మతరహిత దేశం.. గాంధీ స్వప్నం

15 Aug, 2020 00:37 IST|Sakshi

నేడు 73వ స్వాతంత్య్ర దినోత్సవం

గాంధీకి సంబంధించినంతవరకు 1947 ఆగస్టు 15.. శాంతిని కోరుకుంటూ ఉపవాసం పాటించాల్సిన దినం. స్వాతంత్రం సిద్ధించిన తర్వాత 1947 ఆగస్టు 16న స్టాటిష్‌ చర్చి కాలేజి ప్రిన్సిపాల్‌ జాన్‌ కెల్లాస్‌ ఆయనను కలిసి అడిగారు. ‘ఒక జాతికి, మతానికి  ఉండే సంబంధం ఏమిటి?’ మతంపేరుతో తన కళ్లముందు జరుగుతున్న పరస్పర మారణకాండకు సాక్షీభూతుడైన గాంధీ.. శ్రీరాముని భక్తుడు.. ఈశ్వరుడు, అల్లా ఇద్దరూ ఒకే నాణానికి రెండు వైపుల వంటివారు అని విశ్వసించిన గాంధీ.. ఏడు దశాబ్దాలు గడిచిన తర్వాత  ఈరోజుకూ వర్తించేటటువంటి, జాతి అంతరాళంలో ప్రతిధ్వనిస్తున్నటువంటి ఘనమైన సమాధానం ఇచ్చారు. ’ఒక జాతి లేక దేశం అనేది ఏ ప్రత్యేక మతానికి, మత శాఖకూ చెంది ఉండదు. అది పూర్తిగా ఈ రెండింటికి దూరంగా స్వతంత్రంగా ఉండాలి’.

అది 1946 నవంబర్‌ 6 నడిరాత్రి. దశాబ్దాలుగా మహాత్మాగాంధీ కాంక్షించిన స్వాతంత్య్రం మరికొన్ని నెలల్లో సిద్ధించబోతోంది. అప్పుడే దేశ విభజన శాపంలా ముందుకు వచ్చి అరాచకం, హత్యాకాండ రగులుకున్నాయి. ఆ నేపథ్యంలో ఆ రాత్రి మహాత్మాగాంధీ ఒక పెర్రీ బోట్‌లో చాంద్‌పూర్‌ చేరుకున్నారు. క్రూర హింసాకాండకు గురైన హిందువుల పిలుపునందుకుని ఆయన నాటి తూర్పు బెంగాల్‌లోని నౌఖాలి మాగాణిప్రాంతంలో పూర్తిగా నాలుగు నెలల కాలం గడపదలిచారు. తన పర్యటనలో తొలి మజిలీలో అడుగుపెట్టిన వెంటనే బీహార్‌లో ముస్లింలపై పాశవిక ప్రతిదాడి మొదలైందన్న వార్తలు గాంధీ చెవిన పడ్డాయి. తీవ్ర విషాదంతో, అవమానంతో గాంధీ చెప్పారు. ‘ఈరోజు భారత స్వాతంత్య్రం బెంగాల్, బిహార్‌లలో ప్రమాదంలో పడింది. బిహారీలు పిరికిపందల్లా వ్యవహరించారు. బిహారీలు నిజంగా ఎదురుదెబ్బ తీయాలని భావించి ఉంటే వారు నౌఖాలికి వచ్చి అక్కడ ప్రాణాలివ్వడానికి సిద్ధపడి ఉండాలి’.

ఆ మరుసటి రోజు రెండు ప్రతినిధి బృందాలు గాంధీని కలిశాయి. మొదట ముస్లిం ప్రతినిధులు వచ్చి, చాంద్‌పూర్‌లో ఎలాంటి అలజడులూ జరగకుండా చూస్తున్నామని చెప్పారు. తర్వాత హిందూ ప్రతినిధులు వచ్చారు. తమకు పోలీసు, మిలటరీ రక్షణ కావాలని చెప్పారు. ఆ సాయంత్రం చాంద్‌పూర్‌లో 15 వేలమంది (ఎక్కువమంది ముస్లింలే) హాజరైన సభలో గాంధీ ప్రసంగించారు. ‘ఇక్కడ బలవంతపు మత మార్పిడిలు జరిగాయని విన్నాను. బలవంతంగా గొడ్డుమాంసం తిని పించారని విన్నాను. బలవంతంగా పెళ్లిళ్లు జరిపిం చారని విన్నాను. ఇక హత్యలు, లూటీలు, దోపిడీల విషయం చెప్పాల్సిన పని లేదు. ప్రజలు విగ్రహాలు కూల్చేశారు. ముస్లింలు విగ్రహారాధన చేయరు. నేను కూడా పాటించను. కానీ ఆ విగ్రహాలను పూజిస్తున్న వారి వ్యవహారాల్లో వీరు ఎందుకు తల దూర్చినట్లు? ఇలాంటి ఘటనలు ఇస్లాం పేరుకు కళంకం తెస్తున్నాయి’.

