తూర్పు కనుమల అభివృద్ధిపై విభిన్న వైఖరి!

12 Oct, 2022 14:26 IST|Sakshi

అప్పటి వరకూ ఎవరూ ప్రవేశించని చోట– ‘లోపలికి వెళ్లడం’ అనేసరికి, ఒక్కొక్క ప్రభుత్వం తీరు ఒక్కొక్క విధంగా ఉంటుంది. ప్రధా నంగా వాటి దృక్పథంపై అది ఆధారపడి ఉంటుంది. ఆ ప్రకారమే, అది తనతో– ‘రాజ్యాన్ని’ అంటే– ‘ఎగ్జి క్యూటివ్‌’ ‘జ్యుడీషియరీ’ వంటి వ్యవస్థలను, అవి ఇంకా చేరని మారుమూలల ఉన్న మానవ సమూహాల వద్దకు తనతో తీసుకు వెళుతోంది. ప్రజా స్వామ్యంలో ప్రజలు ఎన్నుకున్న ఒక్క– ‘లెజిస్లేటి వ్‌’కు మాత్రమే అటువంటి గమన శక్తి ఉంటుంది. రాష్ట్ర విభజన తర్వాత, తూర్పు కనుమలలోని మన్యం – ‘లోపలికి వెళ్లడం’ అనే విషయంలో, అక్కడ మొదటి పదేళ్ల కాలంలో ఏమి జరుగుతున్నది అనేది లోతైన సమీక్ష అవసరమైన అంశం.   

వామపక్ష తీవ్రవాద సిద్ధాంత కార్యాచరణకు తూర్పు కనుమల మన్య ప్రాంతం నాలుగు దశాబ్దాల పాటుగా క్రియాశీల స్థావరం కావడంపై, ఇప్పుడు ప్రభుత్వ– ‘ఫోకస్‌’ తప్పనిసరి అయింది. అయితే అది– ఒక్కొక్క ప్రభుత్వానికి ఒక్కో తీరుగా అర్థమయింది. ఒకరు అంటారు– ‘విదేశాల నుంచి పోలీస్‌ శాఖ కొనాల్సిన ‘కమ్యూనికేషన్‌’ ఉపకరణాలు సకాలంలో ప్రభుత్వం కొని ఉంటే, ఒక గిరిజన ఎమ్మెల్యే నక్సల్స్‌ చేతిలో చనిపోయేవాడు కాదు’ అని. మరొక ప్రభుత్వ దృష్టి, అందుకు భిన్నంగా– ఆ ప్రాంతాన్ని... అక్కడ భూమిలోని ఖనిజ నిక్షేపాలను విలువైన ఆదాయ వనరుగా చూడ్డంగా కాకుండా, ఆ ప్రాంత ప్రజా ప్రయోజనాల దృష్టి నుంచి దాన్ని చూడాలి అని అనుకోవచ్చు. వామపక్ష తీవ్రవాద చర్యల్ని కట్టడి చేయడానికి 1989లో ఏపీ పోలీస్‌లో– ‘గ్రే హౌండ్స్‌’ విభాగం మొదలయింది. ప్రస్తుతం విశాఖపట్టణం వద్ద తాత్కాలిక ‘క్యాంపు’ల్లో ఉండి పనిచేస్తూ ఉంది. అయితే సాయుధ దళాల దన్నుతో కాకుండా... పౌరపాలన దృష్టితో ఈ ప్రాంత అభివృద్ధిని చేపట్టాలి అనే– ‘దార్శనికత’ ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు అది మునుపటికి భిన్నంగా ఉంటుంది. 

ఇలా భిన్నమైన దృక్పథాల మధ్య 2022 నాటికి ఇప్పటి యువ నాయకత్వానికి ఉన్న కొత్త చూపు నుంచి వచ్చినవే– పాడేరు కేంద్రంగా ‘అల్లూరి సీతారామరాజు’ జిల్లా, పార్వతీపురం కేంద్రంగా ‘మన్యం’ జిల్లాలు. అంటే– ‘లోపలికి వెళ్లడం’ అనేది చిన్న పరిపాలనా యూనిట్ల ద్వారా... సూక్ష్మ స్థాయికి పరిపాలన తీసుకు వెళ్లడం వల్లనే సాధ్యమని ఈ ప్రభుత్వం నమ్మకం. నిజానికి  ఇది– ప్రపంచ దేశాల చరిత్రలో కాలపరీక్షకు నిలిచిన సత్యం. అలా చూసినప్పుడు రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాల్లో– గ్రామ సచివాలయాల ఏర్పాటు, విద్య–వైద్య రంగాల్లో సంస్కరణలు, ఉత్తర్వులు వెలువడిన వెంటనే కొత్త జిల్లా కలెక్టర్, ఎస్పీ కార్యాలయాలు ఏజెన్సీ ప్రాంతంలో పని మొదలు పెట్టడం, ప్రతి సోమవారం జరిగే– ‘స్పందన’ ప్రజా ఫిర్యాదులకు రద్దీ పెరగడం, పాడేరులో కొత్తగా మెడికల్‌ కాలేజీ నిర్మాణం చురుగ్గా జరగడం, రోడ్లు, వంతెనల నిర్మాణం, ఇవన్నీ అమలవుతున్న సంక్షేమ పథకాలకు అదనంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి పనులుగా కనిపిస్తున్నాయి.

