ఈ లక్ష్యం సాధ్యమేనా?

8 Nov, 2021 01:07 IST|Sakshi

ఒకవైపు ‘కాప్‌26’ వంటి అంతర్జాతీయ వేదిక నుంచి కర్బన ఉద్గారాలను శూన్యస్థాయికి తగ్గించడంపై భారత ప్రధాని గంభీర ప్రకటన చేసి ప్రశంసలు అందుకుంటున్నారు. మరోవైపు దేశంలో ఇంధన ఉత్పత్తి విధానం ప్రశ్నార్థకమవుతోంది. పలు అటవీ ప్రాంతాలను బొగ్గుగనుల తవ్వకం కోసం కేంద్రం ప్రైవేట్‌ కంపెనీలకు అప్పగిస్తోంది. బొగ్గు ఆధారిత ఇంధన ప్లాంట్లను నిర్మిస్తూనే ఉన్నారు. పునరుద్ధరణీయ ఇంధనాల పట్ల చిత్తశుద్ధిని ప్రకటించకుంటే దేశం ఆర్థిక ఆత్మహత్యా స్థితిలోకి వెళుతుంది. 

భారతదేశం 2070 నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తగ్గిస్తుందని ప్రధాని నరేంద్రమోదీ గ్లాస్గోలో జరుగుతున్న కాప్‌26 సదస్సు తొలిరోజున చేసిన ప్రకటన పతాక శీర్షికలకు ఎక్కింది. అదే సమయంలో తీవ్ర వాదోపవాదాలకు దారితీసింది. పాశ్చాత్య ప్రపంచం ప్రకటించిన 2050 గడువుకంటే ఇది రెండు దశాబ్దాల సమయం వెనుకబడి ఉంది. 2060 నాటికి నెట్‌ జీరో సాధిస్తానని చైనా చేసిన ప్రకటనతో పోలిస్తే మోదీ ప్రకటన పదేళ్లు వెనుకబడి ఉంది. అయితే ఉద్గారాల పూర్తి తగ్గింపుపై విధించుకున్న 50 ఏళ్ల గడువు, నేటి భారత్‌ విధానాలపై ప్రభావం వేయగలుగుతుందా అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. 

ప్రపంచంలోనే గ్రీన్‌హౌస్‌ వాయువులను అధికంగా వెలువరిస్తున్న మూడో అతిపెద్ద దేశం భారత్‌. దేశంలో ఇప్పుడు వాడుతున్న శిలాజ ఇంధనాలు, బొగ్గు వినియోగం తగ్గించడం, తలసరి ఆదాయం పెంచుకోవడం వంటివి సాధించడానికి దశాబ్దాల సమయం పట్టవచ్చు. దేశం పెట్టుకున్న మౌలిక వ్యవస్థల అభివృద్ధి కల్పనలో 50 శాతం కూడా ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం దేశానికి అవసరమవుతున్న ఇంధనంలో 70 శాతం దాకా దేశీయ బొగ్గు గనుల నుంచే వస్తోంది. అంతర్జాతీయ ఇంధన సంస్థ నివేదిక ప్రకారం భారత్‌లో పర్యావరణ హిత ఇంధన ఉత్పత్తిపై పెట్టుబడులు ప్రస్తుతం 30 బిలియన్‌ డాలర్లుగా ఉండగా, 2030 నాటికి ఇవి 150 బిలియన్‌ డాలర్లకు పెరగాలి. దేశంలో ఎలక్ట్రిక్‌ కార్లు, బైక్‌ల అమ్మకాలు వచ్చే ఎనిమిదేళ్ల కాలంలో ఒకటి నుంచి 40 శాతానికి చేరాలి. కాబట్టి 2070 నాటికి కర్బన ఉద్గారాలను పూర్తిగా తగ్గించాలంటే భారీ పెట్టుబడులు అవసరం. దీనివల్ల ఆర్థికవ్యవస్థపై, పారిశ్రామీకరణ, నగరీకరణ కోసం అందుబాటులో ఉండే ఇంధన వనరులపై తీవ్ర ప్రభావం పడుతుందని ఇండియన్‌ ఎనర్జీ పరిశోధకుడు సిద్ధార్థ్‌ సింగ్‌ చెప్పారు.
 
