తీరప్రాంత రక్షణలో మన ఐఎన్‌ఎస్‌ విశాఖపట్టణం

23 Nov, 2021 14:13 IST|Sakshi

భారత తీరప్రాంత రక్షణ కోసం ప్రత్యేకించి హిందూ మహాసముద్ర ప్రాంతంలో రక్షణ కోసం దేశీయంగా నిర్మించిన అధునాతనమైన క్షిపణి విధ్వంస వాహక నౌక ‘ఐఎన్‌ఎస్‌ విశాఖపట్నం’ ఆదివారం జలప్రవేశం చేసింది. రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ ముంబై తీరంలో ఈ ఆధునిక యుద్ధనౌకను ప్రారంభించారు. శత్రు రాడార్లు గుర్తించలేని ఈ యుద్ధనౌక ద్వారా ఉపరితలం నుంచి ఉపరితలానికి, ఉపరితలం నుంచి గగనతలానికి కూడా క్షిపణులను ప్రయోగించవచ్చు.  

‘ఐ.ఎన్‌.ఎస్‌. విశాఖపట్టణం’ పేరుతో భారత రక్షణ మంత్రిత్వ శాఖ మెజగావ్‌ డాక్‌ యార్డ్‌ లో రూ. 35 వేల కోట్లతో అత్యంత ఆధునిక హంగులతో క్షిపణి విధ్వంస వాహకనౌకను నిర్మించింది. అమెరికా చీఫ్‌ ఆఫ్‌ నేవల్‌ ఆపరేషన్స్‌ అడ్మిరల్‌ మైఖేల్‌ గిల్డే విశాఖపట్టణం నేవల్‌ డాక్‌ యార్డ్‌ నుంచి మన రక్షణశాఖ అధికారులతో కలిసి, గత నెలలో బంగాళాఖాతంలో జరిగిన ‘మలబార్‌–2’ యుద్ధ నౌకా విన్యాసాల్లో పాల్గొన్నారు. ఇది జరిగిన నెలరోజుల్లోనే, నేరుగా ఒక క్షిపణి విధ్వంసక నౌక– ‘ఐ.ఎన్‌.ఎస్‌. విశాఖపట్టణం’ పేరుతో అంతర్జాతీయ సముద్ర జలాల్లోకి ప్రవేశించడం, భారత రక్షణశాఖ ‘మ్యాప్‌’లో పెరిగిన విశాఖపట్టణం నగరం ప్రాధాన్యతను తెలియచేస్తున్నది.

అయితే, విశాఖ నగరంపై అంతర్జాతీయ ‘ఫోకస్‌’ పెట్టడం అనేది ఇప్పటి మాట కాదు. బరాక్‌ ఒబామా ప్రభుత్వం ఇండియాలో ‘స్మార్ట్‌ సిటీలు’గా అభివృద్ధి చేయడానికి, జనవరి 2015లో భారత ప్రభుత్వంతో కుదుర్చుకున్న ఒప్పందంలో– అజ్మీర్, అలహాబాద్, విశాఖపట్టణం నగరాలు ఉన్నాయి. అయితే, డోనాల్డ్‌ ట్రంప్‌ హయాంలో అది ఆగిపోయింది. అంతే కాదు, ట్రంప్‌ నిర్లక్ష్యంతో అమెరికా–ఇండో–ఫసిఫిక్‌ విధానా నికి ‘ఆసియాన్‌’ దేశాల్లో ఐదేళ్ళు స్తబ్దత తప్పలేదు. జనవరిలో జో బైడెన్‌ అమెరికా అధ్యక్షుడుగా వచ్చాక, ఈ ఏడాది చివరి నాటికి ఈ అంశంపై కొత్త కదలిక మొదలవడం తెలిసిందే. (చదవండి: ఇప్పుడు గుర్తొచ్చిన జాతీయ ప్రయోజనం!)

అంతర్జాతీయ విపణిపై చైనా పట్టును నిలువరించడం అగ్ర రాజ్యాల అవసరం అయ్యాక, జరుగుతున్న ప్రతి పరిణామా నికి ఆసియా కేంద్రంగా మారింది. ఒకప్పటి ‘ప్రచ్ఛన్నయుద్ధం’ స్థానంలోకి విశ్వ వాణిజ్యం లక్ష్యంగా – భౌగొళిక ప్రాతిపదిక రాజకీయాలు... నూతన దౌత్య ప్రత్యామ్నాయాలు అయ్యాయి. గత దశాబ్దంలో ‘యూపీఏ–2’ చొరవతో ‘ఆసియాన్‌’ సభ్యదేశా లతో జరిగిన స్వేచ్ఛావాణిజ్య ఒప్పందంతో ఆ జాబితాలోకి అలా చేరినదే కేరళ రబ్బరు, మన అరకు – ‘గిరిజన్‌ కాఫీ’. 

ఈ నేపథ్యంలో భారత ప్రభుత్వం నూతనంగా ఆవిష్కరిస్తున్న క్షిపణి విచ్చిన్న యుద్ధ నౌకకు ‘ఐ.ఎన్‌.ఎస్‌. విశాఖ పట్టణం’ అని నామకరణం చేస్తున్నట్లు నవంబర్‌ 16న ఢిల్లీలో నేవీ వైస్‌–చీఫ్‌ వైస్‌ ఎడ్మిరల్‌ ఎస్, ఎన్‌. ఘోర్మాడే ప్రకటిం చారు. ఇప్పుడు దేశవ్యాప్తంగా ఉన్న మన నౌకానిర్మాణ యార్డుల్లో 39 యుద్ధ నౌకలు, జలాంతర్గాముల నిర్మాణం జరుగుతోంది. త్రివిధ దళాల బలగాలను ఒక్కటిగా సమీకృతం చేసి, మన పోరాట శక్తిని పెంచుకునే వ్యూహం అమల్లో ఉందని, దాని ఫలితాలు ప్రోత్సాహకరంగా ఉన్నాయన్నారు ఘోర్మాడే. (చదవండి: చట్టాల రద్దుతో మారనున్న రాజకీయం)

ఇకముందు ‘విశాఖపట్టణం’ నగరం పేరు ఇలా ఆసియా ‘మారిటైమ్‌’ పటంపై కనిపించడం తెలుగు ప్రజలకు ప్రతిష్ఠా త్మకమైన అంశం. అయినా ఇలా విశాఖ నగరం కీలకం కావడం ఇది మొదటిసారి కాదు. పన్నెండేళ్ల క్రితం అప్పట్లో భారతీయ నౌకాదళం అధునికీకరణలో భాగంగా– ‘సీక్రెటివ్‌ అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ వెస్సల్‌ ప్రాజెక్ట్‌’ కింద ఐదు స్వదేశీ నిర్మాణ జలాం తర్గాములను మనదేశం నిర్మించాలని తలపెట్టింది. అప్పుడు కూడా ఇదే విశాఖపట్టణం నేవల్‌ డాక్‌ యార్డ్‌లోనే 26 జూలై 2009న వాటిలో మొదటి సబ్‌–మెరైన్‌– ‘ఐ.ఎన్‌.ఎస్‌. అరి హంత్‌’ను నాటి ప్రధాని డా. మన్మోహన్‌ సింగ్‌ అవిష్కరించారు. అప్పటినుండి 2016 ఫిబ్రవరి వరకు ‘అరిహంత్‌’ సామర్థ్యంపై సముద్ర జలాల్లో విస్తృత పరీక్షలు జరిగాక, 2018 నుంచి మన నౌకాదళంలో ‘అరిహంత్‌’ భాగం అయింది. 

ఈ పరిణామాల మధ్యలోనే, 2014లో ఉమ్మడి రాష్ట్ర విభ జన, ఎన్నికల తర్వాత కేంద్రంలో ప్రభుత్వ మార్పు రెండూ జరి గాయి. మరి దేశానికీ, తూర్పుతీరంలో రక్షణ శాఖకూ ఇంతగా ప్రాధాన్యత వున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం స్వంతంగా నిలదొక్కు కోవడానికి, చేయూత అందించే విషయంలో– ‘విభజన చట్టం’ లోని అంశాల అమలు పరిధులు దాటి కేంద్రం చూపించిన చొరవ కనిపించదు. కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ రాజకీయ ప్రయోజనం లేకపోవడం, అనే ఒక్క కారణం తప్ప దీనికి మరో కారణం ఇప్పటికీ కనిపించదు. అయితే, ప్రభుత్వాల దేశీయ అంశాల ప్రాధాన్యతలు ఎలావున్నప్పటికీ, దేశ ప్రాదేశిక సరిహద్దుల భద్రతకు ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొనే విషయంలో, రక్షణశాఖ ప్రాధాన్యతలు మాత్రం అలా ఉండ వని– ‘ఐ.ఎన్‌.ఎస్‌. విశాఖపట్టణం’ నామకరణంతో స్పష్టం అవుతున్నది.


- జాన్‌సన్‌ చోరగుడి 

వ్యాసకర్త సామాజిక, రాజకీయ విశ్లేషకులు

మరిన్ని వార్తలు