గతంలో ప్రాంతమూ–ప్రజల మధ్య పెనవేసుకుపోయి ఉండే బంధాన్ని విస్మరిస్తూ రూపొందించే అభివృద్ధి నమూనాలు, వీరి పక్షాన మావోయిస్టులు – ‘రాజ్యాన్ని’ వ్యతిరేకించడానికి బలమైన కారణమైంది. కానీ– ఇప్పుడు ప్రభుత్వ దృక్పథం మారింది. అప్పటి వరకు ఉన్న పట్టు జారిపోతున్నప్పుడు, వ్యూహాలు మార్చుకోవడం ఎవరికైనా తప్పదు. విభజన తర్వాత, ఇంత త్వరగా ఇటువంటి కొత్త వాతావరణం ఏజెన్సీ గ్రామాల్లో ఏర్పడుతుందని వారు కూడా అనుకుని ఉండక పోవచ్చు. దాంతో– ముఖ్యులైన మావోయిస్టుల లొంగుబాట్లు మొదలయ్యాయి. కొత్తగా వచ్చి చేరుతున్నవారు లేరు అంటున్నారు. 

ఈ జూన్‌ నెలలో జరిగిన నాయకుల అరెస్టు సందర్భంగా 33 మంది మావోయిస్టులు, 27 మంది మిలీషియా సభ్యులు పోలీసులకు లొంగిపోయారు. రూ. 39 లక్షల నగదు, అత్యంత విలువైన ఆయుధాలు స్వాధీనం అయ్యాయి. మళ్ళీ మరొకసారి ఈ సెప్టెంబర్‌ 7న పెదబయలు వద్ద మరొక అత్యంత భారీ ఆయుధాలు, కమ్యూనికేషన్‌ సిస్టం, స్కానర్లు సీఆర్పీఎఫ్‌ పోలీస్‌ దళాలు వెలుపలికి తీశాయి. ఈ జిల్లాలో రెండు నెలల వ్యవధిలో రెండవసారి ఛేదించిన ఆయుధాల నిల్వలివి. ఈ మొత్తం వ్యవహారంలో ఆసక్తికరమైన అంశం ఏమంటే– ఇప్పట్లో ఇక్కడ వీటి అవసరం ఉండదని, వారు వీటిని జక్కిని అటవీ ప్రాంతంలో భూమిలో పూడ్చిపెట్టి, ఛతీస్‌గఢ్‌లో భద్రత వున్న రహస్య ప్రాంతాలకు వెళ్లిపోయారు. (క్లిక్ చేయండి: విద్యారంగంలో దూసుకుపోతున్న ఏపీ)

జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం పర్యావరణాన్నీ, జీవవైవిధ్యాన్నీ పరిరక్షిస్తూనే స్థానిక ఆదివాసుల ఆవాసాల మధ్య పర్యాటక రంగం అభివృద్ధి కొరకు ప్రణాళికలు సిద్ధం చేసింది. అందుకు పాడేరులో– ‘ఒబెరాయ్‌ హోటల్స్‌ గ్రూప్‌’ 7 స్టార్‌ హోటల్‌ నిర్మాణానికి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇక మారు మూల ప్రాంత అభివృద్ధి కోసం పార్వతీపురం మన్యం జిల్లాగా ఏర్పడ్డంతో ఇక్కడి – కురికుట్టి వద్ద 1200 మెగావాట్లు, కర్రివలస వద్ద 1,000 మెగా వాట్లు సామర్థ్యం గల అదానీ గ్రీన్‌ ఎనర్జీ పవర్‌ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఇవి పూర్తి అయ్యాక, ఒకప్పుడు – గ్రే హౌండ్స్‌ పోలీసులతో ‘ఏఓబీ’గా పిలవబడిన ఆంధ్ర–ఒడిస్సా సరిహద్దున, ఒక్కొక్క పవర్‌ ప్రాజెక్టు వల్ల 3,000 మందికి ఉపాధి లభిస్తుంది. ఏదేమైనా–ఏటిట్యూడ్‌ ఈజ్‌ ఎవ్రిథింగ్‌  (దృక్పథమే సమస్తమూ) అనేది, అన్ని కాలాలకు వర్తించే పాత సూక్తి.


- జాన్‌సన్‌ చోరగుడి 
అభివృద్ధి, సామాజిక అంశాల వ్యాఖ్యాత

మరిన్ని వార్తలు