భారత్‌లో జరగకూడనిది!

14 Aug, 2021 15:55 IST|Sakshi

సమకాలీన శతాబ్దాలలో భారత దేశ స్వాతంత్రోద్యమ గాథలు అత్యంత ఉత్తేజకరమైనవి. చేజారిపోయిన తమ స్వాతంత్య్రాన్ని రాబట్టుకోవడంలో భారతదేశంలో సంభవించిన త్యాగోజ్జ్వల ఘట్టాలు ప్రపంచంలో వేరే దేశాలలో కనబడవేమో! ఇతర దేశాల స్వాతంత్య్ర పోరాటాలలో భారతదేశంలో నూటికి తొంభై పాళ్లు స్వరాజ్య సాధనలో జరిగిన శాంత్యహింసలు, సత్యా గ్రహమూ ప్రస్తుత పాత్రమైనవి. అమెరికా మన దేశం కన్నా మూడు రెట్లు విస్తీర్ణంలో విశాలమైనది. అక్కడ జరిగిన ప్రజాస్వామ్య పోరాటాలలో లక్షలాదిమంది హతు లైనారు. అమెరికా స్వాతంత్య్ర పోరాట విజయానికి 465 సంవత్సరాల చరిత్ర ఉన్నది.

అమెరికాలో జరిగిన అంత ర్యుద్ధం, లక్షలాది ప్రజల హననం భారతదేశంలో చోటు చేసుకోలేదు. నేటికీ అమెరికాలో సామాజిక దురన్యా యాలు, పాఠశాలలో కూడా తుపాకీ కాల్పులు జరుగు తూనే ఉన్నాయి. జార్జ్‌ వాషింగ్‌టన్, అబ్రహాం లింకన్‌ వంటి సముదాత్త చరిత్రులు నెలకొల్పిన వ్యవస్థలు పంకి లమవుతున్నవి. దేశాధ్యక్షులు హత్యలకు గురి అయినారు. బానిస సంకెళ్ళ విదళన కోసం భారతీయులు ఆత్మార్పణం చేశారు. గాంధీజీని అవతారమూర్తి అని భారతీయులు శ్లాఘించారు. సమస్త భారతీయ భాషలలోనూ వెలువడిన భారతీయ స్వాతంత్రోద్యమ చరిత్ర పరిణామం కొన్ని లక్షల పుటలను విస్తరించింది. 

భగవాన్‌ శ్రీ రమణ మహర్షి ప్రతిరోజూ దినపత్రిక చదివేవారు. తమను పరివేష్టించి ఉన్న పరివారానికి ప్రపంచ వార్తలు, ముఖ్యంగా జాతీయ సంఘటనలు చదివి వినిపించేవారు. భారత స్వాతంత్రోద్యమ నాయ కులెందరో ఆ మహర్షిని దర్శించి భవిష్య దర్శన ఆశావ హులైనారు. 

‘‘శ్రీ రమణులు ఒక రోజున సాయంత్రం రేడియో తీసుకొచ్చి పెట్టమన్నారు. మహాత్మా గాంధీని కాల్చి చంపినట్లు మద్రాస్‌ రేడియోలో చెపుతున్నారు. శ్రీ రమణులు ‘పాకిస్తాన్‌లో ఇది జరగవలసింది. ఇక్కడే జరిగి పోయింది. ఆయన ఒక పని మీద వచ్చారు. అది నెరవేరింది. ఆయనను తీసుకుని వెళ్లటానికి ఒకరు పుట్టారు. అంతా విధి లిఖితం’’ అని మౌనం వహించారు (పుట 256– శ్రీరమణ కరుణా విలాసం).

శ్రీ రమణుల మనోగతం ఏమిటో, ఆయన మాట లలోని పరమార్థం ఏమిటో! భారతదేశంలో ఇటువంటి దుర్ఘటనలు జరగకూడదని కావచ్చు. పాకిస్తాన్‌ ఏర్పాటు, భారత దేశం నుంచి వేర్పాటు మూలంగానే ఇటువంటి కరుణావిలమైన సంఘటన చోటుచేసుకుందని మనం అర్థం చేసుకోవాలి.

– అక్కిరాజు రమాపతిరావు
రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు
(భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా)

మరిన్ని వార్తలు