రామప్ప పరిరక్షణలో తొలి అడుగు

8 Aug, 2021 00:29 IST|Sakshi

చరిత్ర ఒక జాతి గుండెకాయ. సాంస్కృతిక, కళారంగాల గత వైభవపు ఆనవాళ్ళు దేశ చరిత్రకు మదింపు రాళ్ళు. వాటిని పరి రక్షించుకోని నాడు, కాలానుగుణంగా కాంతులీనిన మానవ మేధో జనిత çసృజన కాలగర్భంలో కలిసిపోతుంది. కాకతీయుల కాలంలో రేచర్ల రుద్రుడు నాలుగు దశాబ్దాలు శ్రమించి నిర్మాణం చేయించిన అద్భుత శిల్పకళాఖండం రామప్ప దేవాలయం. క్రీ.శ. 1213లో పూర్తయిన ఈ ఆలయంలో కొలువు న్నది రామలింగేశ్వరుడైనా ప్రధాన శిల్పి రామప్ప పేరుతో ప్రసిద్ధి కెక్కడం విశేషం. శాండ్‌బాక్స్‌ టెక్నాలజీతో, ఇసుక పునాదులపై ఓ భారీ ఆలయాన్ని నిర్మించడం, అది తీవ్రమైన భూకంపాలను సైతం తట్టుకొని నిలబడగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండడం దేశంలో మరెక్కడా చూడలేని నిర్మాణ కౌశలం.

శిల్పసౌందర్యానికి వేదికైన ఈ కట్టడం దశాబ్దాల పాటు నిరాదరణకు గురికావడం క్షంతవ్యం కాని విషయం. 1310లో మాలిక్‌ కాఫర్‌ దండయాత్రలో చాలా భాగం దెబ్బతినడం చారిత్రక గాయమైతే, గుప్తనిధుల కోసం జరిపిన తవ్వకాలు దీని శైథిల్యానికి మరో కారణం. ఆలయం కొలువున్న పాలం పేట ప్రజలతో పాటు, చరిత్రకారులు, సాహితీవేత్తలు, పర్యావరణ వేత్తలు ఆందోళనతో ప్రభుత్వాలకు మొరపెట్టుకున్నా ఎలాంటి చలనం లేని నిర్లక్ష్య ధోరణి. ఒకవైపు పునాదుల్లో నింపిన ఇసుకను తోడుతున్న చీమలు, మరోవైపు దేవాదుల సొరంగాల తవ్వకాల కోసం జరిపే భారీ పేలుళ్ళు ఈ ఆలయ ఉనికిపై తీవ్ర ప్రభావాన్ని చూపసాగాయి.

ఆ తరుణంలో తెలంగాణ రచయితల వేదిక కార్యక్షేత్రంలోకి దిగింది. ఔత్సాహికులను సమీకరించి, రామప్ప ఆలయ పరిరక్షణ కమిటీని ఏర్పాటుచేసింది. వివిధ కార్యక్రమాల రూపకల్పనతో  మేధావులను భాగస్వామ్యం చేసి, ప్రజలకు ఆలయ పరిరక్షణ కోసం పోరాడాలని పిలుపునిచ్చింది. ‘విధ్వంసం కోరల్లో రామప్ప’ అన్న పుస్తకాన్ని వెలువరించింది. తెరవే నిర్వహించిన ఆ కార్య క్రమాల వివరాలు పత్రికల్లో చూసి హైకోర్టు వాటిని సుమోటోగా స్వీకరించి, ప్రభుత్వానికి, పర్యాటకశాఖకు, పురావస్తు శాఖకు నోటీ సులు జారీ చేసి చర్యలు చేపట్టవలసిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఆఖరి దశలో అనివార్యంగానైనా స్పందించిన కేంద్ర, రాష్ట్ర ప్రభు త్వాల కృషి కూడా తోడై ఒక సుదీర్ఘ కల నెరవేరింది. 

గతంలో బొమ్మలమ్మగుట్టను కూడా గ్రానైట్‌ క్వారీకి అనుమ తించడం వల్ల తవ్వకాలకు సిద్ధపడ్డప్పుడు గ్రామస్తులను సమీ కరించి తెరవే అడ్డుకున్నది. ఏ బొమ్మలమ్మగుట్టనైతే పగలజీరి గ్రానైట్‌ మాఫియా నోట్ల కట్టలుగా మార్చుకోవాలనుకున్నదో, ఆ బొమ్మలమ్మగుట్టే తెలుగుకు ప్రాచీన హోదా దక్కడానికి ప్రధానంగా నిలిచింది. జినవల్లభుడు చెక్కిన తొలి కందపద్యం  కాలం ఆధారంగా తెలుగుకు ప్రాచీన హోదా దక్కింది. నందగిరి కోట్ల నర్సిం హులపల్లిలో కూడా క్రీ.పూ. 320 సంవత్స రానికి సంబంధించిన నందుల కాలంగా చెప్పుకుంటున్న నర్సింహస్వామి ఆలయం ఉన్న గుట్టను కూడా గ్రానైట్‌కు అనుమతిస్తే తెరవే అక్కడి ప్రజలను సమీకరించి, దాని పరిరక్షణ కోసం ఉద్యమించిన ఫలితంగానే తవ్వకాలు ఆగిపోయాయి.

మన ప్రాంతంలో వెల్లివిరిసిన ప్రాచీన జైన, బౌద్ధం ఆన వాళ్ళు, ఈ ప్రాంతాన్నేలిన శాతవాహన, కాకతీయ అంతకు పూర్వపు రాజుల చారిత్రక అవశేషాలకు ఆధార భూతంగా నిలిచే ప్రాచీన వాఙ్మయం, ప్రాచీన కట్టడాలు, ఇతరత్రా లభించే చారిత్రక ఆధారాలన్నిటినీ వెలికితీసి తెలంగాణ ఘనమైన వారసత్వ సంప దను ముందుతరాలకు అందించే పనిని ప్రభుత్వాలు చేయాలి.

గాజోజు నాగభూషణం 
మొబైల్‌ : 98854 62052 

మరిన్ని వార్తలు