సవాళ్లెన్ని ఎదురైనా..

23 Sep, 2023 15:26 IST|Sakshi

సవాళ్లెన్ని ఎదురైనా..
మహిళా సాధికారతకు గొప్ప ప్రోత్సాహమిస్తూ  కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లు పార్లమెంట్‌ ఉభయ సభల్లోనూ ఆమోదం పొందడంతో భారత ప్రజాస్వామిక చరిత్రలో నూతన శకానికి నాంది పలికినట్లు అయ్యింది. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభల్లోని సీట్లలో మహిళలకు 33 శాతం కోటాను ఈ బిల్లు కేటాయించింది. ఇది అమల్లోకి రాగానే లోక్‌సభలో మహిళా ఎంపీల సంఖ్య 82 నుంచి 181కి పెరుగుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌ రామ్‌ మేఘావల్‌ చెప్పారు. చట్ట సభల్లో మహిళా రిజర్వేషన్‌ బిల్లు అనేక సంవత్సరాలుగా దేశంలో రాజకీయ చర్చకు కేంద్రంగా ఉంది.

ఈ బిల్లును 1996లో ప్రవేశపెట్టినప్పటికీ, పలు రాజకీయ అవరోధాల కారణంగా ఇది ఆమోదం పొందలేదు. ఇప్పుడు పార్లమెంటులో మహిళలకు 15 శాతం లోపే ప్రాతినిధ్యం ఉంది. దేశ జనాభాలో దాదాపు సగంమంది మహిళలు ఉన్నప్పటికీ, వారి రాజకీయ భాగస్వామ్యం తగినంతగా లేదు. మహిళల గణనీయమైన భాగస్వామ్యంతో కూడిన పార్లమెంట్‌... భారత ప్రజల విభిన్న అవసరాలను, ఆందోళనలను మరింత మెరుగ్గా పరిష్కరించగలదు. పైగా, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడానికి మహిళల రాజకీయ సాధికారత మరింతగా అవసరం అవుతోంది.

ఈ రిజర్వేషన్‌ నిజానికి మహిళలకు సాధికారత కల్పించకపోవచ్చని వ్యతిరేకులు వాదిస్తున్నారు. పురుష రాజకీయ నాయకులు తమ మహిళా బంధువులను తమ తరఫున ఉపయోగించుకుంటారనేది ఒక వాదన. ప్రత్యేక నేపథ్యం ఉన్న మహిళలకు మాత్రమే ఇది ప్రయోజనం చేకూరుస్తూ సామాజిక అసమానతలను పెంచుతుందని విమర్శకులు వాదిస్తుంటారు. ఈ బిల్లుకు వ్యతిరేకంగా మరొక వాదన ఏమిటంటే, కోటాను అమలు చేయాలంటే చాలామంది పురుషులు తమ సీట్లను వదులుకోవలసి ఉంటుందనేది!

ఇలాంటి సవాళ్లు ఉన్నప్పటికీ, పార్లమెంటులో మహిళా రిజర్వేషన్‌ ప్రయోజనాలు గణనీయంగా ఉన్నాయి. రాజకీయాల్లో ఉన్న మహిళలు విద్య, ఆరోగ్యం, సామాజిక న్యాయం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తారని ప్రపంచవ్యాప్తంగా పలు పరి శోధనలు చెబుతున్నాయి. పార్లమెంటులో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచడం వల్ల ఈ సంక్లిష్టమైన రంగా లకు మరిన్ని వనరులను కేటాయించవచ్చు. పైగా, మహిళా రిజర్వేషన్‌ ఇతర రంగాలలో లింగ సమా నత్వానికి శక్తిమంతమైన ఉదాహరణగా నిలుస్తుంది. ఇది సాంప్రదాయికమైన జెండర్‌ నిబంధనలను, మూస పద్ధతులను  సవాలు చేయగలదు.

పార్లమెంట్‌లో పెరిగే మహిళా ప్రాతినిధ్యం మరింత సమగ్రమైన, సమానమైన భారతదేశాన్ని వాగ్దానం చేస్తుంది. స్వాతంత్య్రం వచ్చి 76 ఏళ్లు గడిచిన తర్వాత కూడా, రాజకీయాల్లో సమాన లింగ ప్రాతినిధ్యాన్ని భారతదేశం సాధించలేకపోయింది. పార్లమెంట్‌లో అత్యధిక మహిళా ప్రాతినిధ్యం ఉన్న టాప్‌ 20 దేశాల్లో చాలా వరకు మహిళలకు 30 శాతం రిజర్వేషన్లు ఉన్న విషయం ఈ సందర్భంగా గమనార్హం.

పార్లమెంటులో మహిళలకు ప్రాతినిధ్యం లేకుండా సమానత్వంతో, న్యాయంతో సామాజిక అభివృద్ధిని సాధించలేము; అందుకే మహిళా రిజర్వేషన్‌ బిల్లు ఈనాటి అవసరం. రాజకీయ, ప్రజా జీవితంలో వివక్షను, ప్రత్యేకించి మహిళల పట్ల వివక్షను తొలగించడానికి తగిన చర్యలు తీసుకోవాలని రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 7 ప్రభుత్వాలను నిర్దేశిస్తున్నది. మహిళలపై అన్ని రకాల వివక్షా నిర్మూలనకు సంబంధించిన కన్వెన్షన్‌పై భారతదేశం సంతకం చేసింది.

ప్రభుత్వ విధానానికి, దాని అమలుకు సహకరించడంలో మహిళలకు ‘పాల్గొనే హక్కు’ ఉన్నందున, అన్ని ప్రభుత్వ సంస్థలకు ఎన్నికల్లో పోటీ చేయడానికి పురుషుల వలెనే వారు అర్హులు. ఈ నిబద్ధతను గౌరవించాల్సిన సమయం ఇది. పార్లమెంటులో ఏ సమస్యలను లేవనెత్తుతారు, విధానాలను ఎలా రూపొందిస్తారు అనే అంశంపై పార్లమెంట్‌లో మహిళల విస్తృత ప్రాతినిధ్యం అపారమైన ప్రభావాన్ని చూపుతుంది. పైగా ఇది మహిళలపై వివక్షాపూరిత చట్టాలను సంస్కరించడానికీ, సవరించడానికీ, ప్రభుత్వ జవాబుదారీతనాన్ని నిర్ధారించడానికీ తగిన స్పేస్‌ని సృష్టిస్తుంది. ఈ అన్ని ప్రయోజనాల దృష్ట్యా పార్లమెంట్‌ మహిళా రిజర్వేషన్‌ బిల్లును ఆమోదించడం హర్షణీయం.


ప్రేమ్‌ చౌధరీ
వ్యాసకర్త రచయిత్రి, ఢిల్లీ యూనివర్సిటీ మాజీ విద్యావేత్త

మరిన్ని వార్తలు