మన ప్రాచీన వైద్యాన్ని పునరుద్ధరించాలి

18 Jun, 2022 12:55 IST|Sakshi

ప్రతి మనిషీ ఆరోగ్యం కోరుకుంటాడు. ఏ పని చేయాలన్నా ప్రాథమికంగా మనిషి ఆరోగ్యవంతుడై ఉండాలి. అందుకే అన్ని భాగ్యాల్లో కెల్లా ఆరోగ్యాన్ని మాత్రమే మహా భాగ్యం అన్నారు. అటువంటి ఆరోగ్యం సరిగా లేనప్పుడు  చికిత్స తప్పనిసరి. ఇప్పుడంటే ఆధునిక అల్లోపతి వైద్య విధానం రాజ్యమేలు తోంది కానీ... అత్యంత ప్రాచీన కాలం నుంచీ ఇటీవలి కాలం వరకూ భారతదేశంలో ఆయుర్వేద వైద్య విధా నంలోనే చికిత్స అందించారన్నది ఎవరూ కాదనలేని వాస్తవం. అటువంటి మన దేశీయ వైద్య విధానానికి ఇవ్వాళ అంతగా ప్రాముఖ్యం లభించడంలేదు. ఆయుర్వేదమే కాదు... యునాని, హోమియో వైద్య విధానాలు సైతం చౌకగా ప్రజలకు చికిత్స అందించడానికి ఉపయోగపడు తున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఈ విధానాల కన్నా అత్యంత ఖరీదైన అల్లోపతికే ప్రభు త్వాలు పెద్దపీట వేస్తున్నాయి. 

మిగతా మూడింటితో పోల్చినప్పుడు అల్లోపతి ఎక్కువ శాస్త్రీయమైనదని నమ్మడమే ఇందుకు కారణం కావచ్చు. అలాగే అల్లోపతి వైద్యవిధానంలో రోగ లక్షణాలు లేదా బాధ తొందరగా తగ్గుతుందనేది మరో కారణం. అలాగే పెద్ద పెద్ద శ్రస్త చికిత్సలు చేసి రోగులను బతికించే శాస్త్రీయ విధానంగానూ ప్రజలలో దానికి పేరున్నమాటా నిజం.

చరకుడు, సుశ్రుతుని కాలం నుండి కూడా ఆయుర్వేద వైద్యం భారత ఉప ఖండంలో వ్యాపించి ఉంది. ఆయుర్వేదంలోనూ అనేక ఛేదనాల (అంగాలను తొల గించడం) రూపంలో శస్త్ర చికిత్సలు జరిగేవి. రాచ పుండ్లు (కేన్సర్లు), పక్షవాతానికీ, అనేక దీర్ఘకాలిక వ్యాధులకూ, వ్రణాలకూ అద్భుతమైన చికిత్సలు జరిగేవి. అడవులూ, పొలాలూ, పెరడులూ, వంటిళ్లూ... ఎక్కడ చూసినా ఆయుర్వేదానికి అవసరమైన ఔషధాలు అందుబాటులో ఉండేవి. అయితే అల్లోపతి విధానం అనేక కారణాలవల్ల ప్రజల్లో ఆదరణ పొంద డంతో మన దేశీయ వైద్యం క్రమంగా పడకేసింది.  

అలాగే గత రెండు మూడు దశాబ్దాలుగా హోమియో వైద్య విధానం అంతర్జాతీయ స్థాయిలో ప్రాచుర్యం పొందుతున్న నేపథ్యంలో భారత్‌లోనూ విస్తరిస్తోంది. ముఖ్యంగా ఈ హోమియో వైద్య విధానంలో వ్యక్తి శారీరక ధర్మాలను అంచనా వేసి వైద్యులు మందులను ఇస్తారు. అల్లోపతి వైద్యంతో పోల్చుకున్నపుడు ఖర్చు కూడా తక్కువ అవుతుంది. మొండి రోగాలను నయం చేయగలిగిన శక్తి హోమియోపతికి ఉన్నదని నమ్మకం కూడా ఇటీవల ప్రజల్లో పెరిగిపోవడంతో హోమియో వైద్యానికి గిరాకీ కూడా గణ నీయంగానే పెరుగుతున్నది. అయితే ప్రభుత్వపరంగా హోమియో, ఆయుర్వేద, యునాని వైద్యవిధానాలకు ప్రోత్సాహం అల్లోపతితో పోల్చి చూసినప్పుడు తక్కువగానే ఉందని చెప్పక తప్పదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మరింతగా మన ప్రాచీన వైద్య విధానాల ద్వారా ప్రజలకు చౌకగా చికిత్స అందించడానికి కృషి చేస్తాయని ఆశిద్దాం. ఇప్పటికే ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ‘ఆయుష్‌’ ద్వారా మన సంప్రదాయ వైద్యవిధానాలను ప్రజలకు చేరువ చేస్తోంది. మన రెండు తెలుగు రాష్ట్రాలూ అనేక ఆయుర్వేద కళాశాలలూ, వైద్యశాలలూ నెలకొల్పు తుండటం గమనార్హం. కాకపోతే అల్లోపతి వైద్య కళా శాలలు, ఆస్పత్రుల సంఖ్యతో పోల్చుకుంటే మిగిలిన వైద్య విధానాలకు చెందిన కాలేజీలు, వైద్యశాలలూ తక్కువ అనేది సుస్పష్టం. (క్లిక్‌: భారత్‌ను ఒంటరిని చేస్తారు జాగ్రత్త!)

ముఖ్యంగా వ్యాధి మొదటి, రెండో దశల్లో ఉన్నప్పుడు అల్లోపతి డాక్టర్లకన్నా ఆయుర్వేద, హోమియో వైద్యుల దగ్గరకు వెళ్లడం వల్ల ప్రజలకు తక్కువ ఖర్చుతో సులువైన వైద్యం అందుతుంది. అందుకే ప్రాథమిక, మాధ్యమిక స్థాయిల్లో తప్పనిసరిగా ఆయుర్వేదం వంటి సంప్రదాయ వైద్యాలు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. (క్లిక్‌: భూమాతకు సత్తువనిచ్చే సంకల్పం)


- డా. రక్కిరెడ్డి ఆదిరెడ్డి 

వ్యాసకర్త అసిస్టెంట్‌ ప్రొఫెసర్, జర్నలిజం విభాగం, కాకతీయ యూనివర్సిటీ

మరిన్ని వార్తలు