Artist Gopi: గూడు వీడిన గిజిగాడు

22 May, 2021 12:14 IST|Sakshi

మణికొండలో ఆర్టిస్ట్‌ కడలి సురేష్‌  ఉండేవారు. ఒక మధ్యాహ్నం నేను అక్కడికి వెళ్ళాను. ఆయన ఇంటి నిండా నిలువెత్తు కేన్వాసులు, దొంతరలుగా పెయిం టింగులు, బొత్తులుగా ఇంకు డ్రాయింగులు, ఫ్రేము లుగా రామాయణం బొమ్మల సిరీస్లు. అన్నీ అద్భు తాలే. నేను దొంగ కంట మరో బొమ్మ చూస్తున్నా, టీవీ వెనుక గూట్లో తొంభైల నాటి టేబుల్‌ క్యాలెండర్‌ ఒకటి. ప్రతి షీట్‌ మీద అర చేయంత కొలతలో ముద్రితమైన బొమ్మలు. గోపీ అనే పేరంత సింపుల్‌ లైన్‌ బొమ్మలు. పెన్సిల్‌ పట్టి వంద ఎవరెస్ట్‌ శిఖరాలు కొలిచినంత సాధన చేస్తే మాత్రమే అబ్బగల బొమ్మలు. సురేష్‌ గారి వేలాది బొమ్మలని వదిలి ఆ మూల నిలబడి ఉన్న ఆ క్యాలెండర్‌ నాకు ఇవ్వమని అడగడానికి నాకు ఇబ్బంది అడ్డువచ్చింది. అడిగినా కావలిస్తే నా బొమ్మలు అన్నీ పట్టుకెళ్ళండి, గోపి గారిని మాత్రం వదిలి’ అనేవారు సురేష్‌ గారు. 

గోపీ చిత్రకారులకే చిత్రకారుడు. ఆయన గురించి మహాను‘బాపు’ తమదైన పొదుపైన మాట లతో ఇలా అన్నారు. ‘నాకున్న ఇంకో గురువు గారు గోపి–ఆయన బొమ్మలెప్పుడు చైతన్యంతో తొణికిస లాడుతూ వుంటాయి’. ఆయన ఇమాజినేషన్‌ కూడా అంత డైనమిక్‌గా ఉంటుంది–గిజిగాడు అనే పక్షి ఉంది. దాని గూడు మిగతావాటిలా ఉండదు. అదొక ఇంజనీరింగ్‌ ఫీట్‌! పకడ్బందీగా–కొమ్మకు వేలాడుతూ–అంతస్తులు–కిందా పైనా గదులు కలిగి వుండేట్లు అల్లుతుంది. ఇంజనీర్ల కన్వెన్షన్‌ సావనీరు పుస్తకానికి ముఖచిత్రం కావలిస్తే, గోపి దానికి ముఖ చిత్రంగా గిజిగాడు బొమ్మవేసి వూరుకున్నారు. భగవంతుని సృష్టి ఇంజనీర్లు ప్రతిసృష్టి చేస్తారు అన్నది ఆయన భావన. అదీ ఇమాజినేషన్‌ అంటే, అదీ గోపీ అంటే!

అనగనగా రోజుల్లో సాహిత్యం–చిత్రకళ పచ్చగా ఉన్న కాలంలో ప్రతి పత్రిక బాపు బొమ్మలతో సింగా రించుకునేది. ఒక కన్ను చేతనున్న కుంచె వైపు, మరో కన్ను కెమెరా వంక ఆయన చూస్తున్న కాలంలో ఆయన బొమ్మలకై పడిగాపులు కాచే వరుసలో ఉన్న పబ్లిషర్లు, సంపాదకులు, రచయితలు ‘మీరు కాక పోతే మరో చిత్రకారుడి పేరు చెప్పండి’ అంటే బాపు పలికిన ఏకవచనం గోపి అనే బొమ్మల సంతకమే! గోల్డెన్‌ ఏజ్‌ ఆఫ్‌ తెలుగు ఇలస్ట్రేషన్‌ కాలపు మనిషి గోపి. తెలుగు రచనల గోడలన్నీ బాపుబొమ్మల అలంకరణతో, అనుకరణతో నిండిపోయిన పత్రికల రోజులని గోపి అనే కొత్త సంతకం వచ్చి కథల బొమ్మలకి, కవర్‌ పేజీల డ్రాయింగులకి కొత్త వరుసలు చూపించింది.

