Pakhal Tirumal Reddy: వేయి రేఖల వినూత్న సౌందర్యం

4 Jan, 2023 12:06 IST|Sakshi
పీటీ రెడ్డి

సందర్భం

పీటీ రెడ్డిగా విఖ్యాతులైన పాకాల తిరుమల రెడ్డి (1915– 1996) ప్రపంచ స్థాయికి చెందిన తెలంగాణ కళాకారుల్లో అగ్రగణ్యుడు. కరీంనగర్‌ జిల్లా, అన్నవరం గ్రామంలో 1915 జనవరి 4వ తేదీన జన్మించారు. ప్రాథమిక విద్య చదివే రోజుల్లో ఆయన్ని ప్రోత్సహించింది ప్రధానోపాధ్యాయులు అబ్దుల్‌ సత్తార్‌ సుభాని. 

తన బంధువును కలిసేందుకు ఒక రోజు రెడ్డి హాస్టల్‌కు వెళ్లాడు పీటీ. ఆ రోజు స్కౌట్స్‌ డే. ముఖ్య అతిథి బాడెన్‌ పావెల్‌. బాడెన్‌ రూపానికి 17 ఏండ్ల పీటీ కాంతి వేగంతో ప్రాణం పోస్తున్నారు. అది గమనించిన కొత్వాల్‌ పీటీని పిలిపించుకొని తన పెయింటింగ్‌ వేస్తావా అని అడిగారు! మిడాస్‌ టచ్‌!! 

రెడ్డి హాస్టల్‌ నిబంధలను సవరించి ప్రతిభావంతులైన కళాకారులకూ స్కాలర్షిప్‌ ఇవ్వవచ్చని పీటీని ‘సర్‌ జేజే స్కూల్‌ ఆఫ్‌ ఆర్ట్‌’లో చేర్పించారు కొత్వాల్‌. ముంబైలోని ఆ వినూత్న ప్రపంచంలో సూజా, కేకే హెబ్బార్, ఎమ్‌ఎఫ్‌ హుస్సేన్‌ తదితరులు సహ విద్యార్థులు. తన 22వ ఏట చిత్రించిన సెల్ఫ్‌ పోర్ట్రెయిట్‌ అంతర్‌ వ్యక్తినీ చూపిందని అధ్యాపకులు మెచ్చుకున్నారు. జేజేలో 1935 నుంచి 42 వరకు చిత్రకళను అభ్యసించి డిప్లొమా పొందారు, ఫస్ట్‌ క్లాస్, ఫస్ట్‌ ర్యాంక్‌తో!

దేశ విభజన సందర్భంలో హైదరాబాద్‌ వచ్చారు. తెలంగాణ మాండలికాన్ని తన రచనలలో శాశ్వతం చేసిన యశోదా రెడ్డిని వివాహం చేసుకున్నారు. కార్పెంటరీ ఇండస్ట్రీ నెలకొల్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ హుందాతనాన్ని తెలిపే ఫర్నిచర్‌ పీటీ రెడ్డి సమకూర్చిందే. శిల్పీ, దారుశిల్పీ; ఆయిల్, వాటర్‌ కలరిస్ట్‌ అయిన పీటీ కళా ప్రపంచానికి కానుకగా ఏమి ఇచ్చారు? ఒక్క మాటలో  భారతీయ సాంస్కృతిక తాత్విక సౌందర్య భరిత వేయి దళాల పరిమళ భరిత పుష్పం!

మన జ్ఞాపకాల పొరల్లో మసకబారిన ఆ కళారూపాలు చూడవచ్చా?  ‘స్వధర్మ’లో మూడు అంతస్తులలోని ప్రత్యేక గ్యాలరీలలో పీటీ రెడ్డి కళా రూపాలు కొలువై ఉన్నాయి. వారి కుమార్తె లక్ష్మీ రెడ్డి దంపతులు ఎంతో శ్రద్ధగా కాపాడుతున్నారు. చిరునామా సులభం. నారాయణగూడ మెట్రో పిల్లర్‌ 1155. కళాకారులు, చరిత్రకారులు అపా యింట్‌మెంట్‌ తీసుకుని సందర్శించవచ్చు. (క్లిక్‌ చేయండి: అతడి మరణం ఓ విషాదం!)


- పున్నా కృష్ణమూర్తి 
ఇండిపెండెంట్‌ జర్నలిస్ట్‌
(జనవరి 4న పీటీ రెడ్డి జయంతి)

మరిన్ని వార్తలు