కొత్త జిల్లాలతో సూక్ష్మ స్థాయికి చేరనున్న ‘రాజ్యం’

18 Sep, 2020 01:29 IST|Sakshi

విశ్లేషణ 

రెండవ ఏడాది కూడా నైరుతి రుతుపవనాలు అనుకూలించడంతో 2020 ఖరీఫ్‌ సీజన్‌ నాటికి ఏపీలో జగన్‌ ప్రభుత్వం నాటిన ‘సోషల్‌ కేపిటల్‌’ వంగడాలు క్షేత్ర స్థాయిలో నిశ్శ బ్దంగా కుదురుకుని దుబ్బు కడుతున్నాయి. జలాశయాలన్నీ నిండుగా పొలాలు ఆకుపచ్చగా కనిపిస్తున్నాయి. తన కొత్త వంగడాల ‘నర్సరీ’ సిద్ధం కావడంతో, అదే విషయాన్ని ఆగస్టు 15న ముఖ్యమంత్రి ప్రసంగంలో పేర్కొంటూ– ‘‘రాష్ట్రంలో 85 శాతం మంది ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల యువతీ యువకులు గ్రామ వార్డు సచివాలయాల్లో ప్రభుత్వ బాధ్యతల్లో భాగస్వాములు అయ్యారని... మూడు రాజధానుల నిర్మాణం త్వరలో మొదలు కానుంది’’ అనీ చెప్పారు. ఇది జరిగిన ఐదు రోజులకు శ్రీకాకుళం జిల్లాలో 20 వేలమంది గ్రామ వాలంటీర్లకు ‘మైక్రోసాఫ్ట్‌’ కంపెనీ ద్వారా కంప్యూటర్‌ శిక్షణ మొదలయింది. ఏడాదిపాటు ‘సోషల్‌ వర్కర్లు’ మాదిరిగా ప్రజల్లో పనిచేసిన ఈ యువత ఇక ముందు దశల వారీగా వివిధ గ్రామీణ అభివృద్ధి శాఖలకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులుగా గ్రామాల్లోనే సేవలు అందిస్తారు.