తూర్పు బెంగాల్‌లో దహనకాండ పూర్తిగా అంతం కాకున్నా కాస్త చల్లారింది. తర్వాత గాంధీ 1947 మార్చి 3న ప్రత్యర్థి యుద్ధరంగమైన బిహా ర్‌కు వెళ్లారు. అక్కడ బిర్‌ అనే గ్రామంలో అమాయక ముస్లింలపై పాశవిక హింసాకాండ గురించి తెలుసుకుని ఆ గ్రామాన్ని సందర్శించారు. ఆ గ్రామంలో హాజరైన వారిని ఉద్దేశించి ప్రసంగించిన గాంధీ తన ఆగ్రహాన్ని నియంత్రించుకోలేకపోయారు.  ‘110 సంవత్సరాల వయసు ఉన్న ఒక వృద్ధ మహిళను మీ కళ్లముందే నరికిపారేస్తుంటే మీరు చూస్తూ ఇంకా ఎలా బతికి ఉన్నారు అని నేను ప్రశ్నిస్తున్నాను. నేను ఇక విశ్రాంతి తీసుకోను, ఇతరులను విశ్రాంతిగా ఉంచను. ఈ ప్రాంతమంతటా కాలినడకతోనే తిరుగుతాను. ఏం జరిగిందని ఇక్కడ పడి ఉన్న అస్థిపంజరాలను అడుగుతాను. ఈ మొత్తం ఘటనలన్నింటికీ పరిష్కారం కనుగొనేదాకా నేను శాంతిగా ఉండలేను. నాలో మంటలు రేగుతున్నాయి’ అని గాంధీ పేర్కొన్నారు.
రెండు భూభాగాల్లో అధికార మార్పిడికి చర్యలు తుదిరూపం తీసుకుంటున్న సందర్భంలో గాంధీ ఆ తతంగానికి పూర్తిగా దూరంగా ఉండిపోయారు. ఆయన హృదయం చెబుతున్న చోటికే ఆయన పాదాలు అడుగేశాయి. హింసాకాండ బాధితులు ఎక్కడుంటే అక్కడికల్లా ఆయన వెళ్లిపోయారు. ఇక ఆగస్టు మొదట్లో ఆయన బిహార్‌ నుంచి బెంగాల్‌కు తిరిగి వెళ్లిపోయారు. ఇంకా వ్యవస్థ విఫలం స్పష్టంగా కనబడుతున్న నౌఖాలీకి తిరిగి వెళ్లాలన్నదే ఆయన ఉద్దేశం.

కలకత్తాలో, అతిపెద్ద ముస్లిం ప్రతినిధి బృందం గాంధీని కలిసి అల్లర్లు జరగనున్నట్లు కనిపిస్తున్న నగరంలోనే ఉండిపోవాలని కోరారు. అయితే రెండు షరతులపై గాంధీ అందుకు అంగీకరించారు. ఒకటి. నగరంలో శాంతి పరిరక్షణకోసం తనను ఉండిపోవాలని కోరుతున్న కలకత్తా ముస్లింలు నౌఖాలీలో హిందువుల భద్రతకోసం ప్రయత్నం చేయాలి. రెండు, నగరంలో ముస్లిం నివాసుల భద్రతకు హిందువులు హామీ ఇచ్చేటటువంటి ముస్లిం ప్రాంతంలోనే తాను ఉంటాడు. 
గాంధీ ఎక్కడ విడిది చేయాలో నిర్ణయించారు. అది బెలియాఘట్‌ శివార్లలోని హైదరి మంజిల్‌. అది ఎంతో పాడుపడిన ఇల్లు అని మను గాంధీ నమోదు చేశారు. ‘ఆ ఇంటిలో ఏ సౌకర్యమూ లేదు. అన్ని వైపులా తెరుచుకునే ఉంటుంది. ఒకే మరుగుదొడ్డి ఉంది. ఆ ఇంటిలోని ప్రతి అంగుళం దుమ్ముతో నిండివుంది. ఇంటినిండా వర్షధారలు కాస్త సౌకర్యంగా ఉన్నట్లు కనిపించే ఒక్క గదిలోనే బాపూతో సహా అందరూ గడిపారు’.ఆగస్టు 9న సమాచార శాఖకు చెందిన ఒక అధికారి గాంధీని కలిసి ఆగస్టు 15న జాతినుద్దేశించి సందేశం ఇవ్వాలని కోరారు. కానీ గాంధీ నిరాకరించారు. మీరు సందేశం ఇవ్వకపోతే ఆనాటి కార్యక్రమం పాడైపోతుందని ఆ అధికారి ఒత్తిడి చేశారు. దానికి గాంధీ ప్రత్యుత్తరం ఇచ్చారు. ‘నేను సందేశం ఇవ్వను.. ఆ కార్యక్రమం పాడు కానివ్వండి’.

