రామాయణంలో శేషేంద్రకు దొరికిన ఆణిముత్యాలు

20 Oct, 2021 00:31 IST|Sakshi

సందర్భం

వాల్మీకి పదబంధాలను వ్యాసుడు యథాతథంగా వాడుకున్నాడు. రామాయణానికి భారతం ప్రతి బింబం. ఈ మాట నమ్మడం సాధ్యమా? నేటి భాషలో అయితే వ్యాసుడు వాల్మీకి కాపీరైట్‌ ఉల్లంఘించాడనాలి. ఈ మాట నేను ఇప్పుడు అనడం లేదు. సాక్షాత్తూ గుంటూరు శేషేంద్ర శర్మ విశేష రచన ‘షోడశి’ (రామాయణ రహస్యములు)లో 1967లో అంటే 54 ఏళ్ల కిందటే ఈ రహస్యాన్ని వెల్లడిం చారు. ఆ విషయాన్ని విశ్వనాథ బయటపెట్టారు. నీలంరాజు వెంకటశేషయ్య సంపాదకత్వంలో ఆంధ్రప్రభ సాహితీ అనుబంధంలో 1963–67 మధ్య ధారావాహికగా షోడశి వ్యాసాలు ప్రచురితమైనాయి.

విశ్వనాథ ‘షోడశి’కి రాసిన ముందుమాటలో చెప్పిన మాటలు: ‘‘ఆశ్చర్యములలో నాశ్చర్యమేమనగా భారతము రామాయణమునకు ప్రతిబింబమని గుంటూరు శేషేంద్ర శర్మ గారు చేసిన ప్రతిపాదన. సంపూర్ణముగా ప్రతిబింబము కాకపోయినను శ్రీ శర్మగారు చూపించిన స్థలములలోని ప్రతిబింబత్వము నాకాహా పుట్టించినవి’’. ‘‘శ్లోకములు శ్లోకములు చరణములు చరణములు వాని యంతట వానినే భగవంతుడైన వ్యాసుడు వాడుకొనెను. వాల్మీకిని యథేచ్ఛగా వాడుకొన్న వారిలో మొదటివాడు వ్యాసుడు’’. శేషేంద్రను లోతైన మనిషి అంటూ కవిసమ్రాట్‌ : ‘‘శ్రీ శర్మగారికి నాకు నేడెనిమిదేండ్ల నుండి చెలిమి గలదు. వారింత లోతైన మనిషియని నేననుకొనలేదు. అప్పుడ ప్పుడు నైషధము నుండి కొన్ని శ్లోకములు దేవీ పరముగా వారన్వయించినప్పుడు నేను వారికవి యాదృచ్ఛికముగా తోచిన విషయములనుకొన్నాను గాని శ్రీవిద్యావిషయమునింత లోతుగా తెలిసిన వారనుకొనలేదు. వారీ గ్రంథమును వ్రాసినందుకు తెలుగువారే కాదు. భారతీయులందరును కృతజ్ఞులుగా నుండవలసిన విషయము’’. 

షోడశి వ్యాసాలలో శ్రీసుందరకాండకు ఆ పేరు ఎందుకు వచ్చిందనే అధ్యాయంలో వెల్ల డించిన కారణాలు ఆశ్చర్యకరంగా ఉంటాయి. ప్రవచన కర్తలు సాధారణంగా ప్రస్తావించని అంశాలు సాహిత్యపరంగా పరిశోధించి మన ముందుంచారు శేషేంద్ర. సుందరకాండ సుందర నామం ధరించడానికి చాలా కారణాలున్నాయి. అవి: హనుమంతుడు సుందరుడగుట వలన, సుందర హనుమన్మంత్రమని యొకటి యుండుట, హనుమంతుడు నివసించిన స్థానములలో ఒకదానికి సుందరనగరమనే పేరు ఉండుట అని. సుందరాయ నమః అని శ్రీరామాష్టోత్తర నామములలో ఉన్నది. కాని హనుమ గురించి కాదు. బ్రహ్మాండ పురాణములో సుందరకాండకు ‘‘చంద్రబింబ సమాకారం వాంఛి తార్థ ప్రదాయకం హనుమత్సేవితం ధ్యాయేత్‌ సుందరే కాండే ఉత్తమే’’ అన్నారు. షోడశ కళా ప్రపూర్ణ అయిన శక్తియే చంద్రబింబం అంటే. ఈ కాండలో సీతారాములకు ఏ భేదమూ లేకపోవడం వల్ల రాముని పరాశక్తిగా భావించాలని పారాయణ విధాన వివరణ తాత్పర్యం.

రాముడు సుందరుడు, సుందరి కలవాడు. సుందరకాండ సౌందర్యకాండ, బ్రహ్మాండ పురాణము సౌందర్యకాండ అనే మాట వాడినారు. ఈ సౌందర్యము శంకరులు సౌందర్యలహరి అని చెప్పినదే. కనుక సుందర హనుమంతుడనగా దేవీ భక్తుడైన హనుమ అని అర్థమే గానీ హనుమ సుందరముగా ఉన్నాడని గాదు. హనుమ నిరంతర దేవీ ధ్యానమే, జపమే, యోగమే, సుంద రకాండగా దర్శనమిచ్చుచున్నది. ‘తదున్నసం పాండురదంత మవ్రణం శుచిస్మితం పద్మపలాశ లోచనం ద్రకే‡్ష్యతదార్యావదనం కదాన్వహం, ప్రసన్నతారాధిప తుల్యదర్శనం’ అని ఓ తల్లీ నిన్ను నేనెప్పుడు చూతునో గదా అని హనుమ పరితపిస్తూ చెప్పిన శ్లోకం ఇది.  ‘తెలుగుసీమలో సుందరయ్య, సుందరరామయ్య అని బాలా త్రిపురసుందరీ సంప్రదాయ సిద్ధ నామధేయములు ప్రజలు పెట్టుకొను వ్యవహారమున్నది. ఇతర సీమలలో కూడా సుందరేశన్, సుందర్‌ సింగ్‌ సుందర్‌ బాయ్‌ అట్టి చోట్ల త్రిపురసుందరీపరమైన అర్థమే గానీ హనుమత్పరమైన అర్థము లేద’ని శేషేంద్ర వివరించారు. 

