డిజిటల్‌ భద్రతకు... ఇదే ఉత్తమ విధానం

16 Jul, 2021 16:58 IST|Sakshi

విదేశీ విధానానికి సంబంధించి అతి ముఖ్యమైన సాధనంగా టెక్నాలజీని ఎలా ఉపయోగించాలి అనే అంశంపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ కీలకమైన ఆదేశమిచ్చారు. అత్యంత కఠినమైన, సాక్ష్యాధారాలతో కూడిన విశ్లేషణ ద్వారా సమాచార, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ (ఐసీటీ) నుంచి ఎదురయ్యే ప్రమాదాలను ఫెడరల్‌ ప్రభుత్వం తప్పకుండా అంచనా వేయాల్సి ఉందని బైడెన్‌ చెప్పారు. అమెరికా మౌలిక విలువలు, ప్రాథమిక స్వేచ్చా స్వాతంత్య్రాల పరిరక్షణ, ప్రదర్శనతో సహా మొత్తం జాతీయ భద్రత, విదేశీ విధానం, ఆర్థికపరమైన లక్ష్యాలకు సంబంధించి ఎదురయ్యే ఆకస్మిక ప్రమాదాలను దేశం ఎదుర్కోవలసి ఉందని బైడెన్‌ స్పష్టం చేశారు. భారత టెక్నాలజీ పాలసీ విధానంపై భౌగోళిక–రాజకీయాలు ఆధిపత్యం చెలాయిస్తున్న సమయంలో ఈ పరిణామం సంభవించింది. చైనా ప్రభుత్వం చేపడుతున్న టెక్నాలజీ సప్లయ్‌ చైన్‌ల విస్తరణపై అవిశ్వాసమే అమెరికా ప్రభుత్వ విధానపరమైన మార్పునకు కారణం. 

టిక్‌ టాక్, వీ చాట్‌ వంటి చైనా యాప్స్‌ని నిషేధిస్తూ మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ జారీ చేసిన గత ఆదేశాలను బైడెన్‌ శాసనం రద్దు చేసింది. గత సంవత్సరం భారత్‌ కూడా 267 యాప్‌లపై నిషేధం విధించింది. లద్దాఖ్‌లో చైనా సైనికబలగాలు అనూహ్యంగా సరిహద్దు ఘర్షణలు ప్రారంభించినందుకు స్పందనగా చైనా యాప్‌లపై భారత్‌ వేటు వేసింది. అదేవిధంగా 2020లో కరోనా మహమ్మారి ప్రారంభంలో సున్నితమైన రంగాల్లో సరిహద్దు దేశాల నుంచి పెట్టుబడులపై భారత్‌ ఆంక్షలు విధించడమే కాకుండా, కీలకమైన 5జీ నెట్‌వర్క్‌ల అభివృద్ధిలో చైనా కంపెనీలైన హువే, జీటీఈల భాగస్వామ్యాన్ని నిషేధించవచ్చని కూడా భావించారు. 

ప్రస్తుతం బైడెన్‌ పాలనా యంత్రాంగం టెక్నాలజీ ఆధారిత లావాదేవీల్లో చోటుచేసుకునే ప్రమాదాలకు సంబంధించిన సమగ్ర జాబితాను రూపొందించింది. ఫలితంగా బైడెన్‌ గతంలో ట్రంప్‌ చేపట్టిన ప్రతీకార చర్యల స్థానంలో సాక్ష్యాధారాలతో కూడిన విధాన నిర్ణయాలను ప్రవేశపెట్టారు. కొన్ని జనరంజక యాప్‌లపై ట్రంప్‌ ఆంక్షలను బైడెన్‌ తోసిపుచ్చినప్పటికీ, డేటా భద్రత ప్రాధాన్యతను పలుచన చేయలేదు. నిషేధిం చడం కంటే కచ్చితత్వానికి ప్రాధాన్యమిస్తూ చైనా వ్యతిరేక వ్యూహానికి పునాదిని అమెరికా బలోపేతం చేసింది. దీన్ని భారత్‌ కూడా ఒక ఉపయోగకరమైన నమూనాగా తీసుకోవచ్చు. దీంతో పెరుగుతున్న చైనా విస్తరణవాదాన్ని తిప్పికొట్టి, టెక్నాలజీ పాలసీని ఒక ఉపకరణంగా ప్రయోగించడాన్ని కొనసాగించవచ్చు. 

డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థకు సంబంధించి చైనా అవలంబిస్తున్న తప్పుడు ఎత్తుగడలను భారత్‌ చేపట్టకూడదు. దీనివల్ల ప్రపంచ మార్కెట్ల నుంచి చైనా సమాచార, సాంకేతిక కంపెనీల తరహాలో బహిష్కరణను ఎదుర్కొనే ప్రమాదం ఉంది. ఆఫీసులకు, స్టోర్లకు సేవలందించే సాంప్రదాయిక వ్యాపారాలలాగా కాకుండా డిజిటల్‌ సంస్థలు అంతర్జాతీయ స్థాయిలో వాణిజ్య కార్యకలాపాలు నిర్వహిస్తుంటాయి. దీనివల్ల ఇవి తీవ్రంగా ప్రభుత్వ జోక్యానికి గురయ్యే ప్రమాదం కూడా పొంచి ఉంది. ఆలీబాబాపై చైనా విధించిన ఆంక్షలు దీనికి ఉదాహరణ. చైనా దిగ్గజ కంపెనీ సంస్థాపకుడు జాక్‌ మా దేశీయంగా రెగ్యులేటరీ విధానంలో లోపాలను నిజాయితీగా వెల్లడించినందుకు తనకు ఏం జరిగిందో ప్రపంచానికి తెలుసు. 

చైనాకు చెందిన కమాండ్, కంట్రోల్‌ తరహా నమూనా.. పరిమితమైన అంతర్జాతీయ రక్షణలతో కూడిన ప్రపంచీకృతమైన డిజిటల్‌ మార్కెట్‌కు సరిపోదు. అందుకే బైడెన్‌ ప్రభుత్వం సుస్థిరత కోసం ద్వైపాక్షిక, బహుముఖ ఒడంబడికలను ఏర్పర్చుకోవడం కోసం ఇతర ప్రజాస్వామిక వ్యవస్థలతో కలిసి పనిచేయనుంది. భారతీయ ప్రమాణాల మండలి ఈ సంవత్సరం మొదట్లో డేటా గోప్యతకు హామీనిచ్చే ప్రమాణాలను విడుదల చేసింది కూడా. ఇవి ప్రపంచమంతటా ఆమోదించిన గోప్యతా సూత్రాలకు అనుగుణంగా ఉంటున్నాయి. భారత్‌లో ప్రజాస్వామ్యయుతమైన డిజిటల్‌ ఆర్థిక వ్యవస్థల ఏర్పాటుకు ఇది విస్తృత ప్రాతిపదికను ఏర్పరుస్తుంది.

- వివన్‌ శరణ్‌ 
వ్యాసకర్త కోన్‌ సలహా మండలి భాగస్వామి

మరిన్ని వార్తలు