ఇండియాగేట్‌కు గుమ్మడికాయ కడదాం!

11 Nov, 2022 12:50 IST|Sakshi

సారాంశం: సరికొండ చలపతి

కరెన్సీ నోట్ల, రూపాయి విలువ, ద్రవ్యోల్బణం, అరవింద్‌ కేజ్రీవాల్‌, ఇండియాగేట్‌, ఎలాన్‌ మస్క్‌, ట్విట్టర్‌, రిషి సునాక్‌, సరికొండ చలపతి

ఇద్దరు స్నేహితుల మధ్య సంభాషణ..
‘ఎలాన్‌ మస్క్‌ 44 బిలియన్‌ డాలర్లు పెట్టి ట్విట్టర్‌ కొన్నాడురా
‘వార్నీ! అంత డబ్బు ఎందుకు వేస్ట్‌ చేశాడు? మనలాగా గూగుల్‌ ప్లే స్టోర్‌ నుంచి డౌన్‌లోడ్‌ చేసుకుంటే సరిపోయేది కదా!’’                                  
–  ఫ్రెండ్‌ చమత్కారం
.....
దాదాపు ఇంతే చమత్కార సూచన ఓ ముఖ్యమంత్రి నుంచి సీరియస్‌గా వచ్చింది. చూడండి:
‘‘ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి ఏమీ బాగాలేదు. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ బాగా తగ్గుతోంది. సామాన్య ప్రజలు కష్టాల్లో కూరుకుపోతున్నారు. దేవతల ఆశీస్సులు కావాలి. ఆ చిత్రాలను కరెన్సీ నోట్లపై ముద్రిస్తే వారి ఆశీర్వాదాలు మనకు లభిస్తాయి. మన నోట్లపై  గణేశ్, లక్ష్మీదేవిల చిత్రాలు వేద్దాం. అప్పుడే ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెంది భారతదేశం సంపన్న దేశంగా మారుతుంది.’’ – ఈ అరవింద్‌ కేజ్రీవాల్‌ సూచనను జనం కాసింత క్రేజీ ఐడియాగానే చూశారు.

కరెన్సీ నోట్లపై అంబేడ్కర్, వల్లభభాయ్‌ పటేల్, భగత్‌సింగ్, సుభాష్‌ చంద్రబోస్, అబ్దుల్‌ కలాం ఇలాంటి వారి బొమ్మలు కూడా ఉండాలన్న దేశభక్తితో పాటు... లక్ష్మీదేవి, గణేశ్‌ లాంటి దేవుళ్ల ఫొటోలు ఉండాలన్న మతపర విశ్వాసాలు ఆక్షేపణీయమేమీకాదు.

 – కానీ.. పడిపోతున్న రూపాయి విలువ పెంచడానికి, ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టడానికి మూలికా వైద్యం స్థాయి చిట్కాలు... అదీ ఓ ముఖ్యమంత్రి నోట, అందునా ఓ ఐఐటీ  మేధావి నోటి వెంట రావడం చర్చకు దారితీసింది.

రిషి సునాక్‌! వింటున్నారా...
కాసింత ముందుగా ఈ చిట్కా చెప్పివుంటే బాగుండేది. ఆర్థిక వ్యవస్థను దారిలో పెట్టలేక 45 రోజులకే బ్రిటన్‌ ప్రధాని లిజ్‌ ట్రస్‌  రాజీనామా చేయాల్సిన అవసరం లేకపోయేది. బ్రిటన్‌లో ద్రవ్యోల్బణం 10 శాతానికి చేరి, ధరాభారం మోయలేక  సామాన్యులు నానా యాతనలు పడుతున్నారు. మినీ బడ్జెట్‌తో దాన్ని బాగు చేయలేక మార్కెట్లన్నీ కుదేలయి పోతుంటే విధిలేక ప్రధానిగా ట్రస్‌ రాజీనామా చేయాల్సి వచ్చింది. ఇంత అద్భుతమైన ఐడియా ఆమె చెవిలో వేసుంటే బాగుండేది కదా, అక్కడి కరెన్సీపై వాళ్ల దేవుళ్ల బొమ్మ ముద్రించి  బయటపడేది కదా. –అని నెటిజన్లు చురకలేస్తున్నారు. 

