కశ్మీర్‌ నియోజకవర్గాల పునర్విభజనలో సంక్లిష్టతలు

23 Jul, 2021 12:58 IST|Sakshi

జమ్మూకశ్మీర్‌ నియోజకవర్గాల పునర్విభజన విషయంలో రాజకీయ మద్దతు తీసుకునే లక్ష్యంతోనే ప్రధాని నరేంద్రమోదీ ఇటీవలే అక్కడి రాజకీయ పార్టీలతో భేటీ అయ్యారు. పర్యవసానంగా నియోజకవర్గాల పునర్విభజన కమిటీ ఆ మధ్య జమ్మూకశ్మీర్‌ను సందర్శించి ఈ అంశంపై ప్రాథమిక సమాచార సేకరణ కోసం శ్రీనగర్, కిష్వార్, పహల్‌ గామ్, జమ్మూ ప్రాంతాల్లోని 290 పైగా బృందాలతో సమావేశమైంది. నియోజకవర్గాల పునర్విభజనకి మద్దతుగా చేసే ప్రధాన వాదన ఏదంటే అసెంబ్లీలో ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్‌ అంశమే. వీరు ప్రధానంగా 1947లో శరణార్థులుగా భారత్‌కు వచ్చినవారు. జమ్మూ కశ్మీర్‌ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో వీరిని పశ్చిమ పాకిస్తాన్‌ నుంచి వచ్చిన శరణార్థులుగా ప్రస్తావిస్తుంటారు. పైగా ఆర్టికల్‌ 370 రద్దు తర్వాత అసెంబ్లీ నియోజకవర్గాల సంఖ్యను పెంచాల్సిరావడం అనేది నియోజకవర్గాల పునర్విభజన కమిషన్‌ ఏర్పాటుకు దారితీసింది.

జమ్మూకశ్మీర్‌ అసెంబ్లీ సీట్ల పంపిణీ 1981 జనాభా లెక్కల ప్రాతిపదికన జరిగింది. 2019 ఆగస్టులో ఆమోదం పొందిన జమ్మూకశ్మీర్‌ పునర్వ్యవస్థీకరణ చట్టం ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను కొత్తగా పెంచింది. దీంతో నియోజకవర్గాల పునర్విభజన తర్వాత జమ్మూకశ్మీర్‌ శాసనసభ స్థానాలు 83 నుంచి 90కి పెరగనున్నాయి. గత అసెంబ్లీలో కూడా ఎస్సీలకు రాజకీయపరమైన రిజర్వేషన్లు ఉనికిలో ఉండేవి. ఎస్సీల కోసం కేటాయించిన స్థానాల నుంచి పలువురు కీలక మంత్రులు గతంలో పదవులు చేపట్టగలిగారు. మాజీ ఉప ముఖ్యమంత్రి తారా చంద్‌ కూడా వారిలో ఒకరు. ప్రధానితో ఇటీవలి సమావేశానికి ఈయన్ని కూడా ఆహ్వానించారు.

కశ్మీర్‌ నియోజకవర్గాల పునర్విభజన ఎస్టీలకు రిజర్వేషన్‌ సౌకర్యాన్ని కల్పిస్తుందన్నది వాస్తవం. దీంట్లో ప్రధానంగా లబ్ధిదారులు గుజ్జర్లు. వీరు చాలావరకు ముస్లింలే. గత శాసనసభ ఎన్నికల్లో కశ్మీర్‌ లోయలోని లోలాబ్, కంగన్‌ అసెంబ్లీ నియోజకవర్గాలకు గాను గుజ్జర్‌ అభ్యర్థులు ఎన్నికయ్యారు. జమ్మూలోని సురాన్‌ కోట్, మెంధర్, రాజౌరి, గులాబ్‌ఘర్, డర్హాల్, కాలాకోటె, గూల్‌ అర్నాస్‌ నియోజకవర్గాలకు కూడా గుజ్జర్‌ అభ్యర్థులే ప్రాతినిధ్యం వహించారు. 2011 జనాభా లెక్కల ప్రకారం, గుజ్జర్ల జనాభా పూర్వ రాష్ట్రంలోని మొత్తం జనాభాలో 9 శాతంగా ఉండేది. జమ్మూకశ్మీర్‌ గత శాసనసభలో గుజ్జర్లకు 10.8 శాతం ప్రాతినిధ్యం ఉండేది. 

కశ్మీర్‌లో శాసన కార్యనిర్వాహక మార్పును మాత్రమే కోరుకుంటున్న రాజకీయ పార్టీలు అక్కడి గిరిజన అభ్యర్థులకు ఇకనైనా ప్రాధాన్యం ఇవ్వడంపై ఏమంత ఆసక్తిని ప్రదర్శించడం లేదు. కాబట్టి జమ్మూ కశ్మీర్‌ భవిష్యత్‌ శాసనసభలో కూడా గుజ్జర్ల ప్రాతి నిధ్యం 2014లో ఎన్నికైన గత అసెంబ్లీలో ఉన్న విధంగానే ఉంటుంది తప్పితే పెద్దగా మార్పు ఉండదు. కశ్మీర్‌లో కొత్తగా నియోజకవర్గాల పునర్విభజన ద్వారా ఎస్సీ, ఎస్టీ స్థానాల్లో మార్పు ఏమీ ఉండదు.

ఆర్టికల్‌ 370 రద్దుతో జమ్మూకశ్మీర్‌ ఎన్నికలలో ఓటు వేసే అర్హత ఉన్న వారి సంఖ్య కొద్దిగా మారింది. 2011 జనాభా లెక్కల ప్రకారం పూర్వ రాష్ట్రంలో బయటనుంచి వచ్చిన వారి వాస్తవ సంఖ్య 1.6 లక్షలు మాత్రమే. వాస్తవానికి, గత కొన్ని సంవత్సరాలుగా అసెంబ్లీ నియోజకవర్గాల పునర్విభజన చేయాలనే డిమాండ్‌ జమ్మూకశ్మీర్‌లోని కొన్ని రాజకీయ పక్షాలనుంచి వచ్చింది. గత అసెంబ్లీలో కశ్మీర్‌ లోయలో 46 అసెంబ్లీ సీట్లు ఉండగా జమ్మూలో 37 స్థానాలుండేవి. 19వ శతాబ్దిలో విభిన్న సాంస్కృతిక, భౌగోళిక ప్రాంతాలను కలిపి సృష్టించిన జమ్మూకశ్మీర్‌ 1947లో కీలక మార్పులను చవిచూసింది.

జమ్మూలోని చీనాబ్‌ లోయలో రెండు మతాల జనాభా కలిసివుండే అసెంబ్లీ నియోజకవర్గాలను పునర్విభజించడం సంక్లిష్టంగా మారనుంది. పైగా గత అసెంబ్లీ కంటే ఇప్పుడు ఏర్పడనున్న అసెంబ్లీలో ఎస్టీలకంటే ఎస్సీలకు కాస్త ఎక్కువ సీట్లు లభ్యం కానున్నాయి. ఈ నేపథ్యంలో రీజియన్లకు, దిగువశ్రేణి ప్రాంతాలకు రాజకీయ, ఆర్థిక అధికారాన్ని సంస్థా గతీకరించేటప్పుడు అసెంబ్లీ స్థానాల పునర్విభజన జరిపిన ఇతర ప్రాంతాల అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని తగిన చర్యలు తీసుకోవలసి ఉంటుంది.

- లవ్‌ పురి 
వ్యాసకర్త జర్నలిస్టు, రచయిత 

మరిన్ని వార్తలు