సరిహద్దుల కాపలాలో సైన్యం సత్తా

17 Aug, 2022 00:30 IST|Sakshi

భారత్‌పై మోపిన యుద్ధాలు, ఘర్షణలు... అవి భౌగోళిక, రాజకీయ పరిణామాలను మార్చిన వైనం గురించి పరామర్శించుకోవడానికి భారత 75వ స్వాతంత్య్ర వార్షికోత్సవం చక్కటి సందర్భం. ఈ ఘర్షణలన్నింటిలో ప్రత్యేకంగా నిలిచేది ఏమిటంటే, భారత సాయుధ బలగాలు నిర్వహించిన అసాధారణ పాత్ర. భారత సరిహద్దులను కాపాడటంలో, పొరుగుదేశాల సవాళ్లకు ఎదురు నిలవడంలో మన సాయుధ బలగాలకు ఎక్కువ ఘనత లభించాల్సి ఉంది. ఒక వాస్తవం తరచుగా విస్మరణకు గురవుతోంది. స్వాతంత్య్రం తర్వాత భారత బలగాలు ఒక్క భూభాగాన్ని కూడా కోల్పోలేదు. చొరబాట్ల నిరోధానికి సైనిక బలగాలను పంపడానికి ముందు శత్రుబలగాలు ఆక్రమించిన భూభాగాలు మాత్రమే మనం కోల్పోయింది!

 నాటి జమ్మూ కశ్మీర్‌ మహారాజు పాకిస్తాన్‌లో కశ్మీర్‌ విలీనం కావడాన్ని ఇష్టపడకపోవడం చూసిన తర్వాత, పాకిస్తాన్‌ రాజకీయ కులీన వర్గం 1947 అక్టోబర్‌లో కశ్మీర్‌ దురాక్రమణను ప్రారంభించిందనే ప్రబలమైన ఆవగాహన ఇంతకాలం కొనసాగుతూ వచ్చింది. దీనికి భిన్నంగా ఒక కొత్త కథనం ఇప్పుడు ఉనికిలోకి వచ్చింది. ఇక్బాల్‌ మల్హోత్రా రాసిన ‘డార్క్‌ సీక్రెట్స్‌: పాలిటిక్స్, ఇంట్రిగ్యూ అండ్‌ ప్రాక్సీ వార్స్‌ ఇన్‌ కశ్మీర్‌’ (2022) పుస్తకం చక్కటి పరిశోధనాత్మక వివరాలను వెల్లడిస్తోంది. కశ్మీర్‌పై రెండు భాగాల్లో దాడులు ప్రారంభించాలంటూ పాకిస్తాన్‌ సైన్యాన్ని బ్రిటిష్‌ పాలనా వ్యవస్థ ప్రోత్సహించిందంటూ ఈ పుస్తకం సంచలన వివరాలు బయటపెడుతోంది. ఆ రెండు భాగాలు ఏమి టంటే, కశ్మీర్‌ లోయను స్వాధీనపర్చుకోవడానికి ఆపరేషన్‌ గుల్‌మార్గ్‌ మొదలుపెట్టడం; గిల్గిత్‌–బాల్టిస్తాన్‌ స్వాధీనం కోసం ఆపరేషన్‌ దత్తా ఖేల్‌ను ప్రారంభించడం.

 దీంతో 1947 అక్టోబర్‌ నుంచి 1948 వేసవి కాలం వరకు కశ్మీర్‌ను కాపాడుకుందాం అనే దీర్ఘకాలిక పథక రచనలో భారత వాయుసేన, భారతీయ సైన్యం మునిగిపోయాయి. మన బలగాలు అపారమైన సంకల్పంతో ఈ పథకాన్ని పూర్తి చేశాయి. కానీ బ్రిటిష్‌ నాయకత్వం అంతటితో వదలిపెట్టలేదు. గిల్గిట్‌పై పాకిస్తాన్‌ పతాకం ఎగిరేలా వారు పావులు కదిపారు. అదే సమయంలో ఈ వ్యవహారాన్ని ఐక్యరాజ్య సమితిలో చర్చించడానికి భారత ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూను లార్డ్‌ మౌంట్‌ బాటన్‌ ఒప్పించారు. కశ్మీర్‌ సమస్యకు ప్లెబిసైట్‌ (ప్రజాభిప్రాయ సేకరణ)ను ఉత్తమ పరిష్కా రంగా నెహ్రూ ఆమోదించేలా చేశారు. ఇది కాల్పుల విరమణకు దారితీసింది. ఈ ‘కాల్పుల విరమణ రేఖ’ జమ్మూ కశ్మీర్‌లో భారత్‌– పాక్‌ వాస్తవిక సరిహద్దుగా మారింది.

