ఆ మార్పులతోనే ఆర్థికాభివృద్ధి

16 Aug, 2022 11:59 IST|Sakshi

గత 75 ఏళ్ళలో ప్రపంచ ఆర్థిక దిగ్గజాల సరసన భారత్‌ చోటు నిలుపుకొంది. సంపద పంపిణీకి సంబంధించినంత వరకు మాత్రం అలా ఉండకపోవచ్చు. సాధారణ జీడీపీ పరంగా చూస్తే ప్రపంచంలోనే ఆరవ అత్యంత పెద్ద ఆర్థిక వ్యవస్థ భారత్‌. దశాబ్దాలుగా విధానాల్లో, స్తంభించిన వృద్ధిరేట్లలో మార్పు చేసుకుంటూ వచ్చిన ఫలితంగానే దేశం ఈ స్థాయికి చేరు కుంది. ఇదో సుదీర్ఘ ప్రయాణం. 1700లో ప్రపంచ ఆదా యంలో 22.6 శాతంగా ఉన్న భారత్‌ వాటా 1947 నాటికి 3 శాతానికి పడిపోయింది. 1947 నాటికి జాతీయ దిగుబడిలో పారిశ్రామిక రంగ వాటా 7.5 శాతం ఉండేది. కానీ 35 కోట్లమంది శ్రామికుల్లో 25 లక్షల మందికే పారిశ్రామిక రంగం ఉపాధి కల్పించింది. అప్పట్లో దేశ జీడీపీలో సగభాగం వ్యవసాయం నుంచే వచ్చేది. రూ. 249 తలసరి ఆదాయంతో అతి పేద దేశాల్లో ఒకటిగా భారత్‌ మిగిలింది.

ఈ నేపథ్యంలోనే నూతనంగా ఎంపికైన ప్రభుత్వాధినేత ప్రథమ భారత ప్రధాని నెహ్రూ దేశాన్ని దారిద్య్రం నుంచి బయటకు లాగే లక్ష్యంతో విధానాల రూపకల్పన ప్రారంభిం చారు. నెహ్రూ విశ్వసించే సామ్యవాద ఆదర్శాలు ఆర్థిక ప్రణాళికకు పునాదిరాయిగా నిలిచాయి. దీంతోనే భారీ స్థాయి ప్రభుత్వ యాజమాన్య సంస్థల ఏర్పాటు వేగం పుంజుకుంది. ‘ఇండస్ట్రియల్‌ పాలసీ రిజల్యూషన్‌–1948’ ఒక మిశ్రమ ఆర్థిక వ్యవస్థను ప్రతిపాదించింది కానీ ఆ వ్యవస్థ పగ్గాలు మాత్రం పబ్లిక్‌ సెక్టార్‌కే ఉద్దేశించబడ్డాయి.

‘రెండో ఇండస్ట్రియల్‌ పాలసీ రిజల్యూషన్‌ –1956’ ప్రభుత్వ రంగ సంస్థలు ఏ రంగాలను నియంత్రించవచ్చు, వేటిని ప్రైవేట్‌ రంగానికి వదిలిపెట్టవచ్చు అనే విషయంలో ముఖ్యమైన విభజనరేఖ గీసింది. భారీయెత్తున మూలధనం అవసరమైన పరిశ్రమలను చాలావరకు పబ్లిక్‌ సెక్టార్‌కి పరిమితం చేయగా, వినియోగ సరకుల తయారీని ప్రైవేట్‌ పరిశ్రమలకు ఉద్దేశించారు. నాటి ప్రధాన ఆర్థికవేత్త, గణాంక శాస్త్రవేత్త పీసీ మెహలనోబిస్‌ మార్గదర్శకత్వంలో ఈ విధాన ప్రకటనను రూపొందించారు. తర్వాత అనేక సంవత్సరాలు ఇదే ఆర్థిక విధానాల మార్గదర్శక సూత్రంగా మారింది.

భారీ పరిశ్రమలపై ప్రధానంగా దృష్టిపెట్టడం వల్ల వ్యవ సాయ రంగం నిర్లక్ష్యానికి గురైంది. దీంతో 1950ల చివరి నాటికి దేశంలో ఆహార కొరత ఏర్పడింది. ‘పబ్లిక్‌ లా 480’ కింద అమెరికా నుంచి దిగుమతులపై భారత్‌ ఆధారపడాల్సి వచ్చింది. ఈ ‘పబ్లిక్‌ లా 480’ మిగులు ఆహార ధాన్యాలను ఉచితంగా అందించేది. అయితే అధిక దిగుబడి వంగడాలను ప్రవేశపెట్టినందున హరిత విప్లవం దేశంలో మరో మలుపు నకు దారి తీసింది. విస్తృతంగా పంటల ఉత్పత్తి సాధ్యమై, సమృద్ధిగా ఆహారధాన్యాలు అందుబాటు లోకి వచ్చాయి.

ఇందిరాగాంధీ పాలనాకాలంలో లైసెన్స్‌రాజ్‌ వ్యవస్థ బలపడింది. అవినీతి స్థాయి పెరిగిపోయింది. ప్రైవేట్‌ పరిశ్రమల రంగం ఉక్కిరిబిక్కిరైంది. ఉపాధి నష్టాలను నిరోధించడానికి బ్యాంకింగ్‌ పరిశ్రమ, విదేశీ చమురు కంపెనీలు, పలు రోగగ్రస్థ కంపెనీల జాతీయీకరణ పథకాలను వరుసగా చేపడుతూ పోయారు. దేశంలో అనేక ప్రైవేట్‌ బ్యాంకులు కుప్పకూలిపోయి, సామాన్యులు భారీ నష్టాలకు గురైన నేపథ్యంలోనే బ్యాంకుల జాతీయీకరణ చేయాల్సి వచ్చిందని తప్పక గుర్తుంచుకోవాలి. జాతీయీ కరణ వల్ల పేద వ్యక్తి కూడా ఇప్పుడు అతి కొద్ది నగదుతోనే బ్యాంక్‌ ఖాతాను తెరవగలడు. ఇది ఆర్థిక వ్యవస్థలో సామాన్యుల చేరికకు వీలు కల్పించిన తొలి అడుగు. చమురు కంపెనీల జాతీయీకరణ అనేది హైడ్రో కార్బన్లకు సంబంధించినంతవరకు దేశ వ్యూహాత్మక భద్రతకు హామీ కల్పించింది. అయితే రోగగ్రస్థ ప్రైవేట్‌ కంపెనీలను స్వాధీన పర్చుకోవడం ఘోర తప్పిదమైంది. దీంతో అనేక దశాబ్దాల పాటు దేశం భారీ ఆర్థిక చెల్లింపుల్లో ఇరుక్కుపోయింది. ఖాయిలా పడిన ఈ సంస్థలను సాధారణ మూసివేతకు అనుమతించి, వాటి స్థానంలో కొత్త వెంచర్లను ప్రారంభిం చాలని నిర్దేశించి ఉంటే బాగుండేది.

1980ల వరకు ఈ సోషలిస్టు పాలసీలు భారత వృద్ధి రేటును 3 నుంచి 4 శాతానికే పరిమితం చేస్తూ వచ్చాయి. దీన్ని ‘హిందూ వృద్ధి రేటు’ అని వ్యంగ్యంగా పేర్కొంటూ వచ్చారు. 1991లో నాటి ప్రధాని పీవీ నరసింహారావు, ఆయన ఆర్థిక మంత్రి మన్మోహన్‌ సింగ్‌ ఆర్థిక సంస్కరణలు, సరళీకరణ క్రమాన్ని ప్రారంభించవలసి వచ్చింది. ఈ నూతన విధానాలు లైసెన్స్‌రాజ్‌ వ్యవస్థ ఆంక్షల నుంచి పరిశ్రమను విముక్తి చేసి, సులభతరమైన దిగుమతులు, విదేశీ పోటీకి అనువుగా ఆర్థిక వ్యవస్థను బార్లా తెరిచాయి. ఫలితంగా 1990ల మధ్య నుంచి వృద్ధి రేటు 7 –8 శాతానికి ఉన్నట్లుండి పెరిగింది. సంస్కరణలను తీవ్రతరం చేయడమే కాక అనేక ప్రభుత్వ రంగ కంపెనీలను సాహసోపేతంగా ప్రైవేటీకరించిన వాజ్‌పేయి వరకు ఈ వృద్ధి కొనసాగింది. 

