‘మై హూ నా’ హామీ తీరేదెన్నడు?

11 Nov, 2022 14:14 IST|Sakshi

సెగ ఎటు నుంచి తగిలితే నేమి, ఎనిమిదేళ్లుగా పిడచ కట్టుకుని ఉన్న ఘనీభవ స్థితి అయితే నెమ్మదిగా కరగడం మొదలయ్యినట్లుగా ఉంది. ఉన్నట్టుండి ‘ఢిల్లీ’ ఫోకస్‌ ఈ ఏడాది చివరి నాటికి ఆంధ్రప్రదేశ్‌పైన పడడంతో ఇక్కడి ప్రజలు, ఇటువంటి మార్పు పట్ల ఆనందంగా ఉన్నారు. కేంద్రం 2015 డిసెంబర్‌ 23న ‘యాక్ట్‌ ఈస్ట్‌ పాలసీ’ ప్రకటన చేశాక, ఆ దిశలో తొలి అడుగులు ఆశాజనకంగా అనిపిస్తున్నాయి. అంతే కాదు ప్రధాని విశాఖ పర్యటనకు ముందు ఒక ‘పైలెట్‌ టీమ్‌ టూర్‌’ కూడా జరిగింది. ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఫారెన్‌ ట్రేడ్‌ ‘సదరన్‌ క్యాంపస్‌’ ప్రారంభించడానికి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌; వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పోర్టు సిటీ కాకినాడ వచ్చి... విదేశీ వాణిజ్యం మా ప్రభుత్వ ప్రాధాన్యం అని చెప్పివెళ్లారు. 

మరి ఇది మీ ఆంతర్యం కనుక అయితే, మీరు మాకు చేస్తున్న మంచిని ‘ఓపెన్‌’గా మాతో పంచుకోవడానికి ఇబ్బంది ఎందుకన్నదే మాకు అర్థం కానిది. విశాఖ రైల్వే జోన్‌ విషయమే తీసుకుందాం. ఇప్పటి వరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. కానీ, విశాఖ పట్టణంలోని వైర్‌ లెస్‌ కాలనీలోని 35 ఎకరాల రైల్వే భూమిలో రూ. 110 కోట్లతో జోనల్‌ కేంద్ర కార్యా లయాల భవన నిర్మాణానికి ఆర్కిటెక్టులు ఇచ్చిన డిజైన్లు రైల్వేబోర్డు వద్ద పెండింగ్‌లో ఉన్నాయని సీనియర్‌ రైల్వే అధికారి ఒకరు చెప్పినట్టు ఓ ఆంగ్ల పత్రిక రాసింది. ఇంతలో ఈ నెల 23న ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వంతో– ‘సెంటర్‌–స్టేట్‌ కోఆర్డినేషన్‌ మీటింగ్‌’ అంటూ, అందులో రైల్వే జోన్‌ ఎజెండా మొదటి అంశమని చంద్రగ్రహణం రోజు తెలిపింది. జోన్‌ ప్రతిపాదన మీ వద్ద సజీవంగా ఉందనే సంగతి ఇంత డొంక తిరుగుడుగా అదీ ఒక ఆంగ్ల పత్రిక చేసిన వెతుకులాట వల్ల మాకు తెలియడం, అంత అవసరమా?    

ప్రజలు, ప్రాంతము రెండూ ఇక్కడివే అయినప్పుడు; మాకు జరిగే ఏ మేలైనా, అది మీరు అధినేతగా ఉన్న ఈ దేశంలోనిదే కదా? ఈ రాష్ట్రం కొత్తగా ఏర్పడ్డప్పటి నుంచి మీరు ఢిల్లీ పీఠంపై ఉంటూ,  ఇంకా మా రాష్ట్రాన్ని ‘ఓన్‌’ చేసుకోలేక పోవడం ఏమిటి?  మోదీజీ విశాఖ రాక వైపు చూస్తున్నప్పుడు, ఇవన్నీ రాష్ట్ర ప్రజలకు కలుగుతున్న సహజ సందేహాలు. 

