో పాటు నేలపై ఉన్న అన్ని రకాల మొక్కలూ చనిపోతాయి. కలుపు తీయాలంటే కూలీలకు ఖర్చు అధికమవుతోందని గ్లైఫోసేట్‌ మందును చల్లుతున్నారు. కానీ, ఆరోగ్యం చెడిపోతే, చికిత్సకు ఇంకా భారీగా ఖర్చు చేయాల్సి వస్తుంది అని రైతులు గ్రహించడంలేదు. 

తెలంగాణ ప్రభుత్వం గత నాలుగేళ్లుగా గ్లైఫోసేట్‌ ఉపయోగం మీద కొంత కాలం పాటు ఆంక్షలు విధిస్తున్నది. సాధారణంగా, పత్తి పంట కాలం అయిన జూన్‌ నుంచి అక్టోబర్‌ వరకు గ్లైఫోసేట్‌ అమ్మకాల మీద ఆంక్షలు పెట్టడం ఒక ఆనవాయితీగా వస్తున్నది. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర రాష్ట్రాలు కూడా ఒకసారి ఆంక్షలు విధించాయి. కేవలం తెలంగాణ  రాష్ట్రం మాత్రమే క్రమం తప్పకుండా 2018 నుంచి ప్రతి ఏటా ఆంక్షలు ప్రకటిస్తున్నది. అయితే, దురదృష్టవశాత్తూ, ఈ ఆంక్షల అమలు మాత్రం ఆశించిన మేరకు లేదు. ప్రతి ఏటా గ్లైఫోసేట్‌ అమ్మకాలు యథేచ్ఛగా సాగుతూనే ఉన్నాయి. దుకాణాలలో ఈ డబ్బాలు దొరుకుతూనే ఉన్నాయి. 

దాదాపు ఏడెనిమిదేళ్ల క్రితం చట్టవిరుద్ధమైన బీజీ–3 పత్తి విత్తనాలను మన  దేశంలో అక్రమంగా ప్రవేశపెట్టారు. కేంద్ర వ్యవసాయ శాఖ వెంటనే వీటి విస్తృతిని నివారించి, బాధ్యులమీద క్రిమినల్‌ చర్యలు చేపట్టలేదు. 

గ్లైఫోసేట్‌ అనేది పరాన్నజీవి వ్యవసాయ రసాయన ఉత్పాదన. జన్యుమార్పిడి విత్తనాల సాంకేతిక పరిజ్ఞానంపై స్వారీ చేస్తుంది. కలుపు రసాయనాలను తట్టుకునే విధంగా జన్యుమార్పిడి చేసిన (హెచ్‌.టి. బీటీ–3) అక్రమ పత్తి విత్తనాలతోపాటు గ్లైఫోసేట్‌ అమ్మకాలు కూడా అధికంగా జరుగుతున్నాయి. పైగా ప్రభుత్వాల నిర్లక్ష్యం ఫలితంగా చట్ట వ్యతిరేక బీజీ–3 పత్తి విత్తనాల మార్కెట్‌ 40 శాతానికి పెరిగిందని ఒక అంచనా. 

కేంద్రం చేతుల్లోనే అధికారం
విత్తనాలను మార్కెట్‌ చేస్తున్న కంపెనీల మీద చర్యలు చేపట్టే ఉద్దేశం లేకపోవడంతో, మధ్యేమార్గంగా గ్లైఫోసేట్‌ను నియంత్రించాలని వ్యవసాయ మంత్రిత్వ శాఖ కమిటీ సిఫార్సు చేసింది. ఆ విధంగా గ్లైఫోసేట్‌ మీద ఆయా రాష్ట్రాల్లో కొద్ది నెలల పాటు ఆంక్షలు పెడుతున్నారు. కేంద్ర ప్రభుత్వమే దేశవ్యాప్తంగా గ్లైఫోసేట్‌ను నియంత్రించవచ్చు. అది అత్యంత ప్రమాదకారి అనుకుంటే నిషేధించే అధికారం కూడా కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే ఉంది. ‘మీకు అవసరం అనిపిస్తే నియంత్రించండి’ అని రాష్ట్రాలకు చెప్పడం ద్వారా కేంద్ర ప్రభుత్వం విత్తన చట్టం, పర్యావరణ పరిరక్షణ చట్టం, పురుగు మందుల నియంత్రణ చట్టం కింద తన కున్న అధికారాలను, బాధ్యతలను నిర్లక్ష్యం చేసింది. 

పనిచేయని తాత్కాలిక ఆంక్షలు
ఎనిమిదేళ్ల్ల క్రితం మన దేశంలో గ్లైఫోసేట్‌ పెద్దగా ఎవరికీ తెలియదు. చట్టపరంగా అనుమతి లేని బీజీ–3 పత్తి విత్తనాల రాకతో దీని అమ్మకాలు విపరీతంగా పెరిగాయి. వీటి వాడకాన్ని అరికట్టే బాధ్యత కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు వదిలిపెట్టింది. గ్లైఫోసేట్‌ ఉపయోగం మీద ఏటా కొద్ది నెలలు ఆంక్షలు పెట్టడం కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రతి ఏటా ఉత్తర్వులు జారీ చేస్తున్నది. కాగా, ఈ వ్యూహం పని చేయడం లేదు. 

రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా పురుగు మందును, పురుగు మందుల నియంత్రణ చట్టం–1968 ఉపయోగించి 60 రోజుల వరకు నిషేధించవచ్చు. పూర్తిగా నిషేధించే అధికారాలు మటుకు లేవు. కేంద్ర ప్రభుత్వానికి మాత్రమే పూర్తిగా, శాశ్వతంగా నిషేధించే అధికారం ఉంది.  

అయితే, కేరళ, సిక్కిం రాష్ట్రాల మాదిరి కొన్ని అధికరణాల ద్వారా రాష్ట్రాలకు అవకాశం ఉంది. కేరళ రాష్ట్రం ఆ విధంగానే ఇదివరకు ఎండోసల్ఫాన్‌ మీద చర్యలు చేపట్టింది. గ్లైఫోసేట్‌ మీద కూడా పూర్తి నిషేధం అక్కడ ఉంది. తెలంగాణ  ప్రభుత్వం ఆ అవకాశాన్ని నిర్లక్ష్యం చేసింది. ఇచ్చిన ఉత్తర్వులలో కూడా చాలా లొసుగులు ఉన్నాయి. 

ప్రతి ఏటా ఆంక్షల తీవ్రతను నీరుగార్చే మార్పులు జరుగుతున్నాయి. పంట ఉన్న ప్రాంతంలో వాడవద్దు (జూన్‌ – అక్టోబర్‌ వరకు), పంట లేని ప్రాంతంలో వాడవచ్చు, విస్తరణ అధికారి నుంచి తీసుకున్న పత్రం ప్రకారమే అమ్మాలి, విస్తరణ అధికారులు గ్లైఫోసేట్‌ ఉపయోగాన్ని అరికట్టాలి.. వంటి ఆచరణ సాధ్యం కాని ఆంక్షలు ఈ ఉత్తర్వుల్లో ఉన్నాయి. 

ఆచరణాత్మక ప్రణాళికేదీ?
తెలంగాణ  ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉండి ఉంటే, ఒక ఆచరణాత్మక ప్రణాళిక జిల్లాల వారీగా తయారు చేసి ఉండవచ్చు. 2018 ఉత్తర్వులలో పురుగు మందుల విక్రయదారులకు ఇచ్చే లైసెన్స్‌లో గ్లైఫోసేట్‌ పదాన్ని తొలగించాలన్నారే గానీ దాన్ని అమలు చేయలేదు. 2019లో ఆ పదాన్నే తీసివేశారు. పెస్టిసైడ్‌ యాక్షన్‌ నెట్‌వర్క్‌ ఇండియా అనేక సూచనలు ఇచ్చినా, ప్రభుత్వం పట్టించుకోలేదు.  

మన దేశంలో గ్లైఫోసేట్‌ ప్రభావంపై అధ్యయనాలు లేవు. అనేక గ్రామాలలో రైతులు పత్తి చేలల్లో గ్లైఫోసేట్‌ చల్లితే పంటంతా మాడిపోయిన ఉదంతాలు ఉన్నాయి. గ్లైఫోసేట్‌ వల్ల క్యాన్సర్‌ వస్తుందని ప్రపంచ వ్యాప్తంగా ఆందోళన పెరుగుతోంది. దీని ప్రధాన తయారీదారు అయిన బేయర్‌ కంపెనీ (ఇది వరకు మోన్సాంటో) మీద అమెరికాలో అనేక నష్ట పరిహారం కేసులు వేశారు. 

దేశవ్యాప్త నిషేధమే మార్గం
చట్టవిరుద్ధమైన కలుపు మందును తట్టుకునే బీజీ–3 పత్తి విత్తనాలు అందుబాటులో ఉన్నంత కాలం తాత్కాలిక ఆంక్షలు పని చేయవు. ముందుగా బీజీ–3 విత్తనాల తయారీదారుల మీద, విక్రయదారుల మీద క్రిమినల్‌ చర్యలు చేపట్టాలి. రైతులు, గ్రామీణుల ఆరోగ్య రక్షణకు, ఆర్థిక, పర్యావరణ కారణాల రీత్యా కూడా గ్లైఫోసేట్‌ తయారీ, దిగుమతి, ఎగుమతి, వాడకంపై కేంద్రం దేశవ్యాప్తంగా పూర్తి నిషేధం విధించడం తక్షణ అవసరం. 


- డాక్టర్‌ దొంతి నరసింహారెడ్డి 
వ్యాసకర్త: ప్రముఖ విధాన విశ్లేషకులు
ఈ–మెయిల్‌: nreddy.donthi20@gmail.com

మరిన్ని వార్తలు