అన్నదాతను అనుసంధానించాలి

20 Sep, 2022 12:54 IST|Sakshi

ఇది సమాచార విప్లవ యుగం. సరైన సమాచారం ఉత్పత్తిదారుకూ, వినియోగదారునికీ ఉంటే ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది. ముఖ్యంగా రైతన్నకు కావలసిన సమాచారం అందుబాటులో ఉంటే ఎంతో మేలు జరుగుతుంది.

చాలా సందర్భాలలో ఉత్పత్తి దారులూ, వినియోగదారులూ ఒకే ప్రాంతంలో ఉన్నా ఆ విషయం వారికి తెలియక దూర ప్రాంతాల వారితో క్రయ విక్రయాలు జరుపుతున్నారు. ఉదాహరణకు నా దృష్టికి వచ్చిన ఉదంతం చెబుతాను. సత్యసాయి జిల్లా కదిరిలో పండిన వేరుశనగ వంగడాన్ని నల్లగొండ జిల్లా వాసి కొనుగోలు చేశాడు. కదిరి ప్రక్కనే ఉన్న అన్నమయ్య జిల్లా గాలివీడు మండల వాసికి కదిరిలో ఆ వంగడం ఎవరిదగ్గర ఉందో తెలియక దళారీ ద్వారా నల్లగొండ జిల్లా వాసి నుండి ఎక్కువ ధరకు కొనుగోలు చేశాడు. సమాచారం అందుబాటులో ఉంటే పరిస్థితి మరో విధంగా ఉండేది.   

సహజంగా ఏ వస్తువైనా ఎక్కువ మొత్తంలో కొనడం వల్ల అమ్మకపుదారు నుండి ధరలో రాయితీ లభిస్తుంద న్నది వాస్తవం. మన చుట్టు పక్కల వినియోగదారులను కలిపే ఒక అప్లికేషన్‌ లాంటిది ఉంటే ఒక వీధిలోనో లేదా ఊరులోనో ఉన్నవారందరూ ఉమ్మడిగా తక్కువ ధరకు కొని సరుకును పంచుకోవచ్చు. అలాగే అమ్ముకునేవారికీ ఒకేసారి పెద్ద మొత్తంలో సరుకు అమ్ముడుపోయి లాభం కలుగుతుంది.

చాల సందర్భాల్లో తమ వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రత్యేకత ఉన్నా దానిని లాభదాయకంగా అమ్ము కోవడంలో రైతు విఫలమవుతున్నాడు. రైతుల  ఉత్పత్తుల ప్రత్యేకతలను తెలియజేసే ఒక సమాచార వ్యవస్థ ఉంటే వారికి లాభదాయకంగా ఉంటుంది. మన రాష్ట్రంలో ఒక ప్రాంతంలోని ప్రసిద్ధిగాంచిన ఉత్పత్తులు విదేశాలకు ఎగుమతి అవుతున్నా ఇంకొక ప్రాంతం వారికి అంతగా తెలియడం లేదు. ఉదాహరణకు రుచికరమైన కోనసీమ చక్కరకేళి అరటిపండ్లు నేపాల్‌ దేశానికి ఎగుమతి చేస్తారు. 2015 సంవత్సరంలో నేపాల్‌లో సంభవించిన భూకంపం వల్ల వాటిని ఎగుమతి చేయలేక, రోడ్ల మీద పడవేయ వలసి వచ్చింది. నిజానికి రాయలసీమ ప్రాంతంలో వాటి గురించి చాలా తక్కువగా తెలుసు. ఒక వేళ తెలిసి ఉంటే కనీస ధరకన్నా కోనసీమ రైతుల దగ్గర రాయలసీమ వినియోగదారులు కొనుక్కుని ఉండేవారు. 

పైన పేర్కొన్నట్లు రైతులకూ, వినియోగదారులకూ సరైన సమాచారం అందించడానికి సచివాలయ వ్యవస్థను బాగా వాడుకోవచ్చు. గ్రామ/వార్డు సచివాలయ వ్యవస్థకు రైతు భరోసాకేంద్రాలను అనుసంధానించాలి. ఆయా గ్రామాల్లో పండించే పంటల వివరాలను, రైతు ఫోన్‌ నంబరుతో సహా సచివాలయ వెబ్‌సైట్‌లో ఉంచాలి. ఇలా రాష్ట్రంలోని సచివాలయాలన్నింటినీ అనుసంధానించి సమాచారం అందరికీ అందుబాటులో ఉంచే సమాచార వ్యవస్థను రూపొందించగలిగితే దేశంలోని ఏ ప్రాంతం వారైనా ఆయా సచివాలయ సిబ్బందితోగానీ లేదా రైతుతోగానీ సంప్రదించి కొనుగోలు చేసే సౌకర్యం కలుగుతుంది. ఇందులో దళారీల ప్రమేయం లేదు కాబట్టి అటు రైతుకూ, ఇటు కొనుగోలుదారునికీ కూడ ప్రయోజనకరంగా ఉంటుంది. 

అదేవిధంగా ఒక ప్రత్యేక అప్లికేషన్‌ను ఉపయోగించి ఒక్కో సచివాలయం పరిధిలోని ప్రజలను ఒక కొనుగోలు దారుల గ్రూపుగా తయారుచేయవచ్చు. ఉదాహరణకు సచివాలయ పరిధిలోని ప్రజలు కలసి టమోటా అవసరమనుకుంటే వాటిని ప్రక్క గ్రామంలో ఉన్న రైతే నేరుగా సరసమైన ధరకు అందించవచ్చు. గూగుల్‌ యాప్‌లో తమకు కావలసిన వస్తువులు దగ్గరలో ఎక్కడ దొరకుతాయో వెబ్‌సైట్‌లో వెతికి తెలుసుకునే సౌకర్యం ఉంది. అటువంటి సౌకర్యమే ఈ అప్లికేషన్‌లో పొందు పరచవచ్చు. 

కేవలం రైతు పండించే పంటలకే కాక చేతి వృత్తి కళాకారుల ఉత్పత్తుల వివరాలనూ ఈ సమాచార వ్యవస్థలో భాగం చేయాలి. ఇందువల్ల రాష్ట్రంలో ఏఏ ఉత్పత్తులు ఎక్కడెక్కడ ఎంత మొత్తంలో ఉత్పత్తి అవుతున్నాయో తెలియడమే గాక వాటికి ఉన్న డిమాండ్‌ కుడా తెలుసుకోవచ్చు. ఇలా సప్లయ్, డిమాండ్‌ల సమాచారం తెలియడం వల్ల వాటి మధ్య సమతుల్యత సాధించే ప్రయత్నం చేయవచ్చు. ఇలా అయితే ఉత్పత్తిదారుకూ, వినియోగదారునికీ మేలు చేకూరుతుంది.

- డాక్టర్‌ జి.వి. సుధాకర్‌రెడ్డి 
ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ సభ్యులు

మరిన్ని వార్తలు