ఆగస్టు 14న అక్కడ వాతావరణంలో కాస్త మార్పు కలిగినట్లు కనిపించింది. ప్రీమియర్‌ హెచ్‌ఎస్‌ సుహ్రావర్ధికి ఆరోజు తన కార్యాలయంలో చివరి రోజు. దాంతో స్వాతంత్య్ర ఉత్సవ కార్యక్రమాలను చూపించడానికి, చివరి బ్రిటిష్‌ గవర్నర్‌ నిష్క్రమించడాన్ని, భారత తొలి గవర్నర్‌ పదవీ స్వీకారాన్ని, పీసీ ఘోష్‌ నేతృత్వంలో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటును గాంధీకి చూపించడానికి తన వాహనంలో తీసుకుపోయే అవకాశాన్ని పొందారాయన. ఆ రోజు నగరంలో పరిస్థితులను చూసిన తర్వాతే గాంధీ తన సందేశం ఇచ్చారు. అది నాటి పరిస్థితులను ప్రతిధ్వనించిన సందేశం. ‘రేపు బ్రిటిష్‌ బంధనాలనుంచి విముక్తి పొందుతున్నాం. కానీ ఈ అర్ధరాత్రి నుంచే హిందూస్తాన్‌ రెండు ముక్కలవుతోంది. కాబట్టి రేపు అటు ఆనందాన్ని, విషాదాన్ని కలిగించే రోజుగా ఉండబోతోంది’ అని గాంధీ ఆ సందేశంలో పేర్కొన్నారు.

గాంధీకి సంబంధించినంతవరకు 1947 ఆగస్టు 15 ఉపవాసం పాటించాల్సిన దినం. ఆయన హృదయంలో ఆనాడు ఆగ్రహజ్వాలలు రేగుతూ ఉండిపోయాయి. 1942లో ఆ రోజునే మరణించిన తన పుత్రసమానుడైన కార్యదర్శి మహదేవ్‌ దేశాయి గురించి తల్చుకున్నారు. బెలియాఘటలో తాను ఉంటున్న చోటుకు వేలాదిమంది జొరబడ్డారు. ప్రమాణ స్వీకారం చేయబోతున్న మంత్రులు కూడా వారిలో ఉన్నారు. ఆయన వారితో ఇలా అన్నారు. ‘ఊరించే సంపదల మాయలో పడవద్దు’. ఆ మరుసటి దినం 1947 ఆగస్టు 16న స్టాటిష్‌ చర్చి కాలేజి ప్రిన్సిపాల్‌ జాన్‌ కెల్లాస్‌ ఆయనను కలిసి అడిగాడు. ’ఒక జాతికి, మతానికి  ఉండే సంబంధం ఏమిటి?’ మతంపేరుతో తన కళ్లముందు జరుగుతున్న పరస్పర మారణకాండకు సాక్షీభూతుడైన గాంధీ.. శ్రీరాముని భక్తుడు.. ఈశ్వరుడు, అల్లా ఇద్దరూ ఒకే నాణానికి రెండు  వైపులవంటివారు అని విశ్వసించిన గాంధీ.. ఈరోజుకూ వర్తిస్తూ జాతి అంతరాళంలో ప్రతిధ్వనిస్తున్న ఘనమైన సమాధానం ఇచ్చారు. ‘ఒక జాతి లేక దేశం అనేది ఏ ప్రత్యేక మతానికి, మత శాఖకూ చెంది ఉండదు. అది పూర్తిగా ఈ రెండింటికి దూరంగా స్వతంత్రంగా ఉండాలి’.


(హిందూస్తాన్‌ టైమ్స్‌ సౌజన్యంతో)
వ్యాసకర్త మాజీ గవర్నర్, మాజీ దౌత్యవేత్త
గోపాలకృష్ణ గాంధీవిశ్లేషణ

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా