వివాదాస్పద భోగి.. జాన్‌ మెకాఫే

26 Jun, 2021 10:36 IST|Sakshi

ఆయన ప్రసిద్ధ కంప్యూటర్‌ సైంటిస్ట్‌. యాక్టివిస్ట్‌. వ్యాపార వేత్త. క్రిప్టో కరెన్సీ సమర్థకుడు. పుస్తక రచయిత. ఇన్ని కోణాలున్న ఆయన సృష్టించిన ‘మెకాఫే యాంటీ వైరస్‌’ సాఫ్ట్‌వేర్‌ పేరు కంప్యూటర్లు వాడే అందరికీ తెలుసు. అమెరికా అధ్యక్ష పదవికి రెండుసార్లు ఆరాటపడ్డ జాన్‌ మెకాఫేది చెప్పాలంటే చాలానే ఉన్న జీవితం. ఏకంగా చిత్రంగా తెరకెక్కిన జీవితం.   

ఒక కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌ ఈ స్థాయికి రావడం కనీవినీ ఎరుగని చరిత్ర. బార్సిలోనా జైలులో నవమాసాలుగా గడు పుతూ, డెబ్భై ఆరో ఏట ఈ జూన్‌ 23న నిర్జీవుడై కనిపించే వరకు మెకాఫే తనదైన పద్ధతిలో జీవించిన భోగి. ఆయన చేసిన ప్రతీదీ ఓ వార్తే. క్రిప్టో కరెన్సీని సమర్థించారు. పన్నులు చెల్లించేదేమిటని ధిక్కరించారు. డ్రగ్స్‌ తీసుకున్నారు. తుపాకీ చేతపట్టారు. వనితలతో కలసి విశృంఖలంగా విహరించారు. విగ్రహారాధనను వ్యతిరేకించారు. వివాదాలతో వీధికెక్కారు. చివరకు ఆత్మహత్య అంటున్న ఆయన అర్ధంతర మరణమూ సంచలన వార్తయింది. పన్ను ఎగవేత కేసుల్లో ఆయనను అమెరికాకు అప్పగించడానికి అనుమతిస్తూ స్పెయిన్‌ కోర్టు ఉత్తర్వు లిచ్చిన కాసేపటికే మెకాఫే జీవితం జైలులో ముగిసింది.

సాహసాలన్నా, రహస్యాలన్నా ఇష్టమన్న ఆయన చాలా దుస్సాహసాలే చేశారు. సైద్ధాంతిక కారణాలతో 8 ఏళ్లుగా ఆదాయపు పన్ను ఎగ్గొట్టానని 2019లో ఆయనే చెప్పారు. అప్పటినుంచి అమెరికా న్యాయవిచారణను తప్పించుకోవడం కోసం కాందిశీకుడిగా కాలం గడిపారు. ఓ విలాసవంతమైన నౌకలో కాలక్షేపం చేశారు. భార్య, నాలుగు కుక్కలు, ఇద్దరు సెక్యూరిటీ గార్డులు, ఏడుగురు సిబ్బంది– ఇదే ఆ నౌకలో ఆయన ప్రపంచం. ‘‘స్త్రీలంటే పడిచచ్చే ప్రేమికుణ్ణి’’ అంటూ తనను అభివర్ణించుకున్న ఆయన కనీసం 47 మంది పిల్లల పుట్టుకకు కారణం. మూడేళ్ళ క్రితం ఆయనే ఆ మాట చెప్పు కున్నారు. తెర వెనుక కథలెన్నో ఒప్పుకున్నారు. ఏడు పదులు దాటిన వయసులో పదిహేడేళ్ళ అమ్మాయితో కలసి, ఇంటి నిండా ఆయుధాలతో పోలీసుల కంటపడి పారిపోయారు. 

డబ్బు, పేరుప్రతిష్ఠలు, వివాదాలు– మెకాఫే చుట్టూ వైఫైలా తిరిగాయి. 1987లో ప్రపంచంలో తొలి కమర్షియల్‌ యాంటీవైరస్‌ సాఫ్ట్‌వేర్‌ను ఆరంభించింది మెకాఫేనే! ఇవాళ్టికీ ప్రపంచవ్యాప్తంగా 50 కోట్ల పైచిలుకు మంది వాడుతున్న సాఫ్ట్‌వేర్‌ అది. పదేళ్ళ క్రితమే ఆ సంస్థను ‘ఇన్‌టెల్‌’కు అమ్మే సినా, ఆ సాఫ్ట్‌వేర్‌ మాత్రం ఇప్పటికీ మెకాఫే పేరుతోనే ప్రపంచ ప్రసిద్ధం. ఒకప్పుడు అమెరికా అంతరిక్ష పరిశోధనా సంస్థ ‘నాసా’ సహా జిరాక్స్‌ లాంటి సంస్థల్లో పనిచేశారీ బ్రిటిష్‌–అమెరికన్‌ కంప్యూటర్‌ ప్రోగ్రామర్‌. కాలక్రమంలో ఆయన సంపాదన కూడా అపారమైంది. ‘క్రిప్టోకరెన్సీ గురు’గా మారిన ఆయన రోజుకు వేల డాలర్లు సంపాదించారు. ఈ క్రిప్టో కరెన్సీలు, కన్సల్టింగ్‌ పనులు, నిజ జీవితకథ హక్కుల విక్రయం– ఇలా అనేక విధాలుగా ఆయన లక్షల డాలర్లు ఆర్జిం చారు. చివరకొచ్చేసరికి జైలులోనే జీవిత చరమాంకం గడిచి పోతుందని భయపడి, జీవితం ముగించారు. 

