Bhimbor Deori: భీంబర్‌ డియోరీ.. ఆదర్శ గిరిజన నేత

29 Nov, 2022 12:50 IST|Sakshi
భీంబర్‌ డియోరీ

భారత స్వాతంత్య్ర అమృతోత్సవాల సంరంభంలో ఉన్న మనం ఈశాన్య భారత్‌కు చెందిన భీంబర్‌ డియోరీని గుర్తుచేసుకోవాలి. ఈయన అసోంను తూర్పు పాకిస్తాన్‌లో విలీనం చేసే ప్రయత్నాలను విఫలం చేసిన జన నాయకుడు. అలాగే స్వదేశీ వర్గాలను ఉద్ధరించడంలో, అసోం ప్రయోజనాలను పరిరక్షించడంలోనూ కీలక పాత్ర పోషించారు. ఆయన కృషి ఫలితంగా అసోం విధాన సభలో గిరిజనుల కొరకు 5 స్థానాలు రిజర్వు చేయబడ్డాయి. 

స్వాతంత్య్రేచ్ఛ ఆయన రక్తంలోనే ఉంది. ప్రత్యేక మాతృభూమి కోసం 1945 మార్చి 21– 23 మధ్య ‘ఖాసీ దర్బార్‌ హాల్‌ తీర్మానాలు’ చేశారు. ఈ తీర్మానాలతో వివిధ గిరిజన తెగలకు చెందిన స్థానిక నాయకులు తమ స్వతంత్ర మాతృభూమిని పునరుద్ధరించాలని నిర్ణయించుకున్నారు. 

ఆయన 1903 మే 16న అసోంలోని శివసాగర్‌ జిల్లాలోని వనిదిహింగ్‌ గ్రామంలో గోదారం డియోరీ, బజోతి డియోరీ దంపతులకు జన్మించారు. సాధారణ గిరిజన యువకుడైన భీంబర్‌ అసోం సివిల్‌ పరీక్షలో ప్రథమ స్థానం సంపాదించారు. కానీ ఈయన గిరిజనుడైనందున బ్రిటిష్‌ ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించింది. పట్టుదలతో ఆయన డిబ్రుగర్‌లో న్యాయవాద వృత్తిని ప్రారంభించారు. 

1933లో ‘అసోం బ్యాక్‌వర్డ్‌ ప్లెయిన్స్‌ ట్రైబల్‌ లీగ్‌’ని స్థాపించి దాని వ్యవస్థాపక జనరల్‌ సెక్రటరీగా పని చేశారు. 1941 జూన్‌ 18న వివిధ విద్యా సంస్థలకు చెందిన వసతి గృహాలలో చదువుకుంటున్న గిరిజన విద్యార్థులను జనరల్‌ డైనింగ్‌ హాల్లోకి అనుమతించమని పోరాడారు. 1946 జూలై 8న అసోం ప్రభుత్వంలో అటవీ, కార్మిక శాఖ మంత్రిగా నియమితులైనారు. అసోం ప్రజల హృదయాల్లో భీంబర్‌ డియోరీ ఆదివాసీల నాయకుడిగానేగాక, ఆదర్శ జననేతగా నిలిచి 1947 నవంబర్‌ 30న తనువు చాలించారు.

– గుమ్మడి లక్ష్మీ నారాయణ
ఆదివాసీ రచయితల వేదిక వ్యవస్థాపక కార్యదర్శి
(నవంబర్‌ 30న భీంబర్‌ డియోరీ 75వ వర్ధంతి)

మరిన్ని వార్తలు