స్వాతంత్య్రం కోసం వ్యాయామం

11 Aug, 2021 15:01 IST|Sakshi

గడిచిన శతాబ్దంలో తెలుగు ప్రముఖులలో ఉప్పల లక్ష్మణరావుగారొకరు (1898– 1985). ఆయనది విశిష్టమైన వ్యక్తిత్వం. ‘అతడు–ఆమె’ అనే నవలను ఆయన మూడు భాగాలుగా రచించారు. 1946 ప్రాంతంలో నీలంరాజు వెంకటశేషయ్య నిర్వహించిన పత్రికలో వెలువడ్డది. 

బరంపురంలో వీరిని 1972 ప్రాంతంలో నేను కలిశాను. ఆ రాత్రి వీరింటనే నా బస. అది బరంపురం కాబట్టి గురజాడ అప్పారావు గూర్చి, వి.వి. గిరి గూర్చి రాత్రి ఎంతో పొద్దుపోయినదాకా వారు చెప్పారు. లక్ష్మణరావు వామపక్ష భావజాలం పట్ల మొగ్గుచూపేవారు. మాస్కో ప్రగతి ప్రచురణాలయంలో పని చేశారు. తెలుగు–రష్యన్‌ నిఘంటువు ప్రచురించారు. స్విట్జర్లాండ్‌కు చెందిన మహిళ మెర్లీ షోలింగర్‌ను పెళ్లి చేసుకున్నారు. విజయవాడ ఆంధ్ర సిమెంట్‌ కంపెనీలో పనిచేశారు.

ఉప్పలవారు రచించిన ‘అతడు– ఆమె’ తెలుగులో వచ్చిన ఐతిహాసిక నవలల్లో ఎంతో చెప్పుకోదగినది. నాయికా–నాయకులు దినచర్య రాసుకున్న రీతిలో రచితమైన నవల ఇది. కొంతకాలం కలకత్తా బోస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పనిచేశారు వీరు. అప్పట్లో జగదీశ్‌ చంద్రబోస్‌ ద్వారా కలకత్తాకు వైజ్ఞానిక పరంగా ఎంతో గొప్ప పేరుండేది. సాహిత్యపరంగా రవీంద్రనాథ్‌ టాగూర్‌ విశ్వకవిగా నోబెల్‌ ప్రైజ్‌ అప్పటికే పొందారు. 

బోస్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పని చేస్తున్న రోజులలో జగదీశ్‌ చంద్రబోస్‌ను ఆఫీసు పని అయిపోయిన తరువాత ఉద్యోగులు మానసిక ఒత్తిడి నుంచి బయట పడటానికి ఒక టెన్నిస్‌ కోర్టును ఏర్పాటు చేస్తే బాగుంటుందని లక్ష్మణరావు అర్థించాడు. సర్‌ జగదీశ్‌ చంద్రబోస్‌ ఇందుకు  సమ్మతిం చారు. కానీ ఆయన చేసిన ఏర్పాటు వేరే విధంగా ఉంది. 

వంగదేశంలో అప్పుడు అత్యంత ప్రసిద్ధికెక్కిన మల్లుడొకరిని (కుస్తీ మొదలైన వ్యాయామ క్రీడా ప్రవీణుడిని) శిక్షణనిచ్చేందుకు నియోగించి, విశాలమైన బోస్‌ పరిశోధనా సంస్థ ఆవరణలో ఒక తాలింఖానా నెల కొల్పారు బోస్‌. తన పరిశోధనా సంస్థలో పనిచేసే ఉద్యోగులందరూ సాముగరిడీలలో ఆరితేరాలని అభిలాషించారాయన. 

ఈ విషయం బ్రిటిష్‌ ప్రభుత్వం (ది ఇంపీరియల్‌ గవర్నమెంట్‌) తెలుసుకొని వెంటనే మూసివేయవలసిందిగా హెచ్చరించారు. అట్లా చేయని పక్షంలో ప్రభుత్వం ఇచ్చే సాలుసరి లక్ష రూపాయల గ్రాంటును రద్దుపరుస్తున్నట్లు తాఖీదు పంపారు. అయినా సర్‌ జగదీశ్‌ చంద్రబోస్‌ ఏమాత్రం చలించలేదు. య«థావిధి తాలింఖానా పనిచేసింది. శరీర వ్యాయామం, కుస్తీలు, దండేలు, బస్కీలు సంస్థ ఉద్యోగులలో ఇష్టమున్న వారు సాగించారు. జగదీశ్‌ చంద్రబోస్‌ దేశభక్తి, స్వాతంత్య్రాశయ నిరతి ఇట్లా ఉండేవి. స్వామి వివేకానంద, జగదీశ్‌ చంద్రబోస్‌ను పారిస్‌లో ఒకసారి చూసినపుడు, మా వంగ దేశీయుడు, భారతీయుడు అని ఫ్రెంచి వారికి పరిచయం చేసి పరమానందం అనుభవించాడు. 

– అక్కిరాజు రమాపతిరావు
రచయిత, పరిశోధకుడు, సంపాదకుడు
(భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సందర్భంగా) 

మరిన్ని వార్తలు