India 75th Independence Day 2021: గాంధీజీకి తెలుగు స్ఫూర్తి

9 Aug, 2021 12:51 IST|Sakshi

గాంధీజీ ఒకసారి మూడో తరగతి రైలుపెట్టెలో రాయలసీమ ప్రాంతంలో ప్రయాణం చేస్తూ రైలు కిటికీలోంచి పొలాలు దున్నుకుంటున్న రైతులను చూసి, వారు మొలచుట్టూ ఒక ఖద్దరు వస్త్రాన్ని మాత్రమే ధరించి, తక్కిన శరీరమంతా నిరాచ్ఛాదనగా చెమట లోడుస్తూ ఎండలో కష్టపడుతూ కనపడగా– రత్నగర్భ నా దేశంలో ప్రజలందరికీ తినటానికి తిండి, కట్టడానికి బట్టలేక పోవటం ఎంత దురదృష్టకరం, దుఃఖకరం అని బాధపడి తాను కూడా ఈ దేశ దౌర్భాగ్య చిహ్నంగా మొలకు అంగవస్త్రం మాత్రమే ధరించాలని కృతనిశ్చయుడైనట్లూ, స్వాతంత్య్రం వచ్చినదాకా అర్ధనగ్నంగానే జీవించాలని నిర్ణయించినట్లూ భోగరాజు పట్టాభిసీతారామయ్య రచించిన సమకాలీన భారతదేశ చరిత్రలో ప్రసక్తమైంది.

ఆంధ్రకేసరి ప్రకాశం పంతులు కూడా స్వీయ చరిత్ర (జీవిత నౌక)లో తాను ఇంగ్లండు మొదటిసారి వెళ్లినప్పుడు ఏదో గొప్ప హోటలులో గాంధీజీని యాదృచ్ఛికంగా చూసినప్పుడు మిస్టర్‌ మోహన్‌దాస్‌ కరమ్‌ చంద్‌ గాంధీ ఫుల్‌సూట్‌లో, నెక్‌టైతో సహా కనపడిన ఉదంతం ప్రస్తావించారు. ఆ సూట్‌ చాలా ఖరీదైనదిగా కూడా ఆంధ్రకేసరి అభిప్రాయపడ్డారు. కాబట్టి స్వరాజ్యోద్యమ తీవ్ర కాంక్ష కలిగించినవారు బక్కచిక్కిన తెలుగు రైతులు అనుకోవద్దా?! స్వరాజ్య ఫలసిద్ధి ఉద్యమంలో తెలుగువారి పాత్ర గణనీయమైనది; వ్యక్తులు, సంస్థలు, ఉద్యమాలు తెలుగునాట స్వరాజ్య సంపాదన ఉద్యమాన్ని ముమ్మరం చేశాయి.


భారతదేశ స్వతంత్ర పతాక రూపకర్త పింగళి వెంకయ్య తెలుగు వారికే కాక అఖిల భారతదేశానికి మాననీయుడు. ఒకప్పుడు అఖిల భారత కాంగ్రెసు అధ్యక్షులు న్యాపతి సుబ్బారావు, కార్యదర్శి ఆంధ్రరత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య. అప్పుడు అఖిల భారత కాంగ్రెసు కార్యస్థానం బెజవాడకు వచ్చింది. తెలుగునాట గాంధీ మైదానాలెన్నో ఉన్నవి. ‘హిందూ’ పత్రిక సంస్థాపనంలో న్యాపతి సుబ్బారావు పంతులు సహ భాగస్వామి. అయినా ‘హిందూ’ పత్రిక ఆ విషయం ప్రస్తావించదు. తమిళ మహాకవి సుబ్రహ్మణ్య భారతికి తెలుగు వారంటే గొప్ప ఆదర్శం. తెలుగు భాషనాయన ‘సుందర తెలుంగు’ అని ప్రస్తావించాడు. ఆయన ఒక్కడే కాదు భగవాన్‌ రమణ మహర్షి ‘తెలుగు మధురమైన భాష, మీ పిల్లలకు నేర్పండి’ అని ఉద్బోధించాడు.

ఈ విధంగా తెలుగువారు అనేక త్యాగాలు చేసి, సంస్థలు నిర్మించి, జైళ్ల పాలై స్వరాజ్యోద్యమంలో పాల్గొన్నారు. పెదనందిపాడు రైతుల సత్యాగ్రహం, ఉప్పు సత్యాగ్రహం, సైమన్‌ కమిషన్‌ను వెనక్కి వెళ్లిపోవల్సిందన్న గర్జన, పల్నాటి మించాలపాటి పన్నుల నిరాకరణ తెలుగువారు స్వరాజ్యోద్యమంలో నిర్వహించిన పాత్ర స్మరణీయమైనవి. వాటి గూర్చి ఇటువంటి ఉత్తేజకర సంగతులు తెలుసుకుందాం. 

తెలుగువారిలో గాంధీలు, తిలక్‌లు, బోసులు, నెహ్రూల పేర్లు ఉన్నంతగా భారతదేశం ఇతర ప్రాంతాలలో ఉన్నాయో, లేదో?!

– అక్కిరాజు రమాపతిరావు
రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు
(భారత స్వాతంత్య్ర అమృతోత్సవం సందర్భంగా)

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు