Gurram Jashuva: మనువును జయించిన విశ్వనరుడు

22 Sep, 2022 14:47 IST|Sakshi

‘‘కులమతాలు గీచుకున్న గీతల జొచ్చి /
పంజరాన గట్టువడను నేను
నిఖిల లోకమెట్లు నిర్ణయించిన
నాకు తరుగు లేదు విశ్వనరుడ నేను’’
అంటూ విశ్వమానవతను ప్రకటించాడు తన కవిత్వం ద్వారా జాషువా మహాకవి. తాను నమ్మిన విలువల్ని, సిద్ధాంతాల్ని తన రచనల ద్వారా నిక్కచ్చిగా ప్రకటించాడు. తన సాహితీ ప్రస్థానంలో సామాజికంగా ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నా వెనుదిరగలేదు. కులమతాల దాడులకు వెరవక తన ప్రస్థానాన్ని కొనసాగించాడు. ‘పలుకాకుల మూకలు అసూయ చేత నన్ను ఏవిధంగా దూషించిన నా సాహితీ సౌరభం మాయమై పోద’నీ, ‘నన్ను వరించిన శారద లేచి పోవునే’ అని అన్నాడు. ‘ప్రపంచం ఎట్లా నిర్ణయించిన నాకు కొదవలేదు నేను విశ్వనరుడను’ అని ప్రకటించాడు. కసరి బుసగొడుతున్న నాగరాజుల వైపు కవితా దివిటీలను విసిరాడు. కేవలం విశ్వమానవతను ప్రకటించడమే కాకుండా తన కవితా ప్రస్థానమంతటా జాగరూకుడై కవిత్వమై ప్రతి స్పందించాడు. 

జాతీయోద్యమ కాలంలో జాతి జనుల్లో భారతమాత గొప్పతనాన్ని చాటి చెప్పే అనేక విషయాలను తన కవిత్వంలో పొందుపరచాడు. సింధు గంగా నదులు జీవజల క్షీరాన్ని నిరంతరాయంగా ప్రవహింపజేస్తూ తమ సంతానాన్ని పోషించుకుంటున్నదని పచ్చి బాలింతరాలుగా కన్న దేశాన్ని కీర్తించాడు. తద్వారా ప్రజల్లో దేశభక్తిని పాదుకొల్పాడు. దేశాన్ని గతంలో పాలించిన రాజుల వైభవాన్నీ, తాత్విక మార్గదర్శకులుగా ఉండిన మహనీయుల గురించీ, విశ్వవిఖ్యాతి చెందిన వారి ఘనతను గురించీ ప్రజలకు కనువిప్పు కలిగించే విధంగా, జాతీయభావాలు ఉప్పొంగేలా కవిత్వం రాసిన పద్యాల పరుసవేది జాషువా. 

బుద్ధుని తాత్విక చింతనలోని సారాంశాన్ని వర్ణిస్తూ... ‘రెండు వేల ఐదువందల ఏళ్ళు గడిచినా నీ కమనీయ బోధలకు నిగ్గు రవ్వంత కూడ తగ్గలేదు’ అంటాడు. అశోకుని వంటి మహా చక్రవర్తుల గుండెలను సైతం బౌద్ధం పెళ్ళగించి అహింసా సిద్ధాంతం వైపు మళ్ళించిందని పేర్కొన్నాడు. మరో సందర్భంలో భారతీయ సంస్కృతీ ఔన్నత్యాన్ని విశ్వసభల్లో చాటిన మహనీయుడు స్వామి వివేకానంద గొప్పదనం గురించి ‘వివేకానంద’ అనే ఖండికలో వివరించాడు.

పేదరికం, అవమానాలతో కుంగిపోక ధీరోదాత్తునిలా ఎదుర్కొని విశ్వనరుడి స్థాయికి ఎదిగాడు. నవయుగ కవి చక్రవర్తిగా కీర్తినొందాడు. తెలుగుదనాన్ని తన పద్యంలో జాలువార్చి స్వచ్ఛమైన తెలుగుభాషకు ప్రాణప్రతిష్ఠ చేశాడు. అటు సంప్రదాయ సాహిత్య సంస్కారాన్నీ, ఇటు ఆధుని కతనూ మేళవించి తన సాహిత్య ప్రస్థానాన్ని కొనసాగిం చాడు. కావుననే జాషువా పద్యం జానపదుల నాలుకలపై జీవించి వుంది. ఇంతటి ప్రాచుర్యం పొందిన కవి తెలుగు భాషలో అరుదని చెప్పొచ్చు. 

