Karnataka Hijab Controversy: ఆ నిషేధం చదువును దూరం చేస్తుంది!

9 Feb, 2022 12:18 IST|Sakshi

సందర్భం

కర్ణాటకలో ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించి విద్యాలయాలకు రావడంపై అభ్యంతరం వ్యక్తం చేయడం దేశంలో పెద్ద చర్చను లేవనెత్తింది. మంగళవారం ఈ వివాదంపై కర్ణాటక హైకోర్టులో ఒక పక్క విచారణ జరుగుతుండగానే... స్టూడెంట్స్‌ రెండు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకునే పరిస్థితులూ తలెత్తాయి. దీంతో ప్రభుత్వం పోలీసులను అప్రమత్తం చేసి రాష్ట్రవ్యాప్తంగా అన్ని విద్యాలయాలకూ 3 రోజులు సెలవులు ప్రకటించింది. కోర్టు విచారణ బుధవారం కూడా కొనసాగనున్న నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు వర్గాలుగా ఏర్పడి వీధుల్లోకి వచ్చి దాడులు చేసుకోవడం పట్ల హైకోర్టు తన బాధ, అసహనాలను వ్యక్తం చేసింది.

ఇటీవల కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపుర పట్టణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు హిజాబ్‌ ధరించి వచ్చిన విద్యార్థినులను లోనికి అనుమతించకుండా ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. దీంతో విద్యార్థినులకు, ప్రిన్సిపల్, ఇతర అధ్యాపకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు హిజాబ్‌ ధరించి కళాశాలకు వస్తే అనుమతించే ప్రసక్తే లేదని ప్రిన్సిపల్‌ స్పష్టం చేశారు. ప్రవేశాల సమయంలో ఈ విషయాన్ని స్పష్టం చేయకుండా ఇప్పుడు చెబితే ఎలా? అని విద్యార్థినులు ప్రశ్నించారు. వార్షిక పరీక్షలు మరో రెండు నెలల్లో ఉండగా, ఇప్పుడిలా ఆంక్షలు పెడితే ఎలాగని విమర్శించారు. విద్యార్థినులు కళాశాల మైదానం వెలుపలే కొద్దిసేపు గడిపి వెనుదిరిగారు. ఇది ఒక కళాశాలకో లేక ఒక రాష్ట్రానికో పరిమితమై ఉండొచ్చు... రేపు దేశమంతటికీ పాకితే ముస్లిం అమ్మాయిల చదువుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.

ప్రభుత్వ నిబంధనలను అందరూ తప్పని సరిగా పాటించాల్సిందే అని జిల్లా మంత్రి అంగార చెబుతున్నారు. మత సంప్రదాయాలు పాటించేందుకు విద్యాసంస్థలు వేదిక కాదని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర అన్నారు. మంత్రులే ఇలా బాహాటంగా స్కూల్‌ యాజమాన్యం చర్యను సమర్థించడంతో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. (చదవండి: ప్రత్యామ్నాయ వ్యూహం ఫలించేనా?)

విద్యార్థినులను కళాశాలలోకి అనుమతించక పోవడాన్ని జమ్మూ – కశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఖండించారు. బాలికలకు విద్య అందించాలంటూ ఇస్తున్న నినాదం వట్టిదేనని అర్థమవుతోందని ముఫ్తీ అన్నారు. హిజాబ్‌ ధరించినందుకు ముస్లిం బాలికలకు కాలేజీల్లో ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని కర్ణాటకలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అన్నారు. ఇది రాజకీయ ప్రేరేపితమైనదిగా అభివర్ణించారు.

హిజాబ్‌ను వివాదాస్పదం చేయడం ద్వారా  అధికార పార్టీవారు రెండు లక్ష్యాలు సాధించాలని అనుకుంటున్నట్టు స్పష్టమవుతోంది. మరో ఏడాదిలో కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి. అభివృద్ధిపై చెప్పుకోవడానికి ఏమీలేదు కాబట్టి మళ్లీ ఏదో ఒక కారణంతో ప్రజల మధ్య వివాదాలు సృష్టించి... మెజారిటీ వర్గాన్ని ఏకం చేయాలనే ఆలోచన కనిపిస్తోంది. అంతేకాకుండా ముస్లిం అమ్మాయిలను చదువుకు దూరం చేసే కుట్ర సైతం కనిపిస్తోంది. ఈ కుట్రను లౌకికవాదులు, ప్రజలు ఏకమై భగ్నం చేయవలసిన సమయం ఇది. (చదవండి: రాజకీయాలు మారేదెన్నడు?)

- ఫిరోజ్‌ ఖాన్‌ 
సీనియర్‌ జర్నలిస్ట్‌

మరిన్ని వార్తలు