వివాదాస్పద వ్యాఖ్యల మెకాఫేకు ట్విట్టర్‌లో ఏకంగా 10 లక్షలమంది ఫాలోయర్లున్నారు. దాన్నిబట్టి ఆయన పెంచు కున్న ప్రాచుర్యం అర్థం చేసుకోవచ్చు. మెకాఫే పుట్టింది బ్రిటన్‌లో అయినా, అమెరికా అధ్యక్ష పదవికి ఒకటికి రెండు సార్లు నామినీగా నిలబడాలని ప్రయత్నించడం మరో కథ. లిబర్టేరియన్‌ పార్టీ పక్షాన అధ్యక్ష పదవికి పోటీ చర్చల్లోనూ పాల్గొన్న గతం ఆయనది.

‘గంజాయి వాడకాన్ని నేరంగా పరిగణించరాదు... ప్రభుత్వం సైజు తగ్గించాలి... అహింసాత్మక నేరాలకు పాల్పడ్డ వారందరినీ జైలులో నుంచి విడుదల చేయాలి...’ ఇదీ అప్పట్లో ఆయన వాదన. అమెరికా అధ్యక్ష పదవికి పోటీపడాలనుకొనే స్థాయికి వెళ్ళిన ఆ వ్యక్తి, ఇస్తాంబుల్‌కు పారిపోతుండగా బార్సి లోనా విమానాశ్రయంలో పట్టుబడి, జైలుగోడల మధ్య నిరాశలో మగ్గడం ఊహకందని జీవిత వైకుంఠపాళీ. (జాన్‌ మెకఫీ మృతి.. ముందే అనుమానించిన భార్య)

మెకాఫే ఎంతో సంపాదించారు. రియల్‌ ఎస్టేట్‌ మొదలు హెర్బల్‌ యాంటీ బయాటిక్స్, బిట్‌కాయిన్‌ మైనింగ్‌– ఇలా ఎన్నో వ్యాపారాల్లో వేలుపెట్టారు. 2007 నాటి అమెరికా ఆర్థిక సంక్షోభంలో ఎంతో పోగొట్టుకున్నారు. జీవితం ఆఖరి ఘట్టంలో ఆయన ఆస్తులన్నీ జప్తయ్యాయి. ఏ తంటా వస్తుందో ఏమోనన్న భయంతో స్నేహితులు జారుకున్నారు. మెకాఫే చేతి కింద ఎవరూ, చేతిలో ఏమీ లేని ఒంటరి అయ్యారు. అయినా సరే జీవితంలో చేసిన తప్పొప్పులకు విచారం లేదనేవారు. ‘నాలో ఉదారతా ఉంది. అప్రమత్తతా ఉంది. హాస్యప్రియత్వమూ ఉంది. అన్నిటికీ మించి వేప కాయంత వెర్రీ ఉంది’ అనేవారు. 

జీవితంలోని విభిన్న రుచులు, అభిరుచుల మిశ్రమం కాబట్టే, మెకాఫే జీవితం ఓ సినిమాస్టోరీ. ఆయనపై ‘గ్రింగో: ది డేంజరస్‌ లైఫ్‌ ఆఫ్‌ జాన్‌ మెకాఫే’ అంటూ అయిదేళ్ళ క్రితం ఓ డాక్యుమెంటరీ చిత్రం వచ్చింది. అనేక ప్రభుత్వాలతో తలపడి, జీవిత చరమాంకంలో పారిపోతూ, ప్రవాసంలో గడిపిన మెకాఫే జీవితం ఎన్నో పాఠాలు చెబుతుంది. మెకాఫే మాటల్లోనే చెప్పాలంటే, 75 ఏళ్ళ ఆయన జీవితం ‘స్వర్గ నరకాల మధ్య సాగిన ఉత్థాన పతనాల ఉయ్యాల’! జైలు జీవితంతో విరాగిగా మారిన ఓ వివాదాస్పద భోగి ఆయన.
– రెంటాల జయదేవ

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు