-

సంస్థానాల రేడియో... బ్రిటిష్‌ కనుసన్నల్లోనే!

10 Apr, 2022 01:06 IST|Sakshi

సందర్భం

తొలుత బ్రిటిష్‌ ప్రభుత్వం రేడియో ప్రసారాల పట్ల ఆసక్తి చూప లేదు. కానీ 1927 నుంచీ తన ధోరణిని మార్చు కున్నది. ఒకవైపు పరికరాల దిగుమతి, మరోవైపు రేడియో లైసెన్సుల జారీ  తమ అధీనంలోనే పెట్టు కుని... ప్రసారాల నియంత్రణ, సెన్సార్‌షిప్, ప్రభుత్వ వ్యతిరేకులు రేడియో వినియోగించక పోవడం వంటి అంశాల పట్ల దృష్టి ఎక్కువగానే పెట్టింది. అదే సమయంలో వివిధ సంస్థానాలలో రేడియోపట్ల ఆసక్తి చూపినవారికి అడ్డు చెప్పలేదు. 

కేవలం  హైదరాబాద్, మైసూరు, బరోడా, తిరువాన్కూరు సంస్థానాలలో మాత్రమే రేడియో ప్రసారాలు జరిగినట్టుగా తెలుస్తోంది. ఈ సంస్థా నాల రేడియో ప్రసారాలకు సంబంధించి హైదరా బాద్‌ కొంచెం విభిన్నంగా కనబడుతోంది. నిజాం స్వాధీనం చేసుకున్న, ‘నిజాం రేడియో’ లేదా  ‘దక్కన్‌ రేడియో’గా పేరుగాంచిన కేంద్రం 1935 ఫిబ్రవరి 3వ తేదీ నుంచి 411 మీటర్లపై పని చేయడం మొదలు పెట్టింది. మరే సంస్థానానికీ లేని రీతిన నిజాం రేడియోకు రెండవ ట్రాన్స్‌ మీటరు ఔరంగాబాద్‌ నుంచి పనిచెయ్యడం అదే సంవత్సరంలో కొంతకాలం తర్వాత మొదలైంది. 

హైదరాబాద్‌ తర్వాత మొదలైంది మైసూరులో సైకాలజీ ప్రొఫెసర్‌ డా. ఎమ్‌వీ గోపాల స్వామి ప్రారంభించిన 30 వాట్ల రేడియో ట్రాన్స్‌ మీటర్‌. వీరి నిర్వహణలోనే అది 1935 సెప్టెంబర్‌ 10 నుంచీ 1942 దాకా నడిచి, పిమ్మట మైసూరు సంస్థానం చెప్పుచేతల్లోకి వచ్చింది. మైసూరు సంస్థానం రేడియోకు సంబంధించి ఒక ప్రత్యేకత వుంది. ఆ రేడియో కేంద్రాన్ని వారు ‘ఆకాశవాణి’ అని వ్యవహరించేవారు.  

బ్రిటిష్‌వాళ్ల నిర్వహణలో సాగే రేడియోకు ‘ఆలిండియా రేడియో’ అని 1936 జూన్‌ 8న నామ కరణం చేశారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత 1958లో ఆలిండియా రేడియోకు ‘ఆకాశవాణి’ అనే పేరును కూడా స్వీకరించారు. హైదరాబాద్, ఔరం గాబాద్, మైసూరులలో రేడియో ప్రసారాలు ప్రారంభమైన పిదప 1943 మార్చి 12న తిరువా న్కూరు సంస్థానం (తిరువనంతపురం)లో రేడియో ప్రసారాలు మొదలయ్యాయి. 

బరోడా బ్రాడ్‌ కాస్టింగ్‌ స్టేషన్‌ పేరున రేడియో కేంద్రానికి 1939 మే 1వ తేదీన బరోడా సంస్థా నంలో పునాదిరాయి వేసినట్టు తెలుస్తోంది. ప్రసా రాలు ఎప్పుడు మొదలయ్యాయో సమాచారం పూర్తిగా అందుబాటులో లేదు గానీ, బీబీసీలో పని చేసిన నారాయణ మీనన్‌ 1947లో ఈ రేడియో స్టేషన్‌లో పనిచేశారు. వీరే తరువాతి కాలంలో ఆలిండియా రేడియో డైరెక్టర్‌ జనరల్‌గా 1965–68 మధ్య కాలంలో పనిచేశారు. హైదరాబాద్, ఔరం గాబాద్, మైసూరు, తిరువాన్కూరు, బరోడా రేడియో కేంద్రాల ప్రసారాలు బ్రిటిష్‌ పాలకులకు అనువుగానే సాగాయి. 

ఇంతవరకూ చర్చించిన రేడియో ప్రసారాలు స్వాతంత్య్రోద్యమానికిగానీ, ఉద్యమంలో పాల్గొన్న ప్రజలకు గానీ తోడ్పడిన సందర్భాలు దాదాపు లేవు. 1932లో బొంబాయి స్టేషన్‌ డైరెక్టర్‌ ప్రకారం... ఏదో ఒక రేడియో కేంద్రం స్వాతంత్య్రో ద్యమానికి అనుకూలంగా పనిచేస్తున్నట్టు... విన బడిన ప్రసారాల వల్ల తెలుస్తోందని ఇంటెలిజెన్స్‌ నివేదికలో పేర్కొన్నారని పార్థసారథి గుప్తా...  ‘రేడియో అండ్‌ ది రాజ్‌ 1921–47’(1995) పుస్తకంలో పేర్కొన్నారు. 

నాలుగు సంస్థానాలలో బరోడా రేడియో కేంద్రాన్ని స్వాతంత్య్రం వచ్చిన తర్వాత భారత ప్రభుత్వం 1948 డిసెంబరు 16న తన అజమా యిషీలోకి తీసుకున్నది. హైదరాబాద్, ఔరంగా బాద్, మైసూరు, తిరువాన్కూరు కేంద్రాలన్నీ 1950 ఏప్రిల్‌ 1వ తేదీన భారతదేశ ప్రభుత్వం అధీనంలోకి వచ్చి ఆలిండియా రేడియోగా కొనసా గాయి. ఔరంగాబాద్‌ కేంద్రం కొంతకాలం ఆలిం డియా రేడియోగా పనిచేసి 1953లో మూత పడింది. పాలకులకు పూర్తిగా దోహదపడిన చరిత్ర కలిగిన రేడియో ప్రసారాలుగా ఇవి మిగిలి పోయాయి.


డా. నాగసూరి వేణుగోపాల్‌ 

ఆకాశవాణి విశ్రాంత ఉన్నతోద్యోగి
మొబైల్‌: 94407 32392 

మరిన్ని వార్తలు