 అయితే, చైనాతో అపరిష్కృతంగా ఉన్న హిమాలయాల సరిహ ద్దులు స్వాతంత్య్రం తర్వాత భారత్‌ ముందుకు రెండో కీలకమైన ఘర్షణను తెచ్చిపెట్టాయి. 1962లో చైనా, భారత్‌ మధ్య ఘర్షణ అనేక కారణాల ఫలితం అని చెప్పాలి. టిబెట్‌ పోరాటానికి సహాయం అందించే లక్ష్యంతో భారత్‌లో అమెరికా అడుగుజాడలు పెరగడం కూడా ఒక కారణం. 1954లో భారత్‌ ప్రచురించిన మ్యాపులు అక్సాయ్‌ చిన్‌ను లద్దాఖ్‌లో భాగంగా చూపాయి. అంటే అది భార త్‌లో భాగమేనని చెప్పాయి.

 అలాగే మ్యాప్‌ ఉన్నా లేకపోయినా మెక్‌ మెహన్‌ రేఖ మాత్రమే చైనాతో భారత ఈశాన్య సరిహద్దుగా ఉంటుం దని నెహ్రూ దృఢ వైఖరిని ప్రకటిస్తూ వచ్చారు. ఇది చైనా నాయ కత్వాన్ని రగిలించింది. అందుకే నెహ్రూకు గుణపాఠం చెప్పాలని మావో నిర్ణయించుకున్నాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో చైనాకు రష్యా ఆయుధాలు ఇవ్వడమే కాకుండా, చైనాను పోత్సహిం చిన విషయం మరుగున పడిపోయింది. 1950లలో కొరియన్‌ యుద్ధంలో తొలిసారి చైనాకు రష్యా మద్దతుగా నిలిచింది. తర్వాత అమెరికా శిబిరంలో భారత్‌ ఉన్నట్లు కనిపించింది కాబట్టి, భారత్‌పై చైనా దాడిని కూడా రష్యా బలపర్చింది. 1962 అక్టోబర్‌ 20 నుంచి నవంబర్‌ 19 వరకు క్యూబా క్షిపణి సంక్షోభంలో ప్రపంచం కూరుకు పోయిన రోజు ల్లోనే సోవియట్‌ నాయకుడు నికితా కృశ్చేవ్‌ భారత్‌పై దాడి చేయవచ్చని పంపిన సిగ్నల్‌ను నాటి చైనా నాయకత్వం అందుకుంది.

 చైనా దాడి రెండు భ్రమలను పటాపంచలు చేసింది. ప్రపంచ రాజనీతిజ్ఞుడిగా నెహ్రూ పాత్ర, ఆసియాలో భారత్‌ వైఖరికి సంబం ధించిన భ్రమలు చెల్లాచెదురైపోయాయి. అదే సమయంలో న్యూఢిల్లీలో భారతీయ సైనిక కమాండర్లు విషాదకరంగా పౌర నాయకత్వ ఆజ్ఞలకు లోబడిపోయారు. ప్రత్యేకించి నెహ్రూ, కృష్ణ మీనన్, బీఎన్‌ మలిక్‌ చైనా దాడి సంకేతాల పట్ల పూర్తిగా నిర్లక్ష్యం ప్రదర్శించారు. అందువల్లే 1962 అక్టోబర్‌లో చైనా వాస్తవంగా దాడి ప్రారంభించినప్పుడు సరైన శిక్షణ, తగిన ఆయుధ సంపత్తి లేని భారతీయ దళాలు అత్యంత ఎత్తయిన హిమాలయాల్లో చైనా దురాక్ర మణతో పోరాడాల్సి వచ్చింది. ఇరు సైన్యాల మధ్య భారీ అసమా నతలు ఉన్నప్పటికీ, లదాఖ్, ‘నెఫా’ (ఇప్పుడు అరుణాచల్‌ ప్రదేశ్‌)... రెండు ప్రాంతాల్లోనూ భారతీయ దళాలు గణనీయ పోరాట పటిమను ప్రదర్శించాయి.

 మన బలగాల పోరాట చేవను ఈ వ్యాస రచయిత రాసిన ‘కంటెస్టెడ్‌ ల్యాండ్స్‌: ఇండియా, చైనా అండ్‌ ద బౌండరీ డిస్ప్యూట్‌’ (2021) పుస్తకం పొందుపర్చింది. 1962 సైనిక ఘర్షణను జాతీయ ఓటమిగా పిలుస్తున్నారు కానీ, వాస్తవానికి భారతీయ సైన్యంలో, వాయుసేనలో చాలా భాగాన్ని ఈ యుద్ధంలో ఉపయో గించలేదని గమనించాలి. ఎక్కువ బలాన్ని ఉపయోగిస్తే చైనాను మరింత రెచ్చగొట్టినట్లవుతుందనే భయం దీనికి కారణం కావచ్చు. భారత్‌ బలగాలను అధిక సంఖ్యలో ఉపయోగించి ఉంటే కథ మరొకలా ఉండేది.

