Sports in India: ప్రాథమిక స్థాయిలో శిక్షణేదీ?

18 Oct, 2022 14:02 IST|Sakshi

ఇటీవల 36వ జాతీయ క్రీడలను ప్రారంభిస్తూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ మాట్లాడుతూ... గత పాలకుల వైఫల్యం, క్రీడల్లో బంధుప్రీతి, అవినీతి, తీవ్రమైన మౌలిక వసతుల కొరత వంటి కారణాలవల్ల ప్రపంచ క్రీడా వేదికలపై మనం వెనుకపడ్డామని అన్నారు. విద్యావిధానంలో భాగంగా క్రీడా విధానాన్ని చూసినప్పుడే క్రీడలు కాలానుగుణంగా అభివృద్ధి చెందుతాయి. మన ప్రభుత్వాలు ఆ విషయాన్ని మరచాయి.

1968లో ఇందిరాగాంధీ, 1986లో రాజీవ్‌ గాంధీ, 1992లో పీవీ నరసింహారావు ప్రభుత్వాలు జాతీయ విద్యా విధానంలో మార్పులు చేసినప్పటికీ క్రీడలకు సముచిత స్థానం కల్పించలేకపోయాయి. కానీ మోదీ ప్రభుత్వ ఆధ్వర్యంలో వచ్చిన నూతన విద్యా విధానం – 2020లో వ్యాయామ విద్యకు ప్రాధాన్యం ఇవ్వడం గమనార్హం. మోదీ ప్రభుత్వం ప్రత్యేకంగా తీసుకొచ్చిన ‘గ్రాస్‌ రూట్‌ టాలెంట్‌ హంట్‌’ అనే నినాదంతో ‘ఖేలో ఇండియా’ గేమ్స్‌ను తీసుకురావడం కొంతవరకు మంచి సత్ఫలితాలు ఇస్తున్నప్పటికీ ఇంకా అనేక అంశాలలో దృష్టి సారించాల్సిన అవసరం ఉంది.  

తెలంగాణ రాష్ట్ర జనాభా కన్నా చాలా తక్కువ ఉన్న దేశాలు కూడా ఒలింపిక్స్‌లో మొదటి పది దేశాల జాబితాలో ఉంటున్నాయి. ట్రాక్‌ అండ్‌ ఫీల్డ్‌ అథ్లెటిక్స్‌ ఈవెంట్స్, ఈత కొలనులో జరిగే పోటీల్లో అత్యంత వెనుకబడిన దేశాలూ ఎన్నో పతకాలను కొల్లగొడు తున్నాయి. కాబట్టి మనం కూడా వీటిపై ప్రత్యేక శ్రద్ధపెడితే మంచి ఫలితాలు వస్తాయి. విద్యాహక్కు చట్టం–2009  ప్రతి పాఠశాలలో క్రీడాస్థలం, క్రీడలకు కావాల్సిన సౌకర్యాలు ఉండాలని ప్రతిపాదించింది. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దాన్ని పట్టించు కున్నట్టు కనిపించదు.

చదువు కన్నా ఆటలను ఇష్టపడే వయసులో ఉన్న పిల్లలు ప్రాథమిక పాఠశాలల్లో ఉంటారు. ఆ వయసులోనే పిల్లల్లో నిబిడీకృతమై ఉన్న క్రీడా నైపుణ్యాలు బయటపడతాయి. కానీ దురదృష్టవశాత్తూ మన దేశంలో ప్రాథమిక పాఠశాల స్థాయిలో వ్యాయామ ఉపాధ్యాయులు కనిపించరు. క్రీడల్లో అగ్రదేశాలకు సవాల్‌ విసురుతున్న చైనా... అతిచిన్న వయసులోనే పిల్లలో ఉన్న క్రీడా సామర్థ్యాన్ని గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణ ఇస్తున్న విష యాన్ని ఇక్కడ గమనంలో ఉంచుకోవాలి. అందుకే ముందుగా ప్రాథమిక పాఠశా లల్లోనూ వ్యాయామ ఉపాధ్యాయులను నియ మించాలి.

పాఠశాలలూ, కళాశాలల్లోనే కాక... గ్రామ, మండల, జిల్లా స్థాయుల్లో క్రీడా మైదానాలు ఏర్పాటు చేసి శిక్షకులనూ అందుబాటులో ఉంచాలి. అప్పుడే  మన దేశంలో ఎంతో మంది పీవీ సింధులు, నికత్‌ జరీన్‌లు, నీరజ్‌ చోప్రాలు మన మువ్వన్నెల జాతీయ పతాకాన్ని ప్రపంచ వేదికపై రెపరెపలాడిస్తారు. (క్లిక్ చేయండి: వెల్లివిరుస్తున్న కొత్త క్రీడా సంస్కృతి!)

– జంగం పాండు, ఏబీవీపీ ఖేల్‌ స్టేట్‌ కన్వీనర్‌

మరిన్ని వార్తలు