విపత్తులు సరే... నివారణ ఎలా?

13 May, 2022 12:37 IST|Sakshi

ప్రపంచవ్యాప్తంగా 2030 నాటికి ఏటా 560 ప్రకృతి విపత్తులు సంభవిస్తాయని అంచనా. అంటే రెండు రోజులకు మూడు విపత్తులన్నమాట! వీటి పరిధి, తీవ్రత  కూడా వేగంగా పెరుగుతున్నాయి. ఆసియా, ప్రత్యేకించి దక్షిణాసియా ప్రపంచంలోనే అన్ని ప్రాంతాల కంటే ఎక్కువ బాధితురాలిగా ఉంటున్నందున, భారత్‌ ఈ ఆకస్మిక విపత్తుల పట్ల తీవ్ర ఆందోళనకు గురవుతోంది. ఎందుకంటే ప్రకృతి విపత్తు ప్రమాద సూచికలో అత్యధిక స్థాయిల సమాచారాన్ని నమోదుచేసే నాలుగో అతిపెద్ద దేశం భారతదేశమే. ఈ సూచికకు సంబంధించి భారత్‌ స్కోర్‌ 7.7గా ఉంది. దేశ జనాభాలో 32 శాతంమంది జాతీయ దారిద్య్ర రేఖకు దిగువనే ఉన్నారన్న వాస్తవం మర్చిపోకూడదు. మునుపటి అయిదేళ్ల కాలంకంటే ప్రస్తుత అయిదేళ్ల కాలంలోనే ఎక్కువ మంది ప్రజలు చనిపోయారు లేదా విపత్తుల బారిన పడ్డారు.

విపత్తుల ప్రమాదాన్ని అర్థం చేసుకోవడం, లేదా అంచనా వేయడంలో సమకాలీన పద్ధతులు యథాతథ స్థితినే తరచుగా పరిగణిస్తున్నాయి తప్ప వ్యవస్థల్లో ప్రమాదాలు ఎలా రూపొందుతున్నాయి అనే అంశాన్ని అసలు పట్టించుకోవడం లేదు. ఉదాహరణకు, కోవిడ్‌–19 నేప థ్యంలో అహ్మదాబాద్‌ ఓల్డ్‌ సిటీలో, ఒకే గది ఉన్న ఇంట్లో నివసిస్తున్న వారు లేదా ఒకే ఇంట్లో అయిదుమందికి పైగా నివసిస్తున్న వారే ఎక్కువగా కరోనా వైరస్‌ని వ్యాపింపజేస్తున్నట్లు కనిపించింది. ఇవి చారిత్రక, సామాజికార్థిక వాస్తవికతలు. కాబట్టి, సామాజిక దుర్బలత్వాలను పరిష్కరించకపోతే, ఇలాంటి ఆకస్మిక వ్యాధులు పదేపదే పునరావృతమవుతూ ఒకేరకమైన పర్యవసానాలకు దారి తీస్తుంటాయి. దీనికి సంబంధించి విధాన నిర్ణేతలు– సామాజిక, ఆర్థిక దౌర్బల్యాలకు వెనుక  గల సమకాలీన, చారిత్రక కారణాలను పరిశోధించాలి. 

విపత్తు ప్రమాద తగ్గింపుపై అంతర్జాతీయ అంచనా నివేదిక, కోవిడ్‌–19 ప్రపంచం ముందు సంధించిన సవాలును చర్చిస్తూనే ఆరోగ్య వ్యవస్థలలో ఉనికిలో ఉన్న దుర్బలత్వాలని మహమ్మారి ఎత్తిచూపిన కోణాన్ని ప్రపంచానికి గుర్తు చేసింది. అంతకుమించి అది అసమా నత్వం, నిరుద్యోగితను బలంగా ప్రదర్శించి చూపింది. ప్రత్యేకించి పట్టణ ప్రాంతాల్లో విద్య, పోషకాహారం, ఆహార భద్రత వంటి విషయాల్లో ప్రజల పరిస్థితి దయనీయంగా తయారైంది. మహమ్మారి వ్యవస్థీకృత ప్రభావాలు, దాని క్రమాలను భారత్‌లోని ప్రపంచ చారిత్రక నగరమైన అహమ్మదాబాద్‌ ఓల్డ్‌ సిటీలో నిర్వహించిన తాజా నివేదిక (2022) వెల్లడించింది. శరవేగంతో జరుగుతున్న పట్టణీకరణ ప్రమాదాలను ఈ నివేదిక ఎత్తిచూపింది. పట్టణీకరణ వేగ ప్రక్రియే వాతావరణ మార్పు ప్రభావాలకు ప్రజలను బలిజీవులుగా మారుస్తోందని నివేదిక తెలిపింది. 