 1962లో భారత్‌ పరాజయం, అమెరికా కేంద్ర యుద్ధ పథకం కారణంగా పాకిస్తాన్‌లో కొత్త ఆశలు చిగురించాయి. అప్పటికే అమె రికా ఆయుధాలు పాకిస్తాన్‌ పొంది ఉంది. చైనా దాడితో భారత్‌ సైన్యపు నైతిక బలం క్షీణించిందనీ, 1947 మాదిరిగా రెండు భాగాల్లో తలపెట్టినట్లుగా కాకుండా, సుశిక్షితమైన అర్ధ గెరిల్లా దాడిని మొదలె  డితే ఈసారి కశ్మీర్‌ను తాను ఆక్రమించవచ్చనీ పాక్‌ భావించిందంటే ఆశ్చర్యం లేదు. భారత వాయుసేన, భారత సైన్య సంయుక్త ప్రతి స్పందనతో పాక్‌ కుట్రలు మరోసారి భగ్నమయ్యాయి. మన బలగాల ప్రతి దాడి సమర్థత ఏ స్థాయిలో సాగిందంటే, దురాక్రమణ సైన్యాన్ని తరుముకుంటూ పోయిన భారత్‌ బలగాలు లాహోర్, సియాల్‌ కోట్‌ గేట్ల వద్దకు పోయి నిలిచాయి. దీంతో లాహోర్‌ను కాపాడుకునేందుకు పాక్‌ జనరల్‌ అయూబ్‌ ఖాన్‌ తన బలగాలతో లొంగిపోయారు.

 మరోవైపున కాల్పుల విరమణ పిలుపు కోసం వేచి చూస్తూ భారత బలగాలు ఈ రెండు నగరాల ప్రవేశ ద్వారాల వద్ద తిష్ట వేశాయి. అయితే 1965 నాటి ఆ యుద్ధంలో తమదే విజయం అని పాక్‌ ప్రక టించుకుందనుకోండి. ఎందుకంటే విజయం మనదే అని ప్రకటించు కోవడానికి భారత రాజకీయ నాయకత్వం కాస్త సిగ్గుపడింది మరి! అయితే 1971 నాటి ఇండో–పాక్‌ యుద్ధం పూర్తిగా విభిన్నమైంది. మొదటిసారి భారత త్రివిధ బలగాలు పాల్గొన్నాయి. పైగా అది కశ్మీర్‌ కోసం జరిగిన యుద్ధం కాదు. బంగ్లాదేశ్‌ విముక్తి యుద్ధం. అయితే ఈ యుద్ధానంతరం కుదిరిన ఒప్పందం జమ్మూ కశ్మీర్‌ భవిష్యత్తుకు సంబంధించినదే.

 సిమ్లా ఒడంబడికలో ముఖ్యమైన ఫలితం ఏమిటంటే, కాల్పుల విరమణ రేఖను నియంత్రణా రేఖ (ఎల్‌ఓసీ)గా మార్చుకోవడమే. అంటే ఇది రెండు దేశాల మధ్య రాజకీయ, సైనిక సరిహద్దుగా ఉంటుందన్నమాట. కార్గిల్‌లో మరోసారి భంగపాటుకు గురై నాటి పాకిస్తాన్‌ అధ్యక్షుడు నవాజ్‌ షరీఫ్‌ అమెరికాకు పరుగెత్తినప్పుడు, అమెరికా సైతం ‘ఎల్‌ఓసీ’నే గౌరవించమని పాకిస్తాన్‌ను కోరింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, 1999లో జనరల్‌ ముషారఫ్‌ దురాక్రమణ బలగాలు ఎల్‌ఓసీని దాటి భారత్‌లోకి చొచ్చుకొచ్చిన ప్రధాన ఉద్దేశం, దాని మాన్యతను సవాలు చేయడమే.

 అయితే భారత్‌ బలమైన సైనిక ప్రతిస్పందన కారణంగా నాటి అమెరికా అధ్యక్షుడు క్లింటన్‌ సైతం అదే ఎల్‌ఓసీని గుర్తించడం వల్ల పాకిస్తాన్‌కు మరోసారి భంగపాటు కలిగింది. భారత సరిహద్దులను కాపాడటంలోని సవాళ్లకు ఎదురు నిలవడంలో మన సాయుధ బలగాలకే ఎక్కువ ఘనత లభించాల్సి ఉంది. అయితే ఒక వాస్తవం తరచుగా విస్మరణకు గురవుతోంది. స్వాతంత్య్రం తర్వాత భారత బలగాలు ఒక్క భూభా గాన్ని కూడా కోల్పోలేదు. మనం కోల్పోయినదల్లా... 1947, 1962 సంవత్సరాల్లో చొరబాట్ల నిరోధానికి భారత బలగాలను పంపడానికి ముందు శత్రుబలగాలు ఆక్రమించిన మన భూభాగాలను మాత్రమే.


మరూఫ్‌ రజా, వ్యాసకర్త మాజీ సైనికాధికారి 
(‘ద ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో) 

మరిన్ని వార్తలు