దేశంలో దొంగలు పడ్డారు

29 Nov, 2021 12:57 IST|Sakshi

వీధి చివర మొగలో ఏడు పెంకులాట ఆడే పిల్లలు కనిపిస్తున్నారా? మండు వేసవిలో మిట్టమధ్యాహ్నం ఇల్లు దాటి బయటకు వెళ్లడానికి వీల్లేదని అల్టిమేటం జారీచేసే అమ్మానాన్నల కళ్లు గప్పి ఆరుబయటకు వచ్చి జోరీ బాల్‌ ఆడే కుర్రాళ్లు కనిపిస్తున్నారా? బంతీ బ్యాటూ లేకపోతే రంగు రంగుల గోళీకాయలతో వీధుల్లో  అంతర్జాతీయ మ్యాచులు ఆడే బాలలు కనిపిస్తున్నారా? ఎర్ర గోళీని పచ్చగోళీతో కొట్టేసి గెలిచిన ఆనందంలో కేరింతలు కొట్టేవాళ్లనీ, ఓడిపోయి గోళీ పోగొట్టుకుని రాజ్యం కోల్పోయిన రాజులా బెంగపడే వాళ్లనీ చూశారా? ఖాళీ సిగరెట్‌ ప్యాకెట్లు పోగు చేసి వాటితో బొమ్మ గడియారాలు తయారు చేసే చిన్ని చిన్ని కళాకారులు కనిపిస్తున్నారా? సిగరెట్‌ ప్యాకెట్లనే చించి బచ్చాలాట ఆడుకునే బచ్చాల్ని ఈ మధ్య ఎక్కడైనా చూశారా?

ఏ వెంకన్న కాపు పొలంలోనో... కాపరి లేని సమయం చూసి మామిడి చెట్లు ఎక్కి కోతి కొమ్మచ్చి ఆడే అబ్బాయిలు మురిపిస్తున్నారా? ఎక్కడి దొంగలు అక్కడే గప్‌ చుప్‌ అంటూ దాక్కున్న వాళ్లని పట్టుకోడానికి నానా తంటాలు పడే పిల్లల ఒలింపిక్స్‌ క్రీడ ఇప్పటికీ ఉందా? గూటీ బిళ్ల లేదా గిల్లీ దండా ఆటతో వీధిలో అటూ ఇటూ పోయే వాళ్లని భయపెడుతూ తమాషా చూసే పిల్లల ఆనందాన్ని చూశారా? ఇంట్లో పెద్దలు మరీ చండ శాసనుల్లా బయటకు వెళ్ళనీయకుండా ఆపేస్తే ఇళ్ల అరుగుల మీదే పులీ మేక ఆడే పిల్లలు ఇంకా ఆడుతున్నారా? మంచి ఎండలో ఏ మధ్యాహ్నమో ఐస్‌ ఫ్రూట్‌ అబ్బాయి ‘ఐస్‌... పాలైస్‌’ అంటూ అరుచుకుంటూ వస్తే అమాంతం నిద్ర నటనలోంచి బయటపడి ఐస్‌ కొని పెట్టమని పెద్దాళ్లను బతిమాలే పిల్లల ఆరాటం చూశారా? (చదవండి: ఈ సాగు చట్టాలు నిజంగానే మేలు చేయవా?)

ఇళ్ల లోగిళ్లలో రంగు రంగుల సీతాకోక చిలుకల్లాంటి అమ్మాయిలు తొక్కుడు బిళ్ల  ఆటలు ఆడుతున్నారా? తాటి ముంజెలను మూడు చక్రాల బళ్లుగా తయారు చేసుకుని వాటినే మెర్సిడెస్‌ బెంజ్‌ కారులా సంబరపడిపోయే పిల్ల ఇంజినీర్ల బాలానందాన్ని చూశారా? నదీ తీరాల్లో ఇసుకతో ఇళ్లు కట్టేసి గర్వంగా నవ్వుకునే బుల్లి సివిల్‌ ఇంజనీర్లు కొత్త వెంచర్లు వేస్తున్నారా లేదా? నెమలి పింఛాన్ని పుస్తకం మధ్యలో పెట్టుకుని కొబ్బరి మట్టపై నూగును తురిమి, పింఛానికి ఆహారంగా పెట్టి ప్రతీ రోజూ పింఛం ఎంత పెరిగిందో  పరీక్షించుకునే అమాయక బాల్యంలోని అందాన్ని చూశారా? (చదవండి: అన్నదాత హక్కు గెలిచినట్లే...!)

వేసవిలో పూడిక తీతల పనుల కోసం కాలువలు బంద్‌ చేసే సమయంలో నడుం లోతు ఉన్న నీళ్లల్లో రోజూ దొంగచాటుగా ఈత కొట్టి తడిసిన జుట్టుతో ఇంట్లో డిటెక్టివ్‌లకు దొరికిపోయి వీపు మీద విమానం మోత మోగగానే గుక్కపెట్టి ఏడ్చే బాల్యాన్ని చూశారా? చిల్ల పెంకును కాలువ నీళ్లపై విసిరి అది ఎన్ని ఎక్కువ గంతులు వేస్తూ ముందుకు పోతే అంత గొప్ప అని పోటీలు పడి ఆడుకునే కుర్రాళ్లు ఇంకా ఉన్నారా? (చదవండి: ఋతు ఘోష)

ఏవీ కనపడ్డం లేదు కదూ! మన ఆటలు మన ఆనందాలు రేపటి తరపు మధుర జ్ఞాపకాలు అన్నీ కూడా ఎత్తుకుపోయారు. మన నుండి మన ఆత్మను దోచుకుపోయారు. మన జీవితాల నుండి వెలుగులను దోచుకుపోయారు. ఆర్థిక సంస్కరణలు ఎప్పుడైతే మన దేశంలో అడుగు పెట్టాయో అప్పుడే కార్పొరేట్‌ దొంగలు అవతరించారు. వారే మన ఊళ్లల్లోని చేతి వృత్తులను ఎత్తుకుపోయారు. మన పేదల ఉపాధి అవకాశాలు ఎత్తుకుపోయారు. ఊళ్లల్లో జీవాన్ని, బాలల్లో ఆనందాన్ని, మనుషుల్లో మానవత్వాన్ని... అన్నింటినీ ఎత్తుకుపోయారు.

అన్నీ దోచుకుపోయిన ఘరానా దొంగలను పట్టుకోండని ఎవరికి చెప్పాలి? ఒక్కసారి మళ్లీ బాల్యంలోకి రివైండ్‌ అయిపోయి గత కాలపు ఆటలు మరోసారి ఆడుకుంటే బాగుండునని అనిపిస్తోంది కదూ! కార్పొరేట్‌ ప్రపంచంలో ఈ కల బహుశా ఇక ఎప్పటికీ నెరవేరదేమో? పగటి కలలోనే ఇక ఈ ఆటలు ఆడుకోవాలేమో?

– సి.ఎన్‌.ఎస్‌.యాజులు

మరిన్ని వార్తలు