సుపరిపాలన వైఎస్‌ సంతకం

1 Sep, 2020 08:29 IST|Sakshi

సందర్భం

రాజశేఖరరెడ్డి గారి ప్రత్యేకత ఏమిటంటే ముఖ్యమంత్రిగా పార్టీకి విధేయుడిగా ఉంటూనే, పార్టీ ప్రయోజనాల పరిధిని దాటి ప్రజల కోసం పరిపాలన సాగించారు. ఆయన పాలన కాంగ్రెస్‌ ఇతర రాష్ట్రాలలో అమలు పరుస్తున్న విధానాలకు భిన్నంగా సాగింది. 108,104, ఆరోగ్యశ్రీ,  ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ముస్లింలకు రిజర్వేషన్లు ప్రవేశపెట్టారు. ఉదాహరణకు అనంతపురం జిల్లాలో కలగల అనే గ్రామంలో ఆయన బహిరంగ సభలో ప్రసంగిస్తూ ప్రజలకు ఒక ప్రశ్న వేశారు.

‘ఈ గ్రామంలో మా పార్టీ అభ్యర్థి వేణుగోపాల్‌రెడ్డికి తక్కువ ఓట్లు వచ్చాయి; తెలుగుదేశం పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. అయినా వృద్ధాప్య పెన్షన్లు గానీ, ఆరోగ్యశ్రీ గానీ, ఇంకా ఏ సంక్షేమ పథకాలు గానీ తెలుగుదేశం వారికి అందడం లేదు, కేవలం కాంగ్రెస్‌ వారికే అందాయి అనిపిస్తే తెలుగుదేశం వారు, పథకాలు అందని వారు మాకు ఓట్లు వేయకపోయినా సరే చేతులెత్తండి’అంటే ఆశ్చర్యంగా ఎవరూ చేతులెత్త లేదు. అన్నిపథకాలు లబ్ధిదారులకు చేరేటట్లు ఆయన చూశారు.
(చదవండి: తండ్రివి నీవే చల్లగ కరుణించిన దీవెన నీవే)

ఆయన గుడిసెలు లేని ఆంధ్రప్రదేశ్‌  చేయాలని సంకల్పించారు. ఉచిత విద్యుత్‌ ఇవ్వడం గొప్పవిషయం. చంద్రబాబు, రామోజీ లాంటి వారు బట్టలు ఆరేసుకోవడానికి కరెంటు వైర్లు పనికోస్తాయని కార్టూన్లు వేసినా ఆయన దాన్ని రిసీవ్‌ చేసుకున్న తీరు ప్రశంసనీయం. ప్రతి ఎకరం భూమికి నీటిని అందించాలన్న ఆశయంతో జలయజ్ఞం సంకల్పించారు. దాదాపు 23 ప్రాజెక్టులు చేపట్టారు. ప్రాణహిత– చేవెళ్ల, కల్వకుర్తి, నెట్టెంపాడు, బీమా, కోయిల్‌సాగర్, అలాగే చివరి రోజుల్లో పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకాలకు కూడా కృషిచేశారు. హంద్రీ నీవాకు పునాది వేశారు.

పోతిరెడ్డిపాడు సామర్థ్యం పెంచారు. పోలవరం ప్రాజెక్టువైపు కన్నెత్తి చూడాలంటేనే భయపడేటటువంటి కాలంలో పోలవరంకు అన్ని అనుమతులు సంపాదించారు. ఉత్తరాంధ్ర సుజలస్రవంతి ద్వారా 8 లక్షల ఎకరాలకు సేద్యపు నీటి సౌకర్యం కల్పించే దీక్షా దక్షత ఎవరికైనా ఉంటాయా? కాకినాడకు తాగునీటి స్కీము, ఇటువైపు గుంటూరు జిల్లా సేద్యపు నీటి వసతులు, తరువాత రాయలసీమ, ప్రకాశం నెల్లూరు జిల్లాల్లో తాగు, సాగునీరు లేని ప్రాంతాల్లో వెలుగొండ ప్రాజెక్టు ద్వారా సేద్యపు నీటిని అందించాలని బృహత్తరమైన ఆలోచన చేసిన సాహసి రాజశేఖరరెడ్డి.

రాయలసీమను, ఉత్తరాంధ్రను అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలని ఆరోజుల్లో 1937లో పెద్దలు శ్రీబాగ్‌ ఒప్పందం చేసుకున్నారు. ఇది ఎందుకు ప్రస్తావన చేస్తున్నానంటే రాజశేఖరరెడ్డి హైదరాబాద్, బంజారాహిల్స్‌లోని రోడ్‌ నం.2లో ఒక ఇల్లు నిర్మించుకుని, ఆ ఇంటిపేరును శ్రీబాగ్‌ అని పెట్టుకున్నారు. ఇటీవల జగన్‌మోహన్‌రెడ్డి రెడ్డిని సినీ ప్రముఖులు కలిసినపుడు విశాఖపట్టణంలో సినీ పరిశ్రమను నిర్మించుకునేందుకు వైఎస్‌ ఆనాడే స్థలం కేటాయించారని ఒక వార్త వచ్చింది.
(చదవండి: ప్రభుత్వ ప్రకటనల్లో వైఎస్‌ ఫొటో ఎందుకుండకూడదు?)

నేడు వికేంద్రీకరణలో భాగంగా విశాఖపట్టణాన్ని రాజధానిగా చేయాలనే ఆలోచనను ప్రభుత్వం చేస్తోంది. ఇది రాజశేఖరరెడ్డి విజ్ఞత, ముందుచూపు. ఆయన తెలుగు ప్రజలకు అందించిన అపురూప కానుక మరొకటి ఉంది. ప్రజల సంక్షేమానికి కట్టుబడి వ్యవసాయానికి, ఆరోగ్యానికి ప్రాధాన్యతనిచ్చే ఒక నాయకున్ని మనకు అందించారు. వైఎస్‌ ఎలాగైతే దేశంలో ఒక నూతన ఒరవడి సృష్టించారో ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ కూడా తండ్రి అడుగుజాడలలోనే నడుస్తూ సంక్షేమం, అభివృద్ధి కేంద్ర బిందువులుగా గొప్ప పాలన అందిస్తున్నారు. 
(రేపు డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి వర్ధంతి సందర్భంగా)
వ్యాసకర్త: ఇమామ్‌, ‘కదలిక’ పత్రిక సంపాదకుడు

మరిన్ని వార్తలు