తీర ప్రాంతంలోని అతిపెద్ద నగరాల్లో జనాభా సాంద్రీకరణ కారణంగా సముద్ర మట్టాల పెరుగుదలపై ప్రభావం చూపుతోంది. ఐపీసీసీ తాజా నివేదిక ప్రకారం 2006 నుంచి సగటు సముద్ర మట్టం పెరుగుదల రేటు సంవత్సరానికి 3.7 మిల్లీ మీటర్లుగా ఉంటోందని వెల్లడయింది. ఈ లెక్కన 2100 నాటికి  20 కోట్లమంది ప్రజలు దీని ప్రభావానికి గురవుతారని ఈ నివేదిక తెలుపుతోంది. ఆసియా ప్రజలే ప్రధానంగా దీని బారిన పడనున్నారని, ప్రత్యేకించి చైనాలో (4 కోట్ల 30 లక్షల మంది), బంగ్లాదేశ్‌లో (3 కోట్ల 20 లక్షలమంది), భారతదేశంలో (2 కోట్ల 70 లక్షలమంది) దీని ప్రభావానికి గురవుతారని ఈ నివేదిక స్పష్టం చేసింది. ప్రస్తుత ధోరణులు ఇలాగే కొనసాగితే, 2015 నుంచి 2030 నాటికి, ప్రతి సంవత్సరం విపత్తుల సంఖ్య ప్రపంచవ్యాప్తంగా 40 శాతం మేరకు పెరగవచ్చు. 

ఇక కరువుల విషయానికి వస్తే 2001 నుంచి 2030 నాటికి 30 శాతం పెరుగుతాయని ప్రస్తుత ధోరణులు సూచిస్తున్నాయి. అలాగే అత్యంత అధిక ఉష్ణోగ్రతలు సంభవిస్తున్న ఘటనల సంఖ్య కూడా ప్రతి సంవత్సరం పెరుగుతూనే ఉంది. విపత్తుల వల్ల ఎక్కువమంది దెబ్బ తినడమే కాకుండా, దారిద్య్రం కూడా పెరుగుతుంది. 1990లలో విపత్తుల వల్ల ఆర్థిక నష్టాలు సగటున 70 మిలియన్‌ డాలర్లమేరకు సంభవించగా, 2020 నాటికి సంవత్సరానికి 170 మిలియన్‌ డాలర్లకు పెరిగాయి. ఈ ఆర్థిక నష్టాలకు సంబంధించి బహుశా 40 శాతానికి మాత్రమే బీమా సౌకర్యం ఉంది. అయితే ఈ బీమా రక్షణ కూడా అభివృద్ధి చెందిన దేశాల్లోనే చాలావరకు కేంద్రీ కృతం అయింది. (చదవండి: ఎంత వేసవైనా ఇంత వేడేమిటి!)

వాతావరణ అత్యవసర పరిస్థితి, కోవిడ్‌–19 మహమ్మారి వ్యవస్థీకృత ప్రభావాలు ఒక కొత్త వాస్తవికతను ముందుకు తీసుకొచ్చాయి. ఇలాంటి అనిశ్చిత ప్రపంచంలో, నిజమైన, నిలకడైన అభివృద్ధిని సాధించటానికి నష్టభయాన్ని అవగాహన చేసుకోవడమే ప్రధానం. భవిష్యత్తు షాక్‌లకు వ్యతిరేకంగా ఉత్తమమైన రక్షణ ఏమిటంటే, ఇప్పుడు వ్యవస్థలను పరివర్తన చెందించి, వాతా వరణ మార్పు, తదితర అవరోధాలను పరిష్కరిస్తూ స్థితిస్థాపకతను నిర్మించుకోవడమే. హానికర పరిస్థితులను తగ్గించి, విపత్తులవైపు నెట్టే అసమానత్వాన్ని తగ్గించే ప్రయత్నం కూడా దీంట్లో భాగమే. ఇలా చేయగలిగితేనే కార్యాచరణ సాధ్యం అవుతుంది. (చదవండి: సామాజిక పరివర్తనే సంఘ్‌ లక్ష్యం)

తప్పుల నుంచి నేర్చుకోవడానికీ, అనిశ్చితి పట్ల మరింత స్పష్టంగా కమ్యూనికేట్‌ కావడం ఎలాగో తిరిగి అంచనా వేసుకోవడానికీ పాలనా వ్యవస్థలు లక్ష్యాల సాధనకు అవసరమైన పద్ధతులను తక్షణం అలవర్చు కోవాలి. పాలనా వ్యవస్థలు తప్పుడు విషయాలను మదిస్తూ వాటి విలువను లెక్కిస్తున్నాయి. మానవ మనస్సు – వ్యవస్థలు ఎలా నిర్ణయాలు తీసుకుంటాయి, ఉత్పత్తి – సేవలు ఎలా పనిచేస్తాయి, నష్టభయాన్ని అర్థం చేసుకుని వాటిని నిర్వహించడంలో ప్రస్తుత పద్ధతులు ఎలా విఫలమయ్యాయనే అంశాలపై దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ప్రభావిత ప్రజలతో సంప్రదింపుల ద్వారా మన పాలనా, ఆర్థిక వ్యవస్థలను పునర్నిర్మించడం అవసరం.

- డాక్టర్‌ జ్ఞాన్‌ పాఠక్‌ 
ప్రసిద్ధ కాలమిస్ట్‌

మరిన్ని వార్తలు