హార్ధిక్‌ పటేల్‌(గుజరాత్‌ కాంగ్రెస్‌) రాయని డైరీ

17 Apr, 2022 01:21 IST|Sakshi

కాంగ్రెస్‌ పార్టీలో వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ని పక్కన పెట్టేసే విధానం ఒక దారుణమైన విలక్షణతను కలిగి ఉంటుంది. హఠాత్తుగా ఒకరోజు ఆ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌కి వర్క్‌ ఇవ్వడం మానేస్తారు! వర్క్‌ల ప్రారంభోత్సవాలు ఏవైనా ఉంటే అక్కడికి పిలవడం మానేస్తారు. వర్క్‌ ఎందుకు ఇవ్వందీ చెప్పరు. వర్క్‌ల ప్రారంభోత్సవాలకు ఎందుకు పిలవందీ చెప్పరు. రాహుల్‌కి చెప్పుకుందామని ఢిల్లీ వెళితే, అప్పటికే అక్కడ వేరే స్టేట్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ ఒకరు తన సమస్యను చెప్పుకోడానికి ప్రయత్నిస్తూ కనిపిస్తారు! ‘‘మా దగ్గరికి వచ్చేయొచ్చు కదా.. కాంగ్రెస్‌లోనే ఉండి నీ టైమ్‌ వేస్ట్‌ చేసుకోవడం ఎందుకు.. డిసెంబర్‌లో ఎన్నికలు పెట్టుకుని..’’ అన్నారు గోపాల్‌ ఇతాలియా. ‘ఆప్‌’కి గుజరాత్‌ స్టేట్‌ చీఫ్‌ అతడు. 

‘‘మీ పేరు గోపాల్‌ ఇతాలియానే అయినా నాకు మిమ్మల్ని నరేశ్‌ పతేలియా అని పిలవాలనిపిస్తోంది..’’ అన్నాను. ‘‘నరేశ్‌ పతేలియానా!! నరేశ్‌ పటేల్‌ కదా ఆయన?!’’ అన్నారు ఇతాలియా. ‘‘అవును నరేశ్‌ పటేలే! అతణ్ణి లోపలికి తీసుకోడానికి నన్ను బయటికి పంపాలనో, నన్ను బయటికి పంపడానికి అతణ్ణి లోపలికి తీసుకోవాలనో ప్లాన్‌ చేస్తున్నారు మా వాళ్లు. నేనిప్పుడు మీతో వచ్చేస్తే.. లోపలికి రావడానికి పటేల్‌కి, లోపలికి తీసుకోడానికి మా పార్టీకి మీరు హెల్ప్‌ చేసినవాళ్లవుతారు. అప్పుడు మీరు నాకెప్పటికీ పతేలియాలా గుర్తుండిపోతారు తప్ప ఇతాలియాలా కాదు..’’ అన్నాను. 

‘‘మీ పార్టీకో, నరేశ్‌ పటేల్‌కో దారి క్లియర్‌ చేయడానికి నేనెందుకు నిన్ను రమ్మని అడుగుతాను హార్దిక్‌? కేజ్రీవాల్‌ నిన్ను అడుగుతున్నారు. ‘ఆప్‌’లోకి వచ్చేయ్‌. ఫీల్‌ ద లీడర్‌షిప్‌..’’ అన్నారు ఇతాలియా.  ‘‘నేను రాలేను. మా నాన్నగారి పేరు భరత్‌. నా చిన్నప్పట్నుంచే ఆయన కాంగ్రెస్‌ కార్యకర్త’’ అన్నాను. ‘‘లైఫ్‌లో ఇలాంటివి ఉంటూనే ఉంటాయి హార్దిక్‌. మనకూ ఒక లైఫ్‌ ఉంటుంది కదా. రేపు నువ్వూ.. నీ కొడుకునో, కూతుర్నో ‘మా తాతగారు భరత్‌. మా నాన్నగారి చిన్నప్పట్నుంచే మా తాతగారు కాంగ్రెస్‌ కార్యకర్త’ అనే చెప్పుకోనిస్తావా? మన గురించి చెప్పుకోడానికి ఏమీ లేనప్పుడే మన పిల్లలు వాళ్ల తాతగారి గురించి, ముత్తాతగారి గురించి చెప్పుకుంటారు. ఇంకేం ఆలోచించకు వచ్చేయ్‌..’’ అన్నారు ఇతాలియా. ఇతాలియా వెళ్లాక చూసుకుంటే ఫోన్‌లో మెసేజ్‌! ‘ఒకసారి పార్టీ ఆఫీస్‌కి వచ్చి వెళ్లడం కుదురుతుందా హార్దిక్‌..’ అని జగదీశ్‌ థాకర్‌. గుజరాత్‌కి నేను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ అయితే జగదీశ్‌ థాకర్‌ ప్రెసిడెంట్‌.   

‘‘పార్టీ గురించి బయట నువ్వేదో బ్యాడ్‌గా మాట్లాడుతున్నావట?!’’ అన్నారు థాకర్‌.. పార్టీ ఆఫీస్‌కి నేను వెళ్లీవెళ్లగానే. ‘‘బ్యాడ్‌గా ఏమీ మాట్లాడలేదు, బ్యాడ్‌గా ఫీల్‌ అవుతూ మాట్లాడి ఉంటాను’’ అన్నాను. థాకర్‌ పక్కనే రఘుశర్మ కూర్చొని ఉన్నారు. రఘుశర్మ పక్కన  మనీష్‌ దోషి ఉన్నారు. శర్మ స్టేట్‌ ఇన్‌చార్జ్‌. మనీష్‌ స్టేట్‌ అధికార ప్రతినిధి. ‘‘హార్దిక్‌.. ఒకమాట. ఇంతప్పుడు నిన్ను పార్టీలోకి తెచ్చి, అంతలోనే కాంగ్రెస్‌ నిన్ను వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ని చేసిందంటే.. అది నీకు ఫీల్‌ గుడ్‌ ఫ్యాక్టర్‌ కాదా? గుడ్‌ని వదిలేసి, బ్యాడ్‌ని పట్టుకుంటావేంటి?’’ అన్నారు శర్మ. ‘‘2017లో నన్ను తెచ్చారు. 2022లో నా మీదకు నరేశ్‌ పటేల్‌ను తెస్తున్నారు. 2027లో నరేశ్‌ పటేల్‌ మీదకు మరొక పటేల్‌ని తెస్తారు. ఇది నాకు గుడ్‌ అనిపించలేదు..’’ అన్నాను. ‘‘సరే, ‘ఆప్‌’లోకి ఎప్పుడు వెళ్తున్నావ్‌?’’ అన్నారు థాకర్‌ సడన్‌గా! ఆయన అలా అంటున్నప్పుడు పార్టీలోని విలక్షణత ఆయన ముఖంలో ప్రతిఫలించింది. ‘‘అవును.. ఎప్పుడు?’’ అన్నారు శర్మ, దోషి వెంటవెంటనే! నన్ను రప్పించుకోడానికి కేజ్రీవాల్‌ పడని తొందర కంటే, నన్ను పంపించడానికి కాంగ్రెస్‌ పడుతున్న తొందరే ఎక్కువగా కనిపిస్తోంది!!  

మరిన్ని వార్తలు