ఇప్పుడు వ్యవసాయం దండగ కాదు పండగ

16 Feb, 2021 01:29 IST|Sakshi

సందర్భం 

తెలుగు రాష్ట్రాలను ఏలుతున్న కేసీఆర్, జగన్‌మోహన్‌ రెడ్డి అనేక బాలారిష్టాలను దాటి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను అభివృద్ధి పధం వైపు నడిపించడంలో విశేషంగా కృషి చేస్తున్నారు,  ప్రాజెక్టుల విషయంలో, ప్రజాసంక్షేమ పథకాలు అమలు విషయంలో జాతీయ పార్టీల కంటే మెరుగైన పాలననందిస్తున్నారు. మత సామరస్యాన్ని కాపాడటంలోను, సబ్బండ వర్ణాలకు సంక్షేమ పథ కాల ఫలితాలనందించంలోనూ, దండగన్న వ్యవసాయాన్ని పండుగగా చేయడంలోను, మతం కంటే మనిషి సంక్షేమం  ముఖ్యమని భావించడంలోనూ అందరికంటే ముందున్నారు. 

తెలుగువారికి రెండు రాష్ట్రాలు ఏర్పడినందుకు కలగాల్సిన ఫలాలు ఈ ఇద్దరు పాలకుల వల్ల ప్రజల కందుతున్నాయి. ముఖ్యంగా బహుజన కులాలందరూ వీరి వల్ల లబ్ధి పొందుతున్నారు. బహుజనుల చిరకాల స్వప్నమైన ఇంగ్లిష్‌ చదువులు రెండురాష్ట్రాల్లోనూ సాకారమౌతున్నాయి. ప్రభుత్వ రంగంలో తెలుగు మాధ్యమం, ప్రైవేటు రంగంలో ఇంగ్లిష్‌ మాధ్యమం వల్ల జరుగుతున్న వ్యత్యాసాలను తొలగించడానికి ప్రభుత్వ రంగంలో ఇంగ్లిష్‌ మాధ్యమాన్ని ప్రవేశపెట్టారు జగన్‌మోహన్‌ రెడ్డి. తెలంగాణాలో వందలాది రెసిడెన్షియల్‌ ఇంగ్లిష్‌ మాధ్యమ విద్యాలయాలను స్థాపించి తెలంగాణా బహుజనులకు నాణ్యమైన విద్యా కోర్కెను సఫలం చేశారు కేసీఆర్‌. ఆంధ్రప్రదేశ్‌ పిల్లల చదువులకోసం అనేక పథకాలను ప్రవేశపెట్టి ఆదుకుంటుంటే, తెలంగాణలో రెసిడెన్షియల్‌ విద్యాలయాలు, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ ద్వారా విద్యాదానం చేస్తున్నారు. వ్యవసాయమే ఓ దండుగ అంటూ టీడీపీ, గిట్టుబాటు ధర కావాలన్న రైతును కొడుతూ, నిర్బంధిస్తూ బాధించే చీకటి చట్టాలను తెచ్చిన బీజేపీ రెండూ రైతు నడ్డి విరిచాయి. వ్యవసాయాన్ని, రైతు బతుకును సంక్షోభంలోకి నెట్టాయి. పాలకుల రైతు వ్యతిరేక విధానాలు రైతు బతుకును అతలాకుతలం చేస్తున్నాయి. 

తెలుగు సీఎంలు వ్యవసాయాన్ని పండుగ చేసే ప్రయత్నంలో ఉన్నారు. పెట్టుబడి సాయం చేయడం, కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు, పెడింగ్‌లో ఉన్న ప్రాజెక్టులు నిర్మించి నీటివసతి కలిపించడం, వివిధ పథకాలతో రైతును హృదయానికి హత్తుకొని ప్రోత్సహించడం, ఆర్గానిక్‌ వ్యవసాయం, మంచి విత్తనాల సరఫరా, రైతు ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయడం లాంటి పనులతో రైతుల ఆత్మహత్యలు తగ్గాయి. రైతుల ఆదాయం పెరుగుతోంది. త్వరలో వ్యవసాయం పండుగే అవుతుంది. తెలం గాణాలో కేసీఆర్‌ ప్రవేశపెట్టి అమలు చేస్తున్న రైతుబంధు పథకం దేశంలోని ఏ రాష్ట్రంలోనూ లేదు. రెండు రాష్ట్రాలు వృత్తి పని వారలకు ఆయావృత్తులకు సంబంధించిన ఆదాయ వనరులు కల్పించి లక్షలాది కుటుంబాల ఆదాయాలు పెంచడంతో వాళ్ళలో ఆత్మవిశ్వాసం పెరుగుతోంది. 

తెలంగాణా ప్రభుత్వం హైదరాబాద్‌ను, కరీం నగర్, వరంగల్, ఖమ్మం, లాంటి నగరాలను ఐటీ హబ్బులుగా మార్చుతూ, అంతర్జాతీయ స్థాయి సంస్థల పెట్టుబడులను ఆకర్షిస్తోంది. హైదరాబాద్‌ చుట్టు పక్కల ఫార్మా హబ్బులను స్టాపిస్తోంది. దేశ విదేశీయులు ఇక్కడ స్థిరపడటానికి ఉత్సాహం చూపుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా ప్రభుత్వాలు ప్రపంచస్థాయిలో పెట్టుబడులను ఆకర్షించడంలో ముందువరసలో ఉన్నాయి. ఈ ప్రభుత్వాలు అమలు చేస్తున్న పధకాలు సబ్బండ వర్ణాలకు ఉపయోగకారులుగా ఉంటూ దేశానికే ఉదాహరణ ప్రాయాలుగా ఉన్నాయి. రెండు తెలుగు రాష్ట్రాలను తమవైన శైలిలో అభివృద్ధి ప«థంలో నడిపిస్తున్న పార్టీలపై ఏదో విధంగా బురదజల్లి, సెంటిమెం ట్లను రెచ్చగొట్టి అధికారంలోకి రావాలని బీజేపీ చూస్తోంది. అయితే ద్రవిడ భూమిలో, తెలుగు రాష్ట్రాల్లో ద్వేషం ఎజండా పని చేయదు, మనుషులను ప్రేమించే ఎజండా తప్ప. జగన్, కేసీఆర్‌ లాంటి బాహుబలులు తెలుగు రాష్ట్రాల్లోకి మత తత్వం ప్రవేశించకుండా నిరోధించగలుగుతారు. 

డా. కాలువ మల్లయ్య
వ్యాసకర్త రచయిత, విమర్శకుడు
మొబైల్‌ : 91829 18567

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు