రైతుకు సిరులు... ఒంటికి సత్తువ!

11 Apr, 2022 12:24 IST|Sakshi

ప్రపంచీకరణలో గ్రామీణ ఉపాధులు పోయాయి. ఐతే అతివృష్టి, లేకుంటే అనావృష్టి. వర్షపు నీరు సముద్రం పాలవుతోంది. భూగర్భ జల వనరులు పాతాళానికి దిగాయి. పంటలకు నీరుండదు. ఈ నేపథ్యంలో తక్కువ నీటితో పండే చిరుధాన్యాల పంటలే రైతుకు మేలు. జొన్న, రాగి, కొర్ర, సజ్జ (సొద్ద), సామ, అరికె, వరిగె, ఊద, ఓట్లు, బార్లీ వంటివి చిరుధాన్యాలుగా వ్యవహరిస్తారు.

1960ల్లో, మన దేశంలో ఒక మనిషి ఏడాదికి సగటున 32.9 కిలోల చిరుధాన్యాలను తినేవాడు. 2010 నాటికి వీటి వాడకం 4.2 కిలోలకు.... అంటే 87%కి పడి పోయింది. ‘పెరిగిన ఆదాయాలు, పట్టణీకరణ వలన గోదుమ ఉపయోగం పెరిగింది. దీన్ని శ్రేష్ఠమైన తిండి అనుకుంటున్నారు. చిరుధాన్యాల వాడకం తగ్గింది. వీటిని నాసిరకం తిండిగా భావిస్తున్నారు’ అని 2014లో ‘అనువర్తిత ఆర్థిక పరిశోధన జాతీయ మండలి’ తెలిపింది. 1960వ దశకం మధ్యలో ఒక పట్టణవాసి సగటున సంవ త్సరానికి 27 కిలోల గోదుమలు తినేవాడు. ఇది 2010లో రెట్టింపయింది. కొన్ని దశాబ్దాల నుండి ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా గోదుమ, బియ్యానికి రాయితీ లిస్తున్నది. అందువలన ప్రజల్లో ప్రత్యేకించి పట్టణ జనాభాలో వీటి ఉపయోగం పెరిగింది. చిరుధాన్యాల వాడకం తగ్గింది. ‘2013–ఆహార భద్రతా చట్టం’ చేయక ముందు గోదుమలు, బియ్యాన్ని మాత్రమే ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థలో చేర్చింది. ఫలితంగా ముతక ధాన్యాల వినియోగం పడిపోయిందని  ప్రభుత్వేతర సంస్థ ‘ధన్‌’ నాయకుడు మునియప్పన్‌ కార్తికేయన్‌ అన్నారు. 1956 నుండి చిరుధాన్యాల పంట విస్తీర్ణం తగ్గింది. సజ్జ 23%, రాగి 49%, జొన్న 64%, ఇతర ధాన్యాల సాగునేల 85% తగ్గింది. ఈ విస్తీర్ణం ఇంకా తగ్గితే దేశం చిరుధాన్య పంటలను కోల్పోతుంది.  

చిరుధాన్యాలు తక్కువ నీటితో అధిక ఉష్ణోగ్రతలు గల గరుగు, పొడి నేలల్లో, కరువు ప్రదేశాల్లో పండుతాయి. వీటి ఉత్పత్తి ఖర్చు తక్కువ. దిగుబడి ఎక్కువ. విత్తనాల పేటెంటు, బహుళ జాతి సంస్థల గొడవలు లేవు. ముందు ఏడాది గింజలను మరుసటి సంవత్సరం విత్తనాలుగా వాడవచ్చు. మెరుగుపర్చబడిన చిరుధాన్యాల విత్తనాలు రోగనిరోధక శక్తిని పెంచుకొని ఉత్పత్తిని బాగా పెంచాయి. 2013లో ప్రపంచంలో చిరుధాన్యాల ఉత్పత్తిలో 1,09,10,000 టన్నులతో భారత్‌ మొదటి స్థానంలో ఉంది. వరికి కావలసిన నీటిలో 28% నీరే వీటికి సరిపోతుంది. ప్రస్తుత కరువుకే కాక పెరగబోయే భవిష్యత్తు కరువులకు కూడా ఇవి పరిష్కారమవుతాయి. ఈ పంటలతో మనకు తిండి గింజలు, పశువులకు మేత లభిస్తాయి. వీటిలో ఆమ్ల శాతం తక్కువ. పీచు శాతం, పోషక విలువలు ఎక్కువ. 

ఊదల్లో గోదుమల కంటే 531%, బియ్యం కంటే 1,033% ఇనుము ఎక్కువ. సజ్జల్లో గోదుమల కంటే 314%, బియ్యం కంటే 611% ఇనుము ఎక్కువ. సామలలో గోదుమల కంటే 265%, బియ్యం కంటే 516% ఇనుము ఎక్కువ. సామలలో గోదుమల కంటే  839%, బియ్యం కంటే 3,440% సున్నం ఎక్కువ. బియ్యంలో కంటే సజ్జలు, గోదుమల్లో 4 రెట్ల సున్నం ఎక్కువ. ఊదల్లో గోదుమల కంటే 313%, బియ్యం కంటే 783% ఖనిజ లవణాలు ఎక్కువ. కొర్రల్లో గోదుమల కంటే 220%, బియ్యం కంటే 550% ఖనిజ లవణాలు ఎక్కువ. గోదుమలు, బియ్యం కంటే చిరుధాన్యాలలో పోషక పదార్థాలు, నత్రజని అధికం. కేవలం బియ్యం తిన్న ఆడపిల్లల కంటే 60% జొన్నలు, 40% బియ్యం తిన్న ఆడపిల్లల ఎదుగుదల రేటు ఎక్కువని హైదరాబాదు ‘భారతీయ చిరుధాన్యాల పరిశోధక సంస్థ’, ‘జాతీయ పోషకాహార సంస్థ’ 2015 ఏడాది అధ్యయనాల్లో తెలిపాయి. (చదవండి: ఒప్పుకొందామా? తప్పందామా?)

ఇతర పంటలతో పోల్చితే చిరుధాన్యాల పంటలు పర్యావరణానికి తక్కువ హానికరం. ఈ పరిస్థితుల్లో ఈ పంటలు ఉపయోగకరం. చిరుధాన్యాల పునరుద్ధరణ పోషకాహార లోపాన్ని పరిష్కరిస్తుంది. రైతుల ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. అందుకే పలు ప్రయోజనాల చిరు ధాన్యాలను పండిద్దాం. వ్యవసాయాన్ని గిట్టుబాటు చేసుకుందాం.  (చదవండి: పడిలేచిన కెరటం... ‘పోలవరం’)

- సంగిరెడ్డి హనుమంత రెడ్డి 
ఆల్‌ ఇండియా ప్రోగ్రెసివ్‌ ఫోరం జాతీయ కార్యదర్శి

మరిన్ని వార్తలు