మన విజయగాథకు ఇదే మూలం!

27 Oct, 2021 01:18 IST|Sakshi

విశ్లేషణ

దేశంలోని నాలుగు దిగ్గజ ఐటీ సంస్థలు ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఆరునెలల్లో లక్షమందికి పైగా ప్రొఫెషనల్స్‌కు ఉద్యోగావకాశాలు కల్పించాయి. యువతీయువకులను కొత్తగా పెద్ద సంఖ్యలో నియమించుకుంటున్నారంటేనే ఈ కంపెనీల లాభాలు వేగంగా పెరుగుతున్నాయని అర్థం. భారతీయ ఐటీ పరిశ్రమ అసాధారణ వేగంతో ముందుకు సాగుతోందనటానికి ఈ నియామకాలు తిరుగులేని సంకేతం. కానీ ప్రతికూల వార్తలకు, నిరాశా నిస్పృహలకు మాత్రమే విలువనిచ్చే మన సమాజం ఇలాంటి అద్భుతమైన సానుకూల వార్తను పట్టించుకోదు. మన ఐటీ కంపెనీలు కోవిడ్‌ మహమ్మారి కాలంలోనూ ఇంత ఘన విజయం సాధించడానికి బలమైన నాయకత్వం, పోటీతత్వమే కారణమని గ్రహించాలి.

దురదృష్టవశాత్తూ, భారతదేశంలో సానుకూల వార్తలకు ఈరోజుల్లో చాలా తక్కువ ప్రాధాన్యమిస్తుంటారు. వాటిగురించి మాట్లాడేది కూడా తక్కువేనన్నది అందరికీ తెలిసిన విషయమే. ఒకవేళ అలాంటి వార్తలు కాస్త ముందుకొచ్చినా, అవి వెంటనే మాయమైపోతుంటాయి. మరుగున పడుతుంటాయి. ప్రస్తుతం నిరాశావాదాన్ని ప్రేరేపించే నిస్పృహ కలి గించే వార్తలపై అధికంగా దృష్టి సారించే అలవాటు ఎక్కువగా కనిపిస్తుంటుంది. ఇదే ఇప్పటి ఫ్యాషన్‌ అని చెప్పాలి. 

ప్రస్తుతం దేశ ముఖచిత్రం నుంచి ఒక గొప్ప ఉదాహరణను పరిశీలిద్దాం. దేశంలోని నాలుగు ప్రముఖ ఐటీ సంస్థలు – టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌(టీసీఎస్‌), ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోని తొలి ఆరు నెలల్లో లక్షమందికి పైగా వృత్తినిపుణులైన యువతను ఉద్యోగాల్లో నియమించాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలంతో పోలిస్తే ఇది 13 రెట్లు ఎక్కువ. భారతీయ ఐటీ పరిశ్రమ అసాధారణ ముందంజలో సాగుతోందనటానికి ఈ నియామకాలు తిరుగులేని సంకేతం.

టీసీఎస్‌లో ప్రస్తుతం 5 లక్షలమంది వృత్తి నిపుణులు పనిచేస్తున్నారు. పైన పేర్కొన్న ఇతర ఐటీ సంస్థలు కూడా లక్షలాదిమందిని ఉద్యోగాల్లో నియమించాయి. వీటిలో పనిచేసిన ప్రొఫెషనల్స్‌ మంచి అవకాశాలు రాగానే ఇతర కంపెనీలకు కూడా తరలి వెళ్లారు. గత త్రైమాసికంలో ఇన్ఫోసిస్‌ సిబ్బందిలో 20 శాతం మంది రాజీనామా చేశారు. ఇన్ఫోసిస్‌ వంటి సుప్రసిద్ధ కంపెనీని వదిలి ఉద్యోగులు వెళ్లిపోతున్నారంటే, వారికి మరింత మెరుగైన అవకాశాలు లభిస్తున్నాయని అర్థం.

మన ఐటీ రంగంలోని కంపెనీలు అభివృద్ధి, పురోగతికి సంబంధించిన అన్ని రికార్డులను ఎలా బద్దలు చేశాయో చూపడానికి ఇది ఒక ఉదాహరణ మాత్రమే. యువతీయువకులను కొత్తగా పెద్ద సంఖ్యలో నియమించుకుంటున్నారంటేనే ఈ కంపెనీల లాభాలు వేగంగా పెరుగుతున్నాయని అర్థం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండో త్రైమాసికంలో టీసీఎస్‌ ఒక్కటే రూ. 9,624 కోట్ల లాభాన్ని ఆర్జించింది.

ఈ  సంవత్సరం తొలి త్రైమాసికంలో కంపెనీ 9,800 కోట్ల లాభాలను ఆర్జించింది. ఇక ఇన్ఫోసిస్‌ తన వంతుగా ఈ సంవత్సరం తొలి త్రైమాసికంలో రూ. 5,500 కోట్ల లాభాన్ని ఆర్జించగా, విప్రో, హెచ్‌సీఎల్‌ కూడా అసాధారణమైన ఫలితాలను సాధించాయి. ఇంత భారీ ముందంజ వేసినప్పటికీ ఇలాంటి అద్భుతమైన వార్తల పట్ల దేశం ఎలాంటి ప్రత్యేక స్పందనలను వ్యక్తీకరించడం లేదు. ఈ రోజు హింస ఎక్కడ జరిగింది, దేశం కోలుకోలేని విధంగా ఎక్కడ నష్టపోయింది వంటి వార్తలకే ప్రాధాన్యముండటం విచారకరం.  

అయితే, టాటా గ్రూప్‌ ఇటీవలే ఎయిర్‌ ఇండియాను రూ. 18 వేల కోట్లు వెచ్చించి కొనుగోలు చేయడానికి దాని కీలక సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ ఆర్జించిన అపారమైన లాభాలే కారణమని జనాం తికంగా చెప్పుకుంటున్నారు. టీసీఎస్‌ రెండు త్రైమాసికాల ఫలితాల దన్నుతో టాటా గ్రూప్‌ సులువుగా ఎయిర్‌ ఇండియాను కొనేసింది. టీసీఎస్, ఇన్ఫోసిస్, విప్రో, హెచ్‌సీఎల్‌ కంపెనీలు సాధించిన అద్భుత విజయాల వెలుగులో, ఏ కంపెనీ లాభాలు ఆర్జించడంలో అగ్రస్థానంలో ఉంది, మార్కెట్‌లో ఏ కంపెనీకి ఎక్కువ పరపతి ఉంది అనే అంశాలపై మీరెన్నడైనా ఆలోచించారా?

ఈ ప్రశ్నలకు సమాధానాలు వెతకడం ఏమంత కష్టమైన పని కాదు. ఉత్తమ నాయకత్వం, సరైన మార్గదర్శకత్వం కారణంగానే ఇంతటి పురోగతి సాధ్యపడింది. ఇప్పుడు టీసీఎస్‌ని ఉదాహరణగా తీసుకుందాం. ప్రస్తుతం ఆ కంపెనీ సీఈఓ, మేనేజింగ్‌ డైరెక్టర్‌ రాజేశ్‌ గోపీనాథ్‌ టీసీఎస్‌ పగ్గాలు చేపట్టడానికి ముందే టీసీఎస్‌ ప్రపంచస్థాయి కంపెనీగా మారింది.

ఈ ఘనత మొత్తంగా ప్రస్తుత టాటా కంగ్లామరేట్‌  చైర్మన్‌ ఎన్‌. చంద్రశేఖరన్‌కే దక్కాల్సి ఉంది. ఈయన 2009లో టీసీఎస్‌ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ అయ్యారు. వృత్తిపరంగా తన కెరీర్‌ను కూడా టీసీఎస్‌తోనే మొదలెట్టారు. టీసీఎస్‌ వ్యవహారాలను అద్భుతంగా పర్యవేక్షించి, నిర్వహించారు. నాయకత్వ నైపుణ్యాలను టాటా గ్రూప్‌ చైర్మన్‌ రతన్‌ టాటా, టీసీఎస్‌ వ్యవస్థాపక చైర్మన్‌ ఫకీర్‌చంద్‌ కోహ్లీ నుండి చంద్రశేఖరన్‌ నేర్చుకున్నారు. 

ఈరోజు సమాచార సాంకేతిక రంగంలో భారతదేశాన్ని ఒక నిగూఢ శక్తిగా యావత్‌ ప్రపంచం గుర్తిస్తోంది. భారత ఐటీ రంగం విలువ 190 బిలియన్‌ డాలర్లకు చేరింది. ఈ ఘనత మాత్రం ఫకీర్‌ చంద్‌ కోహ్లీకే దక్కాలి. దేశంలోనే ఐటీ రంగానికి పునాది వేసిన వ్యక్తి ఈయన. అలాంటి కోహ్లీ, రతన్‌ టాటాలతో కలిసి పనిచేసిన చంద్రశేఖరన్‌ ఒక సృజనాత్మక సంస్కృతిని, ప్రతిభాపాటవాలను నేర్చుకున్నారు. ఇకపోతే శివ్‌ నాడార్‌ గురించి మాట్లాడుకుందాం. ఈయన తమిళనాడు లోని తంజావూర్‌ నుంచి వచ్చారు. ఒంటిచేత్తో హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌ని ఏర్పర్చారు.

తన సుదీర్ఘ నాయకత్వంలో హెచ్‌సీఎల్‌ని అతి గొప్ప సాఫ్ట్‌వేర్‌ కంపెనీగా మార్చారు. తమ గుహల్లోంచి బయటకు వచ్చి ఏదైనా విభిన్నంగా ఆలోచించాల్సిందిగా తన కంపెనీ సీఈఓలను, మేనేజర్లను ఆయన ప్రభావితం చేశారని ప్రతీతి. నాడార్‌ ఎల్లప్పుడూ తన ఉద్యోగులకు దన్నుగా నిలిచారు. అందుకే ఆయన కింద పనిచేసే మేనేజర్లు అత్యుత్తమ ఫలితాలను సాధించారు. ఈ రోజు ఈ కంపెనీ కనీసం అరడజన్‌ పైగా దేశాల్లో ఉనికిలో ఉంటూ వంద ఆఫీసులను తెరిచింది. లక్షమంది ప్రొఫెషనల్‌ ఇంజనీర్లు ఈ సంస్థతో ముడిపడి ఉన్నారు. జేఆర్‌డీ టాటాలోని పోరాటస్ఫూర్తి, చురుకైన వ్యాపార తత్వం శివ్‌ నాడార్‌లో కనిపిస్తాయి. విద్య, జాతీయ నిర్మాణం పట్ల వీరిద్దరి విశ్వాసాలు దాదాపు ఒకేలా ఉంటాయి.

ఇక ఇన్ఫోసిస్‌ లిమిటెడ్‌. దీని ప్రస్తుత సీఈఓ సలీల్‌ పరేఖ్‌. చరిత్ర ప్రసిద్ధుడైన నారాయణమూర్తి ఈ సంస్థకు పునాది వేశారు. ఈ క్రమంలో నందన్‌ నీలేకని వంటి సహచరుల సహాయం ఈయనకు లభించింది. నందన్‌ నీలేకని ఇప్పటికీ ఇన్ఫోసిస్‌ వర్కింగ్‌ చైర్మన్‌గా వ్యవహరిస్తున్నారు. తన జీవితంలోని ప్రతి క్షణాన్ని అర్థవంతంగా మల్చుకోవడంలో నారాయణ మూర్తి తీరిక లేకుండా ఉంటారు. మానవ జీవితం క్షణభంగురమే కావచ్చు, కానీ మనం చేసే సత్కార్యాల ద్వారా మన జీవితాన్ని అర్థవంతంగా మార్చుకునే అవకాశాన్ని భగవంతుడు మనకు అందిస్తాడు.  అంధకారమనే సామ్రాజ్యం ఎంత పెద్దదైనా కావచ్చు కానీ చిన్న దీపం తాను ఆరిపోయేంతవరకు ఆ అంధకారంతో పోరాటం సాగిస్తూనే ఉంటుంది.

అలాగే పూల జీవిత కాలం చాలా చిన్నదే కావచ్చు కానీ తమలోని పరిమళాన్ని చివరివరకూ వెదజల్లే ధర్మాన్ని నిర్వరిస్తూనే ఉంటాయి. నారాయణమూర్తి తెలిసిగానీ, తెలీకగానీ తన జీవితాన్ని పైన పేర్కొన్న దీపం, పూవుల్లాగే మలుచుకున్నారు. మునుపెన్నడూ చేయని మంచిపనులను చేస్తూ పోవాలని ఆయన ఆకాంక్ష. అందుకే ఆయన జీవితం మచ్చలేకుండా నడిచింది. తన కంపెనీకి కొత్త దిశను కల్పిస్తూ సామాజిక శ్రేయస్సు కోసం అనేక సంక్షేమ పథకాలకు భారీ ఎత్తున విరాళాలు ఇస్తూపోయారు. అందుకే తనతోపాటు తన కంపెనీ ఇన్ఫోసిస్‌ నిరంతరం విజయసాధనను కొనసాగిస్తూ వచ్చింది. 

వీరందరి లాగే విప్రో లిమిటెడ్‌ చైర్మన్‌ అజీం ప్రేమ్‌జీ జీవితం కూడా. తనది అసాధారణ స్వభావం. అత్యున్నత విద్యాప్రమాణాలు, ర్యాంకింగ్‌ కలిగిన గొప్ప మేనేజర్లను ఆయన సంస్థలో చేర్చుకున్నారు. ప్రతిభాపాటవాల ప్రాతిపదికనే విప్రోలో కీలకమైన స్థానాల్లో ప్రొఫెషనల్స్‌ని నియమించుకున్నారు. ఈ ప్రతిభా మార్గదర్శకత్వ ఫలితంగానే విప్రో దేశంలోనే అగ్రగామి కంపెనీగా అవతరించింది.

కాబట్టే, భారత ఐటీ కంపెనీల శరవేగ పురోగతితో అసంఖ్యాక యువతకు ఉద్యోగ అవకాశాలు రావడమే కాదు, దేశం భారీ మొత్తంలో ఆదాయ పన్నును, విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జిస్తోంది. అయితే ఈ కంపెనీలు అసాధారణ విజయాన్ని పొందటానికి బలమైన, స్ఫర్ధాస్వభావం కలిగిన నాయకత్వమే కారణమని గ్రహించాలి.
-ఆర్‌కే సిన్హా
వ్యాసకర్త సీనియర్‌ ఎడిటర్, మాజీ రాజ్యసభ సభ్యుడు

మరిన్ని వార్తలు