రేఖ చేసే విన్యాసంలో కానీ, రంగులు అద్దిన మార్గంలో కానీ, మనుషులు నిలబడిన భంగి మలు, పాఠకుడు బొమ్మను చూసిన కోణాలను అన్ని టిని ఆయన డైనమిక్‌ టచ్‌తో మార్చేశారు. మెల కువలో ఉన్న ప్రతి క్షణం ఆయన చేతిలో స్కెచ్‌బుక్‌ ఉండేది. కనపడిన ప్రతీది బొమ్మగా మలి చేవారు. చూసిన సినిమాల్లో సన్నివేశాలు గుర్తు పెట్టు కుని వచ్చి ఆ యుద్ధ పోరాటాలు, పోరాటాల వంటి తెలుగు డ్యూయెట్‌ డ్యాన్సులు, మనిషి వెనుక మనిషి, మనిషి పక్కన మనిషి అనే ఫ్రేములు అన్నీ బొమ్మలుగా నింపేవారు. ఆయన బొమ్మల పిచ్చికి, ఆ అభ్యాసానికి కాగితాలు, నోటు పుస్తకాలు, చివరికి ఇంటి తెల్ల గోడలు కూడా నల్ల పడిపోయి ఇక గీయటానికి మరేం దొరక్క పలక మీద గీయటం, చెర పటం, మళ్ళీ గీయటం...

బొమ్మలు ఇష్టపడ్డం వేరు, దానిని జీవితాంతం ఆరాధించడం వేరు–బొమ్మలని జీవనోపాధిగా చేసు కోడం వేరు. గోపిగారే కాదు, చాలామంది చిత్ర కారులు చిత్రకళని బ్రతుకుతెరువుగా నమ్ముకుని ఎంత మోసపోవాలో అంత మోసపోయారు. ఇది మోసమని తెలిసిపోయేసరికి మంచి యవ్వనాన్ని, ఆరోగ్యాన్ని బొమ్మలు కబళించేశాయి. బొమ్మలు తెచ్చిపెట్టిన డబ్బు లేకపోవడం వలన ఆయన ఎన్నో ఇబ్బందులు పడ్డారు. యవ్వనం–ఆరోగ్యం సహక రించినంత కాలం జీవితాన్ని లాగుకుంటూ వచ్చారు. అవి కరువయిన రోజున నేనున్నా అని కరోనా వచ్చి ఆయనని కమ్మేసింది. చివరికి మిగిలింది ఏమిటి? ఆయన చేత కదం తొక్కిన కుంచె రాల్చిన బొమ్మలు, ఆ కాగితాలు నశించి పోయాయి. ఆయన బొమ్మల జ్ఞాపకాల మనుషుల తరం మాసిపోయింది. ఇంకు వాసన, క్రొక్విల్‌ చప్పుడులు తెలిసిన జ్ఞానేంద్రియాలు పనిచేయడం మానేసి చాలా కాలమే అయింది. కరోనా వలన కుదరదు గానీ, ఆయన భౌతిక దేహం వద్ద  కూచుని చెవి దగ్గర ‘మళ్ళీ జన్మంటూ ఉంటే ఆర్టిస్ట్‌ గానే పుడతారా గోపీ గారు?’ అని అడిగితే ప్రాణం లేని ఆ తల ‘ఊహు’ అని అడ్డంగా ఊపడానికైనా కాస్త ప్రాణం కచ్చితంగా తెచ్చుకునేదే.                                
 – అన్వర్‌

మరిన్ని వార్తలు