కేంద్రంలో మోదీ ప్రభుత్వం 2014లో బాధ్యతలు స్వీకరించిన తర్వాత మన అభివృద్ధి మందగించినట్లు కనిపించింది. పెద్ద నోట్ల రద్దు విధానం, జీఎస్టీ ప్రారంభం, కోవిడ్‌ మహమ్మారి, చమురు ధరలు, సరఫరాపై ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావం వంటివి అందుకు కారణాల్లో కొన్ని. అయితే, దిశా నిర్దేశం చేసిన 1991 నాటి సంస్కరణల కాలంతో పోలిస్తే నేడు దేశం ఎదుర్కొంటున్న సమస్యలు భిన్నమైనవి. దేశ ఆర్థిక వ్యవస్థ ముందంజ వేసినప్పటికీ, నలిపివేస్తున్న దారిద్య్రం ఇప్పటికీ కొనసాగుతోంది. అంత ర్జాతీయ రంగంలో ఐటీ పరిశ్రమ బలమైనశక్తిగా మారినం దున దేశం కూడా  గొప్పగా ముందడుగు వేసింది. పైగా బిలియన్‌ డాలర్ల పెట్టుబడులను సాధించిన వెంచర్లుగా పేరుపడిన యూనికార్న్‌లను అత్యధికంగా స్థాపించిన మూడో అతి పెద్ద దేశంగా భారత్‌ చరిత్ర సృష్టించింది. అదే సమయంలో, ప్రత్యేకించి కరోనా తర్వాత నిరుద్యోగం పెరిగిన గ్రామీణ ప్రాంతాల్లో దారిద్య్రం కొనసాగుతోంది. (క్లిక్: పండించినవారికే తిండికి కొరతా!?)

గ్రామీణ, కుటీర పరిశ్రమల వృద్ధిని ప్రోత్సహించడం ద్వారా క్షేత్రస్థాయిలో మరిన్ని ఉద్యోగాలను ప్రభుత్వం సృష్టించాల్సిన అవసరం ఉంది. గాంధీ దీన్నే ప్రబోధిస్తూ వచ్చారు. జీడీపీలో వాటా తగ్గినా, వ్యవసాయరంగం నేటికీ 50 శాతం ఉద్యోగితను కల్పిస్తున్నందున రైతుల ప్రయోజనాలకు మరింత ప్రాధాన్యం ఇవ్వాలి. రానున్న సంవత్సరాల్లో విస్తృతంగా వేరవుతున్న రెండు ఇండియాల మధ్య డిజిటల్‌ అంతరాన్ని పూరించాలి. ప్రపంచ స్థాయి ఐటీ పరిశ్రమ ఉన్నప్పటికీ మహమ్మారి కాలంలో మొబైల్‌ ఫోన్లు లేక విద్యకు ఎంతోమంది పిల్లలు దూరమయ్యారు. 2022–23లో భారత్‌ ప్రపంచంలోనే వేగంగా వృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అవుతుందని అంచనా. ఆ మాటెలా ఉన్నా, నిరుపేదల స్థితిగతుల్ని మెరుగుపర్చాల్సిన అవసరం ఉంది. (క్లిక్:  మా వాటా మాకిచ్చారా?)


- సుష్మా రామచంద్రన్‌ 
సీనియర్‌ ఫైనాన్షియల్‌ జర్నలిస్ట్‌
(‘ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో...)

మరిన్ని వార్తలు