కేబుల్‌ బిల్లు కాస్తంత తగ్గుతుందా?

4 Jul, 2021 00:24 IST|Sakshi

సందర్భం 

హడావుడిగా కేబుల్‌ టీవీ డిజిటైజేషన్‌ పూర్తిచేసిన టెలికం రెగ్యులేటరీ అథారిటీ క్రమంగా తప్పులు దిద్దుకుంటోంది. మొదట్లో బ్రాడ్‌ కాస్టర్లకు అత్యధిక మేలు చేసి, ఆ తరువాత క్రమంలో ఎమ్మెస్వోలు, కేబుల్‌ ఆపరేటర్లు లబ్ధిపొందగా నష్ట పోయింది కేబుల్‌ టీవీ వినియోగదారులే. డీటీహెచ్‌ వినియోగదారులు అప్పటికే డిజిటైజేషన్‌ పూర్తి చేసుకున్నారు గనుక బ్రాడ్‌ కాస్టర్లు పెంచిన బిల్లు తప్ప వాళ్ళ నెలవారీ బిల్లులు పెద్దగా ప్రభావితం కాలేదు. మొదట్లో ట్రాయ్‌ చేసిన తప్పు ఉచిత చానల్స్‌ సంఖ్య పరిమితం చేయటం. నెట్‌వర్క్‌ కెపాసిటీ ఫీజు రూ. 130 కింద 100 చానల్స్‌ ఇవ్వటం, అందులోనే దూరదర్శన్‌ చానల్స్‌ కూడా చేర్చటం. మరో ప్రధానమైన విమర్శ పే చానల్‌ ధరలు పెంచటం. బొకేలో పెట్టే చానల్స్‌ గరిష్ఠ చిల్లర ధర 19గా నిర్ణయించటమంటే, సగటున నెలకు బిల్లు 125 దాకా అదనంగా భరించాల్సి వచ్చింది. 

ఆ తరువాత కోర్టులో ట్రాయ్‌కి అనుకూలంగా తీర్పు వచ్చినా, మార్కెట్‌ శక్తుల వలన బ్రాడ్‌ కాస్టర్లు పోటీపడి ధరలు తగ్గిస్తారని ఆశించిన ట్రాయ్‌ భంగపడింది. ఎట్టకేలకు కొన్ని మార్పులతో 2020 జనవరి 1న రెండో టారిఫ్‌ ఆర్డర్‌ ప్రకటిం చింది. ఇందులో ప్రధానంగా రూ.130కి ఇచ్చే ఉచిత చానల్స్‌ సంఖ్యను 100 నుంచి 200కు పెంచటంతోబాటు వీటికి అద నంగా 26 ప్రసారభారతి చానల్స్‌ చేర్చాలని చెప్పటం. అదే సమయంలో వినియోగదారుడు తన నెట్‌వర్క్‌లో అందుబాటులో ఉన్న మొత్తం చానల్స్‌ కోరుకుంటే రూ.160 కే ఇచ్చి తీరాలి. 

ఇంకో ముఖ్యమైన సవరణ–అదనపు టీవీ సెట్లు ఉండేవారికి ఊరట కల్పించటం. మొదటి టీవీకి కట్టే రూ. 130 కనీస చార్జ్‌ కాగా, ఆ తరువాత ఎన్ని అదనపు టీవీలున్నా, 40% చొప్పున, అంటే రూ. 52 చెల్లిస్తే సరిపోతుంది. ఎలాగూ పే చానల్స్‌ ధరలు అదనం. ఇది కూడా ఎమ్మెస్వోలను, ముఖ్యంగా కేబుల్‌ ఆపరే టర్లను ఇబ్బంది పెట్టే విషయమే. అదే సమయంలో పే చానల్‌ చందాల విషయంలో రెండో టీవీకి తగ్గింపు ధర నిబంధన లేక పోవటం ద్వారా బ్రాడ్‌ కాస్టర్లను వదిలేశారని, ఇది అన్యాయమని అంటున్నారు.ఇక ట్రాయ్‌ చేసిన ప్రధానమైన సవరణ పే చానల్స్‌ ధరల నిర్ణయానికి సంబంధించినది. ఏ బ్రాడ్‌ కాస్టర్‌ అయినా, విడిగా తన చానల్‌ ధర నిర్ణయించుకోవాలనుకుంటే దానికి ఎలాంటి పరిమితి లేకపోయినా, ఒక బొకేలో పెట్టి తన చానల్స్‌ను తక్కువ ధరకు ఆశచూపి ఇవ్వాలనుకుంటే మాత్రం దాని గరిష్ఠ చిల్లర ధర ఇంతకుముందు 19 రూపాయలుంటే, ఇప్పుడు దాన్ని 12కు తగ్గించటం వలన కేబుల్‌ బిల్లులో 25 నుంచి 30 రూపాయల దాకా తప్పకుండా తగ్గే అవకాశముంది.

టారిఫ్‌కు సంబంధించినంతవరకు ట్రాయ్‌కి అసలు ఆ అధికారమే లేదని బ్రాడ్‌కాస్టర్లు కోర్టుకెక్కారు. ఒక వస్తువు తయారీదారుడు తన వస్తువు ధరను నిర్ణయించుకునే అవకాశం ఉండటం సహజం అయినప్పుడు పే చానల్‌ ధరల నిర్ణయాధి కారం తమకే ఉండాలని వారు వాదించారు. అయితే, ఒక నియం త్రణా సంస్థ ప్రజల ప్రయోజనాలు కాపాడటానికి ఇలాంటి చర్యలు తీసుకోవటాన్ని బొంబాయి హైకోర్ట్‌ సమర్థించింది. అయితే ధరల నియంత్రణ విషయంలో ట్రాయ్‌కి పూర్తి అను కూలమైన తీర్పు రాలేదనే చెప్పాలి. బొకేలో పెట్టదలచుకున్న చానల్‌ గరిష్ఠ చిల్లర ధర రూ. 19 నుంచి 12కు తగ్గించినా, బ్రాడ్‌ కాస్టర్లు రకరకాల విన్యాసాలతో బొకేలు తయారు చేయటం ఇంతకుముందు చూశారు గనుక ఈసారి కఠిన నిబంధనలు పెట్టాలని ట్రాయ్‌ నిర్ణయించుకుంది. అందుకే బొకేలు రూపొం దించటంలో బ్రాడ్‌ కాస్టర్లకు రెండు కఠినమైన నిబంధనలు పెట్టింది.  మొదటిది– బొకేల మీద మితిమీరిన డిస్కౌంట్‌ ఇవ్వటం ద్వారా వినియోగదారులు బొకేలే తీసుకునేట్టు చేయటం ఇప్పటి దాకా నడిచింది. అందువలన ఇకమీదట 33% మించి డిస్కౌంట్‌ ఇవ్వకుండా కట్టుదిట్టం చేసింది. అప్పుడే బొకే ధరలు అదుపులో ఉంటాయి. అదే సమయంలో ఆ బొకేలో పెట్టే చానల్స్‌ చిల్లర ధరలు కూడా అదుపులో ఉంటాయి. బొకే నచ్చకపోతే అందులో కొన్ని చానల్స్‌ విడిగా తీసుకోవటం వినియోగదారునికి అనువుగా ఉంటుంది. 

ఈ షరతు సమంజసమేనని బొంబాయ్‌ హైకోర్టు కూడా చెప్పింది కాబట్టి ఇందుకు అనుగుణంగా బొకేలు తయారు చేయటానికి ఎన్ని రకాల కసరత్తు చేసినా, ఇప్పటిదాకా వస్తున్న ఆదాయంలో కనీసం 20% గండిపడే అవకాశాలున్నాయని మార్కెట్‌ వర్గాలు భావిస్తున్నాయి. ఇది ఒక్కో బ్రాడ్‌ కాస్టర్‌కు ఒక్కో రకంగా ఉండవచ్చు. స్టార్‌ గ్రూప్‌ ఎక్కువగా నష్టపోతుం దని ఇప్పటిదాకా ఉన్న బొకేలు గమనిస్తే సులభంగా అర్థమవు తుంది. ఏమంత నష్టం జరగనిది సన్‌ గ్రూప్‌కి కాగా, జీ గ్రూప్‌కి  నామమాత్రంగా నష్టం జరగవచ్చు.ఇక రెండో షరతు విషయానికొస్తే, బొకేలో ఉండే చానల్స్‌ విడి ధరలు ఆ బొకేలోని మొత్తం సగటులో మూడురెట్లకంటే ఎక్కువ ఉండకూడదు. అంటే ఒక పెద్ద చానల్‌తో అనేక చిన్నా చితకా చానల్స్‌ కలిపి అంటగట్టటానికి వీల్లేదు. కానీ ఈ షరతును బొంబాయి హైకోర్ట్‌ తోసిపుచ్చింది. దీనివలన మరింత కట్టడికి వీలయ్యేది గానీ ఇది కొట్టివేయటం వలన బ్రాడ్‌ కాస్టర్లకు కొంతమేర ఊరట కలుగుతుంది. 

మొత్తంగా చూసినప్పుడు ట్రాయ్‌ సవరించిన కొత్త టారిఫ్‌ ఆర్డర్‌ వలన చందాదారులకు సగటున 30 రూపాయల లబ్ధి కలుగుతుంది. కోరుకున్న చానల్స్‌ను బొకేలో కాకుండా విడివిడిగా ఎంచుకునే సౌకర్యం మెరుగుపడుతుంది. ఒకసారి చానల్స్‌ బొకేలు ప్రకటిస్తే అప్పుడు చందాదారులు తమ హక్కు వినియో గించుకుంటూ లాభపడే అవకాశం కలుగుతుంది. ఇలా ధరలు ప్రకటించటానికి కోర్టు ఆరు వారాల సమయం ఇచ్చిందిగనుక ఆ లోపు బ్రాడ్‌ కాస్టర్లు సాధ్యమైనంతవరకు లాభాలలో కోతపడ కుండా ఉండే బొకేలు తయారు చేస్తారు.

సామాన్యులకు ఈ బొకేలు,అ– లా–కార్టే చానల్స్‌ ధర నుంచి తమకు ఉపయోగకరమైన విధంగా, బిల్లు తగ్గించుకునే విధంగా ఎంచుకోవటం తెలియదు కాబట్టి ఎమ్మెస్వోలు స్వయంగా స్థానిక ప్రేక్షకుల అభిరుచికి అనుగుణంగా బొకేలు తయారుచేసి సులభంగా అర్థమయ్యేలా చర్యలు తీసుకుంటారు. కాకపోతే, బ్రాడ్‌కాస్టర్లు ఎప్పటిలాగే ఆ బొకేలలో తమ చానల్స్‌ కలిపేలా రకరకాల తాయిలాలతో ఎమ్మెస్వోలను ఆకట్టుకోరన్న గ్యారంటీ ఏమీలేదు. చందాదారుడు అంతకంటే తెలివిగా ఉంటేనే ట్రాయ్‌ సవరణలతో మరింత లబ్ధిపొందుతాడు.

తోట భావనారాయణ 
వ్యాసకర్త సీనియర్‌ జర్నలిస్ట్‌ 

మరిన్ని వార్తలు