హనుమంతుడు అనే పేరు వజ్రఘాతం వల్ల, మారుతి అనే పేరు తండ్రి వాయుదేవుని మారుతమనే పేరు వల్ల, ఆంజనేయుడు అనే పేరు తల్లి పేరుతో వచ్చినాయి. కానీ తల్లి ఆంజనేయుడికి పెట్టుకున్న అసలు పేరేమిటి? సుందరుడు అని శేషేంద్ర, విశ్వనాథ వెల్లడించారు. ఇది వాల్మీకి చెప్పలేదు. ఆ మహర్షి పరమ గూఢమైన రచన చేసినాడు. సుందరుని కథా సమగ్రమయిన సుందరకాండకు ఆ పేరు వచ్చిందని వివరించారు. ఆ విధంగానే మరికొన్ని అసలు పేర్లను పేర్కొన్నారు. ద్రౌపది అసలు పేరు కృష్ణ అనీ శూర్పణఖ అసలు పేరు బాల అని ప్రస్తావించారు. 

కవి సమ్రాట్‌ విశ్వనాథ ‘‘రామాయణమునందు తక్కిన కాండలకు తత్తత్కాండాతర్గత కథా సూచకములైన నామములుండగా దీనికి సుందరకాండమన్న పేరు విడిగానేల పెట్టవలసి వచ్చినదన్న ప్రశ్ననిచ్ఛలు వినిపించునదే. ఈ సందియము పలుమందికి కలదు’’ అని తనదైన శైలిలో వ్యాఖ్యానించారు. విశ్వనాథ ప్రశంస ఇంకా సాగింది. ‘‘శ్రీశర్మగారు త్రిజటా స్వప్నమును గాయత్రీ మంత్రములోని పాదముల సంఖ్యయు నక్షరముల సంఖ్యయు తీసికొని అది గాయత్రీ మంత్రమునకు నొక విధమైన వ్యాఖ్యయని నిరూపించుట మిక్కిలి యూహస్ఫోరకముగా నున్నది: వారి శ్రధ్ధను నిరూపించుచున్నది.  

ఇది పారాయణము చేయనెంచెడి వారికి శ్రీశర్మగారు చేసిన యుపకారమింతయని చెప్పరాదు.’’ ....‘అన్నిటికంటే ప్రధానమైన యుపపత్తి సుందరకాండ మంతయు కుండలినీ యోగమని నిరూపించుటయే.. ఈ నిరూపణ మాత్రమాశ్చర్యజనకముగా ఉన్నది. శ్రీ శర్మగారు దీని నూరకయే నిరూపించలేదు. గాలిలో దీపం పెట్టి దేవుడా నీ మహిమ యనలేదు. వాల్మీకి వేదముననుసరించి శ్రీరామాయణము వ్రాసెననుట న్యాయమే అనిపించును. ఇది యొక పెద్ద గొడవ. ఇదినిరూపించుటకు నాకు శ్రీశర్మగారికున్నంత యోపికలో సగమైన నుండవలయును. నాకు లేనిదే అది’’ అని విశ్వనాథ పేర్కొన్నారు. షోడశి హిందీ ఇంగ్లిష్‌ భాషల్లోకి అనువదించడం కూడా విశేషమే.

సుందరకాండలో కుండలినీ యోగాన్ని దర్శించిన శేషేంద్ర శర్మది లోతైన పరిశోధన. త్రిజట స్వప్న వృత్తాంతంలో గాయత్రీ మంత్ర వృత్తిని శేషేంద్ర శర్మచూచిన తీరు, వేద రహస్యాలను లోతుగా చదివితేనే అర్థమయ్యేట్టు సూచనప్రాయంగా వాల్మీకి పొందుపరిచిన విధానాన్ని పరిశీలిస్తే రామాయణంలో షోడశి కొత్త కోణాలను ఆవిష్కరించిందని అర్థమవుతుంది. భారతీయ విమర్శనా సాహిత్యాన్ని ప్రపంచ వాఙ్మయంలో నిలువెత్తు నిలబెట్టిన అత్యుత్తమ గ్రంథం ఇది. వాల్మీకి ఏ విధంగా రామాయణాన్ని సృష్టించారనే విశ్లేషణ గొప్పది. కథా సందర్భం, పాత్రల మనోగతం, ఆనాటి దేశకాల పరిస్థితులు, విశేషమైన శాస్త్ర పాండిత్యం, శబ్దాధికారం, వీటికి తోడు లౌకిక వ్యవహారాలు ఇన్నీ తెలిస్తే కానీ వాల్మీకి పదప్రయోగాలను అవగతం చేసుకోలేమని శేషేంద్ర శర్మగారు అన్నారంటే ఆయన రామాయణ మహార్ణవంలో లోతులను ఎంతగా పరిశోధించారో తెలుస్తుంది.

-మాడభూషి శ్రీధర్‌
వ్యాసకర్త డీన్, స్కూల్‌ ఆఫ్‌ లా, 
మహీంద్రా యూనివర్సిటీ
(నేడు గుంటూరు శేషేంద్ర శర్మ జయంతి)

మరిన్ని వార్తలు