ఇక్కడ చూడ్డానికి వేర్వేరు (అబ్‌స్ట్రాక్ట్‌)గా కనిపిస్తున్న పరిణామాల లక్ష్యం అర్థం కావడానికి, ‘మూడు రాజధానులు’ చట్టం శీర్షికలోనే ఉన్న (ఏపీ డీసెంట్రలైజేషన్‌ అండ్‌ ఇంక్లూజివ్‌ డెవలప్‌మెంట్‌ ఆఫ్‌ ఆల్‌ రీజియన్స్‌ యాక్ట్‌ 2020) ‘ఇంక్లూజివ్‌ డెవలప్మెంట్‌’ అనే ‘విండో’లో నుంచి చూస్తేనే ఇవన్నీ ఒక లక్ష్యంతో ఒక ‘ఆర్డర్‌’లో జరుగుతున్నట్టుగా మనకు స్పష్టమవుతుంది. ఆర్థిక మంత్రిగా ‘పొలిటికల్‌–ఎకానమీ’లో దాన్ని పేర్కొన్న డా. మన్మోహన్‌ సింగ్‌ ప్రధానిగా ఉన్నప్పుడే ఈ రాష్ట్రం రెండుగా విడిపోయింది, ఇప్పుడు రాష్ట్రం ‘సైజ్‌’ చిన్నదై ‘ఇంక్లూజివ్‌ గ్రోత్‌’ క్షేత్ర స్థాయిలో ఒక కార్యాచరణగా అనువదించబడుతోంది.
అన్నట్టు తెలుగు సినిమాకు పుట్టిల్లు కూడా కృష్ణా మండలమే. నలుపు–తెలుపు సినిమా రోజుల నుండి ‘2020 రాజకీయక«థ’తోనే ఇక్కడి రచయితలు హీరోలతో ఇక్కడివారే తీసిన సినిమాలు తెలుగు ప్రజలు చూసేవారు. అందులో నాగభూషణం ఊరిపెద్ద సర్పంచ్‌ కుర్చీమీద కన్ను వేసి ఉంటాడు. తాను గెలిస్తే కార్మికుల కాలనీ స్థలం ఖాళీ చేయించి పట్టణం నుంచి వచ్చిన ఫ్యాక్టరీ యజమానికి అప్పగించడానికి చాటు ఒప్పందం చేసుకుంటాడు. ‘ఎన్టీఆర్‌’ పట్టణంలో చదువుకుని వచ్చి వూరి ప్రజలకు చేరువై శ్రమదానంతో వూళ్ళో పాడుబడ్డ స్కూల్, ఆసుపత్రి భవనాలు బాగు చేయించి అందరి మన్ననలు పొందుతాడు. కార్మికుల ఇళ్లు ఒక రాత్రి నాగభూషణం తగలబెట్టడానికి ప్రయత్నిస్తే ఎన్టీఅర్‌ దాన్ని అడ్డుకుంటాడు. చివరికి వూరి ప్రజల మద్దతుతో నాగభూషణం మీద ఎన్టీఅర్‌ పోటీ చేసి గ్రామ సర్పంచ్‌ అవుతాడు. యాభై ఏళ్లు పైగా వెండితెరపై, తెరబయట కూడా తెలుగు ప్రజల మస్తిష్కాల మీద నల్లమందులా పనిచేసిన సూపర్‌ హిట్‌ ఫార్ములా ఇది!
నిజానికి మరో యాభై ఏళ్ల వరకు ఈ ‘నలుపు–తెలుపు సినిమా’ ఫార్ములాకు నైజాం, సీడెడ్, జిల్లాల్లో ‘ఎక్స్‌పెయిరీ’ ఉండదని ‘కోస్తాంధ్ర’ నమ్మింది, ఉత్తరాంధ్ర ఉనికితో దానికి ఎప్పుడూ పట్టింపు లేదు! కానీ తెలంగాణ ఉద్యమం ఆ వెండితెర కలల్ని చెరిపింది. ఇటువంటి తాత్విక దారిద్య్రంతో విభజనకు ముందు ఎన్నిసార్లు ఢిల్లీకి రమ్మని పిలిచినా, ఎందుకు రాష్ట్రాన్ని రెండుగా చీల్చవద్దో... చివరిదాకా నాటి ఆంధ్ర నాయకత్వం భారత ప్రభుత్వానికి చెప్పి ఒప్పించలేక పోయింది. మన అవగాహనకు పునాదులు లేక అవి ఉపరితలానికి పరిమితమైనప్పుడు, విధిగా ఎదురయ్యే సమస్య ఇది. 
ఇప్పుడయినా మళ్ళీ ఎందుకీ గతం తలపోత అంటే, ఇప్పుడు ‘మూడు రాజధానులు వద్దు’ అనడానికి ఆరేళ్ళనాటి సమస్యే మళ్ళీ మాజీ ‘సమైక్య వాదులకు’ ఎదురయింది! ఇలా అనడం మర్యాద కానప్పటికీ, తప్పదు.. ఇక్కడ ఒక మాట చెప్పాలి. ‘ఫస్ట్‌ క్రై’ పేరుతో పసిపిల్లల ఉత్పత్తుల తయారీ కోసం ఒక బ్రాండ్‌ వుంది. ఇప్పుడు ఏ వికేంద్రీకరణను అయితే వీళ్ళు ఆపాలని అంటున్నారో అది వీరి – ‘లాస్ట్‌ క్రై’ లాగా ఉంది! వాస్తవానికి ఇప్పుడు జరుగుతున్నది, ఒక విభజన మరెన్నో విభజనలకు దారి తీస్తుంది అనే ఫక్తు శాస్త్రం మాత్రమే. అయితే ఒకటి మాత్రం నిజం– ‘ఇంక్లూజివ్‌ డెవలప్‌మెంట్‌’ మాత్రం మొదలయ్యేది ఇక్కడి నుంచే!