‘‘రిషి సునాక్‌ .. వింటున్నారా? కేజ్రీవాల్‌ చెప్పిన మేడ్‌ ఈజీ ఫార్ములా, చిన్న చిట్కాతో మీ దేశం బాగుపడిపోతుంది.. అంటూ  సరదా కామెంట్లు పెడుతున్నారు. 
రష్యా–ఉక్రెయిన్‌ యుద్ధంతోపాటు అనేక కారణాలతో ప్రధాన దేశాలు ఆర్థిక మాంద్యం దిశలో నడుస్తున్నాయి. 2023 కల్లా దాదాపు సగానికి తగ్గొచ్చన్న సంకేతాలు వినపడుతున్నాయి. కేజ్రీవాల్‌ జీ! కరెన్సీ నోట్లపై దేవుళ్ల బొమ్మలు ముద్రించాలని ప్రధాని మోదీకి రాసే లేఖలో... ఈ చిట్కాను  ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో కూడా ప్రస్తావించాలని  కోరండి. ప్రపంచ దేశాలన్నీ  ఆర్థిక మాంద్యంలోంచి బయటపడే అవకాశం ఉంది.


మాంకాళమ్మ, పోలేరమ్మ...

ఇదేమీ సీరియస్‌ కాదు. మోదీ మత రాజకీయాలపై కేజ్రీవాల్‌ వ్యంగాస్త్రమిది. ముల్లును ముల్లుతోనే తీయాలనే వ్యూహం. ఇప్పుడు చూడండి బీజేపీ గింగిరాలు తిరుగుతోంది. –అని ఓ అభిమాని ఆనందం.

అవునవును.. రూపాయికీ, గుజరాత్‌ ఎన్నికల్లోనూ దైవసాయం అవసరమే. అయితే, దీన్ని ఇంకా పవర్‌ఫుల్‌గా వాడుకోవచ్చుననే సలహా కూడా వినిపిస్తోంది.. గణేశ్, లక్ష్మీదేవిలతో పాటు మాంకాళమ్మ, పోలేరమ్మ,  ఉప్పలమ్మ, కట్టమైసమ్మలాంటి గ్రామ దేవతల ఫొటోలు కూడా కరెన్సీ నోట్లపై ముద్రిస్తే... రూరల్‌ ఓటింగ్‌ అంతా మనకే. – సూపర్‌ ఐడియా!

గుమ్మడికాయ మంత్రం...
కేజ్రీవాల్‌ దారిలోనే ఇంకాస్త అడుగు ముందుకు వేసిన తుంటరి కుర్రాళ్లు ఇలా సూచిస్తున్నారు. ‘‘నిరుద్యోగం పెరిగిపోతోంది, పేదరికం పెరిగిపోతోంది, మన దేశ ఆర్థిక పరిస్థితి అంతంతమాత్రమే, జనం చేతిలో డబ్బులు ఆడడం లేదు. విద్య, వైద్యం పరిస్థితి ఏం బాగాలేదు. గ్రామాల పరిస్థితి అంతంతే. పట్టణాల్లో కాలుష్యం బాగా పెరిగి పోతోంది. టపాసులతో దీపావళి చేసుకునే పరిస్థితి లేదు. చాలా విషయాల్లో ఇతర దేశాలకన్నా వెనుకబడిపోతున్నాం. పైగా పాకిస్తాన్, బంగ్లాదేశ్, చైనాలనుంచి నరదిష్టి ఎక్కువయింది. వీటన్నింటికి విరుగుడుగా ఇండియా గేట్‌కు ‘గుమ్మడి కాయ’ కడితే ఫలితం ఉంటుందేమో. మేమయితే మా ఇంటికి గుమ్మడి కాయే కడుతున్నాం.’’ – మంచి చిట్కా

యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌.. అంతా దైవికం!
ఇలా దేవుడిని లాగడం గతంలో కూడా జరిగింది. కేంద్ర  ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌.. కరోనా వల్లే ఆర్థిక వృద్ధిరేటు తగ్గిందనీ, జీడీపీ తగ్గుముఖం పట్టడానికి, జీఎస్టీ వసూళ్లు తగ్గడానికి అదే కారణం అని అంతా ‘యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌’ (దైవిక చర్య )అనడం పెనుదుమారమే లేపింది. మీ తప్పిదాలను దేవుడిపై నెడతారా అని విపక్షాలవారు, నెటిజన్లు విరుచుకు పడ్డారు. ఇది యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ కాదనీ, యాక్ట్‌ ఆఫ్‌ గవర్నమెంట్‌ అనీ విమర్శలు గుప్పించారు. అంతకుముందు సంవత్సరం పరిస్థితేమిటని ప్రశ్నించారు. యాక్ట్‌ ఆఫ్‌ గాడ్‌ పేరు మీద ప్రజలు పన్ను చెల్లించడం మానేస్తే ఓకేనా అని ప్రశ్నించారు. కాస్త కొంటె నెటిజన్లు ఇండియాలో ముక్కోటి దేవతలు ఉన్నారు. ఇంతకీ ఏ దేవుడి పుణ్యం ఇది అని వెక్కిరించారు. ముస్లిం దేవుళ్లు, క్రిస్టియన్‌ దేవుళ్లు, ఇతర మైనారిటీ మతాల దేవుళ్ల పాత్ర ఏమైనా ఉందా అని ట్రోల్‌ చేశారు. వారందరినీ కోర్టుకు లాగుతున్నారా లేదా అని వ్యంగాస్త్రాలు సంధించారు.

కరెన్సీకి ఎక్స్‌పైరీ డేట్‌...
కరెన్సీ ప్రస్తావన రాగానే గుర్తుకు వచ్చేది నవంబర్‌ 8, 2016 నాటి డీమానిటైజేషన్‌. పెద్ద నోట్ల రద్దు జరిగి ఇప్పటికి ఆరేళ్లు. నల్లధనం ఏమీ బయటికి రాకపోగా  దేశ ఆర్థిక వ్యవస్థను కుదేలు చేసిందని విమర్శలు వస్తూనే ఉన్నాయి.

ఈ సందర్భంగా కరెన్సీపై 10వ తరగతి కుర్రాడి ఐడియా ఒకటి సోషల్‌ మీడియాలో నడుస్తోంది. అన్ని వస్తువులకు ఎక్స్‌పైరీ డేట్‌ ఉంటోంది కదా, కరెన్సీ నోట్లపై కూడా ఎక్స్‌పైరీ డేట్‌ ఎందుకు ఉండదు? ఎన్నేళ్ల దాకా చెల్లుబాటు అవ్వాలో  మేధావులు ఆలోచించి వాటిపై కూడా ఐదేళ్లో ఆరేళ్లో ఎక్స్‌పైరీ డేట్‌ ముద్రించాలి. ఆ టైమ్‌ దాటాక ప్రజలు పాత నోట్లు తీసుకువెళ్లి కొత్తవి తీసుకుంటారు. అంటే కరెన్సీ అంతా బ్యాంకుకు వస్తుంది. ఇక నల్లధనం అనే మాట ఉండదు కదా. 
– మన ఐఐటీయన్‌ సీఎం ఐడియా కన్నా టెన్త్‌ క్లాస్‌ స్టూడెంట్‌ ఐడియా బాగున్నట్లుంది కదా! (క్లిక్‌ చేయండి: ఉప ఎన్నికలూ జిందాబాద్‌!)

మరిన్ని వార్తలు