సెంటర్‌ ఫర్‌ పాలసీ రీసెర్చ్‌కి చెందిన నవ్రోజ్‌ దుబాష్‌ కూడా నెట్‌ జీరోపై ప్రధాని ఇచ్చిన హామీ పట్ల అనుమానం వ్యక్తం చేశారు. ఉద్గారాల తగ్గింపునకు భారత్‌ ఈరోజు ఏం చేస్తోందన్నది పట్టించుకోకుండా 50 ఏళ్ల తర్వాత భవిష్యత్తులో నెట్‌ జీరో గురించి ప్రతిజ్ఞ చేయడం వల్ల పెద్దగా మార్పు ఉండదు. 2030 నాటికి ఈ విషయంలో మనం ఏం చేయగలమని లక్ష్యాలు పెట్టుకుని దానికి అనుగుణంగా చర్యలు చేయడం చాలా ముఖ్యం అని దుబాష్‌ చెప్పారు. భారతదేశం ఇప్పటికే ఆర్థికాభివృద్ధి, నగరీకరణ మార్గంలో  కొనసాగుతున్నందున ఈ మార్గం ఉద్గారాల తగ్గింపు విషయంలో పెద్ద అడ్డంకిగా మారనుంది. 

భారత వాతావరణ అజెండాలో పునరుద్ధరణీయ ఇంధనానిది కీలక స్థానం. కాప్‌26లో ప్రధాని మోదీ ఇచ్చిన ఇతర హామీల్లో 2030 నాటికి 500 గిగావాట్స్‌ మేరకు శిలాజేతర ఇంధన సామర్థ్యాన్ని భారత్‌ సాధిస్తుందన్నది ఒకటి. 2030 నాటికి 50 శాతం విద్యుత్‌ను పునరుద్ధరణీయ వనరుల నుంచే సాధిస్తామని ప్రధాని చెప్పారు. అయితే వేగంగా పెరుగుతున్న ఇంధన డిమాండ్‌ని ఈ పునరుద్ధరణీయ వనరులు తీర్చగలవా అనేది పెద్ద ప్రశ్న.

కాప్‌26 సదస్సులో బొగ్గు ఉత్పత్తిని నిలిపివేయడం గురించి కనీసం ప్రస్తావించని ప్రధాని, దశలవారీగా బొగ్గు ద్వారా ఇంధన ఉత్పత్తిని తొలగిస్తామనే తీర్మానంపై సంతకం చేయడానికి నిరాకరించారు. అంటే బొగ్గు దేశానికి అపరిష్కృత సమస్యగా మిగిలి ఉంటుంది. కాప్‌26లో హామీ ఇచ్చినప్పటికీ, అనేక బొగ్గు ఆధారిత ఇంధన ప్లాంట్లను ఇప్పటికీ దేశంలో నిర్మిస్తూనే ఉన్నారు. పైగా కొత్త దేశీయ బొగ్గు గనుల తవ్వకానికి ఆమోదం కూడా తెలిపారు. పైగా శిలాజ ఇంధన ధరల్లో భారీ పెరుగుదల నేపథ్యంలో పునరుద్ధరణీయ ఇంధనాల పట్ల చిత్తశుద్ధిని ప్రకటించకుంటే కేంద్రప్రభుత్వాన్ని అది ఆర్థిక ఆత్మహత్యా స్థితిలోకి నెడుతుంది. బ్యాటరీ ధరలు తగ్గుముఖం పట్టి, విద్యుత్‌ గ్రిడ్లు ఆధునీకరణవైపు మళ్లడం సాధ్యపడనంత కాలం దేశానికి బొగ్గు రూపంలోని ఇంధనం చాలా సంవత్సరాలు అవసరం అవుతుంది. పైగా ఒకవైవు పర్యావరణ చట్టాలను తుంగలో తొక్కుతూ, బడా పరిశ్రమలకు క్రమబద్ధీకరణ తలుపులు తెరుస్తూ, వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలను, తీరప్రాంతాలను కార్పొరేట్ల పరం చేస్తూనే మరోవైపు అంతర్జాతీయ సదస్సుల్లో గంభీర ప్రకటనలు చేయడం డొల్లతనమే అని పలువురు కేంద్రప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు.

2070నాటికి కర్బన ఉద్గారాలను జీరో స్థాయికి తీసుకొస్తామని చెప్పడం ఏ మేరకు ఆచరణ సాధ్యమని పర్యావరణ సంస్థ ఎన్విరానిక్స్‌కి చెందిన శ్రీధర్‌ రామమూర్తి చెప్పారు. ఇటీవలే డజన్లకొద్దీ కొత్త ప్రాంతాలను ప్రైవేట్‌ కంపెనీలకు బొగ్గు గనుల కోసం కేంద్రం అమ్మేసిందని, పేదలకు పెద్దగా ఉపయోగం లేని మౌలిక వసతుల కల్పన దిశగా ఉన్మాదస్థితిలో అడుగులేస్తున్నారని, ఇవన్నీ పర్యావరణానికి తీవ్ర ప్రమాదం కలిగిస్తాయని ఈయన చెబుతున్నారు.
వ్యాసకర్త: హన్నా ఎల్లిస్‌ పీటర్‌సన్‌
జర్నలిస్ట్‌ (ది గార్డియన్‌ సౌజన్యంతో)

 

మరిన్ని వార్తలు