జాషువా సాహిత్యంలో భారత పురాణ  పురుషులే గాక, ప్రపంచ శాంతికి సత్యం, అహింస వంటి ఆయుధాలను అందించిన గౌతమ బుద్ధుడు, అహింసామూర్తి గాంధీ, సామాజిక తత్వవేత్త అంబేడ్కర్‌ వంటి మహానీయులు అందరూ దర్శనమిస్తారు. బుద్ధుని బోధనల్లోని అహింసా తత్వాన్నీ, విశ్వమానవ ప్రేమనూ, ఏసుక్రీస్తు బోధనల్లోని శాంతి, కరుణ, సత్యం, సౌశీల్యాన్నీ ఆయన ప్రజల్లో దేశభక్తిని పాదుకొల్పేవిగా పేర్కొన్నాడు. ఆయన దృష్టిలో జాతీయత అంటే అన్ని మతాలు సహనంతో కలగలసి జీవించడం. ఏసుక్రీస్తు చెప్పినట్లు ‘నీవలే నీ పొరుగువారిని ప్రేమించడం’. సామాజిక సమానత, సంక్షేమం కోసం కవిత్వం రాశాడు. ‘కాందిశీకుడు’ రచనలో ‘కపాలం’ ద్వారా మాట్లాడుతూ సమాజంలోని అసమానతలు తొలగిపోయి విశ్వ సమానతా భావం, విశ్వ సోదరభావం పెంపొందినపుడే జాతీ యతా భావం ఆవిర్భావం జరుగుతుందని చెబుతాడు.

నా జాతి నాయూరు నాదేశమని పొంగు
స్వాభీ మానము శూన్యమయిన దాక
విశ్వసౌభ్రాత్రంబు వెలయించునైక్య సం
ఘావ్యాప్తిదిశల పెంపారు దాక...
అంటాడు. 
మహాత్ముడి అకాల మరణానికి దిగ్భ్రాంతికి గురయిన జాషువా ‘బాపూజీ’ లఘు కావ్యాన్ని రచించాడు. గాంధీజీ అహింసా సిద్ధాంతాల పట్ల అత్యంత ప్రేమాదరణను కన బరచిన ఆయన ఈ కావ్యానికి ముందు మాటగా ‘వినతి’ని రాస్తూ ‘ప్రపంచ చరిత్రలో నెట్టివాడు నీయుగమున గడింపని కీర్తి నతడార్జించి, అనుంగు బిడ్డలగు భారతీయుల కంకిత మొనర్చినాడు. ప్రతిఫలముగా తనకు లభించినది బలవన్మరణము. భస్మస్వరూపము. అది తలంపరాని విషమ ఘడియ’. ‘నాడు రాలిన యశ్రు కణములే ఈ కావ్యము’ అంటాడు. బాపూజీ కావ్యంలో జాషువా హృదిలో ముద్రించుకున్న చిత్రం దృశ్యమానంగా కళ్ళకు కట్టి కనిపిస్తుంది. అహింసావాదిగా కరుణా మూర్తిగా, సంఘ సంస్కర్తగా, హిందూ ముస్లిం సమైక్యతావాదిగా గాంధీజీని చిత్రించాడు. 
గోచిపాత గట్టుకొని జాతి మానంబు 
నిలిపినట్టి ఖదరు నేతగాడు 
విశ్వసామరస్య విజ్ఞాన సంధాత
కామిత ప్రదాత గాంధితాత’’
అంటాడు. గాంధీ సైద్ధాంతిక నిష్టను, నైతికతను మనఃపూర్వకంగా ఒప్పు కున్నాడు. ఆచరింప దగినవిగా భావించాడు. ఈ నేపథ్యంలో ఆయన ‘నివసించుటకొక నిలయము తప్ప గడన చేయుటకు ఆశపడను’ అన్నాడు. ‘ఆలు బిడ్డలకు ఆస్తి పాస్తులు గూర్చ పెడత్రోవలో కాలు పెట్టను’ అన్నాడు. ఈ నైతిక, సామాజిక నిష్ఠను గాంధీజీ దృక్పథం నుండి జాషువా గ్రహించాడు. 

ఆయన దృష్టిలో దేశభక్తి, విశ్వమానవత ప్రాధాన్యాలు. నిత్యం అనేక సామాజిక అవరోధాలను ఎదుర్కొన్నా, తాను మాత్రం జాతీయతా దృక్పథంతోనూ, విశ్వమానవ తత్పరతతోనూ రచనా వ్యాసంగాన్ని కొనసాగించాడు. మహాకవి దృష్టిలో దేశభక్తీ, విశ్వమానవతా రెండూ నాణేనికి రెండు వైపుల వంటివి. జీవించినంత కాలం ఈ సైద్ధాంతిక భూమికకు కట్టుబడే పనిచేశాడు. కాబట్టే బుద్ధుడు, మహాత్ముడు తనకు ఆరాధ్యులుగా భావించాడు.


- డొక్కా మాణిక్యవరప్రసాద్‌ 
ఏపీ ప్రభుత్వ విప్, మాజీమంత్రి
(జాషువా జయంతి వారోత్సవాలు నేటి నుంచి ఈ నెల 28 వరకు గుంటూరులో జరుగుతున్న సందర్భంగా)

మరిన్ని వార్తలు