ఒడిశా తీరంలోని అబ్దుల్‌ కలాం ఐల్యాండ్‌ నుంచి నంబర్‌ 10–11 మధ్య క్షిపణి ప్రయోగం జరగనుంది. క్షిపణి సముద్రం మీద శ్రీలంక, ఇండోనేషియాల మధ్యగా ప్రయాణించే దిశలో 2,200 కి.మీ. మేర ‘నో ఫ్లయ్‌ జోన్‌’ అని మనదేశం ఇప్పటికే ప్రకటించింది. అయితే, మన క్షిపణి అనుపానులు అంచనా వేయడానికి, ఇప్పటికే చైనా స్పై షిప్‌ ‘యువాన్‌ వాంగ్‌–6’ హిందూ మహాసముద్రం జలాల్లోకి ప్రవేశించి, బాలి దీవుల్లో బస చేసింది. మన తూర్పు సరిహద్దున చైనా చేస్తున్న రెండవ కవ్వింపు చర్య ఇది. ఆగస్టులో కమ్యూనికేషన్‌ – నిఘా చర్యల రీసెర్చ్‌ నౌక – ‘యువాన్‌ వాంగ్‌–5’ శ్రీలంక హంబన్‌ తోట పోర్టులో వారం రోజులు తిష్ట వేసింది. అది ఇక్కడకు వచ్చి వెళ్ళాక, మన సెంట్రల్‌ ఇంటిలిజెన్స్‌ ఏజెన్సీ... చైనా నౌకలు శాటిలైట్‌ మోనిటరింగ్‌తో రాకెట్లు, ఇంటర్‌ కాంటి నెంటల్‌ మిస్సైల్స్‌ ఉపయోగించే అవకాశం ఉందనీ, మన న్యూక్లియర్‌ స్టేషన్లు, పోర్టుల భద్రతకు  నిఘా, రక్షణ చర్యలు చేపట్టాలనీ తమిళనాడు రాష్ట్ర ఇంటి లిజెన్స్‌ ఏజెన్సీని ఆదేశించింది. (క్లిక్‌ చేయండి: ‘రాజనీతి’లో రేపటి చూపు!)

ఈ నేపథ్యంలో ప్రధాని ఈస్ట్రన్‌ నేవల్‌ కమాండ్‌ కేంద్రమైన విశాఖ వస్తున్నారు. భారత ప్రభుత్వ ప్రాదేశిక అవసరాల బాధ్యతతో, ‘ఫెడరల్‌’ స్పూర్తితో దేశం తూర్పు సరిహద్దుల్లో ఆరోగ్యకరమైన సమాజ నిర్మాణం కోసం, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం పరిపాలనలో కొత్త సంస్కరణలు అమలు చేస్తున్నది. వాటిని గ్రేడింగ్‌ చేసి ర్యాంకులు వెల్లడించేది మీరే కనుక, మా పురోగతి ముందు మీకు తెలిశాకే, అవి మాకు తెలిసేది. కేరళలో– ఈ ఏడాది ఎం.ఏ. ‘డీసెంట్రలైజేషన్‌ అండ్‌ లోకల్‌ గవర్నెన్స్‌’ పీజీ కోర్సు మొదలుపెడితే, ఇక్కడది ఇప్పటికే అమలులో ఉంది. ఇక్కడ స్థిరమైన ప్రభుత్వం ఉండటం, ఇప్పుడు దేశం అవసరం. దీని పట్ల మీ ‘ఓపెన్‌ మైండ్‌’ మా అవసరం.  (చదవండి: తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!)


- జాన్‌సన్‌ చోరగుడి 
అభివృద్ధి–సామాజిక అంశాల వ్యాఖ్యాత

మరిన్ని వార్తలు