ఇప్ప నారాయణరెడ్డి.. స్మృతివనంలో త్యాగధనుడు

29 Jul, 2022 12:21 IST|Sakshi

రాజన్న సిరిసిల్ల జిల్లాలో నాలుగువేల లోపు జనాభా కలిగిన ఒక చిన్న ఊరి పేరు దుమాల. 21 మంది రక్త తర్పణలతో అమరుల స్మృతి వనంగా ఈ ఊరు ప్రాధాన్యత సంతరించుకుంది. సరిగ్గా నేటికి 50 సంవత్సరాల క్రితం ‘శ్రీ వేంకటేశ్వర యువజన సంఘం’ స్థాపించి, దుమాలలో నూతన చైతన్యానికి అంకురార్పణ చేసిన ఇప్ప నారాయణరెడ్డి, ఆయన మిత్ర బృందం రైతుకూలీ సంఘం నిర్మాణం ద్వారా విప్లవోద్యమానికి కూడా నాంది పలికారు. మధ్యయుగాల నాటి భూస్వామ్య దోపిడీనీ, దానిపై ప్రజల పోరాటాన్నీ అర్థం చేసుకోవడానికి దుమాల గ్రామం అచ్చు గుద్దినట్టు సరిపోతుంది. 

పంచాయితీ వ్యవస్థ అమల్లోకి వచ్చే ముందూ... వచ్చిన తర్వాత కూడా దుమాలలో దొర, మాలి పటేల్, పోలీస్‌ పటేల్, పట్వారి వ్యవస్థలు కొనసాగిన రోజుల్లో... లక్ష్మయ్య దొర.. దొరగా, కిష్టయ్య దొర మాలిపటేల్‌గా, నాంపల్లి దొర పోలీస్‌ పటేల్‌గా, నారాయణ పంతులు పట్వారీగా– దాదాపు 300 ఎకరాల భూములకు యజమానులుగా ఉండేవారు. వీరి దోపిడీ, పీడనలకు వ్యతిరేకంగా ప్రజలు పోరాడారు. 1978లో ప్రభుత్వం కల్లోలిత ప్రాంతంగా ఈ ఏరియాను ప్రకటించి భూస్వాములకు అండగా నిలిచింది. దీంతో ప్రజాపోరాటం ఎగసిపడింది.

1989 ఫిబ్రవరి 23న దుమాలకు చెందిన కానవరపు చంద్రయ్యను బెజ్జంకి దగ్గర బూటకపు ఎన్‌కౌంటర్‌ చేయడంతో హింసాకాండ రూపమే మారిపోయింది. 2001 వరకు 22 సంవత్సరాలు నిరాఘాటంగా సాగిన ఈ హత్యాకాండలో 21 మంది ఈ గ్రామానికి చెందినవారు మరణించారు. శ్రీ వెంకటేశ్వర యువజన సంఘం ప్రాథమిక పాఠశాలకు తరగతి గదులు కట్టించింది. హైస్కూల్‌కు విశాల స్థలం ఇచ్చింది. రూ. 5 లక్షలతో తరగతి గదులు పెంచడానికి జనశక్తి పార్టీ స్వయంగా పూనుకుంది. మేక పుల్లరి, వెట్టి గొర్లు, వెట్టి నాగళ్ళు, జీతాల వ్యవస్థ అంతమైపోవడానికి పార్టీ కారణమైంది. అన్నింటికీ మించి ఉత్పత్తి శక్తులకు దొరికిన స్వేచ్ఛ ప్రజల జీవితాల్లో కొత్త మార్పునకు నాంది పలికింది. 

– అమర్, జనశక్తి
(జూలై 29న ఇప్ప నారాయణరెడ్డి ప్రథమ వర్ధంతి)

మరిన్ని వార్తలు