ధరల పెరుగుదలపై ఇంత నిరాసక్తతా?

24 Feb, 2021 00:39 IST|Sakshi

సందర్భం

గత నలభై ఏళ్లుగా రాజకీయాలను, ప్రభుత్వ విధానాలను గమనిస్తున్నవారందరికీ గుర్తుండిపోయే విషయాలు కొన్ని ఉన్నాయి. ఎప్పుడైనా ఇంధన ధరలు ఒక పావలా పెరిగినప్పుడు, బస్సు చార్జీలు కిలోమీటరుకు రెండు నయాపైసలు పెంచినపుడు, రైలు చార్జీలు ఐదుశాతం పెరిగినపుడు, నూనెల ధరలు అయిదు రూపాయలు పెరిగినపుడు దేశం మొత్తం గగ్గోలెత్తిపోయేది.  విపక్షాలన్నీ కలసికట్టుగా దేశవ్యాప్త ఉద్యమాలు, ఆందోళనలు, ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహించేవి.

ఈ ధర్నాలు నిర్వహించడానికి కమ్యూనిస్టు పార్టీలు ముందంజలో నిలిచేవి. పెట్రోల్‌ ధరలు పెరగగానే రాష్ట్రాల ముఖ్యమంత్రులు కొందరు దూరదర్శన్‌ వారు కెమెరాలతో చిత్రీకరిస్తుండగా కొంచెం దూరం సైకిల్‌ తొక్కుతూ అసెంబ్లీ భవనానికి వెళ్లేవారు. మరికొందరు ఆర్టీసీ బస్సుల్లో వెళ్లేవారు.  మరికొందరైతే తమ ఇళ్లలో లాంతర్లు వెలిగించి నిరసన తెలిపేవారు. గ్యాస్‌ ధర పది రూపాయలు పెరిగితే రోడ్ల మీద కట్టెలతో వంటలు చేస్తూ నిరసనలు తెలిపేవారు. ఈ ఆందోళనల్లో ప్రజలు కూడా స్వచ్ఛందంగా పాల్గొనేవారు. లాఠీ చార్జీలు జరిగినా, బాష్పవాయువు ప్రయోగించినా, బుల్లెట్లు కురిపించినా బెదిరేవారు కారు.

విపక్ష నాయకులు ఆందోళనల్లో ముందుండి ఉద్యమాలను నడిపేవారు. పెంచిన ధరలు తగ్గించాల్సిందే అని ప్రతిపక్షాలు, నయాపైసా కూడా తగ్గించేది లేదని ప్రభుత్వాలు భీష్మించుకునేవి.  ఎప్పుడో ఒకటోఅరో సందర్భాల్లో పెంచిన ధరలను ఒక్క శాతం తగ్గించేవి ప్రభుత్వాలు. అప్పటికే పదిశాతం ధరలు పెరిగాయనే వాస్తవాన్ని విస్మరించి తామేదో ఘనవిజ యాన్ని సాధించినట్లు, ప్రభుత్వం మెడలు వంచినట్లు విపక్షాలు సంబరపడిపోయేవి.  

ఇలాంటి గిమ్మిక్కులనే ఎద్దేవా చేస్తూ దివంగత దర్శకుడు దాసరి నారాయణరావు ‘ఎమ్మెల్యే ఏడుకొండలు’ అనే సినిమాను నిర్మించారు. సినిమాలో ముఖ్యమంత్రి  ఏ వస్తువు మీదైనా ధరలు పెంచాలంటే ముందుగా రూపాయి వస్తువును మూడు రూపాయలకు పెంచడం,  దానిమీద ప్రతిపక్షాలు మండిపడి ఆందోళనలు చేస్తే ఒక రూపాయిని తగ్గించడం, దాంతో విపక్షాలు శాంతించి ఆందోళన విరమించడం జరిగేవి.  రూపాయి వస్తువు రెండు రూపాయలు అయిందనే స్పృహ అటు ప్రజలకూ ఉండేది కాదు, విపక్షాలకూ ఉండేది కాదు. ఎపుడో నలభై ఏళ్ళక్రితం దాసరి నారాయణరావు తీసిన అలాంటి సంఘటనలు ఆ తరువాత నిజజీవితంలో కూడా కొన్ని సార్లు జరిగాయి.

ఇంధనధరలను పెంచితే వెంటనే దేశవ్యాప్తంగా లారీ యజమానులు సమ్మెకు దిగేవారు. ఎక్కడి లారీలు అక్కడే స్తంభించిపోయేవి. రవాణా స్తంభించిపోవడంతో కూరగాయలు, పండ్లు చెడిపోవడం, రైతులకు కోట్లలో నష్టం వాటిల్లడం జరిగేవి. దాంతో నిత్యావసర వస్తువుల ధరలు పెరిగి పోవడం, ఆ తరువాత   లారీ యజమానుల సంఘం వారు ప్రభుత్వంతో చర్చలు జరపడం, అందులో వారికేవో కొన్ని హామీలు లభించడం, ఫలితంగా సమ్మెను విరమించడం షరా మామూలుగా సాగిపోతుండేది. కానీ జరగాల్సిన నష్టం మాత్రం జరిగిపోతుండేది.  ఉల్లిపాయల ధర పెరగడంతో కేంద్ర ప్రభుత్వాలనే దించేసిన ఉదంతాలు ఉన్నాయి మనదేశంలో.   

గత కొద్దికాలంగా  పెట్రోల్, డీజిల్‌ ధరలు దినదినప్రవర్ధమానం అవుతున్నాయి.  ప్రతిరోజూ ధరలు పెంచేస్తున్నారు. మన్మోహన్‌ సింగ్‌ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో ఇంధనం ధరలు, గ్యాస్‌ ధరలు పది రూపాయలు పెంచగానే బీజేపీ పెద్దఎత్తున ఆందోళన చేసేది. బీజేపీ అగ్రనేతలు సిలిండర్లను రోడ్లమీద పెట్టి కట్టెలతో వంటలు చేసేవారు. నూనె ధరలు రెండు రూపాయలు పెరిగితే నీళ్లతో తిరగమోతలు పెడుతూ నిరసన తెలిపేవారు. మన్మోహన్‌ ప్రభుత్వం వంటగ్యాస్‌ ధరను పాతిక రూపాయలు పెంచినపుడు నాటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖరరెడ్డి ఆ పెంచిన భారాన్ని తమ ప్రభుత్వం మోస్తుందని ప్రకటించి ప్రజలను శాంతిం పజేశారు. మిగిలిన అన్ని రాష్ట్రాల్లో ఆ భారాన్ని ప్రజలే భరించాల్సి వచ్చింది. ఇక కమ్యూనిస్ట్‌ పార్టీలైతే ప్రతిరోజూ మన్మోహన్‌ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏదో ఒక చోట ఆందోళనలు చేస్తూనే ఉండేది.

మన్మోహన్‌ ప్రభుత్వం దిగిపోయాక మోదీ సారథ్యంలో ఎన్డీయే ప్రభుత్వం గద్దె ఎక్కింది.  కాంగ్రెస్‌ ప్రభుత్వంలో  ఉన్నప్పుడు తాము ప్రదర్శించిన ధర్నాలు, ఆందోళనలను వాటంగా విస్మరించి అనునిత్యం ధరలు పెంచడమే పరమావధిగా పెట్టుకుంది.  ముఖ్యంగా గత రెండేళ్లుగా నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. అయిదారు నెలలక్రితం ఉన్న ధరలకు దాదాపు రెట్టింపు అయ్యాయి. పప్పు దినుసులు, నూనెలు, వంట గ్యాస్‌ ధరలు ఇష్టారాజ్యంగా పెరిగిపోతున్నాయి. ఇక పెట్రోల్, డీజిల్‌ ధరలు రోజురోజుకు పెరిగిపోతూ సామాన్యుల గుండెలను దడదడలాడిస్తున్నాయి.

పెట్రోల్‌ ధర దాదాపు వందరూపాయలకు చేరువలో ఉన్నది. గత మూడు నెలల్లో వంట గ్యాస్‌ ధర రెండు వందల రూపాయల మేర పెరిగింది.  నాలుగైదు నెలల క్రితం వరకూ నూట యాభై రూపాయల వరకూ సబ్సిడీ వినియోగదారుల ఖాతాల్లో జమ అయ్యేది. ఇప్పుడు అదికూడా పోయింది. ఒకప్పుడు ధరలు పెంచడం అంటే బడ్జెట్‌ సమావేశాల్లో మాత్రమే జరిగేది.  ముందుగా కేబినెట్‌ మీటింగ్‌లో చర్చించి పార్లమెంట్లో ప్రవేశపెట్టి పెంచేవారు. ఇప్పుడు అలాంటి సంప్రదాయాలు లేవు. ప్రతిరోజూ పెంచేస్తున్నారు.

అయినా ఆశ్చర్యం! ఎక్కడా ఆందోళనలు లేవు.  సమ్మెలు లేవు.  ధర్నాలు లేవు.  కరెంట్‌ చార్జీలు పెంచినా, రవాణా చార్జీలు పెంచినా, ఇంటి పన్నులు పెంచినా, కూరగాయల ధరలు పెరిగినా, ఆరోగ్యకారక మందుల ధరలు పెంచినా, ఆస్తుల రిజిస్ట్రేషన్‌ చార్జీలు పెంచినా కిమన్నాస్తి.  ప్రజలు కానీ, పార్టీలు కానీ ఏమాత్రం స్పందించడం లేదు.  గతంలో పెరిగిన ధరలపై చెలరేగిన ఆందోళనలు, ఉద్యమాల వాతావరణం ఇప్పుడు కనిపించలేదు.

విద్యార్థులతో సహా అన్ని వర్గాలూ ధరల పెరుగుదలపై, ఇతర సమస్యలపై పూర్తిగా నిరాసక్తత ప్రదర్శిస్తున్నాయి. అందుకే ప్రభుత్వాలు తమ చిత్తం వచ్చినట్లు నిత్యావసర వస్తువుల ధరలు పెంచినా, ఇంధన ధరలు పెంచినా ఒకరోజు గుండెలు బాదుకుని మరునాడు ఎంత పెరుగుతుందా అని ఎదురు చూడటం తప్ప మరో గత్యం తరం కనిపించడం లేదు.


ఇలపావులూరి మురళీ మోహనరావు
వ్యాసకర్త సీనియర్‌ రాజకీయ విశ్లేషకులు 

మరిన్ని వార్తలు