ధనిక దేశాల తీరుతోనే కొత్త ముప్పు!

28 Nov, 2021 00:26 IST|Sakshi

ఆయుధాలను పోగేసుకున్న చందాన ‘కోవిడ్‌–19’ వ్యాక్సిన్‌లను సంపన్నదేశాలు పోగేసుకున్నాయి. దీంతో  ప్రపంచమంతటా వ్యాక్సినేషన్‌ అమలు లక్ష్యానికి ఇవి చాలా దూరంలో ఉండిపోయాయి. మరోవైపున ఒక దేశంలో, లేక కొన్ని దేశాల్లో సంపూర్ణ వ్యాక్సినేషన్‌ వల్ల ఈ మహమ్మారిని తుడిచిపెట్టలేమని ముంచుకొస్తున్న ఒమిక్రాన్‌ వైరస్‌ రకం తేటతెల్లం చేస్తోంది. పరీక్ష చేయించుకోవడం, మాస్కులు ధరించడం, ప్రతి ఒక్కరికీ వ్యాక్సిన్లు వేయించడం మాత్రమే దీనికి పరిష్కారం. ఎప్పటిలాగే మనం తీసుకునే జాగ్రత్తలే ఈ కొత్త వైరస్‌ రకం నుంచి కూడా మనల్ని కాపాడతాయి. ఈ వైరస్‌ ఎంత ప్రమాదకరమైనా... దాన్ని ఎదుర్కొనే పద్ధతుల్లో మాత్రం మార్పు ఉండదు. ఏ దేశమైనా సరే తాను మాత్రమే త్వరగా వైరస్‌ నుంచి బయటపడాలనుకోవడం అర్థరహితం.

ఆయుధపోటీలా... టీకా నిల్వలు
దక్షిణాఫ్రికాలో కరోనా వైరస్‌ కొత్త రూపాంతరితం ఒకటి బయటపడటం ఆశ్చర్యమేమీ కలిగించదు. పాశ్చాత్యదేశాలు అవసరానికి మించి వ్యాక్సిన్లు పోగేయడమే కాకుండా... కాలం చెల్లిపోయాయని వాటిని నాశనం చేశాయేగానీ... ఆఫ్రికాలోని పలు పేద దేశాలకు అందించే ఆలోచన కూడా చేయలేదు. ఈ పరిస్థితి మారాలి. అభివృద్ధి చెందుతున్న దేశాలకు తగినన్ని వ్యాక్సిన్లు అందుబాటులో ఉంచకపోతే ముప్పు తప్పదని ఆరోగ్య రంగ నిపుణులు చాలాకాలంగా పదే పదే హెచ్చరికలు చేస్తున్నా పాశ్చాత్య దేశాలు దీంట్లో పూర్తిగా విఫలమయ్యాయి.

ఈ తప్పు ఇప్పుడు కొత్త ముప్పు రూపంలో మనల్ని వెంటాడేందుకు సిద్ధమైంది. మూకుమ్మడి టీకా కార్యక్రమాలు లేని నేపథ్యంలో కోవిడ్‌ విస్తృతం కావడమే కాకుండా... రూపాంతరం చెందుతోంది కూడా. పేద దేశాల నుంచే కొత్త కొత్త రూపాంతరితాలు బయట పడుతూండటం ఇందుకు నిదర్శనం. ఈ పరిణామమిప్పుడు ధనిక దేశాలకే కాకుండా ప్రపంచం మొత్తమ్మీద టీకాలు వేసుకున్న వారికీ ముప్పు తెచ్చిపెడుతోంది. 

అక్కరకురాని టీకాల నిల్వలు
దక్షిణాఫ్రికాలో బయటపడ్డ సరికొత్త ఒమిక్రాన్‌ రూపాంతరితం అత్యంత సంక్లిష్టమైన, ఆందోళన కరమైందని యూకే ఆరోగ్య విభాగం ఇప్పటికే స్పష్టం చేసింది. అయినా సరే.. ఇప్పటికే తయారైన 910 కోట్ల టీకాలు, ఏడాది చివరికల్లా సిద్ధం కానున్న మరో 1,200 కోట్ల డోసులతో అందరినీ కాపాడుకునే అవకాశం ఉండింది. కానీ.. ఆయుధ పోటీ తీరులో ధనిక దేశాలు టీకాలను పోగేసి దాచుకున్నాయి. 