ఏడాది తర్వాత వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం తమ ‘ఇండస్ట్రియల్‌ పాలసీ’ని ప్రకటించింది. ‘మూడు రాజధానులు’ పట్ల వ్యతిరేకత అనేది ప్రభుత్వం బయట ఉన్నవారికి రాష్ట్రంలో ఇప్పుడు రాజకీయ ఉపాధి హామీ పథకం అయింది. కానీ అందువల్ల నష్టం కూడా ఉంది. వాళ్ళు ఆ వ్యతిరేకతతోనే ఇంకా అక్కడే వుంటే, రేపు కొత్త జిల్లాల ఏర్పాటులో కూడా వీరు తమ భాగస్వామ్యాన్ని కోల్పోతారు. ఒక పక్క ప్రభుత్వంలో ఒక్కొక్క నిర్ణయం అమలులోకి వస్తున్నప్పుడు, మధ్యతరగతి శిష్టవర్గం బాధ్యతగా విధాన నిర్ణయంలో భాగస్వాములు కావాలి. 

వికేంద్రీకరణ జాడలు బైబిల్లో కీ.పూ. 1805లో కనిపిస్తాయి. ఈజిప్టు ఫరో బానిసత్వం నుంచి ఇజ్రాయెలీయులు మోజెస్‌ నాయకత్వంలో విముక్తి పొందాక, వారందరికీ జెహోవా ధర్మశాస్త్రం ప్రకారం వ్యాజ్యాలు తీర్చవలసిన బాధ్యత మోజెస్‌ మీద పడుతుంది. మోజెస్‌ మామ ఇత్రో అది గమనించి, ‘ప్రతిదీ నువ్వే చూడాలి అంటే నువ్వు నలిగి పోతావు, ప్రజలకు సకాలంలో న్యాయం అందడం ఆలస్యం అవుతుంది, వాళ్ళను వేర్వేరు గణాలుగా విడగొట్టి ఎంపిక చేసిన వారికి వాటిని అప్పగించు. వాళ్ళతో కానివి నువ్వు పరి ష్కరించు’ అంటాడు. మామ సలహా ప్రకారం మోజెస్‌ న్యాయాధిపతులను నియమిస్తాడు. మోజెస్‌ తర్వాత జాషువా యుద్ధంలో కానన్‌ దేశాన్ని ఆక్రమించి తెగల ప్రాతి పదికగా భూమిని గణరాజ్యాలుగా విడగొట్టి వాటి సరిహద్దు మ్యాప్‌లు సిద్ధం చేసిన భూమిని వారికి అప్పగిస్తాడు. ఆధునిక రాజ్యం ఉపాంగాలు అయిన– ప్రజలు, ప్రాంతం, ప్రభుత్వం, ఈ మూడు అంశాలతో తొలిసారిగా ఊపిరి పోసుకున్న ‘రాజ్యం’ పుట్టుక ఛాయలు ఇక్కడ చూస్తాం.

తాత్వికులు ‘పోస్ట్‌ మోడరన్‌’ అంటున్న ఇప్పటి కాలం లోకి రావడానికి ఇప్పటికే దాటి వచ్చిన మజిలీలను కలగాపులగం చేస్తే, ఇక్కణ్ణించి ముందుకు మనకు దారి దొరకదు. గతం నుంచి సంయుక్త ఆంధ్రప్రదేశ్‌ వరకు చూస్తే– డా. బి.ఆర్‌. అంబేడ్కర్, తాలూకాల స్థానంలో ఎన్టీఅర్‌ మండలాల వ్యవస్థ, మండల్‌ కమిషన్, స్థానిక సంస్థల సంస్కరణ – 74 వ రాజ్యాంగ సవరణ, పాతికేళ్ళ ఆర్థిక సంస్కరణలు, తర్వాత సత్యానంతర యుగం (పోస్ట్‌ ట్రూత్‌ ఎరా) మనం ఇప్పుడు చూస్తున్నది. ఈ దశలో జరిగిన తాజా రాష్ట్ర విభజన ఆంధ్రప్రదేశ్‌ – తెలంగాణ. దాటి వచ్చిన సుదీర్ఘ ప్రయాణం ఎప్పుడూ తదుపరి మార్గాన్ని స్పష్టం చేయాలి. ఇప్పటికీ మనకది అర్థం కానప్పుడు, ఇది – ‘లాస్ట్‌ క్రై’ గానే మిగులుతుంది. 
వ్యాసకర్త: జాన్‌సన్‌ చోరగుడి,అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత

Read latest Guest-columns News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా