Gujjula Narsaiah: జాతీయవాద ఉద్యమానికి తీరని లోటు

27 Sep, 2022 13:52 IST|Sakshi

ప్రముఖ విద్యావేత్త, జాతీయవాది, హిందూధర్మ పరిరక్షకులు గుజ్జుల నర్సయ్య సార్‌. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌ (ఏబీవీపీ) రాష్ట్ర మాజీ అధ్యక్షులుగా, ఆలిండియా స్థాయిలో ఉపాధ్యక్షులుగా, భారతీయ జనతా పార్టీ రాష్ట్ర మాజీ కార్యవర్గ సభ్యులుగా గణనీయమైన స్థాయిలో సేవలు అందించారు. నర్సయ్య తన 81 ఏళ్ల వయసులో 2022 సెప్టెంబర్‌ 24 హన్మకొండ హంటర్‌ రోడ్‌లోని స్వగృహంలో తుది శ్వాస విడిచారు. ఆయనకు భార్య రాజ్యలక్ష్మి, ముగ్గురు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. 

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని మారుమూల గ్రామం మండలగూడెంలో 1942 ఆగస్ట్‌ 8న ఆయన జన్మించారు. 1952లో రాష్ట్రీయ స్వయంసేవక సంఘంలో స్వయంసేవక్‌గా జీవితాన్ని ప్రారంభిం చారు. 1967లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్‌  కార్యకర్తగా విద్యార్థి రాజకీయాల్లోకి ప్రవేశించారు. 1981లో ఇంగ్లిష్‌ లెక్చరర్‌గా ఉద్యోగ జీవితాన్ని మొదలుపెట్టారు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు ఇంగ్లిష్‌ భాషను సులభ శైలిలో బోధించి వారిలో ఇంగ్లిష్‌ భాష అధ్యయనం పట్ల ఆసక్తి పెంచే మెలకువలు నేర్పించిన ఉత్తమ అధ్యాపకులుగా గుర్తింపు పొందారు. 

1986లో ఏబీవీపీ రాష్ట్ర అధ్యక్షులుగా ఆయన బాధ్యతలు స్వీకరించిన సమయంలో రాష్ట్రంలో వామపక్ష భావజాలం కలిగిన విద్యార్థి సంఘాలతో జరిగిన అనేక సంఘర్షణ  ఉద్యమాలలో కీలక పాత్ర పోషించారు. ఉత్తర తెలంగాణ పరిధిలో గల జిల్లాల్లో విశేష పర్యటనలు చేసి విద్యార్థి పరిషత్‌ కార్యకర్తల్లో జాతీయవాద దృక్పథాన్ని ప్రేరేపించారు. 1992లో ఏబీవీపీ జాతీయ కార్యవర్గ సభ్యులుగా వ్యవహరించారు. కొంతకాలం వరంగల్‌ విభాగ్‌ ప్రముఖ్‌గా బాధ్యతలు నిర్వహించారు. ఏబీవీపీ సంస్థకు పూర్తి సమయ కార్యకర్తగా వరంగల్‌ నుండి దేశ నలుమూలల పని చేయడానికి వెళ్లారు. క్లిష్ట పరిస్థితులలో జాతీయవాద వ్యాప్తి కోసం నిరంతరం పరితపించిన మహానుభావుడు నర్సయ్య. బిహార్‌ విశ్వవిద్యాలయం ఈసీ మెంబర్‌గా కూడా ఆయన చాలాకాలం సేవలు అందించారు. 2001లో హన్మకొండలోని కాకతీయ డిగ్రీ కళాశాల నుండి ఇంగ్లిష్‌ లెక్చరర్‌గా ఉద్యోగ విరమణ చేశారు. 2007లో భారతీయ జనతా పార్టీ పక్షాన ఎమ్మెల్సీగా పోటీ చేసి స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారు. 

ఇంగ్లిష్‌ లెక్చరర్‌గా నర్సయ్య వడ్డేపల్లిలోని పింగిలి కాలేజీలో, గోదావరిఖని, మంథని, మంచిర్యాల, పెద్దపల్లి, హుజురాబాద్‌ డిగ్రీ కళాశాలలో పని చేశారు. పలు జూనియర్‌ డిగ్రీ కళాశాలలు నిర్వహించిన జాతీయ సేవాపతకం శిబిరాల్లో జాతీయ పునర్నిర్మాణంలో యువత పాత్ర అనే అంశంపై అనర్గళంగా ఉపన్యసించి యువతలో సేవాభావం, దేశభక్తి, సంకల్పబలం, మనోధైర్యం కల్పించే ప్రయత్నం చేసిన సామాజిక చైతన్యశీలి ఆయన. గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా హన్మకొండ చౌరస్తాలోని వేదికపై ఆయన ప్రసంగాలు ప్రజలను ఆలోచింపజేసే విధంగా సాగేవి.

నక్సలైట్ల చేతిలో ఏబీవీపీ కార్యకర్తలు మరణించిన సమయంలో నర్సయ్య మొక్కవోని ధైర్యంతో వెళ్లి వారి కుటుంబ సభ్యులకు భరోసా ఇచ్చిన సందర్భాలు అనేకం. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక కార్యక్రమాలలో విద్యార్థులను జాగృతం చేయడంలో కూడా కీలక భూమిక పోషించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఏబీవీపీ చేపట్టిన పాదయాత్రకు పాటలు, మాటలు అందించారు. గుజ్జుల నర్సయ్యసార్‌ మరణం విద్యారంగానికి, సామాజిక చైతన్యానికి తీరని లోటు. వారి ఆశయాల సాధనకు కృషి చేయడమే ఘనమైన నివాళి. (క్లిక్: సాయుధ పోరాటాన్ని రగిల్చిన అగ్ని కణం చాకలి ఐలమ్మ)


- నేదునూరి కనకయ్య 
వ్యాసకర్త రాష్ట్ర అధ్యక్షులు, తెలంగాణ ఎకనామిక్‌ ఫోరం, సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక, తెలంగాణ ఎడ్యుకేషన్‌ ఫోరం

మరిన్ని వార్తలు