సోమవారం వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఒమిక్రాన్‌ నేపథ్యంలో యూకే రాకపోకలను నిషేధించిన ఆరు దేశాల్లో టీకా కార్యక్రమం చాలా తక్కువగా ఉండటంపై చర్చ జరగనుంది. డిసెంబరు నాటికి ఆయా దేశాల జనాభాలో 40 శాతం మందికి టీకాలివ్వాలన్న లక్ష్యం నెరవేరనే లేదు. జింబాబ్వేలో 25 శాతం మంది తొలిడోసు తీసుకోగా పూర్తిస్థాయి రక్షణ పొందిన వారు 19 శాతం మాత్రమే. లెసోథో, ఈస్‌వాటిని దేశాల్లో ఒకే డోసు అవసరమయ్యే జాన్సన్‌ అండ్‌ జాన్సన్‌ టీకాలు ఉండగా ఇప్పటివరకూ 27 శాతం, 22 శాతం మంది మాత్రమే వాటిని పొందగలిగారు. 

నమీబియాలో ఇది మరీ తక్కువగా 14 శాతం మాత్రమే. దక్షిణాఫ్రికా విషయాని కొస్తే... ఇక్కడ 27 శాతం మందికి టీకా లందాయి కానీ... గ్రామీణ ప్రాంతాల్లో పది కంటే తక్కువే. యూరోపియన్‌ యూని యన్‌ నయా వలసవాద విధానాల కారణంగా తమ టీకా కార్యక్రమాలకు నెలల పాటు అంత రాయం కలిగిందన్న ఆఫ్రికా దేశాల ఆగ్రహం ఇప్పుడు ఎంతైనా సమర్థనీయమే.

మాట నిలబెట్టుకోలేదు
ప్రపంచంలోని 92 పేద దేశాలకు తాము వ్యాక్సిన్లు అంది స్తామని గొప్పగా చెప్పుకున్న ధనిక దేశాలు ఆ హామీ అమలులో దారుణంగా విఫలమయ్యాయి. అవసరమైన టీకాల్లో సగం ఇస్తానని చెప్పిన అమెరికా నాలుగో వంతు మాత్రమే ఇవ్వ గలిగింది. యూరోపియన్‌ యూనియన్‌ 19 శాతం, యూకే 11 శాతం, కెనడా ఐదు శాతం టీకాలు మాత్రమే అందించాయి. చైనా, న్యూజీలాండ్‌లు హామీ ఇచ్చిన వాటిల్లో సగం పేద దేశాలకు ఇచ్చాయి. ఆస్ట్రేలియా 18 శాతం, స్విట్జర్లాండ్‌ 12 శాతం హామీ మాత్రమే నెరవేర్చగలిగాయి. ఈ ఘోర వైఫల్యం కారణంగా అల్పాదాయ దేశాల్లో ఇప్పటికీ కేవలం మూడు శాతం మందికి మాత్రమే పూర్తి స్థాయిలో టీకాలు అందాయి. అధికాదాయ దేశాల్లో ఈ సంఖ్య 60 శాతం ఉండటం ఇక్కడ చెప్పుకోవాల్సిన అంశం. 

పేద దేశాల్లో పంపిణీ అవుతున్న ప్రతి టీకాకు పాశ్చాత్య దేశాల్లో బూస్టర్‌ డోసు, మూడో డోసు అంటూ ఆరు టీకాలు వేస్తున్నారు. ఈ అసమానత్వం కారణంగానే ప్రపంచవ్యాప్తంగా కోవిడ్‌ కేసులు మరో 20 కోట్లు నమోదు కావచ్చునని ప్రపంచ ఆరోగ్య సంస్థ అంచనా వేస్తోంది. దీనివల్ల యాభై లక్షల మరణాలకు ఇంకో ఐదు లక్షలు చేరవచ్చునన్న ఆందోళనను వ్యక్తం చేసింది.

జీ20 దేశాల వైఖరి గర్హనీయం...
టీకాల ఉత్పత్తి ఇప్పుడు సమస్య కానే కాదు. కానీ అనుచిత పంపిణీతోనే ఇబ్బందులు వస్తున్నాయి. జీ20 దేశాలు మొత్తం టీకాల్లో 89 శాతాన్ని పోగేసుకున్నాయి. ఈ రోజుకు కూడా ఉత్పత్తి కానున్న టీకాల్లోనూ 71 శాతం ఈ ధనిక దేశాలే బుక్‌ చేసుకోవడం గమనార్హం. ఫలితంగా కోవాక్స్‌ వంటివి ముందుగా నిర్దేశించుకున్న 200 కోట్ల టీకాల్లో మూడింట రెండు వంతులు మాత్రమే అందుకోగలిగాయి. 

ఊరటనిచ్చే అంశం ఒక్కటి ఏమిటంటే... మన వైద్య నిపు ణులు ఒమిక్రాన్‌ను చాలా వేగంగానే గుర్తించడం! జన్యుక్రమ నమోదు కూడా వేగంగా జరుగుతూండటం. ఒకవేళ ఈ రూపాం తరితం ప్రస్తుతం అందుబాటులో ఉన్న టీకాలకు లొంగదని, వేగంగా వ్యాపిస్తుందని రుజువైతే త్వరలోనే ఇంకో కొత్త వ్యాక్సిన్‌ సిద్ధమయ్యే అవకాశం ఏర్పడుతుంది. కానీ ఈ లోపు టీకాలు వేయించుకోని వారిలో ఈ రూపాంతరితం వ్యాప్తి చెందడం ద్వారా కరోనా నీడలో ప్రపంచం ఇంకో ఏడాది గడపాల్సిన పరిస్థితి వస్తుంది. 

సమయం మించిపోలేదు...
ఇప్పటికైనా ధనికదేశాలు వేగంగా అడుగులేయగలిగితే జీ7 దేశాల్లో వాడకుండా మిగిలిపోయిన యాభై కోట్ల టీకాలను క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న దేశాలకు పంపి ఆదుకోవచ్చు. అమెరికా వద్ద దాదాపు 16.2 కోట్ల డోసులు మిగిలి ఉన్నాయి. వచ్చే నెలకు ఈ సంఖ్య 25 కోట్లకు చేరుకుంటుంది. యూరప్‌లోనూ ఇంకో 25 కోట్ల టీకాలు, యూకే వద్ద మరో 3.3 కోట్ల టీకాలు పంపిణీకి సిద్ధంగా ఉన్నాయి. డిసెంబరు నాటికి పాశ్చాత్యదేశాల వద్ద ఉన్న టీకాల్లో దాదాపు పదికోట్లు నిరుపయోగమయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎంత త్వరపడితే అంత ప్రయోజనం ఉంటుంది. 

ఒకప్పుడు అణ్వస్త్రాల వ్యాప్తిని నిరోధించేందుకు అంత ర్జాతీయ ఒప్పందం ఒకటి అవసరం కాగా... ఇప్పుడు కోవిడ్‌ మహమ్మారి వ్యాప్తి నిరోధానికి అంతే అర్జంటుగా కృషి చేయా ల్సిన సమయం ఇది. ఈ దిశగా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్వహించనున్న వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ ప్రయత్నం చేయడం అవసరం. ఈ ఒప్పందంలో భాగంగా వ్యాధిపై నిరంతర నిఘా, అవసరమైన దేశాలకు వైద్య సరఫరాలను వేగవంతం చేయడం, అందరికీ టీకాలు అందేలా చూడటం ద్వారా మాత్రమే కోవిడ్‌ మహమ్మారి మరింత ప్రమాదకరం కాకుండా నివారించగలం! – గార్డన్‌ బ్రౌన్‌, బ్రిటన్‌ మాజీ ప్రధానమంత్రి, ప్రపంచ ఆరోగ్య సంస్థ దౌత్యవేత్త

మరిన్ని వార్తలు